సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1513వ భాగం....


ఈ భాగంలో అనుభ
వం:

  • శ్రీసాయి కరుణాకటాక్షాలు

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

శ్రీసాయినాథుని దివ్య పాదపద్మములకు నా సాష్టాంగ ప్రణామాలు. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు సునంద. బ్లాగులో అనుభవాలు పంచుకుంటుంటే బాబాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు, నేరుగా బాబాతో మాట్లాడుతున్న భావన నాకు కలుగుతుంది. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాను.

2022, జనవరిలో మా ఇంట్లో మా అమ్మకు, నాకు, మా చెల్లికి జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండింది. ముగ్గురం హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ చెక్ చేసి నాకు, మా చెల్లికి ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చారు. కానీ అమ్మకు చెస్ట్ ఎక్స్-రే తీయించమన్నారు. మేము అలాగే ఎక్స్-రే తీయించి రిపోర్ట్ డాక్టరుకి చూపిస్తే, 'గుండె కొంచెం పెద్దదిగా ఉంద'న్న అనుమానం వ్యక్తం చేసి, "గుండె డాక్టర్ దగ్గరకి వెళ్ళండి" అన్నారు. ఇంట్లో అందరం చాలా భయపడి మరుసటిరోజు గుండె డాక్టర్ వద్దకు వెళ్ళాము. డాక్టర్ ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేయించమన్నారు. నాకు చాలా భయమేసింది. అప్పటికి నేను అప్పుడప్పుడే నా ఆఫీసులో కుదుటపడుతూ ఇంకా కొన్ని సమస్యలతో సతమవుతున్నాను. అందువల్ల నేను హాస్పిటల్లో కూర్చొని, "ఇప్పుడు అమ్మకి ఏం కాకుండా చూడు బాబా. రిపోర్టుల్లో నార్మల్ అని వచ్చి, అమ్మ ఆరోగ్యం బాగుందని చెప్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అని బాబాను చాలా ప్రార్థించాను. తరువాత సాయినామస్మరణ చేస్తూ రిపోర్టులు డాక్టరుకి చూపిస్తే, "సమస్య ఏమీ లేదు" అన్నారు. నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఈ విషయం బ్లాగులో వెంటనే పంచుకోలేకపోయాను. "క్షమించండి బాబా".

2022, ఆగస్టులో మా నాన్నకు బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. హాస్పిటల్‌కి రమ్మంటే రానని ఆయన చాలా మొండిగా ఉండసాగారు. రెండు రోజుల తర్వాత పంటినొప్పితో కొంచెం వాపు కూడా వచ్చి ఆయన చాలా ఇబ్బందిపడుతూ బాధను అనుభవించారు. అయినా సరే హాస్పిటల్‌కి వెళ్ళనని మొండిగా వాదించారు. మరుసటిరోజుకి ఆయన గొంతు వద్ద చిన్నగడ్డలా వచ్చింది. నాకు చాలా భయమేసి, "నాన్నా! హాస్పిటల్‌కి వెళ్దామ"ని చాలా ప్రాధేయపడ్డాను. కానీ నాన్న నాపై కోపంతో చికిత్స తీసుకోవడానికి నిరాకరించి నన్ను చాలా బాధపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకున్న ఒకే ఒక దిక్కు, ధైర్యం, నమ్మకం, అన్నీ బాబానే. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకొని, "సాయీ! నేను నిన్నే నమ్మాను. నా సంతోషం, బాధ అన్నీ నీవే. నా పరిస్థితి నీకు తెలుసు. నువ్వే కాపాడాలి తండ్రీ" అని బాబాను చాలా వేడుకున్నాను. ఆ వెంటనే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు తెరిచాను. అందులో, "ఎటువంటి గడ్డ, జ్వరం అయినా తగ్గిపోవాల్సిందే! భయపడకు" అని బాబా సందేశం ఉంది. ఆయన దయవల్ల ఒకరోజు తర్వాత నాన్న పంటినొప్పి, వాపు, గడ్డ అన్నీ తగ్గిపోయాయి. "సాయీ! మీ కరుణాకటాక్షాలు నాపైన ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. 

మేము 2022, అక్టోబర్లో నవంబర్ నెలలో తిరుమల దర్శనానికి టికెట్లు బుక్ చేసుకున్నాము. అయితే కొద్దిరోజుల ముందు అకస్మాత్తుగా మా అమ్మ ఆరోగ్యం బాగాలేక కర్నూలు మరియు హైదరాబాదులోని హాస్పిటళ్ళకు తిరగాల్సి వచ్చింది. మా ఇంట్లో అందరూ మా అమ్మ విషయంగా ఆందోళనలో ఉండగా తిరుమల వెళ్లేరోజు దగ్గరపడింది. అందరూ 'ఈ స్థితిలో తిరుమల వెళితే ఆవిడ(మా అమ్మ) క్యూలో నిలబడగలదా? ఎలా మరి?' అని చాలా బాధపడ్డారు. నేను మాత్రం బాబాపై నమ్మకముంచి, "బాబా! ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు దర్శనం జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తరువాత మా ఇంట్లో అందరం స్వామివారి దర్శనానికి తిరుమల వెళ్ళాము. మా అమ్మానాన్నలకు వేకువఝామున దర్శనం ఉండటంతో వాళ్లిద్దరూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి వెళ్లి దర్శనం కోసం వేచి ఉండగా నేను రూమ్‌లో ఉండి, "అమ్మను జాగ్రత్తగా చూసుకోండి బాబా" అని వేడుకోసాగాను. అక్కడ అమ్మ లైన్‌లో ఎక్కువ సమయం నిలబడలేక స్పృహ తప్పి పడిపోయింది. ఆమె పల్స్ కూడా చాలా నెమ్మదించింది. పక్కనున్న నాన్న చాలా భయపడిపోయారు. కానీ అమ్మ వెంటనే స్పృహలోకి వచ్చింది. వాళ్లిద్దరూ క్షేమంగా రూమ్‌కి వచ్చారు. అమ్మ నార్మల్‌గానే ఉంది. అంతా బాబా దయ. "అమ్మకి వచ్చిన చిన్న ఇబ్బంది నుంచి బయటపడేట్లు చేసిన మీకు ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని చాలా ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు తండ్రీ. మా అమ్మ ఆరోగ్యం గురించి మీకు తెలుసు కదా బాబా! అమ్మ బాధలను చూడలేకపోతున్నాము. తన ఆరోగ్యాన్ని బాగుచేసి కర్మలను అనుభవించే క్రమంలో మీరు మీ బిడ్డలకు తోడుగా ఉంటామని నిరూపించండి సాయీ".

ఒకసారి మేము అన్నవరంలోని వీరవెంకటసత్యనారాయణస్వామి దర్శనం చేసుకోవాలనుకున్నాం. మా ఊరినుండి అన్నవరం చాలా దూరంలో ఉన్నందున, "అంత దూరప్రయాణంలో అమ్మానాన్నలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే దర్శనం బాగా జరిగేలా అనుగ్రహించండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా నా కోరిక మన్నించారు. ప్రయాణం సాఫీగా జరిగింది, స్వామివారి దర్శనం, వ్రతం బాగా జరిగాయి. తరువాత క్షేమంగా ఇంటికి వచ్చాము. అదే నెలలో కుక్కేసుబ్రమణ్యస్వామి దర్శనానికి వెళ్లాలనుకున్నాము. అది కూడా చాలా దూరప్రయాణం. అమ్మ ఆరోగ్యరీత్యా ఆమెను మా అక్క వద్ద ఉంచి మిగతా కుటుంబ సభ్యులందరం అక్కడికి వెళ్ళాము. వెళ్లేముందు నేను, "బాబా! మా యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలం కావాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా యాత్రలో ఎటువంటి ఇబ్బంది, బడలిక లేకుండా సుబ్రమణ్యస్వామి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. బాబా ఆశీస్సులతో మా యాత్రలు సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

ఒకసారి మా అక్కకూతురికి డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్లు చాలా తగ్గిపోయాయి. అప్పుడు నేను, "బాబా! చిన్నపిల్ల అనారోగ్యంతో బాధపడుతోంది. తనని కాపాడయ్యా" అని బాబాను ఎంతగానో వేడుకున్నాను. నా బాబా కరుణామయుడు. తొందరలోనే పాపకి జ్వరం తగ్గించి నయం చేశారు. బాబాపై నమ్మకముంచి ఆయన చూపించిన దారిలో వెళ్లడానికి మనస్ఫూర్తిగా అంగీకరించి భారం ఆ సాయిభగవంతునిపై పెట్టండి. ఇక అన్నీ ఆ సచ్చిదానంద స్వరూపుడైన సాయి చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. ఈ బ్లాగు ద్వారా మీకొక విన్నపం చేసుకుంటున్నాను. నేను మ్రొక్కిన మ్రొక్కులు త్వరలోనే తీర్చుకుంటాను. ఆ విషయంలో నాకు మీ సహాయం కావాలి తండ్రీ. మీ బిడ్డలను కాపాడు తండ్రీ".

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo