సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దాదాకేల్కర్



శ్రీసాయిబాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న ప్రముఖ భక్తులలో దాదాకేల్కర్ అలియాస్ గణేష్ దామోదర్ కేల్కర్ ఒకరు. బాబా ఎంతో ప్రేమగా అతనిని ‘దాదాసాబ్’ అనీ, కొన్ని సందర్భాలలో మరింత ఆప్యాయంగా ‘దాదాభట్’ అనీ పిలిచేవారు. వయస్సు దృష్ట్యా బాబా ఎల్లప్పుడూ అతనిని గౌరవించేవారు. బాబా తమకొచ్చే దక్షిణలోంచి ప్రతిరోజూ అతనికి 5 రూపాయలు ఇచ్చేవారు. ఈ అలవాటుని బాబా తమ చివరి రోజులవరకు కొనసాగించారు. ఈ అరుదైన గౌరవాన్ని పొందిన భాగ్యశీలురైన భక్తులలో కేల్కర్ ఒకరు.

దాదాసాహెబ్ ఖపర్డే అనే సాయిభక్తుడు తన డైరీలో ఒక చక్కటి ఉదంతాన్ని వ్రాసుకున్నారు. అందులో దాదాకేల్కర్ గురించి ప్రస్తావిస్తూ 1912, జనవరి 1న ఈవిధంగా వ్రాశారు: “ఈరోజు బాబా తమ పూర్వజన్మకు సంబంధించిన ఒక కథనాన్ని చెప్పారు. ఆ కథలో బాబా తమతోపాటు నేను, దాదాకేల్కర్, మాధవరావు దేశ్‌పాండే, బాపూసాహెబ్ జోగ్ మరియు కాకాసాహెబ్ దీక్షిత్ ఒకే వీధిలో నివసించేవారమనీ, అందుకే ఈ జన్మలో అందరినీ ఒకే చోటుకి చేర్చామనీ చెప్పారు.

ఇకపోతే, దాదాకేల్కర్ పూర్వజీవితం గురించిన సమాచారం అంతగా అందుబాటులో లేదు. అయినప్పటికీ, అతను శిరిడీ గ్రామవాసి మాత్రం కాదు. అతను మంచి సంస్కృతీ సాంప్రదాయాలు గల సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంనుండి తల్లిదండ్రులు నైతిక విలువలు బోధించడం వల్ల అవి బలంగా అతనిలో నాటుకుపోయాయి. అతను వేదాలను లోతుగా అధ్యయనం చేసి, దేవతోపాసన చాలా తీవ్రంగా చేశాడు. హిందూమత సిద్ధాంతాలు, ఆచారవ్యవహారాలు, విలువలు, నమ్మకాల విషయంలో అతను చాలా గర్వంగా ఉండేవాడు. ఆ గర్వమే ముస్లిం వేషధారణలో కనిపించే సాయిబాబా వద్దకు వెళ్ళడానికి అతనికి ఆటంకమైంది. నాటి హిందూమత సంప్రదాయానుసారం ముస్లిములందరూ అణగారిన జీవులనీ, ఒక బ్రాహ్మణ సత్పురుషుడే తనను మోక్షమార్గంలో నడిపిస్తాడనీ అతను బలంగా నమ్మేవాడు. అందువల్ల, బాబా అతనిని తమవైపుకు ఆకర్షించినప్పటికీ వారి వద్దకు వెళ్ళడానికి అతని మనస్సు సిద్ధంగా లేదు. కానీ, "ఎవరూ ఏ వ్యక్తినీ తన గురువుగా చేసుకోలేరు. అది సహజంగా జరుగుతుంది" అనే నానుడి ఎంత నిజమో దాదాకేల్కర్‌కు అనుభూతమయ్యే సమయం రానే వచ్చింది.

సాయిబాబాతో మొదటి సమావేశం:

దాదాకేల్కర్‌కు రావుబహదూర్ హరివినాయక్ సాఠే గురించి బాగా తెలుసు. అందువల్ల ఒకరోజు అతను, 'తనకు పెళ్ళీడుకొచ్చిన ఒక కుమార్తె ఉందనీ, అహ్మదాబాద్‌లో ఆమెకు తగిన సంబంధాలేవైనా ఉంటే తెలుపమ'ని సాఠేకు ఒక ఉత్తరం వ్రాశాడు. వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఆ ఉత్తరం సాఠేను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే భార్య మరణించటంతో మళ్ళీ వివాహం చేసుకొనే ఆలోచనలో ఉన్న సాఠేకి తనను దృష్టిలో పెట్టుకొనే కేల్కర్ పెళ్ళి ప్రతిపాదన చేస్తున్నారని అనిపించింది. ఆ విషయమై వివరణ కోరుతూ, 'ఒకవేళ మీరు నన్నే దృష్టిలో పెట్టుకుని ఉత్తరం వ్రాసి ఉన్నట్లైతే, నా వయస్సు తదితర విషయాలు పరిగణించమ'ని జవాబు వ్రాశాడు. ఆ ఉత్తరం అందుకున్న కేల్కర్, 'మీ పూర్తి వివరాలు నాకు తెలుసు. మిమ్మల్ని నా అల్లునిగా చేసుకోవడానికి నేను సంతోషిస్తున్నాను' అని ప్రత్యుత్తరం వ్రాశాడు. అందుకు సాఠే, 'అలాగైతే మీ కుమార్తెను మీతోపాటు శిరిడీ తీసుకెళ్ళి, శ్రీసాయిబాబాకు చూపించి వారి అనుమతి తీసుకోండి. అప్పుడే నేను ఈ విషయంలో ముందుకు సాగగలను. బాబా అనుమతి లేనిదే నేను వివాహం చేసుకోను' అని ఖచ్చితమైన జవాబు వ్రాశాడు. అయితే, కేల్కర్ మనసు మహాబలేశ్వర్ సమీపంలో ఉన్న వాయి అనే తీర్థక్షేత్రంలో పేరుగాంచిన బ్రాహ్మణ పురోహితుని సంప్రదించాలని ఎక్కువ మొగ్గు చూపినందువల్ల, సాయిబాబాను దర్శించి వారి సలహా తీసుకునేందుకు అంతగా ఇష్టపడలేదు. ఇంకా చెప్పాలంటే, తాను పెరిగిన వాతావరణం దృష్ట్యా అతని మనసులో బాబా పట్ల కొన్ని ప్రతికూల భావాలున్నాయి. పైపెచ్చు, తన మనస్సులోని ఆలోచనలు బాబాకు తెలిసి ఉండవచ్చని, కాబట్టి ఈ వివాహానికి అనుమతినివ్వకపోవచ్చని భావించాడు. కానీ సాఠే తన నిశ్చయానికి దృఢంగా కట్టుబడి ఉండటంతో ఇక తప్పనిసరై కేల్కర్ తన కుమార్తెను వెంటబెట్టుకొని శిరిడీ వెళ్ళాడు. మాధవరావు దేశ్‌పాండే (షామా) వాళ్ళను బాబా దర్శనానికి మసీదుకు తీసుకొని వెళ్ళాడు. బాబా కేల్కర్ కుమార్తెను ఆశీర్వదించి, ఆమె ఒడిలో ఒక కర్బూజాపండు వేసి, నుదుటిపై కుంకుమ పెట్టి, "అమ్మాయిని అహ్మదాబాద్ పంపు!" అని కేల్కర్‌తో అన్నారు. వాళ్లిద్దరూ ఒకవైపు ఆశ్చర్యపోతూనే, మరోవైపు బాబా ఆశీర్వాదానికి ఎంతో సంతోషించారు. బాబా అనుమతి లభించడంతో సాఠే తన యాభయ్యవ ఏట 1905లో కేల్కర్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహాన్ని మిషగా చేసుకొని కేల్కర్ మనసులో భక్తిని ప్రజ్వలింపజేశారు బాబా. కేల్కర్ అతి తక్కువ కాలంలోనే బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. 1906 నుండి 1916 వరకు సుమారు దశాబ్దకాలం సద్గురు సన్నిధిలో గడిపిన అదృష్టవంతుడతను.

శిరిడీలో సాఠేవాడా నిర్మాణం జరిగాక సాఠే, అతని భార్యాపిల్లలతోపాటు కేల్కర్ కూడా తన కుటుంబంతో ఆ వాడాలోనే నివసిస్తుండేవాడు. తద్వారా ఉపాసనీబాబా, బాపూసాహెబ్ జోగ్, దాదాసాహెబ్ ఖపర్డే, రామమారుతి మహరాజ్, కాకాసాహెబ్ దీక్షిత్, లక్ష్మీబాయి కౌజల్గి వంటి బాగా చదువుకున్న, ఆధ్యాత్మిక పురోగతి సాధించిన భక్తులతో సమయాన్ని గడపగలిగాడు. వారి సహచర్యంలో అతను వివిధ ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం చేయసాగాడు.

ఒకసారి ప్రముఖ సాయిభక్తుడు శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్‌కి సన్నిహితుడైన డాక్టర్ జగన్నాథరావు పండిట్ బాబా దర్శనం కోసం శిరిడీ వచ్చాడు. అతను నేరుగా మసీదుకు వెళ్లి బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనిని దాదాకేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి అక్కడికి చేరుకునే మార్గం కూడా చెప్పారు. బాబా ఆదేశానుసారం అతను అలాగే కేల్కర్ ఇంటికి వెళ్ళాడు. ఇరువురూ ఒకరినొకరు పలకరించుకున్నాక, కేల్కర్ బాబా పూజకు మసీదుకు బయలుదేరుతూ, తనతోపాటు రమ్మని పండిట్‌ని కూడా ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి మసీదుకు చేరుకున్నారు. అప్పటివరకు బాబా నుదుటిపై తిలకం దిద్దేందుకు ఎవరూ సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠానికి చందనం పూసేవాడు. మిగిలిన భక్తులు బాబా పాదాలకు మాత్రమే చందనమద్దేవారు. ఈ ఆచారాలేవీ తెలియని డాక్టర్ పండిట్ యథావిధిగా కేల్కర్ బాబాను పూజించిన తరువాత అతని చేతిలోని పళ్లెం అందుకొని, అందులోని గంధంతో బాబా నుదుటన త్రిపుండ్రాన్ని దిద్దాడు. పండిట్ చేసిన పని చూసి కేల్కర్ శిలలా స్తబ్ధంగా నిలబడిపోయాడు. పండిట్ చర్యతో బాబా తమ నిగ్రహాన్ని కోల్పోయి నరసింహావతారం దాల్చి ఉగ్రులౌతారేమోనని అతను భయపడ్డాడు. కానీ బాబా అలాంటిదేమీ చేయలేదు. అందుకు విరుద్ధంగా ఆయన చాలా సంతోషంగా కనిపించారు. ఆ సంఘటన కేల్కర్‌ను ఎంతో కలవరపెట్టింది. ఆ విషయమై అతను బాబాను అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే ఆరోజు సాయంత్రం అతను బాబాతో, “మేము మీ నుదుటిపై గంధంతో ఒక చిన్న బొట్టు పెట్టాలని ప్రయత్నిస్తే, కనీసం మీ నుదుటిని తాకడానికి కూడా మమ్మల్ని అనుమతించరు. కానీ ఈరోజు ఉదయం జరిగిందేమిటి? మా తిలకం మీకు నచ్చదుగానీ డాక్టర్ పండిట్ త్రిపుండ్రం నచ్చిందా? ఏమిటీ వింత? ఇదేం సమంజసంగా లేదు" అని అడిగాడు. అప్పుడు బాబా నవ్వుతూ ఆప్యాయంగా, "దాదా! అతని గురువు సమాజంలోని ఉన్నతవర్గంగా భావించే గొప్ప బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. నేను సమాజంలో అత్యల్పంగా చూడబడే తక్కువజాతి మహమ్మదీయుడిని. అయినప్పటికీ డాక్టర్ పండిట్ నన్ను పూజించాడు. నేను చెప్పిన ఆ వాస్తవాలేవీ అతనికి ఆటంకం కలిగించలేదు. అంతేకాదు, అతను నన్ను తన గురువుగా భావించి నాకు పూజ చేశాడు. మరి నేను 'వద్ద'ని అతనికి ఎలా చెప్పగలను? అతనికి నచ్చినట్లు చేయటానికి అనుమతించడం తప్ప నాకు వేరే మార్గం లేకపోయింది" అని చెప్పారు. అదంతా బాబా ఏదో మామూలుగా చెప్పారని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ, తన మనస్సులో 'బాబా ముస్లిం' అని లోతుగా పాతుకుపోయిన అభిప్రాయం గురించి బాబాకు తెలుసని కేల్కర్ గ్రహించాడు. తరువాత డాక్టర్ పండిట్‌ను అడిగి, అతని గురువు రఘునాథరావు అలియాస్ కాకాపురాణిక్ అలియాస్ ధోపేశ్వర్ మహారాజ్ అనీ, ఆయన గొప్ప సిద్దపురుషుడు, నిజంగా గౌరవనీయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడనీ తెలుసుకొని, ‘ఇదంతా బాబాకు ఎలా తెలుసా’ అని కేల్కర్ ఆశ్చర్యపోయాడు.

పూణే నివాసి అనంతరావు పాటంకర్ ఒకసారి బాబా దర్శనానికి శిరిడీ వచ్చాడు. అతను వేదాలు, ఉపనిషత్తులు మొదలైన మతగ్రంథాలను లోతుగా అధ్యయనం చేశాడు. కానీ అతని మనసుకి శాంతి కరువై ఎప్పుడూ చంచలంగా ఉండేది. బాబా దర్శనంతో అతని కనులు తృప్తి చెందాయి. అతను బాబా పాదాలకు నమస్కరించి, "బాబా! నేను అనేక గ్రంథాలు చదివాను. కానీ నా మనసుకి శాంతి లేదు. నేను చదువుకున్నదంతా వృధా అయిపోయింది. నాకంటే చదువురాని నిరక్షరాస్యులే నయమని ఇప్పుడు అనిపిస్తోంది. కనీసం అలాంటి వాళ్ళు జ్ఞానం లేకపోయినా స్వచ్ఛమైన భావోద్వేగాలతో శాంతిని అనుభవిస్తారు. నేను కూడా వారిలాగే నిరక్షరాస్యుడనై ఉంటే బాగుండేది. నేను మీ కీర్తి విని మనశ్శాంతి కోసం మీ పాదాలను ఆశ్రయించాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి" అని వేడుకున్నాడు. అప్పుడు బాబా ఒక చిన్న కథ చెప్పారు: "ఒకసారి ఒక వర్తకుడు గుర్రం మీద వచ్చాడు. ఆ గుర్రం తొమ్మిది లద్దెలను వేసింది. ఆ వర్తకుడు తత్పరుడై తన కొంగులో ఆ తొమ్మిది లద్దెలను సేకరించాడు. తక్షణమే అతని మనసుకు శాంతి చేకూరింది" అని. ఆ కథ యొక్క అంతరార్థాన్ని అనంతరావు గ్రహించలేకపోయాడు. తరువాత తాను బస చేసిన సాఠేవాడాకు వెళ్లి, బాబా చెప్పిన కథను దాదాకేల్కర్‌తో చెప్పి, "అసలు ఆ వర్తకుడు ఎవరు? లద్దెల ప్రయోజనమేమిటి? తొమ్మిది అంకె యొక్క ప్రాముఖ్యం ఏమిటి? ఈ కథలోని అంతరార్థం ఏమిటి? అల్పబుద్ధిగల నాకు ఏమీ అర్థం కావడం లేదు. బాబా మనసులో ఉన్నదాన్ని మీరైనా నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పండి" అని అడిగాడు. అందుకు దాదాకేల్కర్, "నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. బాబా మాటలన్నీ ఇలాగే వుంటాయి. అయినా బాబా నాకు స్ఫురింపజేసినట్లుగా నాకు అర్థమైంది చెప్తాను. ఆ గుర్రం ఈశ్వరానుగ్రహానికి సంకేతం. 9 లద్దెలు నవవిధభక్తులు. అవి, 

1) శ్రవణం - భగవంతుని లీలలు వినుట
2) కీర్తనం - భగవంతుని వైభవాన్ని కీర్తించుట
3) నామస్మరణం - భగవంతుని నామాన్ని స్మరించుట 
4) పాదసేవనం - భగవంతుని పాదాలను భక్తితో సేవించుట 
5) అర్చనం - పూజించుట
6)వందనం - రెండు చేతులు జోడించి భక్తితో నమస్కరించుట
7) దాస్యం - సేవ
8) సఖ్యం - స్నేహం
9) ఆత్మనివేదనం - ఆత్మసమర్పణ గావించుట

ఈ నవవిధభక్తులను భక్తుడు తన హృదయంలో నిక్షిప్తం చేసుకుంటే మనసుకి శాంతి, పరమానందం కలుగుతాయి" అని వివరించాడు. బాబా చెప్పిన కథలోని అంతరార్థాన్ని కేల్కర్ చాలా సరళంగా, అందంగా వర్ణించగా అది పాటంకర్ మనస్సును ఎంతగానో ఆకట్టుకుంది. ఆనందంతో అతని కన్నులు ద్రవించిపోయాయి. అంతవరకూ తాను చేసిన మతగ్రంథాల అధ్యయనం ఎటువంటి భక్తి లేనిదనీ, అంతా వ్యర్థ శ్రమ అని గ్రహించి కేల్కర్ పాదాలకు వందనం చేశాడు. సాయితో నిత్యసహవాసం వలనే కేల్కర్‌లో అంతటి పరిపాకం వచ్చిందనేది మనం గుర్తించదగిన విషయం.

మరుసటిరోజు పాటంకర్ మసీదుకు వెళ్లి బాబాకు నమస్కరించగానే, "తొమ్మిది లద్దెలను సేకరించావా? దాదాభట్ చెప్పింది ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించు" అని అన్నారు. అందుకతను, "అలాగే బాబా. దయచేసి ఈ దీనుడిని ఆశీర్వదించండి. అప్పుడే నేను నవవిధ భక్తిమార్గాన్ని అనుసరించగలను" అని అన్నాడు. అందుకు బాబా, "నీకు శుభం కలుగుతుంది. నేను నీ సంక్షేమాన్ని చూసుకుంటాను" అని ఆశీర్వదించి పంపారు.

మతాచారాలపట్ల బూటకపు గర్వమెందుకు?

మాధవరావు దేశ్‌పాండే, దాసగణు మహరాజ్, నానాసాహెబ్ చాందోర్కర్, నిమోన్కర్ వంటి కొంతమంది భక్తులకు అంటరానితనం వంటి మూఢ ఆచారవ్యవహారాలపట్ల చాలా స్థిరమైన నమ్మకం ఉండేది. వాళ్లంతా బాబాకు అంకిత భక్తులు. కానీ అసంబద్ధమైన ఆ మూఢాచారాలను వదులుకోలేకపోయారు. ఎంతలా అంటే, అవే వాళ్ళ జీవన విధానంగా మారాయి. బాబా అనుగ్రహంతో వాళ్ళంతా ఒకవైపు పరమార్థికంగా ఉన్నతస్థితికి చేరుకుంటున్నప్పటికీ మరోవైపు ఇటువంటి ఆచారాల చట్రంలో ఇరుక్కుపోయారు. కానీ అవేవీ తమకు, బాబాకు మధ్యనున్న ప్రేమ, భక్తి, ఆప్యాయతలకు అడ్డుకాలేదు. కేల్కర్ కూడా అటువంటి భక్తుడే. అనేక అనుభవాల ద్వారా అతను బాబాపట్ల దృఢమైన ప్రేమను పెంచుకున్నాడు. కానీ మూఢాచారాలను వదిలించుకోవడం అతనికి సాధ్యం కాలేదు. అయితే వాటిపట్ల ఉన్న అతనికున్న విశ్వాసమూ, గర్వాల కారణంగా కొన్ని సందర్భాలలో అతని పారమార్థిక పురోగతికి, భావాలకు మధ్య ఘర్షణ జరుగుతుండేది, ఎప్పటికప్పుడు బాబాపట్ల అతనికున్న విశ్వాసం పరీక్షింపబడుతుండేది. కులం, మతం, వర్ణ తారతమ్యాల వంటి కృత్రిమ సరిహద్దులతో పరమార్థం ముడిపడి ఉండదని బాబా అతనికి బోధించడమేకాక, ఆ విషయాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి పదేపదే ప్రయత్నించారు. అటువంటి కొన్ని సంఘటనలను పరిశీలిద్దాం.

ఒకసారి సాయిబాబా మసీదు ముంగిట బహిరంగ ప్రదేశంలో పొయ్యి వెలిగించి మాంసపు పులావు తయారీలో నిమగ్నమయ్యారు. కొంతసేపటికి దాదాకేల్కర్ అక్కడికి వచ్చాడు. బాబా అతనితో, "దాదా! నేను మాంసపు పులావు చేశాను. నువ్వు రుచి చూసి ఎలా వుందో చెప్పు" అని అన్నారు. అయితే ఎక్కడ, ఏమి తింటున్నామనే విషయాలపట్ల చాలా నిష్ఠగా ఉండే కేల్కర్ తటపటాయించి పులావు రుచిచూడకుండానే, "ఆహా, చాలా రుచిగా ఉంద"ని అన్నాడు. అది విని బాబా నవ్వుతూ, "నువ్వు దాని రుచి చూడనేలేదు. మరి, రుచిగా ఉందని ఎలా చెబుతున్నావు? మూత తీసి, పాత్రలో చేయిపెట్టి కొంచెం పులావు తీసి రుచి చూడు" అని అన్నారు. తరువాత బాబా అతని చేయి పట్టుకొని పాత్రలోకి తోసి, "ఈ గరిట తీసుకొని, కొంచెం పులావు నీ పళ్లెంలో వడ్డించుకో! ఆచారాల గురించి పట్టించుకోకు. వాటి గురించి ఎందుకంత గర్వపడతావు?" అని అన్నారు.

మరోసారి, హిందువులు ఎంతో పవిత్రంగా భావించి ఉపవాసముండే ఏకాదశి రోజున బాబా దాదాకేల్కర్‌తో, "నాకు ఈరోజు మాంసం తినాలని ఉంది. నువ్వు కొర్హాలా గ్రామానికి వెళ్లి మాంసం తీసుకొని రాగలవా?" అని అడిగారు. అంతేకాకుండా, అందుకు సరిపడా డబ్బులు కూడా ఇచ్చి, "మాంసం తేవడానికి నువ్వే వెళ్ళు. నాకు తెలుసు, నువ్వు నాకోసం ఈ పని చేస్తావు" అని అన్నారు. దాంతో కేల్కర్ ధర్మసంకటంలో పడ్డాడు. ఒకవైపు తానొక  సద్బ్రాహ్మణుడు, ఎప్పుడూ మాంసం దుకాణం సమీపానికి కూడా వెళ్లనివాడు. మరోవైపు 'గురువు ఆదేశానుసారం నడుచుకోవడం శిష్యుని ధర్మమ'ని నమ్మినవాడు. బాగా ఆలోచించిన మీదట అతను చివరికి తన గురువైన బాబా మాటకు ప్రాధాన్యతనిచ్చి బట్టలు మార్చుకుని కొర్హాలా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బాబా అతనిని గమనించి, "నీకిప్పుడు వయస్సు పైబడింది. నువ్వు వెళ్ళవద్దులే, వేరే ఎవరినైనా మాంసం తీసుకొని రావడానికి పంపుతాను" అని అన్నారు. తరువాత తమ సేవకుడు పాండుని మాంసం తెమ్మని చెప్పారు. అతను బయలుదేరబోతుండగా, "పాండు వద్దులే, మరోరోజు ఎప్పుడైనా తెద్దాం" అని అన్నారు.

1915, మే నెలలో ఎస్.బి.నాచ్నే తన అత్తగారిని, మరికొంతమంది కుటుంబసభ్యులను తీసుకొని శిరిడీ సందర్శించాడు. వాళ్లంతా బాబా ఆదేశానుసారం సాఠేవాడాలో బస చేశారు. కేల్కర్ తన కుటుంబంతో అందులోనే నివాసముంటుండేవాడు. ఆచారవ్యవహారాల పట్ల మక్కువ గల కేల్కర్ వాడాలో ఉల్లి, వెల్లుల్లి వాడకూడదని నిషేధాన్ని విధించాడు. ఆ విషయం తెలియని నాచ్నే అత్తగారు మొదటిరోజే వంటకోసం ఉల్లిపాయలు తరగడం మొదలుపెట్టింది. ఆ ఉల్లివాసన తన ముక్కుకి చేరడంతోనే కేల్కర్ ఆగ్రహంతో ఊగిపోతూ నాచ్నే కుటుంబీకులు ఉంటున్న గదికి వెళ్లి ఆమెను తిట్టిపోశాడు. అతని కోపానికి కారణమేమిటో ఆమెకు అర్థం కాలేదు. కానీ, అతని పరుషమైన మాటలకు ఆమె చాలా బాధపడింది. ఆ తరువాత కొంతసేపటికి కేల్కర్ మనవరాలు తీవ్రమైన కంటినొప్పితో ఎడతెరిపి లేకుండా ఏడవసాగింది. కేల్కర్ ఆ పాపను బాబా దగ్గరకు తీసుకువెళ్లి, తన మనవరాలికి ఆ బాధ నుండి ఉపశమనం కలిగించమని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు బాబా, "కొన్ని చుక్కల ఉల్లిరసాన్ని పాప కంటిలో వేయమ"ని చెప్పారు. అయితే ఉల్లిపాయలను ఎక్కడ సంపాదించాలో అతనికి అర్థం కాలేదు. అంతలోనే, 'బాబాకు ఉల్లి అంటే ఇష్టం, వారెప్పుడూ కొన్ని ఉల్లిపాయలను తమ వద్ద ఉంచుకుంటారు. కాబట్టి వారే ఉల్లిపాయలను తనకిస్తార'ని తలచాడు. అతని మనసులో ఆ ఆలోచన రాగానే బాబా నాచ్నే అత్తగారిని చూపిస్తూ, "ఆ తల్లి వద్దకు వెళ్లి అడుగు. నన్ను అడగకు!" అని అన్నారు. పరుషమైన మాటలతో తన మనసును ఎంతగానో గాయపరిచిన కేల్కర్‌కు ఉల్లిపాయలను ఇవ్వడానికి ఎంత మాత్రమూ ఇష్టం లేకున్నా బాబా మాటకు కట్టుబడి ఆమె వాటిని అతనికిచ్చింది. ఆ ఉల్లిపాయల రసంతో కేల్కర్ మనవరాలికి కంటినొప్పి నుండి ఉపశమనం లభించింది.

శ్రీమతి కాశీబాయి కనీత్కర్ ఆ రోజుల్లోనే గొప్ప విద్యావంతురాలు. ఆమె కుటుంబానికి, కేల్కర్ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలుండేవి. ఒకసారి ఆమె బంధువులలో ఒకరైన శ్రీమతి గోఖలే శిరిడీ వెళ్లి, బాబా సన్నిధిలో మూడురోజులు ఉపవాసం ఉండాలని ఆశించింది. ఆమె కోరికను తీర్చడానికి శ్రీమతి కాశీబాయి ఒక పరిచయపు ఉత్తరాన్నిచ్చి ఆమెను కేల్కర్ వద్దకు పంపింది. సరిగ్గా అదే సమయానికి శిరిడీలో బాబా తన ప్రక్కనే వున్న దాదాకేల్కరుతో, “అలాగా! రేపు నా బిడ్డలు తిండి లేకుండా ఉంటారా? కానీ నేను వాళ్ళను ఆకలితో ఎలా ఉండనిస్తాను? అలాగైతే నేను ఎందుకు ఇక్కడున్నాను?" అని అన్నారు. హఠాత్తుగా బాబా తనతో అలా ఎందుకంటున్నారో దాదాకేల్కరుకు అర్థం కాలేదు. ఆ మరుసటిరోజు షిమోగా(హోలీ) పండుగ. అందరూ ఆ పవిత్రమైన రోజున పూరన్ పోళీలు చేసుకొని కుటుంబసభ్యులతో కలిసి తిని ఆనందంగా గడుపుతారు. అటువంటి రోజున శ్రీమతి గోఖలే శిరిడీ చేరి, దాదాకేల్కర్ ఇంటికెళ్ళి తనను పరిచయం చేసుకొని, అక్కడే బస ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత బాబా దర్శనం కోసం మసీదుకెళ్ళింది. బాబాకు నమస్కరించి కూర్చొనగానే బాబా తమంతట తామే ఆమెతో, “అమ్మా, అన్నమూ, అన్నము తినేవారివురూ పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి మనమెందుకు ఉపవాసం ఉండాలి? మనకు అవి అవసరమా? దాదాభట్ ఇంటికి వెళ్లి చక్కగా పూరన్ పోళీలు చేసి దాదాకు, అతని పిల్లలకు, మనవళ్లకు పెట్టి, నువ్వు కూడా తిను. చక్కటి ఈ షిమోగా పండగరోజు నువ్వెందుకు ఉపవాసముండి, ఆహారం లేకుండా గడపాలి?” అని అన్నారు. ఆమె మసీదు నుండి దాదాకేల్కర్ ఇంటికెళ్ళేసరికి అప్పుడే దాదా భార్య ‘బయట చేరడం’తో సమయానికి వంటచేసేవారు లేక భోజనం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. శ్రీమతి గోఖలే తాను వంట చేస్తానంటే, ఇంటికొచ్చిన అతిథి చేత వంట చేయించుకోవడం ఉచితం కాదని దాదా సంకోచించాడు. అప్పుడు శ్రీమతి గోఖలే తాను శిరిడీ బయలుదేరడానికి ముందు సంకల్పించుకున్న ఉపవాసదీక్ష, అంతకు కొద్దిసేపు ముందు బాబా తనకు చేసిన ఉపదేశం... అన్నీ కేల్కర్‌కు వివరించింది. ఆ ముందురోజు బాబా తనతో అన్న మాటల అర్థం అప్పుడుగానీ దాదాకేల్కర్‌కు బోధపడలేదు. శ్రీమతి గోఖలే వంట చేసి, దాదా కుటుంబానికి వడ్డించి, తానూ తిని బాబా ఆదేశానుసారం తను సంకల్పించిన ఉపవాసదీక్షకు స్వస్తి చెప్పింది.

source: sai leela magazine 2013, may - june, july - august issues.

9 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Very nice written. I liked it. Om sai ram������. Baba don't like fast. His thought is right.we feel hungry. Papients can't do fasting. Om sai baba������

    ReplyDelete
  3. Om sai ram baba mamalini rakshinchu thandri sainatha

    ReplyDelete
  4. Excellent.my eyes are filled with tears of love for Sree Saibaba.ohm Sree SaiRam

    ReplyDelete
  5. Kothakonda SrinivasMay 18, 2021 at 1:10 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼😀🌹🤗🌸🥰🌺😃

    ReplyDelete
  7. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺🥰🌹😃🌼😀🌸👪💕

    ReplyDelete
  8. OM sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo