సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1507వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • తిరుపతి యాత్రలో బాబా అనుగ్రహం

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. మా తిరుపతి యాత్రలో నేను పొందిన బాబా అనుగ్రహాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2023, మార్చి 9న తిరుపతి వీఐపీ బ్రేక్ దర్శనానికి మావారికి టికెట్ దొరికింది. ఆ టికెట్‌పై ఆరుగురిని దర్శనానికి అనుమతిస్తారు. మావారు, "మనం నలుగురమే(నేను, మావారు, మాపాప, మా అత్తయ్య) కదా! మా చెల్లి, బావని మనతో తీసుకెళదాం" అన్నారు. సరేనని 7వ తేదీన బయలుదేరి వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. ఎనిమిదవ తరగతి చదువుతున్న మా పాప బాబా దయవల్ల మెరిట్ మీద గుడివాడ KKR గౌతమ్ స్కూలులో కో-బ్యాచ్‌కి సెలెక్ట్ అయి నెల రోజులుగా హాస్టల్లో ఉంటోంది. తనని మార్చి 6, సోమవారం ఇంటికి తీసుకొద్దామని అనుకుంటుండగా, ఆలోపు శుక్రవారం రాత్రి మా పాప నాకు ఫోన్ చేసి, "అమ్మా! నాకు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. హాస్టల్‌వాళ్ళు డాక్టరుకి చూపించారు" అని చెప్పింది. నాకు భయమేసి మావారితో, "ఎలాగూ తనని సోమవారం తీసుకొని రావాలనుకున్నాం కదా! రేపు ఉదయాన్నే తీసుకొద్దాం" అని అన్నాను. మావారు, "సరే, వెళ్లి తీసుకొచ్చేయ్" అన్నారు. అలాగే నేను వెళ్లి పాపను ఇంటికి తీసుకొచ్చాను. తనకి వచ్చింది వైరల్ ఫీవర్. అది కూడా ఎక్కువగా ఉంది. సోమవారం రాత్రికి పాప జ్వరం కంట్రోల్లోకి వస్తుందనుకున్న సమయంలో తనకి దగ్గరగా ఉంటున్నందువల్ల నాకు జలుబు, ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. మరుసటిరోజు సాయంత్రం 4:30కి ప్రయాణం. నేను ఎప్పుడు తిరుపతి వెళ్లినా కాలినడకన తిరుమల కొండెక్కుతాను. ఈసారి కూడా కాలినడకనే కొండెక్కాలన్నది నా కోరిక. కానీ ఆ రాత్రి జలుబు మరింత ఎక్కువై గొంతునొప్పి కూడా మొదలైంది. మావారు, "ఈసారికి నడిచి కొండెక్కద్దులే. మరోసారి వెళుదువు" అన్నారు. నేను మావారితో, "మీరు రేపు ఉదయాన్నే బాబా గుడికి వెళ్ళి రండి. ఆయనే అంతా చూసుకుంటారు" అని చెప్పాను. మేము ఎక్కడికి వెళ్లినా బాబా గుడికి వెళ్లి బాబాకి రెండు రూపాయలు దక్షిణ సమర్పించి బయలుదేరుతాం. నేను చెప్పినట్లే మావారు మంగళవారం ఉదయం గుడికి వెళ్లి బాబాకి దక్షిణ సమర్పించి వచ్చారు. ఆ సాయంత్రం మేము, మా ఆడపడుచువాళ్ళు తిరుపతికి ప్రయాణమయ్యాము. రాత్రికి నాకున్న జలుబు, ఒళ్లునొప్పులకు తోడు జ్వరం కూడా ఎక్కువగా వచ్చింది. కొద్దిగా టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోకుండానే పడుకున్నాను. మావారు కూడా టాబ్లెట్ ఇవ్వడం మరచిపోయారు. అయితే బాబా అద్భుతం చూపించారు. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను చూస్తుండగానే నా చేతికున్న లక్ష్మీదేవి ఉంగరం వెండి ఉంగరంగా మారిపోతూ అందులో బాబా కనిపించారు. నేను కంగారుగా మావారితో, "ఏవండీ! నా ఉంగరం వెండిగా మారిపోయి, అందులో బాబా దర్శనమిస్తున్నారు. మీకు కూడా బాబా కనిపిస్తున్నారా?" అని అడిగాను. మావారు, "అవును. నాకు కూడా బాబా కనిపిస్తున్నారు" అన్నారు. మరుక్షణం నాకు మెలకువ వచ్చింది. టైం చూస్తే 4 గంటలవుతుంది. మావారు "ట్రైన్ దిగాల్సిన టైం అయింది, కిందికి రా" అన్నారు. ఎంత ఆశ్చర్యమంటే, పక్కన తీసిపెట్టినట్లు నాకున్న జ్వరం, ఒళ్లునొప్పులు, జలుబు పోయాయి. మావాళ్లంతా ఆశ్చర్యపోయారు. కానీ నేను నాకొచ్చిన కల గురించి మావారికి చెప్పలేదు. ఎందుకంటే, మా అత్తగారు అక్కడే ఉన్నారు. ఆవిడ అలాంటివి నమ్మరు.

ట్రైన్ దిగాక మావారు నన్ను అలిపిరి వెళ్లే బస్సు ఎక్కించి, తను మా అత్తగారిని, పాపని, మా ఆడపడుచువాళ్ళని తీసుకొని కొండపైకి వెళ్లే వేరే బస్సు ఎక్కారు. నేను ఉదయం 5 గంటలకి బాబాని, వెంకటేశ్వరస్వామిని తలచుకుంటూ నడక ప్రారంభించాను. కొంతసేపటికి మావారు ఫోన్ చేసి, "ఎక్కడివరకు ఎక్కావ"ని అడిగారు. "సగం వరకు ఎక్కేశాను" అని నేను అంటే, "పరిగెత్తుతున్నావా ఏంటి? నిదానంగా నడువు" అన్నారాయన. కానీ నాకు ఏవిధమైన అలసటా లేదు. కేవలం మూడున్నర గంటల్లో నేను కొండెక్కేశాను. నిజానికి ప్రతిసారీ నాకు కొండెక్కడానికి 5, 6 గంటల సమయం పట్టేది. మధ్యమధ్యలో కాసేపు కూర్చొని నిదానంగా ఎక్కేదాన్ని. అలాంటిది ఈసారి నన్ను ఏదో శక్తి నడిపించినట్లు చాలా స్వల్ప సమయం కూర్చొని త్వరగా ఎక్కేశాను. అసలు నడక చాలా తేలికగా సాగినట్లు అనిపించింది. సరే, కొండ పూర్తిగా ఎక్కాక కర్పూరం వెలిగిద్దామని చూస్తే, అక్కడ కర్పూరం అమ్మేవాళ్ళు ఎవరూ లేరు. కొంతమంది కర్పూరం బిళ్ళలు వెలిగిస్తూ కొండెక్కుతారు. అలా ఎవరో వెలిగించాక పూర్తిగా వెలగకుండా ఉండిపోయిన కర్పూరం నా కంటపడితే దాన్ని వెలిగించి నా నడక పూర్తిచేశాను. ఆ కర్పూరాన్ని నాకు బాబానే చూపించారన్నది నా నమ్మకం.

తరువాత మేము రూమ్ తీసుకొని మరుసటిరోజు బ్రేక్ దర్శనానికి రిపోర్టు చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాము. తరువాత మేము, మా ఆడపడుచువాళ్ళు కల్యాణోత్సవానికి, మా అత్తయ్యగారికి సుప్రభాత సేవకు లక్కీ డిప్ వేశాము. మాకు రాలేదుగానీ మా అత్తగారికి సుప్రభాతసేవ వచ్చింది. రాత్రి 7 గంటలకి నేను, మా అన్నయ్యగారు సర్వదర్శనానికి వెళ్ళాము. దర్శనమై బయటకి వచ్చేటప్పటికీ ఉదయం 4 గంటలైంది. కాసేపు విశ్రాంతి తీసుకొని, ఆరోజు గురువారం కావడంతో బాబా చరిత్ర రెండు అధ్యాయాలు చదువుకొని 8 గంటలకి బ్రేక్ దర్శనానికి వెళ్ళాము. మేము ఊహించని విధంగా మాకు స్వామివారి నిజరూప దర్శనమైంది. ఆరోజు గురువారమైనందున స్వామివారి నిజరూప దర్శనము ఉంటుందని మాకు తెలియనప్పటికీ బాబా దయవల్ల మాకు ఆ దర్శనభాగ్యం దక్కింది. 

దర్శనానంతరం బయటకు వచ్చి కూర్చున్న మరుక్షణం నాకు మావారు అంతకుముందు, "మనకి రూమ్ ఒంటిగంట వరకే ఉంది. కానీ ఖాళీ చేయొద్దు. మన ట్రైన్ రాత్రి 11:30కి కదా, అప్పటివరకు మీరు విశ్రాంతి తీసుకోండి. రాత్రి 8 గంటలకి రూమ్ ఖాళీ చేద్దాం" అన్న మాటలు గుర్తొచ్చాయి. నేను వెంటనే మా వదినతో, "వదినా! మనకి నిన్న లక్కీ డిప్ రాలేదు కదా! నాకెందుకో ఈరోజు వస్తాయని అనిపిస్తుంది. డిప్ వేసే అవకాశం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మనమీరోజు మళ్ళీ డిప్ వేద్దాం. ఒకవేళ వస్తే, రేపు తెల్లారి స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరై రాత్రికి తిరుగు ప్రయాణమవుదాం. రాకుంటే ఈరోజే వెళ్ళిపోదాం. మీ అన్నయ్యతో చెప్పు" అన్నాను. మా వదిన సరేననడంతో వెళ్లి లక్కీ డిప్ వేశాము. సాయంత్రం 5:30కి కళ్యాణోత్సవానికి సెలెక్ట్ అయినట్లు మాకు మెసేజ్ వచ్చింది. కానీ మా ఆడపడచువాళ్ళకి రాలేదు. నేను నా  మనసులో, "బాబా! మనకి తప్పకుండా వస్తుందని నేనే మా ఆడపడుచువాళ్ళకి చెప్పాను. అలాంటిది మాకొచ్చి వాళ్ళకి రాకపోతే బాధగా వుంది. దయచేసి వాళ్లకు కూడా వచ్చేటట్లు చేయి తండ్రీ" అని దణ్ణం పెట్టుకున్నాను. తరువాత మేము CRO ఆఫీస్ దగ్గరకు వెళ్లి అక్కడ కళ్యాణోత్సవానికి డబ్బులు కడుతుంటే, మా ఆడపడుచువాళ్ళ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ కనిపించింది. వెంటనే నేను మా ఆడపడుచుకు ఫోన్ చేసి, "మీకు కూడా కళ్యాణోత్సవం వచ్చింది" అని చెప్పాను. చూశారా, బాబా చేసిన అద్భుతం!

మా ఈ తిరుమల ప్రయాణంలో బాబా అడుగడుగునా వెహికల్స్ మీద దర్శనమిచ్చి చక్కటి స్వామివారి దర్శనాలను ప్రసాదించారు. మా పాప జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మరొక విషయం ఏమిటంటే, మా అత్తయ్యగారికి కూడా జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. టాబ్లెట్లు వేసుకుంటున్నా తిరుపతి నుండి వచ్చిన నాలుగైదు రోజులకుగానీ ఆవిడకు తగ్గలేదు. అదే నేను ఒక్క టాబ్లెట్ అయినా వేసుకోకుండా బాబాపై విశ్వాసముంచి ప్రయాణం మొదలుపెడితే, బాబా కలలో దర్శనమిచ్చి నా అనారోగ్యాన్ని ఇట్టే తీసేశారు. నేను ఇలా చెప్పి మా అత్తయ్యను విమర్శించడం లేదుగానీ 'బాబాని నమ్మినవారికి, నమ్మనివారికి ఉన్న తేడాను తెలియజేయాలనుకున్నాను. "అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు బాబా. మా అత్తయ్య విషయం వ్రాయడం తప్పైతే క్షమించు బాబా. నేను కేవలం మిమ్మల్ని నమ్మినవారిపై మీ అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్పేందుకే అలా వ్రాశాను".

3 comments:

  1. బాబా సాయి నీ మీద నమ్మకాన్ని పెట్టుకోలేదు చూస్తున్నాను బాబాయ్ సాయి నా భర్తని నువ్వే మార్చాలి తను నన్ను అర్థం చేసుకొని నన్ను కాపురానికి తీసుకెళ్లాలి. నాకు అన్యోన్య దాంపత్యాన్ని ప్రసాదించు తండ్రి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo