సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1511వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇష్టమైన తమ ఫోటోని అనుగ్రహించిన బాబా
2. 'గురువే అసలైన తండ్రి' అన్న విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి

ఇష్టమైన తమ ఫోటోని అనుగ్రహించిన బాబా

నేను సాయిభక్తురాలిని. నా పేరు పద్మజ. నాకు పై ఫోటోలోని బాబా అంటే చాలా చాలా ఇష్టం. నా మొబైల్ వాల్ పేపర్, వాట్సాప్ డీపీ అన్నిట్లో ఆ బాబానే ఉంటారు. ఎందుకనో ఆ బాబాను చూస్తే నాకు ఒక ధైర్యం. నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నప్పుడు బాబా ఆ రూపంలో నాకు కనిపించి చాలా అంటే చాలా సహాయం చేశారు. అప్పటినుంచి నాకెందుకో ఆ బాబా అంటే చాలా సెంటిమెంట్. అలాంటి ఫోటోనే ఒకటి నేను మా పిన్నికి ఇచ్చాను. ఇక అసలు అనుభవానికి వస్తే..

ఒకరోజు మా ఇంటిలోకి ఒక పక్షి వచ్చింది. 'పక్షి ఇంట్లోకి రాకూడదని, వస్తే మంచి జరగదని' అందరూ అన్నారు. మా ఇంట్లో చిన్నబాబు ఉన్నందున నాకు చాలా భయమేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ పూజ చేయించుకోవాలని చెప్పారు కానీ మాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే, మేమంతా బాబానే నమ్ముతాము. "ఏంటి ఇలా జరిగింది?" అని బాబాకే దణ్ణం పెట్టుకొని వెంటనే మా పిన్నికి ఫోన్ చేశాను. ఆమె, "ఎందుకు భయపడుతున్నావు? ఇల్లంతా శుభ్రం చేసుకొని బాబాకి కొబ్బరికాయ కొట్టి ఊదీనీళ్ళు ఇల్లంతా చల్లుకో. ఏం కాదు. అయినా నీకు ఇష్టమైన బాబా ఉన్నారు కదా! ఆ ఫోటో తీసి గోడకు తగిలించుకో. మా ఇంట్లో పెట్టుకోమని లాంటి బాబా ఫోటో నువ్వే నాకు ఇచ్చావు. మరి నువ్వు ఎలా మర్చిపోయావు?" అని అంది. అయితే నేను ఆ బాబా ఫోటో గురించి రెండురోజులు వెతికినా దొరకలేదు. తర్వాత నేను దానిగురించి మర్చిపోయాను. తరువాత కొన్నిరోజులకి మేము తిరుమల వెళ్ళాము. నాకు మాములుగా కొండపైకి వెళ్ళేటప్పుడు కళ్ళు తిరుగుతాయి. అందువలన నేను, "బాబా! నాకు కళ్ళు తిరగకుండా చూడు. అలాగే కొండ పైకి వెళ్ళగానే మీరు నాకు దర్శనమివ్వాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. నేను చిన్నప్పటినుంచి తిరుమల ఎన్నోసార్లు వెళ్లినప్పటికీ కొండ ఎక్కేటప్పుడు ప్రకృతి దృశ్యాలను ఎప్పుడూ చూడలేదు. అలాంటి నేను మొదటిసారి మొత్తమంతా చూశాను. నా కళ్ళు అస్సలు తిరగలేదు. అంతేకాదు, మేము కొండ పైకి వెళ్ళాక మా కారు పార్క్ చేస్తుంటే ఎదురుగా ఒక టెంపో మీద నాకు ఇష్టమైన బాబా తెలుపురంగు వస్త్రాల్లో కనిపించారు. అప్పుడు నాకు మా పిన్ని చెప్పిన మాట గుర్తొచ్చి, "బాబా! నేను తిరిగి ఇంటికి వెళ్ళే లోపల ఎలాగైనా నాకు ఆ ఫోటో దొరికేలా అనుగ్రహించండి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అయితే నేను ఏ షాపుకి వెళ్లినా నాకు కావాల్సిన బాబా ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఇక నేను దానిగురించి మర్చిపోయాను. తరువాత మేము అలివేలుమంగాపురం వెళ్లి, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని, షాపింగ్ కూడా చేశాము. తర్వాత అందరం తిరిగి మా కారు దగ్గరకి వెళ్ళాము. అంతలో మా తమ్ముడు ఏదో కొనాలని మళ్ళీ షాపింగ్ మాల్‌కి వెళ్ళాడు. మేము కూడా తన వెనక వెళ్ళాము. అలా వెళ్లిన మేము అనుకోకుండా ఒక షాపు ముందు ఆగాము. అంతే, ఆ షాపులోకి చూడగానే నాకు ఇష్టమైన బాబా నాకు కావాల్సిన రంగులో, సైజులో కనిపించారు. ఇంక దొరకదులే అని నిరాశతో ఇంటికి వెళ్ళిపోదామని కారు ఎక్కే సమయంలో మళ్ళీ వెనక్కి వెళితే, 'నన్ను మర్చిపోయావా?' అంటూ బాబా నన్ను ఆశ్చర్యంలో ముంచేశారు. నాతో మా ఇంటికి వచ్చారు. నేను అనుకున్నప్పుడు ఆ ఫోటోని  కొనుక్కొని ఉంటే నాకు అంత ఆనందం అనిపించేది కాదేమో! ఇలా దొరకడం వల్ల ఆ ఫోటోని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. "థాంక్యూ సో మచ్ బాబా".

'గురువే అసలైన తండ్రి' అన్న విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి

ముందుగా నా సాయినాథునికి హృదయపూర్వక ప్రణామాలు. సాయిబంధువులందరికీ నా వందనాలు. నా పేరు రాధిక. సాయి నాకు అనుగ్రహించిన బోధనలను, అనుభవాలను బ్లాగులో పంచుకోవాలని నా కోరిక. దానికి అనుమతి కోరుతూ, "ఏదైనా సంకేతం ఇవ్వమ"ని బాబాను అడుగుతుండేదాన్ని. చివరికి బాబా అనుమతి లభించడంతో మొట్టమొదటిసారి నా అనుభవాన్ని ఆనందంగా మీతో పంచుకుంటున్నాను. నేను 'గురువే అసలైన తండ్రి' అని సాయిసచ్చరిత్రలో చదివాను. మా గురూజీ కూడా అదే చెప్తారు. నాకు కూడా అలా అనిపించినప్పటికీ ఎక్కడో 'గురువు అసలైన తండ్రి ఎలా అవుతారు?' అని చిన్న సందేహం. అయితే ఆ సందేహాన్ని నేను ఎప్పుడూ మా గురూజీని అడగలేదు. కానీ నాలో వున్న ప్రశ్నలను నా అంతరాత్మ అయిన ఆ సాయినాథులు గ్రహించగలరు కదా! నా సందేహాన్ని ఆయన నా కళ్ళముందు చాలా అద్భుతంగా ఒక దృశ్యరూపంలో వివరించారు. ఒకరోజు నేను మా గురువుగారితో ఫోన్‌లో మాట్లాడి ఫోన్ పెట్టేస్తూనే, పూర్తి మెలకువలో ఉండగానే నా కళ్ళముందు ఒక దృశ్యo జరిగింది. ఆ దృశ్యంలో నేను చాలా చిన్న పాపగా ఉన్నాను. ఎంత చిన్న అంటే నిలబడగలనుగానీ, అడుగులు వేయలేను. నా ఎదురుగా నా తండ్రి స్థానంలో మా గురూజీ చేయి చాపి నిలబడి కనిపించారు. ఆయన్ని చూడగానే నేను ఆనందంతో కేరింతలు కొడుతూ ఆతృతగా అడుగు ముందుకు వేసి, నా చేయి ముందుకు చాపి ఆయన చేయి పట్టుకోబోతున్నాను. అదే సమయంలో ఆయన ఒక అడుగు వెనుకకు వెళ్లారు. అలా నేను అడుగు ముందుకు వేయడం, ఆయన ఒక అడుగు వెనక్కి వెళ్లడం జరుగుతుండగా నేను కొన్ని అడుగులు వేశాక అక్కడ నిలబడి ఆశ్చర్యంగా, "ఇలా ఎలా నడిచేశాను? ఏమిటీ అడుగులు!" అని కిందకు చూశాను. మొత్తం 5 అడుగులు వేశాను. "ఏమిటి ఈ ఐదు అడుగులు?" అని అనుకున్నాను. 1.శరీరం, 2.మనసు, 3.బుద్ధి, 4.చిత్తం, 5.అహంకారం అనేవే ఆ ఐదు అడుగులు. ఆధ్యాత్మిక జీవితంలో మనిషి ఈ అడుగులు వేస్తూ ఒక్కొక్క స్థాయిని దాటాలి. 'ఈ జీవితంలో శరీరానికి కన్న తండ్రి నడకను నేర్పిస్తే, ఆధ్యాత్మిక జీవితంలో గురువు మనకు తండ్రై పరమాత్మ వైపుకు నడిపిస్తారు. కాబట్టి గురువే అసలైన తండ్రి' అని నాకు స్పష్టంగా అర్ధమైంది. ఇలా బాబా నా సందేహాన్ని చాలా చక్కగా నివృత్తి చేశారు. నా సాయితండ్రికి ప్రేమతో ధన్యవాదాలు, ప్రణామాలు.

6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. సాయి నా వంశీ నువ్వే మార్చాలి సాయి తనలో ఇప్పటివరకు ఈ క్షణం వరకు కూడా ఇలాంటి మార్పు లేదు సాయి. నువ్వే తనను మార్చి నాకు దగ్గర చేయాలి నాకు నిలబెట్టాలి సాయి నా కన్నుండే దాంపత్యాన్ని ప్రసాదించు తండ్రి

    ReplyDelete
  3. ఓం సాయారామ్

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 Raksha raksha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo