సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అబ్దుల్ బాబా


అబ్దుల్ బాబా 1871వ సంవత్సరంలో ఉత్తర మహారాష్ట్రలోని తపతీనదీ తీరంలో ఉన్న నాందేడులో జన్మించాడు. అతని తండ్రి పేరు సుల్తాన్. చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు అతన్ని నాందేడుకి చెందిన అమీరుద్దీన్ అనే సూఫీ గురువు యొక్క సంరక్షణలో ఉంచారు. 1889లో ఒకరోజు అమీరుద్దీన్‌కి కలలో సాయిబాబా దర్శనమిచ్చి, రెండు మామిడిపండ్లు ఇచ్చి, వాటిని అబ్దుల్‌ కివ్వమని, అతన్ని శిరిడీ పంపమని ఆదేశించారు. నిద్రలేచేసరికి రెండు మామిడిపండ్లు ప్రక్కన ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తరువాత ఆయన ఆ మామిడిపండ్లను అబ్దుల్‌ కిచ్చి వెంటనే శిరిడీలో ఉన్న సాయిబాబా వద్దకు వెళ్ళమని చెప్పి పంపించారు. 

అబ్దుల్ తన 19వ ఏట 1889లో మొట్టమొదటిసారి బాబా వద్దకు వచ్చాడు. అప్పటికింకా నానాసాహెబ్ చందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. అతన్ని చూడగానే బాబా 'మేరా కావ్లా ఆలా' అంటే, 'నా కాకి వచ్చింది' అని స్వాగతించారు. అతన్ని పూర్తిగా తమ సేవకు అంకితమవ్వమని బాబా చెప్పారు. అప్పటినుంచి అబ్దుల్ బాబా సేవ చేయడం, శిరిడీ వీధులు చిమ్మి శుభ్రం చేయడం, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవడం వంటి పనులలో నిమగ్నమై ఉండేవాడు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు 30 సంవత్సరాలు, బాబా సమాధి చెందాక 36 సంవత్సరాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆయనను సేవించుకున్నాడు. అంత సుదీర్ఘకాలం బాబాను అంటిపెట్టుకునివున్న ముస్లిం భక్తుడు ఇతనొక్కడే. తన గురువు పంపగా బాబా సన్నిధికి చేరిన అతడు బాబా సేవలో తరించాడు.

మొదట్లో అతడు మసీదు సమీపంలోనే నివసిస్తూ (కొంతకాలం తర్వాత చావడికి ఎదురుగా ఉండే ఇంటిలోకి మారాడు.) సదా బాబా సేవలో తత్పరుడై ఉండేవాడు. ద్వారకామాయి చుట్టూ ఉండే ఐదు దీపాలను నిరంతరం చమురుతో నింపటం, లెండీబాగ్‌లో బాబా చేత వెలిగించబడిన దీపాన్ని కనిపెట్టుకుని ఉండటం, ద్వారకామాయి, చావడిని ప్రతిరోజూ శుభ్రపరచడం చేసేవాడు. ఇవేకాక బాబా తిరిగే వీధులను తుడిచి, మలాలను ఎత్తి పారవేసేవాడు. ధునిలో కట్టెలు వేసేవాడు. నది నుండి నీటిని తెచ్చి బాబా బట్టలను శుభ్రపరిచేవాడు. ఈవిధంగా అతడు విసుగన్నదే లేకుండా బాబాకు చేసిన సేవ ఎనలేనిది. మొదటిరోజుల్లో బాబా అతనికి ఆహారం ఇచ్చేవారు కాదు. అందువలన అతడు భిక్ష చేసుకుని జీవించేవాడు.

బాబా అతడిని ప్రేమగా, “హలాల్ కుర్” (మా పాకీవాడు) అని పిలిచేవారు. ఆయన సాధనాపరంగా అతనికెన్నో సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. రాత్రి సమయాలలో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని, పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారుకోకూడదని బాబా చెప్పేవారు. ఇంకా, "స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు” అని చెప్పారు. “నేను ఎవరిని?” అనే విచారణ కూడా చేసుకోమని చెప్పారు. బాబా సూచనలను అతడు శ్రద్ధగా పాటిస్తుండేవాడు.

శిరిడీలో రోడ్డు ప్రక్కన లెండీతోపు ఉంది. రోజూ రెండుపూటలా బాబా అందులో ఏకాంతంగా కొంతసేపు గడిపేవారు. అప్పుడప్పుడు అబ్దుల్‌ను తమతోపాటు తీసుకుని వెళ్లేవారు. మిట్టమధ్యాహ్నవేళ అబ్దుల్‌కు తప్ప వేరెవరికీ  లెండీ లోపలికి ప్రవేశం ఉండేది కాదు. 

అబ్దుల్ ఇలా చెప్పాడు: "ఆ తోపులో ఒకచోట రెండడుగుల లోతున ఒక గుంటలో అఖండదీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైన ఒక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేనా దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటునుంచి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గర రెండు కుండలతో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీటిని అన్నివైపులకూ చల్లి, ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు. అప్పుడాయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు".

ఇంకా అబ్దుల్ ఇలా చెప్పాడు: “నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖం ఉంచుకుని కునుకుతీశాను. అప్పుడు సాయి, “చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమి?” అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్రలో తూగి ఆయనమీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో దోసిట్లో నీళ్ళు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు”. "బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాలలో ఉండేది. బాబా నన్ను చాలా చెడ్డగా తిట్టేవారు. నన్ను, జోగ్‌ను కొట్టారు కూడా! అదీ ఆశీర్వచనమే!"

ఒకరోజు ఉదయాన్నే బాబా చావడిలో కూర్చుని నాతో, “నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడ్డాను. మట్టిని బంగారంగా మార్చాను. ఎంతో పెద్ద భవనాన్ని కట్టిచ్చాను!” అని నన్ను ఆశీర్వదించి మశీదుకు బయలుదేరారు. (మొదటి రెండు అతని ఆధ్యాత్మిక ప్రగతి గురించి బాబా చెప్పి ఉండవచ్చు. మూడవది అతని భవిష్యత్తును సూచిస్తూ ఉంది. బాబా మహాసమాధి చెందిన తరువాత అతడు బాబా సమాధికి పూజ నిర్వహిస్తూ బూటీవాడాలోని గదిలో నివసించేవాడు.) అప్పుడప్పుడు బాబా, "అబ్దుల్ అంతస్తులు గల భవనంలో నివసిస్తాడు. అతను మహిమాన్విత సమయాన్ని కలిగి ఉంటాడ"ని చెప్పేవారు. అందుకు తగ్గట్టుగానే అబ్దుల్ కొంతకాలం బూటీవాడాలో నివాసమున్నాడు.

అబ్దుల్ మసీదులో బాబా దగ్గర కూర్చుని ఖురాన్ చదివేవాడు. అప్పుడప్పుడు ఆ గ్రంథాన్ని బాబా తమ చేతులలోకి తీసుకుని, తెరచి అతనికిచ్చి ఆ పేజీలోని వాక్యాలను చదవమనేవారు, ఒక్కోసారి ఖురాన్ లోని కొన్ని వాక్యాలు చెప్పేవారు. కొన్ని సందర్భాలలో ఆయన అతనితో ఇస్లాం, సూఫీ గురించి చెప్తుండేవారు. అవి అరబిక్ లోని అనేక ఉల్లేఖనాలతో కూడిన ఇస్లాం, సూఫీ సూత్రాలకు సంబంధించినవి. దీన్నిబట్టి బాబాకు ఇస్లాం, సూఫీ సంప్రదాయాలు బాగా తెలుసునని అర్థమవుతుంది.

మహాత్ముల మాటలు ఎంతో అమూల్యమైనవి అనే భావమున్న అబ్దుల్, బాబా చెప్పిన ప్రతిమాటను పరమ పవిత్రంగా తలచి మరాఠీ లేదా మోడీ లిపిలో ఎంతో శ్రద్ధగా ఒక పుస్తకంలో వ్రాసుకుంటుండేవాడు. అదే అతడికి ఖురాన్. దానిని అతడు అంత పవిత్రమైన గ్రంథంగా భావించి భక్తిపూర్వకంగా చేత జపమాల ధరించి తన్మయత్వంతో చదివేవాడు. బాబా  పెదవులనుండి జాలువారిన పదాలు పొందుపరచబడివున్న ఆ పుస్తకాన్ని బాబా ఉచ్ఛారణల పుస్తకమని పిలిచేవారు. అంతటి అద్భుతమైన బహుమతి అతనికి శ్రీసాయి కృపతో లభించింది. ఆ పుస్తకం ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశం చేస్తుందని అతని పూర్తి విశ్వాసం. ఎవరైనా భవిష్యత్తు గురించి లేదా ఏదైనా సమస్య గురించి తెలుసుకోవాలని అతని వద్దకు వచ్చినప్పుడు అతను ఎంతో భక్తి, శ్రద్ధలతో ఆ గ్రంథం తెరచి సమాధానం చెబుతుండేవాడు. తెరచిన పేజీ నుండి వచ్చిన జవాబు ఆ సందర్భానికి సరిగా సరిపోయేదిగా ఉండి, ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరికేది.

అటువంటి రెండు ఉదాహరణలు గమనిద్దాం. బాబా సమాధి చెందిన తరువాత ఒకసారి మందిర ప్రాంగణంలో బావి త్రవ్వారు. అందులో ఉప్పునీరు పడటంతో భక్తులు అబ్దుల్‌ని సంప్రదించారు. అతడు బాబా సమాధానం కోసం తాను వ్రాసుకున్న పుస్తకం తెరవగా అందులో, "ఇంకా లోతుగా త్రవ్వితే మంచినీరు వస్తుంది" అని సమాధానం వచ్చింది. దానిని అనుసరించి మరి రెండు అడుగుల లోతు త్రవ్వగా మంచినీరు పడింది.

మరొక సంఘటన: బారిస్టర్ గాడ్గిల్, 'తన కుమారుడు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వస్తాడా? లేక అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంటాడా?' అని తెలుసుకోవాలనుకున్నాడు. ఈ విషయమై అబ్దుల్‌ని సంప్రదించగా, ఆ పుస్తకం ద్వారా "అతను తిరిగి వస్తాడు" అని సమాధానం వచ్చింది. అలాగే అతను తన ఇంగ్లీష్ భార్య, పిల్లలతో తిరిగి వచ్చాడు.

అలా అబ్దుల్ చెప్పిన విషయాలు సత్యమవుతుండటంతో ప్రజలు అతనిని ‘అబ్దుల్ బాబా’ అని పిలవడం మొదలుపెట్టారు. అబ్దుల్ ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, లేదా మరియు సంతానం కలుగుతుందా, లేదా వంటి విషయాలు చెప్పగలిగేవాడు. అతడలా చెప్పినవన్నీ చాలాసార్లు నిజమయ్యాయి. అదంతా బాబా కృపవలనే సంభవమైందని అతడు చెప్పేవాడు.

1997లో మరియాన్నే వారెన్ మరియు వి.బి. ఖేర్ లు అబ్దుల్ బాబా వ్రాసిన బాబా యొక్క ఉచ్ఛారణల పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. వారు చేసిన ఆ ప్రయత్నంలో ఇస్లాంధర్మం గురించి, సూఫీయిజం గురించి బాబాకున్న అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నారు.

కొంతకాలం తర్వాత అబ్దుల్ మొదటి గురువు శిరిడీ వచ్చి తనతోపాటు తిరిగి రమ్మని కోరాడు. అందుకు అబ్దుల్, "బాబా అనుమతి లేకుండా నేనేమీ చేయలేన"ని సమాధానమిచ్చాడు. బాబా అనుమతినివ్వకపోవడంతో అతని గురువు శిరిడీ నుండి తిరిగి వెళ్ళిపోయాడు.

అబ్దుల్ భార్య, కొడుకు నాందేడులో ఉండేవారు. అతని కొడుకు అబ్దుల్ పఠాన్ 1901లో జన్మించాడు. ఆ అబ్బాయికి యుక్తవయస్సు రాగానే అబ్దుల్ తల్లి పెళ్లి సంబంధం చూడటం ప్రారంభించింది. ఒక సంబంధం చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ఒక ఫకీరు కొడుకుకి తన కూతురినిచ్చి వివాహం చేయడం ఇష్టం లేదని చెప్పాడు. దానితో నిరాశకు గురైన ఆమె బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకుని, ఆయన సహాయాన్ని అర్థించింది. అప్పుడు బాబా, "చింతించవద్దు, బాలునికి మంచి వధువు దొరుకుతుంది. సరైన సమయంలో అన్నీ సక్రమంగా జరుగుతాయి" అని ఆమెను ఓదార్చారు. కొన్నిరోజుల తరువాత అబ్బాయి, అతని నాన్నమ్మ కొంతమంది స్నేహితులను, బంధువులను కలవడానికి ఒక ప్రదేశానికి వెళ్లారు. అక్కడొక వ్యక్తి వాళ్ళని కలిసి తన కుమార్తెను ఆ అబ్బాయికిచ్చి వివాహం చేసేందుకు ఆసక్తి కనబరిచాడు. అప్పుడు అబ్బాయి నాన్నమ్మ, "అబ్బాయి తండ్రి ఒక ఫకీరు" అని చెప్పింది. కానీ అతడా విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. పైగా తన పెద్దకూతురి వివాహం కానప్పటికీ, చిన్న కుమార్తెను ఈ అబ్బాయి చేతిలో పెట్టడానికి చాలా ఆసక్తి చూపాడు. బాబా వాక్కు ఫలించి వివాహం ఎంతో ఘనంగా, అందరికీ ఆనందదాయకంగా జరిగింది.

బాబా తమ దేహత్యాగానికి కొంత సమయం ముందు అబ్దుల్‌ను రమ్మని కబురుచేశారు. కానీ అతడు కాసేపు ఆగి వస్తానని చెప్పాడు. ఆ మాట విని బాబా చిరునవ్వు చిందించారు. అతను వచ్చేటప్పటికి బాబా దేహత్యాగం చేసివుండటం చూచి తన దురదృష్టానికి ఎంతగానో దుఃఖించాడు అబ్దుల్. బాబా సమాధి అనంతరం అబ్దుల్ బాబాపట్ల గొప్ప విశ్వాసాన్ని కనబరుస్తూ బాబా ఊదీని ఎంతోమందికి అందిస్తూ ఉండేవాడు. తద్వారా ఎంతోమంది తమ వ్యాధుల నివారణకు, ఇతర కోరికలు సాధించుకోవటానికి అతడు సహాయపడ్డాడు.

బాబా సమాధి చెందాక అబ్దుల్ 1922 వరకు సమాధి మందిరంలో ఎడమవైపున ఉన్న గదిలో ఉంటూ సమాధిమందిరం శుభ్రపరచడం, బాబా సమాధికి అభిషేకం చేసి, వస్త్రములతో మరియు పూలతో అలంకరించి, మహానైవేద్యం పెట్టడం చేసేవాడు. భక్తులు ఇచ్చిన దక్షిణ, బాబాకి సమర్పింపబడిన నైవేద్యంలోని కొంతభాగంతోనే అతడు తన జీవనం సాగించేవాడు. ఇప్పటికీ అతని వంశస్థులు ఉదయాన్నే బాబాకు పూలను సమర్పిస్తున్నారు.

1922లో బాబా పరమభక్తుడు దీక్షిత్ అహ్మద్‌నగర్ జిల్లాకోర్టును ఆశ్రయించి ఒక పబ్లిక్ ట్రస్టుని ఏర్పాటు చేయటానికి అనుమతి పొందాడు. కానీ అబ్దుల్ తనని అభిమానించే కొందరు వ్యక్తుల ప్రేరణతో, 'తాను సాయిబాబాకు చట్టబద్ధమైన వారసుడినని, అందువలన తాను సమాధిమందిర నిర్వహణకు తగిన హక్కు కలిగివున్నాన'ని ట్రస్టు ఏర్పాటును సవాలుచేస్తూ కోర్టును సంప్రదించాడు. అయితే, "సమాధిమందిరం ఒక మఠంగానీ, ఆశ్రమంగానీ కాదని, సాయిబాబాకు వారసులు ఎవరూ లేరని, అలా సాయిబాబాకు తాను వారసుడినని అబ్దుల్ చెప్పుకోవడానికి వీలులేద"ని కోర్టు పేర్కొంది. దాంతో సమాధిమందిర నిర్వహణలో అతనికెటువంటి సంబంధం లేకుండా నిరోధించారు. అంతేగాక, అతనికి రోజూ లభించే ఉచిత ఆహారాన్ని నిలిపివేసి, సమాధిమందిరంలో అతను ఉంటున్న గదిని కూడా ఖాళీ చేయమన్నారు. కొంతకాలం తర్వాత బాబా అనుగ్రహంతో సంస్థాన్ వారు ఆ తీవ్రమైన ఆంక్షలను కొంత సడలించి, సమాధిమందిర నిర్వహణకు అతన్ని అనుమతించారు. అప్పటినుండి 1954 ఏప్రిల్ 2న తాను మరణించేవరకూ సాయిబాబా సమాధిమందిర కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో బాబా సేవ చేసుకున్నాడు అబ్దుల్. అలా తన అంతిమక్షణం వరకు తన జీవితాన్ని బాబా సేవకు అంకితమిచ్చిన గొప్పభక్తుడు అబ్దుల్.

బాబా తాము సమాధి చెందాక కూడా అబ్దుల్‌కు రక్షణనిస్తూ వచ్చారు. రాధాకృష్ణమాయి మరణానంతరం ఆమె నివసించిన మట్టిఇంటిలో అబ్దుల్ నివాసముండేవాడు. ఆ ఇల్లు చాలా పురాతనమైంది కావడం వలన శిథిలావస్థలో ఉండేది. సుమారు 1927వ సంవత్సరంలో ఒకసారి అబ్దుల్ ఆ ఇంటిలో కూర్చుని ఖురాన్ చదువుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఇల్లు కూలిపోయింది. శిధిలాలలో అతను దాదాపు కూరుకుపోయాడు. అయితే బాబా దయవల్ల అతను ఏమాత్రం గాయపడలేదు.

1954 ఆగస్టు 16న అతడు మరణించాడు. అతని దేహాన్ని సమాధిమందిర ప్రాంగణంలో ఉన్న లెండీబాగ్ సమీపంలో ఖననం చేసారు. లెండీబాగ్ ప్రవేశద్వారానికి సమీపంలో కుడివైపున ఉన్న అబ్దుల్ బాబా సమాధిని భక్తులు దర్శించవచ్చు. చావడికి ఎదురుగా అతడు నివాసమున్న గృహంలోని ప్రధాన గదిని అబ్దుల్ బాబా స్మారకచిహ్నంగా మార్చి భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఆ కుటీరాన్ని సందర్శించే భక్తులు ఎడమవైపు గోడపై వ్రేలాడుతున్న బాబాయొక్క అసలు ఛాయాచిత్రాలను, బాబా వాడిన చిమ్టాను చూడవచ్చు. ఆ చిమ్టాను బాబా స్వయంగా అతనికి ఇచ్చారు. అబ్దుల్ వాటిని భద్రంగా దాచివుంచి, ప్రతిరోజు ధూపంతో పూజించేవాడు. బాబా మహాసమాధి తరువాత, భక్తుల నొప్పులను, రోగాలను నయం చేసేందుకు అబ్దుల్ ఈ చిమ్టాను ఉపయోగించేవాడు. బాబా అతనికి సటకాను, రేకుడబ్బాను కూడా ఇచ్చారు.



అబ్దుల్ భార్య పేరు ఉమ్రాన్రావు.బి. వీరి కుమారుడు అబ్దుల్ పఠాన్(ఘనీభాయ్). ఇతడు 1901లో జన్మించి, డిసెంబరు 14, 1984న మరణించాడు. అబ్దుల్‌కి ఐదుగురు మనుమళ్ళు - ఇబ్రహీం, అజీజ్, రెహ్మాన్, రహీం మరియు హమీద్; మరియు ఇద్దరు మనుమరాళ్ళు - శంషాద్.బి మరియు ఇర్షద్.బి. ప్రస్తుతం రహీం మరియు హమీద్ మాత్రమే బ్రతికి ఉన్నారు. అబ్దుల్ తరువాత అతని వారసుడు ఘనీభాయ్‌కి రోజూ ఉదయం 10 గంటలకి బాబా సమాధిని శుభ్రపరిచి, పువ్వులతో అలంకరించే గౌరవం దక్కింది. అబ్దుల్ మనుమడైన హమీద్ ఈనాడు కూడా అతని యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.

Source: Life of Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji and www.saiparichai.com)
(http://bonjanrao.blogspot.in/2012/09/abdul-baba.html

7 comments:

  1. ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం శ్రీ సాయి సమర్థ
    ఓం శ్రీ సాయి సమర్థ
    ఓం శ్రీ సాయి సమర్థ
    ఓం శ్రీ సాయి సమర్థ
    ఓం శ్రీ సాయి సమర్థ 🙏🙏🌹

    ReplyDelete
  2. ఓం సాయిరాం శ్రీ సాయిరాం జయ జయ సాయిరాం
    ఓం శ్రీ సాయిరాం జై సాయిరాం మాస్టర్

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  4. Om Sri Sainathaya namah om Sri Sai sainathaya namah om Sri Sainathaya namah swamy Naku Sandhya ki marriage avali swamy
    Memu baga undela anugrahinchu tandri omsairam Omsairam Omsairam

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo