సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1520వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపకు నిదర్శనాలు
2. బాబాని అడిగితే జరగనిదంటూ ఏమీ ఉండదు

బాబా కృపకు నిదర్శనాలు


నా పేరు దేవి. మా వదిన పేరు 'సాయిగీత'. పేరుకు తగ్గుట్టుగా తను తన జీవితాన్ని సాయి ఆజ్ఞానుసారం గడుపుతుంది. సాయి పాటలను ఎంతో బాగా రాగయుక్తంగా పాడుతుంది. తను చాలా అనారోగ్య సమస్యల కారణంగా ఎంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ బాబాకి చేయవలసిన సేవలు మాత్రం మానక చేస్తుంది. అందువల్లనేమో బాబా తన 11 సంవత్సరాల అమ్మాయి రజస్వల అవ్వటం గురించి ముందుగానే నాకు తెలియజేసారు. 2022, ఏప్రిల్ నెలలో నేను ఒకరోజు పూజ చేసి బాబా ముందు కూర్చొని బాబా కళ్ళలోకి చూస్తుంటే, 'నీ మేనకోడలు ఈ నెలలో రజస్వల అవుంతుంది' అని బాబా చెప్తున్నట్లు నాకు అనిపించింది. చీటీలు వేసే అలవాటున్న నేను, 'అవునా బాబా! ఈనెల తను రజస్వల అవుతుందా? లేక నేను భ్రమపడుతున్నానా?' అని బాబాను అడిగాను. బాబా నుండి 'అవును' అని సమాధానం వచ్చింది. నేను ఆ విషయం మావారితో చెప్పి, "అందుకోసం మనం డబ్బులు సిద్ధం చేసుకోవాలి" అని అన్నాను. మావారు బాబాను అంతగా నమ్మరు. అందువల్ల నేను చెప్పినదానికి 'నీకు పిచ్చా?' అన్నట్లు చూసారు. ఆ విషయం అలా ఉంచితే, నేను మా వదినకు బాబా సందేశం గురించి తెలియజేసి పాపకు కావలసిన బట్టలు తీసి కుట్టించాము. బాబా అనుగ్రహం వల్ల పాప గురువారం నాడు రజస్వల అవుతుందని మేము అనుకున్నప్పటికీ 2022, ఏప్రిల్ 27, బుధవారం నా మేనకోడలు రజస్వల అయింది. అందరం ఆశ్చర్యపోయాం. బాబా లీలకు పరవశించిపోయాము. పాప బుధవారం రజస్వల అవ్వడానికి కూడా కారణం లేకపోలేదు. మర్నాడు గురువారం మా మావయ్యగారు బాబాలో ఐక్యమయ్యారు(మావయ్యగారి మరణం గురించి కూడా బాబా నాకు ముందే తెలియజేసారు). పాప కూడా అదేరోజు రజస్వల అయినట్లయితే మేనత్తనైనా నాకు తనని కూర్చోబెట్టే అవకాశం ఉండేది కాదు. కాబట్టే ముందురోజే పాప రజస్వల అయ్యేలా అనుగ్రహించారు బాబా. ఆయన 15 రోజులు ముందుగా పాప రజస్వల గురించి తెలియజేసి కావలసిన బట్టలు తీయించి, కుట్టించుకునేలా చేసి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న మా వదినకి ఇబ్బంది లేకుండా చేసారు. ఇంకో ముఖ్య విషయం ఈ అనుభవంతో మావారు కూడా బాబాను నమ్ముతున్నారు. బాబాను మనసారా ప్రేమించాలి గానీ ఎంత లీలా అయినా చేస్తారు అనడానికి ఈ అనుభవమే ఒక నిదర్శనం.


నాకు తెలిసిన హేమ అనే సాయి భక్తురాలు కరోనా మహమ్మారి నుండి తన కుటుంబాన్ని కాపాడినప్పటి నుండి బాబాను నిత్యం ఆరాధిస్తుంది. తనకి బాబా నామస్మరణ చేయడం అలవాటు. ఒకరోజు తను బాగా మరిగిన వేడినీళ్ల పాత్రను పట్టుకొని వెళ్తుంటే అనుకోకుండా చేయిజారి వేడి నీళ్లు తన ముఖంపై నుండి ఛాతి వరకు పడి కాలి పోయింది. అది చూసిన వాళ్ల అమ్మాయికి ఏం చేయాలో తోచక గుప్పెడు ఊదీ తీసుకొని కాలిన తన తల్లి శరీరంపై అద్ది, చెంబు నీళ్లలో ఎక్కువ మోతాదులో ఊదీ కలిపి త్రాగించింది. మంటతో బాధపడుతున్న హేమ అంతటి బాధలోనూ సాయి నామస్మరణను వదల లేదు. బాబా తమ లీలను చూపించారు. తన భక్తురాలు బాధపడకూడదని ఆ మంటను తామే తీసుకున్నారేమో! హేమకు నిద్రపట్టింది. ఆ క్షణం నుండి తనకి మంట, బాధ కొద్దిగా కూడా లేవు. అంత తొందరగా కాలిన గాయాల నుండి ఉపశమనం లభించడం చూసి డాక్టరు కూడా ఆశ్చర్యపోయారు. బాబా దయవలన ఆ గాయాలు తొందరగానే నయమైపోయాయి. ఈవిధంగా బాబా అనుభవించాల్సిన పెద్ద కర్మను కొంచంగానే అనుభవింపజేసి తమ భక్తురాలిని కాపాడారు. ఆయన తమ భక్తులు ఎక్కడ ఉన్నా మనోనేత్రంతోనే వారిని రక్షిస్తారు. అందుకు నిదర్శనం ఈ అనుభవం.


బాబాని అడిగితే జరగనిదంటూ ఏమీ ఉండదు


నేను ఒక బాబా భక్తురాలిని. ఎప్పుడు నీడలా తోడుండే బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఇటీవల మా డాడీ తను పనిచేసే కంపెనీవాళ్ళు ఆఫర్ చేసిన టూర్‌కి వెళ్లాలనుకున్నారు. అది హిల్ స్టేషన్ అయినందున 'ప్రయాణం ఎలా ఉంటుందో!' అని నాకు టెన్షన్‌గా అనిపించి డాడీ ప్రయాణానికి ముందురోజు, "బాబా! డాడీకి సదా తోడుగా ఉండి తనకి ఏ ఇబ్బందీ లేకుండా టూర్‌కి వెళ్ళొచ్చేలా చూడండి. డాడీ తిరిగి వచ్చిన వెంటనే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకొని, ఊదీ ఇచ్చి డాడీని పంపాను. నా బాబాని అడిగితే జరగనిదంటూ ఏమీ ఉండదని నా నమ్మకం. నేను నమ్మినట్లే బాబా అన్ని వేళల్లో తోడుగా ఉన్నారు. ఆయన దయవల్ల ప్రయాణంలో గానీ, బస చేసిన చోట గానీ డాడీకి ఏ కష్టమూ కలగలేదు. ఆయన క్షేమంగా టూర్ పూర్తి చేసుకొని వచ్చారు.


ఇకపోతే ఈమధ్య మా కంపెనీవాళ్ళు వారంలో కొన్ని రోజులైనా ఆఫీసుకి తప్పనిసరిగా రావాలని రూలు పెట్టారు. తరువాత ఏదో పనిపడి ఒక వారం ఆఫీసుకి వెళ్లలేని పరిస్థితి నాకు వచ్చింది. కంపెనీవాళ్ళు ఆఫీసుకి రానివాళ్లపై చాలా సీరియస్ అవుతున్నారని తెలిసి కూడా అడిగితే ఏమంటారో అనే భయంతో నేను పర్మిషన్ అడగకుండా, "బాబా! ఎలాగైనా మా మేనేజర్ నేను ఈ వారంలో ఆఫీసుకి వెళ్లని విషయం గురించి నన్ను అడగకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా మేనేజర్ నన్ను ఏమీ అడగలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


3 comments:

  1. Sai please give peace to me. Please bless my son, daughter and hubby with long life. Om sai ram🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo