సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1512వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఊదీయే ఔషధం
2. దట్టంగా మబ్బులు కమ్ముకున్నప్పటికీ వర్షం పడకుండా చూసిన సాయితండ్రి 

బాబా ఊదీయే ఔషధం

నా పేరు కోమలి. ముందుగా సాయితండ్రికి సాష్టాంగ ప్రణామములు. అలాగే, సాయిబంధువులకు వందనములు. 2023, మార్చి 14, మంగళవారంనాడు నాకు, మా చిన్నపాపకి ఒకేసారి జలుబు చేసింది. నాకు ఒళ్లునొప్పులు కూడా ఉన్నాయి. సాధారణంగా మా చిన్నపాపకి జలుబు వచ్చిందంటే ఒకటి, రెండు వారాల వరకు అస్సలు తగ్గదు. సిరప్ బాటిల్స్ అయిపోతాయి కానీ జలుబు తగ్గనే తగ్గదు. అలాంటిది బుధవారంనాడు నేను బాబాతో, "సాయితండ్రీ! పాపకి, నాకు జలుబు, ఒళ్ళునొప్పులు తగ్గితే మీ అనుగ్రహాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని చెప్పుకొని కొంచెం ఊదీని నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి పాపకు త్రాగించి, నేను కూడా త్రాగితే బాబా అద్భుతం చూపారు. ఆరోజు సాయంత్రానికి పాపకు, నాకు జలుబు తగ్గిపోయింది. తరువాత 2023, మార్చి 18, ఉదయం 4 గంటల సమయంలో పాపకు బాగా దగ్గు వచ్చి నిద్రపోలేదు. అప్పుడు నేను, "సాయితండ్రీ! పాపకు దగ్గు తగ్గి మంచిగా నిద్రపోతే మీ అనుగ్రహాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని పాప పక్కన పడుకొని మనసులో అనుకున్నాను. అంతే, రెండు నిమిషాల్లో పాపకు దగ్గు తగ్గి ప్రశాంతంగా నిద్రపోయింది. "థాంక్యూ సాయితండ్రీ".

2023, ఏప్రిల్ 2, రాత్రి 12 గంటల సమయంలో మా పెద్దపాప ఎడమ ఊపిరితిత్తుల్లో బాగా నొప్పిగా ఉందని, ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉందని బాధతో ఏడ్చింది. ఒక పది నిమిషాలు చూసినా తగ్గలేదు. అప్పుడు హఠాత్తుగా ఊదీ పెట్టాలన్న ఆలోచన నాకొచ్చింది. వెంటనే బాబా దగ్గరకి వెళ్లి, "సాయితండ్రీ! ఈ రాత్రివేళ మీ ఊదీయే మాకు ఔషధం. ఊదీ రాయగానే పాపకి తగ్గిపోయేలా కృప చూపించండి" అని వేడుకున్నాను. తరువాత ఊదీ తీసుకొని పాప దగ్గరకి వెళ్లి ఊదీ రాయసాగాను. అద్భుతం! అప్పటివరకు నొప్పితో బాధపడుతున్న పాప నేను ఊదీ రాస్తుండగానే, "అమ్మా, నొప్పి తగ్గిపోయింది" అని చెప్పింది. అంతసేపూ తగ్గని నొప్పి ఊదీ రాస్తున్న క్షణాల్లోనే తగ్గేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆనందంగా ఆ సాయితండ్రికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "థాంక్యూ సాయితండ్రీ. మీ కృప అందరిపైనా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసివుంటే క్షమించండి తండ్రీ. మాకు ఏది మంచిదో ఆ మార్గంలో నడిపించండి సాయీ. మాలో శ్రద్ధ, సబూరీ వృద్ధి చెందేలా అనుగ్రహించండి తండ్రీ".

దట్టంగా మబ్బులు కమ్ముకున్నప్పటికీ వర్షం పడకుండా చూసిన సాయితండ్రి 

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! 
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!

ముందుగా మన సాయితండ్రికి నా అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు. ఈ బ్లాగ్ కుటుంబసభ్యులందరికీ నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. మా చిన్నత్తయ్యవాళ్ళ ఊర్లో పొలాల మధ్యలో ఒక చిన్న గుడి ఉంది. మా అత్తయ్య అక్కడ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయించాలని ఇదివరకు రెండుసార్లు అనుకున్నారు. కానీ, ఏవేవో కారణాల వల్ల అప్పుడు వాయిదా వేయవలసి వచ్చింది. చివరికి 2023, ఏప్రిల్ 2న చేయించాలని మా అత్తయ్య పూనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పొలాల మధ్యలో గుడి ఉండటం వల్ల పూలమాలలు, మైక్ సెట్లు, ఇంకా అవసరమైనవన్నీ అక్కడికి చక్రాలబండిలో తీసుకెళ్లాల్సి ఉండగా ఆరోజు బాగా మబ్బుపట్టి గాలి వీయటం మొదలుపెట్టింది. దాంతో మా అత్తయ్యకు భయం పట్టుకుంది. ఎందుకంటే, పెద్ద వర్షం కురిస్తే అక్కడికి వెళ్ళటానికి సాధ్యపడదు. ఎలాగో సామాగ్రి ఆంతా అక్కడికి చేర్చినా గుడి చాలా చిన్నది అవడం వలన భక్తులు కూర్చోవటానికి వీలుండదు. మరి అంతసేపు పారాయణ ఎలా చేయగలరు? అందువలన ఈసారి కూడా వాయిదా వేయలేమో అని అందరూ భయపడసాగారు. ఆ సమయంలో నేను మన సాయితండ్రిని, "ఈ కార్యక్రమం సక్రమంగా జరిగితే, మీ అనుగ్రహాన్ని తోటి సాయిభక్తులతో  పంచుకుంటాను" అని ప్రార్థించాను. దట్టంగా మబ్బులు కమ్ముకున్నప్పటికీ మన సాయితండ్రి వర్షం పడకుండా చూశారు. పారాయణ పూర్తయేంతవరకూ గాలి, వర్షం గానీ మరే ఇబ్బందిగానీ లేవు. అంతా ముందుగా ప్లాన్ చేసుకున్నట్లే చాలా బాగా జరిగింది. వెంటనే నా అనుభవాన్ని బ్లాగుకి పంపించాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలానే ఎప్పుడూ మమ్మల్ని కనిపెట్టుకొని మా సత్సంకల్పాలు నెరవేర్చు తండ్రీ. సదా మాకు తోడుగా ఉండి సన్మార్గంలో నడిపించండి తండ్రీ. మీ ఉనికి మాకు ఎల్లప్పుడూ అనుభవమవుతూ ఉండేలా అనుగ్రహించండి బాబా" 

శ్రీ సమర్థ  సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo