సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1506వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం
2. బాబా స్మరణతో అంతా శుభం

బాబా అనుగ్రహం

నేనొక సాయిభక్తురాలిని. బాబా నా జీవితంలో చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి నేను, మావారు కొంతమంది స్నేహితులతో కలిసి ఒక విహారయాత్రకు వెళ్ళాము. అది చలిప్రాంతం అవడం వల్ల నాకు తేడాచేసి చలిజ్వరంలా వచ్చి చాలా నీరసంగా అనిపించింది. ఇలా అయితే ఎలా అని సాయిదేవుని తలచుకున్నాను. తరువాత దేనిగురించో నా బ్యాగులో వెతుకుతుంటే బాబా ఊదీ ప్యాకెట్ కనిపించింది. ఆ ఊదీ తీసుకున్నాక నేను మామూలు అయ్యాను. విచిత్రం ఏంటంటే, ఆ ఊదీ ప్యాకెట్‌ని నేను ఎప్పుడు ఆ బ్యాగులో పెట్టి మార్చిపోయానో తెలియదుగానీ ఆ యాత్రలో నాకు ఎప్పుడు బాగలేకపోయినా వెంటనే ఆ ఊదీని వాడటం, తక్షణం నేను మామూలు అవడం జరిగేది. అలా బాబా దయవల్ల ఆ యాత్ర ఏ ఇబ్బందీ లేకుండా పూర్తైంది. బాబాకి మాటిచ్చినట్లే నేను ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా".

మేము వేరే ఊరిలో ఒక షాపు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టాక మా అత్తగారింటి నుండి ఆ ఊరిలోని కొత్త ఇంటికి మారాము. అప్పుడు నేను నా మనసులో 'ఎవరైనా బాబా ప్రతిమ ఇస్తే శుభసూచకంగా ఉంటుంది. మా కొత్త కాపురానికి బాగుంటుంది' అని అనుకున్నాను. నేను కొనుక్కోగలను, కానీ ఎందుకో బాబా దీవెనలు అలా వస్తే బాగుంటుందని నా భావన. కొన్నిరోజుల తర్వాత శిరిడీ వెళ్లిన నా ప్రాణస్నేహితురాలు నేను అడగకుండానే నాకోసం ఒక బాబా ప్రతిమను తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అలాగే మాకు తెలిసినవాళ్ళు ఒకరు మా ఇంటికి వచ్చి తాము శిరిడీ వెళ్ళొచ్చామని ప్రసాదం, ఒక చిన్న బాబా ఫోటో ఇచ్చారు. నాకు చాలా ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ అనిపించింది.

ఒకరోజు మావారు తన బండి 'కీ' నాకు ఇచ్చారు. తరువాత ఆయన అడిగినపుడు దాన్ని ఎక్కడ పెట్టానో నాకు గుర్తురాలేదు, వెతికితే దొరకలేదు. దాంతో మావారికి కోపం వచ్చింది. నాకు భయమేసి బాబాని తలచుకొని, 'వెంటనే 'కీ' దొరికితే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల మళ్ళీ వెతికితే ఆ 'కీ' దొరికింది.

ఈమధ్య నన్ను కొన్ని ప్రతికూల ఆలోచనలు వేధించాయి. ఎంత ఆలోచించొద్దన్నా అవే ఆలోచనలతో నేను చాలా సతమతమయ్యాను. అప్పుడు, "బాబా! నాకు ప్రతికూల ఆలోచనలు రాకుండా చూడు. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అనుకున్నాను. బాబా దయవల్ల ప్రతికూల ఆలోచనలు చాలావరకు తగ్గాయి. "ధన్యవాదాలు బాబా. నేను ప్రశాంతంగా వుండేలా చూడు బాబా".

చివరిగా, నేను 'నాకు పిల్లలు ఎపుడు పుడతార'ని బాబాని అడుగుతూ వుంటాను. బాబా ఈ బ్లాగ్ ద్వారా 'త్వరలో పుడతార'ని సందేశం ఇస్తున్నారు. "నీ మీదే భారం వేశాను తండ్రీ. త్వరలో నాకు సంతానభాగ్యాన్ని ప్రసాదించు బాబా".

బాబా స్మరణతో అంతా శుభం

అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక్ సాయి. నేను ఏ పని చేసినా ముందుగా బాబాని తలచుకుని చేస్తాను. నేను ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాశాను. నేను ప్రతిరోజూ పరీక్షకు వెళ్లేముందు బాబాకి దణ్ణం పెట్టుకొని వెళ్ళేవాడిని. ఆఖరి పరీక్ష వ్రాసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు చికెన్‌పాక్స్ వచ్చింది. బాబా దయవల్లే ఇబ్బంది లేకుండా అన్ని పరీక్షలు బాగా వ్రాశాను. ఇకపోతే, చికెన్‌పాక్స్ వచ్చాక నాకు నాలుగు రోజులు జ్వరం ఎక్కువగా ఉండి మందులు వేసుకున్నా తగ్గలేదు. నాల్గవరోజు రాత్రి జ్వరం మరీ ఎక్కువగా ఉండడంతో నేను భరించలేకపోయాను. అప్పుడు బాబాను తలచుకొని ఊదీ నుదుటన పెట్టుకొని, నోట్లో వేసుకున్నాను. తెల్లవారుఝాముకి జ్వరం తగ్గింది. "ధన్యవాదాలు బాబా. జ్వరం తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మీకు మ్రొక్కుకున్నట్లుగా పంచుకున్నాను. ఇకముందు కూడా మీరు నా యందు ఉండి నన్ను ముందుకు నడిపించండి బాబా".
-నీ భక్తుడు
సాత్విక్ సాయి

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo