ఈ భాగంలో అనుభవం:
- బాబా దయ అపారం
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! సాయిబంధువులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. నా పేరు రూప. నేనిప్పుడు బాబా మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. 2019, డిసెంబర్ 28న మా అమ్మకి మూత్రవిసర్జన కాలేదు. హాస్పిటల్‌కి వెళితే యూరిన్ పైప్ వేశారు. అప్పటికి మా మావయ్య చనిపోయి పదిరోజులవుతున్న కారణంగా మా తమ్ముడు ఒక్కడే హాస్పిటల్లో ఉన్నాడు. నేను వెళ్లలేక, "బాబా! అమ్మకి ఏ సమస్యా ఉండకూడదు. అలా అయితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, "యూరిన్ లోపల ఉండిపోవడం వల్ల కిడ్నీకి ఇన్ఫెక్షన్ అయింది. సమస్య ఇలాగే వుంటే డయాలసిస్ చేయాలి" అన్నారు. అసలు ఏమీ అర్థంకాక 'ఆ సాయినాథుడే మాకు దిక్కు' అనుకున్నాము. రెండు రోజులకి కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గింది. కానీ మూత్రవిసర్జన అయ్యేది కాదు. డాక్టర్, "జీవితాంతం మూత్రవిసర్జన కోసం యూరిన్ పైపు వాడాలి" అని చెప్పారు. మాకు దిక్కుతోచక బాబా మీదే భారం వేశాము. ఒక వారం తర్వాత యూరిన్ పైపుతో అమ్మని డిశ్చార్జ్ చేసి ఒక వారం తర్వాత మళ్ళీ రమ్మన్నారు. అప్పుడు వెళితే ఆ పైపు, బ్యాగ్ తీసేసి మరో పైపు ఇచ్చి, "ప్రతి రెండు, మూడు గంటలకి ఆ పైపు పెట్టి మూత్రం బయటకు తీయాలి" అని చెప్పారు. అది అమ్మకి నరకంలా అనిపించేది. అలా ఉండగా ఒకరోజు అమ్మ కళ్ళుతిరిగి పడిపోయింది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే, డాక్టర్లు మళ్ళీ అన్ని పరీక్షలు చేసి, "పక్షవాతంలా వుంది. MRI స్కాన్ చేయాలి" అని అన్నారు. అమ్మ ఆరోగ్యం చెడిపోవడానికి ముందు డిసెంబర్ 7న మా తమ్ముడికి నిశ్చితార్థం అయ్యింది. ఫిబ్రవరి 27న పెళ్లి పెట్టుకుంటే ఇలా జరిగింది. "ఇదేంటి బాబా, మాకు ఈ కష్టం" అని అనుకున్నాము. బాబా దయవల్ల అమ్మకి MRI చేస్తే, ఒక్క మూత్రం సమస్య తప్ప వేరేమీ లేదని తేలింది. కానీ రోజూ పైపు వాడడమన్న చాలా పెద్ద సమస్యని ఎదుర్కోక తప్పలేదు. తమ్ముడి పెళ్లికి 13 రోజుల ముందు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాము. బాబా దయవల్ల తమ్ముడి పెళ్లి జరిగిపోయింది. అమ్మ రోజూ పైపు వాడుతూ ఉండేది. మేము పడిన బాధ బాబాకే తెలుసు. "బాబా! ఈ సమస్య నయమయ్యేలా చూడు" అని బాబాతో చెప్పుకొనేవాళ్ళం. బాబా దయవల్ల రెండునెలలు కంటిన్యూగా పైపు వాడాక రెండు రోజులకి ఒకసారి, ఆ తర్వాత మెల్లమెల్లగా 3 నుండి 5 రోజులకి ఒకసారి వాడటం మొదలుపెట్టింది అమ్మ. అలాగే, హోమియో మందులు వాడడం ప్రారంభించింది. క్రమంగా 10 నుండి 15 రోజులకి ఆ తర్వాత నెలకొకసారి పైపు ఉపయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు బాబా దయవల్ల పైపు పూర్తిగా వాడటం లేదు. కానీ మొత్తం సమస్య ఇంకా నయం కాలేదు. మూత్రవిసర్జన జరుగుతోంది, కానీ పూర్తిగా అవడం లేదు. అమ్మ మందులు వాడుతోంది. ఏదేమైనా, బాబా దయవల్లనే మా అమ్మ మాకు దక్కింది. అంత పెద్ద సమస్య నుంచి కొద్దికొద్దిగా కోలుకుంది. మిగిలిన ఆ కాస్త సమస్య కూడా తీరిపోతుందని నాకు తెలుసు. "ధన్యవాదాలు బాబా. తొందరగా అమ్మకి నయం చేయండి తండ్రీ. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించు తండ్రీ".
2021, గురుపౌర్ణమికి ఒక నెల ముందు నా బ్రెస్ట్‌లో ఒక గడ్డ(ట్యూమర్) కనిపించింది. డాక్టరు దగ్గరకి వెళ్లాలంటే నాకు చాలా భయమేసి, "బాబా! గురుపౌర్ణమికల్లా ఈ గడ్డ తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకొని ఊదీ రాసుకొని ఆ గడ్డ గురించి మా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పూర్తిగా బాబాపై భారం వేశాను. అయితే, గురుపౌర్ణమి నాటికి ఆ గడ్డ తగ్గలేదు సరికదా, మరింత పెరిగింది. ఇంక ఇంట్లోవాళ్ళకి విషయం తెలిసింది. హోమియో క్లినిక్‌కి వెళితే డాక్టర్ చెక్ చేసి, "ఏమీ భయపడాల్సిన పని లేదు. ఇది కేవలం సిస్ట్. మూడు నెలలు మెడిసిన్ వాడితే తగ్గుతుంది" అని చెప్పారు. ఆ మాట విన్నాక నా బాధ కాస్త తగ్గింది. ఆ డాక్టరు ఇచ్చిన మెడిసిన్ తీసుకొచ్చి, "బాబా! ఈ మెడిసిన్‍తో ఈ గడ్డ కరిగిపోవాలి. మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. కానీ నా దురదృష్టం, మూడు నెలల్లో ఆ ట్యూమర్ తగ్గలేదు. పైగా ఇంకాస్త పెరిగింది. దాంతో ఈ మెడిసిన్ వేస్ట్ అని ఇంగ్లీష్ వైద్యం కోసం వెళదామని వెళ్ళాము. డాక్టర్, "హోమియో వైద్యానికి ఎలా తగ్గుతుందనుకున్నారు?" అని తిట్టి స్కానింగ్, బయాప్సీ మొదలైన అన్ని పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ వచ్చాక, "సర్జరీ చేయాలి" అన్నారు. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. 2022, మార్చి 12న శస్త్రచికిత్స జరిగింది. నేను చాలా నొప్పిని అనుభవించాను. అయితే, "అది మామూలు ట్యూమరే. క్యాన్సర్ కాదు. సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోండి" అని డాక్టరు చెప్పారు. బాబా దయవల్లే నేను బతికి బయటపడ్డాను. "ధన్యవాదాలు బాబా. మళ్ళీ నాకు ట్యూమర్ రాకుండా చూడండి. నీదే భారం సాయినాథా".
ఒకరోజు నా పన్ను ఒక్కటి బాగా నొప్పి పెట్టింది. "ఇదేంటి బాబా, మరో సమస్య వచ్చింది?" అనుకొని డెంటల్ డాక్టరు దగ్గరకి వెళ్ళాను. ఆ డాక్టరు ఎక్స్-రే తీయించుకొని రమ్మన్నారు. అప్పుడు నేను, "నాకు రూట్‌కెనాల్‍తో పనిలేకుండా చూడు తండ్రీ" అని బాబాను వేడుకొని ఎక్స్-రే తీయించాను. తరువాత డాక్టర్ ఎక్స్-రే రిపోర్ట్ చూసి, "ఏం సమస్య లేదు. సెన్సిటివ్ టీత్. అందుకే అలా లాగుతుంది" అని చెప్పి, కేవలం 'సెన్సోడెంట్-కె' పేస్ట్ ఉపయోగించమని చెప్పారు. సంతోషంగా బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను.
2023, ఫిబ్రవరిలో మేము తిరుపతి, శ్రీరంగం, మధురై, తంజావూరు, కన్యాకుమారి, అరుణాచలం తీర్థయాత్రకి వెళ్ళాము. మేము తిరుపతి వరకు ట్రైన్‍లో వెళ్ళాము. అక్కడ మా బంధువులున్నారు. అందరం కలిసి ఒక టెంపో మాట్లాడుకొని వెళ్ళాము. మొదటి మూడు రోజులలో దర్శనాలు బాగా జరిగాయి. చివరిగా అరుణాచలం వెళ్ళేటప్పుడు మా బాబుకి వాంతులు, విరేచనాలు, జ్వరం అన్నీ ఒకేసారి వచ్చి తను చాలా బాధపడ్డాడు. మేము బాబుకి టాబ్లెట్లు వేశాము. నేను, "బాబా! బాబుకి తొందరగా తగ్గిపోవాలి. మేము ఇంటికి తిరిగి వెళ్ళేవరకు ఏ సమస్యా లేకుండా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. అయితే అరుణాచలం దర్శించుకొని తిరిగి తిరుపతికి వచ్చినా బాబుకి తగ్గలేదు. అక్కడ హాస్పిటల్లో చూపిస్తే, డాక్టర్, "ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది" అని టాబ్లెట్లు, ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ బాబుకి అస్సలు తగ్గలేదు. పూర్తిగా రెండు రోజులు తను ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాగా నీరసించిపోయాడు. మేము మరుసటిరోజు ఉదయం తిరుమలలో స్వామివారి కల్యాణానికి వెళ్ళాము. బాబు నీరసంతో పడుకొనే ఉన్నప్పటికీ బాబా దయవల్ల స్వామి దర్శనం బాగా జరిగింది. ఆ మరుసటిరోజు హైదరాబాద్ వచ్చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళితే మూడు రోజుల్లో విరేచనాలు, వాంతులు తగ్గిపోయాయి. కరోనా సమయంలో ఒకసారి స్కూలు నుండి వచ్చాక మా పిల్లలిద్దరికీ జ్వరాలు వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! ఇది అసలే కరోనా కాలం. తొందరగా పిల్లల జ్వరం తగ్గించు" అని బాబాను వేడుకున్నాను. ఆ తండ్రి బాబా దయవల్ల తొందరగానే పిల్లలకి జ్వరం తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాలు ఆలస్యంగా పంచుకున్నందుకు, అలాగే నా తప్పులు ఏమైనా ఉన్నా నన్ను మన్నించు తండ్రీ. మా మరదలు ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటుందని మా అమ్మ నాతో చెప్పి బాధపడుతోంది. మరదలికి మంచి ఆలోచనలు కల్గించు తండ్రీ. మా తమ్ముడికి డే-షిఫ్టులు వచ్చేలా, అలాగే వాళ్ళకి తొందరగా సంతానం కలిగేలా అనుగ్రహించు తండ్రీ".
సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteSai always be with me
Chala bhagundhi me anubhavam, Naku kuda breast lo gada vundhi annaru kani baba daya , anugraham tho aa sist vala Naku ya problem ledu
ReplyDeleteOm sairam
ReplyDeleteసాయి నాకు నా భర్తకి మధ్య ఉండే మనస్పర్ధలు అన్నీ తొలగిపోవాలి కోర్టు సమస్యలన్నీ తొలగిపోవాలి నా భర్త నన్ను అర్థం చేసుకుని నన్ను కాపారానికి తీసుకెళ్లేలా చూడు సాయి నన్ను భార్యగా స్వీకరించేలా చూడు సాయి
ReplyDelete