1. సమస్యలను తీర్చి మనోధైర్యాన్ని ప్రసాదించే బాబా
2. మనుషుల మనసులు మార్చి అభయాన్ని ప్రసాదించే బాబా
సమస్యలను తీర్చి మనోధైర్యాన్ని ప్రసాదించే బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. శ్రీసాయిబాబా పాదారవిందములకు నా మనఃపూర్వక నమస్కారాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహించడం వల్ల మేము బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులకు తెలియజేయగలుగుతున్నాము. అలాగే, బాబాపై మా భక్తి, విశ్వాసాలు మరింతగా దృఢమవుతున్నాయి. నా పేరు ఉమ. మాది కృష్ణాజిల్లా, ఘంటసాల గ్రామం. మా అమ్మగారిది, మా అత్తగారిది ఒకే ఊరు. మా అత్తగారింటికి కేవలం ఐదు నిమిషాల దూరంలోనే మా అమ్మవాళ్ల ఇల్లు ఉంటుంది. 2023, మార్చి 23, గురువారంనాడు నేను మా అమ్మవాళ్ళింటికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చాను. ఆ రాత్రి స్నానం చేసేముందు నా మెడలో ఉండే గొలుసు, చేతిగాజులు తీద్దామని చూస్తే, నా చేతికి గాజులు లేవు. ఒక్క నిమిషం నా బుర్ర పనిచేయలేదు. లక్ష రూపాయల విలువైన గాజులు ఎక్కడ పెట్టానో నాకు అస్సలు గుర్తురాక మా ఇల్లంతా వెతికాను. కానీ, అవి ఎక్కడా కనిపించలేదు. విషయం నా భర్తకి చెప్పి, మళ్ళీ ఇద్దరమూ వెతికాము. అయినా అవి ఎక్కడా కనపడలేదు. నేను వాటికోసం వెతుకుతూనే నా మనసులో, "బాబా! నా గాజులు ఎక్కడ పెట్టానో నాకు గుర్తుకొచ్చి అవి నా కంటపడేలా చేయండి" అని అనుకున్నాను. తరువాత నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి, "నా గాజులు అక్కడ ఉన్నాయేమో చూడు" అన్నాను. 10 నిమిషాల తర్వాత మా అన్నయ్య ఫోన్ చేసి, "గాజులు ఇక్కడే ఉన్నాయి" అని చెప్పి వాటిని మా ఇంటికి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. వాటిని ఎప్పుడు నా చేతినుండి తీసి అక్కడ పెట్టానో నాకు అసలు గుర్తులేదుగానీ అన్నయ్య వాటిని తీసుకురాగానే నా మనసు తేలికపడింది.
నాకు పెళ్ళై 15 సంవత్సరాలవుతుంది. మా పుట్టింటివారిచ్చిన కట్నకానుకల ద్వారా ప్రతి సంవత్సరం నాకు నాలుగు లక్షల ఆదాయం వస్తుంది. ఆ మొత్తంతో నేను నాకు కావాల్సిన బంగారు నగలు కొనుక్కుంటాను. దానికి నా భర్త ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అయితే 2023వ సంవత్సరమొచ్చిన ఆదాయంతో నేను ఒక బంగారు చైన్ తీసుకొని, పుట్టినరోజు కానుకగా మావారికిచ్చి ఆయన్ని ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. కానీ 2023, జనవరి 27న మావారి పుట్టినరోజుకాగా ఆలోపు నాకు రావాల్సిన డబ్బులు రాలేదు. కారణం, ధాన్యం కొనుగోలు చేసిన గవర్నమెంట్ వెంటనే డబ్బులు మాకు చెల్లించలేదు. అందువలన నేను నాకు తెలిసిన ఒక బంగారు షాపు అబ్బాయితో మాట్లాడి అరువు మీద ఒక చైన్ తెప్పించి మావారికి ప్రెజెంట్ చేశాను. అయితే ఆ చైన్ అరువు మీద తెచ్చిన విషయం మా ఆయనకి చెప్పలేదు. మనసులో బాబాని తలచుకుని, "బాబా! నా పంట డబ్బులు త్వరగా వచ్చేలా చేసి, వాటిని ఆ బంగారం షాపు అబ్బాయికి చెల్లించేలా అనుగ్రహించండి" అని ప్రార్థించాను. కానీ డబ్బులు రావడం చాలా ఆలస్యమైంది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో విషయం మావారికి తెలిసి వెంటనే డబ్బులు తీసుకెళ్లి ఆ బంగారం షాపు అబ్బాయికి ఇచ్చేశారు. దాంతో ఈసారి నా భర్తకి నా సొంత డబ్బులతో చైన్ కొనాలన్న నా కోరిక నెరవేరలేదని బాధపడ్డాను. అయినప్పటికీ నాకు బాబాపై నమ్మకం, భక్తి తగ్గలేదు. మనసులో, "నా పంట డబ్బులు త్వరగా రావాలి. వాటిని నా భర్తకు ఇవ్వాలి" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల కొంచెం ఆలస్యమైనప్పటికీ డబ్బులు వచ్చాయి. వాటిని నేను నా భర్తకు ఇచ్చాక నా మనసుకి తృప్తిగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
మనుషుల మనసులు మార్చి అభయాన్ని ప్రసాదించే బాబా
తోటి భక్తులకు నమస్కారం. నా పేరు సుగుణ. సద్గురు సాయి పాదపద్మములకు ప్రణామాలర్పిస్తూ ఆయన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆ తండ్రికి సదా కృతజ్ఞురాలిని. మావారు మా బాబుకి ఒక కొత్త కారు కొనిచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఇంటిముందు పార్క్ చేసి ఉన్న ఆ కారుని ఒక కారు రాసుకుంటూ వెళ్ళింది. దాంతో కొత్త కారుకి గీతలు పడ్డాయి. వెంటనే మా బాబు ఆ కారు అతనిని అడిగితే, "రిపేర్ చేయించండి. ఎంత ఖర్చు అయితే అంత ఇస్తాను" అని చెప్పాడతను. సరేనని రిపేర్ చేయిస్తే 16,000 రూపాయలు అయింది. అతనికి ఫోన్ చేసి అడిగితే, "నేను డబ్బులు ఇవ్వను" అని కఠినంగా సమాధానం ఇచ్చాడు. దాంతో మా బాబుకి కోపమొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని మాతో అన్నాడు. నాకు పోలీసులు, కంప్లైంట్లు అంటే చాలా భయం. అందుకని, "ఆ 16 వేల రూపాయలు నువ్వే పెట్టుకో. పోలీసుస్టేషన్‍కి వెళ్లొద్దు. అతను మంచివాడైతే అలా మాట్లాడడు" అని నచ్చజెప్పాను. కానీ అతను ముందు డబ్బులిస్తానని, ఇప్పుడు ఇవ్వనని అబద్ధం చెప్పడం మా బాబుకి నచ్చక కోపంతో, "అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను" అని అన్నాడు. సరిగా అప్పుడే హఠాత్తుగా ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' నా ఫోన్లో కనపడింది. అది చూడగానే నేేను అనుకోకుండా, "మా బాబు పోలీసుస్టేషన్‍కి వెళ్ళకుండా అతని మనసు మార్చి డబ్బులు ఇచ్చేటట్లు చేయమ"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. చిత్రంగా మరుసటిరోజు అతను ఫోన్ చేసి, "6,000 రూపాయలు ఇస్తాన"ని మా బాబుతో చెప్పాడు. అలాగే 5,500 రూపాయలు మా బాబుకి ఇచ్చాడు. దాంతో మా బాబు పోలీసుస్టేషన్‍కి వెళ్లడం మాని ఆ డబ్బుతో సరిపెట్టుకున్నాడు. ఇంతలా కోరిన వెంటనే మనుషుల మనసులు మార్చి మనకి అభయాన్ని ప్రసాదించే బాబా మనకు ప్రాప్తించడం ఎన్ని జన్మల సుకృతమో! శరణాగతవత్సలుడు, భక్తానుగ్రహకారకుడు, ప్రేమప్రదాత అయిన ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Nenu nee daggare unnanu very nice blessings to devotees. Om sai ram🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me