సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శంకరరావు గవాంకర్


సాయిభక్తుడు శంకరరావు గవాంకర్ గురించిన సంక్షిప్త ప్రస్తావన శ్రీసాయిబాబా సంస్థాన్ ప్రచురించిన పవిత్ర శ్రీసాయి సచ్చరిత్రలోని 28వ అధ్యాయంలో ఉంది. 

శ్రీసాయిలీల పత్రిక (సంచిక 12,  సంపుటి 3, 1926)లో ఇతని గురించిన మరిన్ని వివరాలు ప్రచురింపబడ్డాయి. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

1907వ సంవత్సరంలో శంకరరావు మనసులో సాధుసత్పురుషుల దర్శనం చేసుకోవాలనే బలమైన కోరిక వృద్ధి చెందింది. అందువల్ల అతను సాధుసత్పురుషుల జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టి, భజనలు, ఉపన్యాసాలు వింటుండేవాడు. ఒకసారి అతడు థానే జిల్లాలోని ములుంద్ పర్యటనలో ఉన్నప్పుడు పూణేలోని ఖేడ్‌గాఁవ్‌కు చెందిన సత్పురుషుడు నారాయణ్ మహరాజ్‌ను దర్శించాడు. కొద్దిరోజుల తరువాత అతడు గోవింద్ రఘునాథ్ దభోల్కర్ అలియాస్ హేమాడ్‌పంత్ ఇంటిలో దాసగణు మహరాజ్ కీర్తనలు వినడం జరిగింది. ఆ కీర్తనల ద్వారా అతనికి నాటి సత్పురుషులకు, పురాతనకాలంనాటి సత్పురుషులకు మధ్య సారూప్యత అర్థమైంది. అంతేకాదు, అతనికి కొన్ని అద్భుతమైన అనుభవాలు కూడా వచ్చాయి. పై రెండు సంఘటనల తరువాత సత్పురుషులను దర్శించాలన్న అతని కోరిక ఇంకా ఎన్నోరెట్లు తీవ్రమైంది. పైగా అతని వైపు నుండి ఎటువంటి ప్రయత్నం లేకుండానే తనకి సత్పురుషులతో కలయిక ఏర్పడుతుండేది. చాలాసార్లు కొంతమంది స్నేహితులు తమతో తీర్థయాత్రకు రమ్మని అతనిని అడగటం, అతను వాళ్లతో వెళ్లడం, సత్పురుషులను కలవడం జరుగుతుండేది.

శంకరరావు వసయీ గ్రామంలో నివసిస్తూ, అక్కడి కోర్టులో పనిచేస్తుండేవాడు. ఒకరోజు సిమ్లాలోని ప్రభుత్వ రైల్వే బోర్డులో పనిచేస్తున్న తన స్నేహితుడు లాలా మదన్ గోపాల్ నుండి శంకరరావుకి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో అతడు తనతోపాటు సంత్ నారాయణ్ మహరాజ్ దర్శనార్థం ఖేడ్‌గాఁవ్ రమ్మని శంకరరావుని కోరాడు. లాలా సిమ్లా నుండి వచ్చేటప్పుడు తన స్నేహితుని కలుసుకోవడానికి కల్యాణ్‌లో బస ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. శంకరరావు ఒక వారంరోజులు సెలవు తీసుకుని, తన సామాను సర్దుకుని ఇంటినుండి బయలుదేరాడు. అతను కళ్యాణ్ వెళ్లేముందు విలేపార్లేలో దిగి తన సోదరుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతను 'అనివార్యమైన పరిస్థితుల కారణంగా తాను రాలేకపోతున్నానని, ఆ విషయాన్ని తనకు తెలియజేయమని కోరుతూ' లాలా తన సోదరునికి టెలిగ్రాం పంపినట్లు తెలుసుకున్నాడు. దాంతో శంకరరావు సెలవులను అక్కడే గడపాలా లేక సెలవు రద్దు చేసుకుని తిరిగి పనిలో చేరాలా అన్న ఆలోచనలో పడ్డాడు. అదేరోజు సాయంత్రం అతడు తన స్నేహితుడైన లాలాలక్ష్మీచంద్‌ను కలవడం జరిగింది. స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటుండగా శిరిడీ ప్రస్తావన వచ్చింది. తాను ఖేడ్‌గాఁవ్ వెళ్ళి నారాయణ మహరాజ్ దర్శనం చేసుకోవాలనుకున్నాననీ, కానీ ముందుగా శిరిడీ వెళ్ళాలని కోరికగా ఉందనీ లక్ష్మీచంద్‌తో చెప్పాడు శంకరరావు.  నిజానికి ఆ సమయంలో లాలాలక్ష్మీచంద్ కూడా శిరిడీ వెళ్ళడానికి అనువైన సహచరునికోసం చూస్తున్నాడు. అలా ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ఇద్దరూ కలిసి శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు ఇద్దరూ అదే మొదటిసారి శిరిడీ వెళ్లడం. కాబట్టి శిరిడీ గురించి, సాయిబాబా గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించడానికి వాళ్ళు  ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు 'మొదటిసారి వచ్చిన సందర్శకులను బాబా కొడతార'న్న పుకార్లను విన్నారు. చివరకు భావూసాహెబ్ వారికి సరైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాడు. అంతేకాదు, అతడు వారికి పండ్లు, పువ్వులతో నిండిన బుట్టను ఇచ్చి బాబాకు అర్పించమని కోరాడు. మరో స్నేహితుడు రఘునాథ్ వాఘ్ బాబాకు సమర్పించమని ఒక పూలమాలను ఇచ్చాడు. కన్హయ్యలాల్‌ అనే అతను నాలుగు అణాలు ఇచ్చి, బాబాకు జామకాయలంటే చాలా ఇష్టమని, ఆ డబ్బులతో జామకాయలు కొని బాబాకు సమర్పించమని చెప్పాడు. తరువాత శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు శిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్ళు దాదర్‌లో దిగి, మన్మాడ్ రైలు అందుకున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయేలా, నానాసాహెబ్ చందోర్కర్ ఇంటికి వెళ్తూ అదే కంపార్టుమెంట్లోకి వచ్చాడు. నానా వాళ్ళ సామానంతా చూసి, కొంత సామాను తన వద్ద విడిచిపెట్టమని, తాను వాటిని కల్యాణ్ తీసుకుని వెళ్తానని, తిరుగు ప్రయాణంలో వాటిని తిరిగి తీసుకోవచ్చని సలహా ఇచ్చాడు. తరువాత నానా తన నమస్కారాలను బాబాకు సమర్పించమని వాళ్ళను కోరాడు.

శంకరరావు, లక్ష్మీచంద్‌లు ఇద్దరూ భజనలంటే చాలా ఇష్టపడేవారు. అందువల్ల నాసిక్ చేరేవరకు భజనలు చేస్తూ గడిపారు. అర్థరాత్రివేళ ఒక ముస్లిం వారి బోగీలోకి వచ్చాడు. అతను కూడా శిరిడీ వెళ్తున్నాడు. అతనిని వీళ్లిద్దరూ బాబా గురించి అడిగారు. అతడు 'బాబా గొప్ప సత్పురుషులు(ఔలియా)' అని చెప్పాడు. తెల్లవారి 6 గంటలకు వాళ్ళు కోపర్‌గాఁవ్ లో దిగారు. ఆ సమయంలో రైల్వేస్టేషన్ వద్ద ఒక్క టాంగా కూడా లేదు. కానీ, అంతలోనే ఆశ్చర్యకరంగా, ఒక టాంగా అక్కడికి వచ్చింది. టాంగా తోలేవాడు తనను భావూసాహెబ్ పంపించారని చెప్పాడు. సామాను టాంగాలో ఎక్కించి ఇద్దరూ సుమారు రెండు గంటలు విశ్రాంతి తీసుకున్న తరువాత స్నానం చేసి, అల్పాహారం తీసుకుని శిరిడీకి బయలుదేరారు. మొదటి పది, పదిహేను నిమిషాలు గుఱ్ఱాలు పరుగుతీయలేదు సరికదా, కనీసం వేగంగా కూడా నడవలేదు. టాంగా తోలేవాడు కూడా కొరడా ఝుళిపించి వాటిని పరుగుతీయించనూలేదు. అప్పుడే ఒక మహిళ జామకాయల బుట్టను పట్టుకుని టాంగా వెనుక పరుగెత్తుకుంటూ వస్తూ, "దాదా, మీరు జామకాయలు కొనాలనుకున్నారుగా. ఇదిగో, వీటిలో మీకు నచ్చినవి కొనుక్కుని, మిగిలినవి నా తరపున బాబాకు సమర్పించండి" అని అన్నది. ఆమె అన్న మాటలు శంకరరావుకు కన్హయ్యలాల్‌కు తాను ఇచ్చిన మాటను, శిరిడీకి దగ్గరలో జామకాయలు తీసుకుందామని అనుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చాయి. వెంటనే అతడు జామకాయలు కొనుగోలు చేశాడు. మరుక్షణంలో గుఱ్ఱాలు పరుగుతీయడం మొదలుపెట్టి ఎక్కడా ఆగకుండా కొద్దిసేపట్లోనే వాళ్ళని శిరిడీకి చేర్చాయి.

శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు ఇద్దరూ సాఠేవాడాలో దిగారు. ఆ సమయంలో అక్కడ సుమారు 150 మంది యాత్రికులున్నారు. వాళ్లిద్దరూ నూల్కర్‌ను, అతని స్నేహితుడైన నీలకంఠను కలిశారు. వాళ్ళు వీళ్ళకి ఒక కప్పు టీ ఇచ్చి స్వాగతం పలికారు. అప్పుడు శంకరరావు వాళ్ళని బాబా దర్శనం కోసం ఎలా వెళ్లాలని అడిగాడు. వారి వద్దనుండి వివరాలు తెలుసుకున్న మీదట శంకరరావు, లాలాలక్ష్మీచంద్  ద్వారకమాయికి వెళ్లారు. ఆ సమయంలో బాబా పట్టరాని కోపంతో అక్కడున్న అందరినీ కేకలు వేస్తూ ఘోరంగా తిడుతున్నారు. భక్తులు భయంతో పరుగున మశీదు మెట్లు దిగి సభామండపంలోకి చేరుకున్నారు. పైన బాబా, ఆయన వీపు మర్దన చేస్తున్న ఒక బ్రాహ్మణుడు మాత్రమే ఉన్నారు. అప్పుడే పవిత్రమైన ద్వారకామాయిలోకి ప్రవేశిస్తున్న శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లను చూసిన భక్తులు, "బాబా చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడే సభామండపంలో కూర్చోండి" అని సలహా ఇచ్చారు. శంకరరావు వాళ్ళ మాటలను పట్టించుకోకుండా ధైర్యం చేసి మశీదు మెట్లెక్కి కొంతసేపు అక్కడే నిలుచున్నాడు. ఆ సమయంలో బాబా కేకలు వేస్తూ ఉన్నప్పటికీ, అతనికి అవేవీ వినిపించలేదు. "ఇక్కడి నుండి వెళ్లిపోండి!(జావో ఇధర్ సే!)" అన్న ఒక్కమాట మాత్రం అతనికి వినిపించింది. దాంతో శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు ఇద్దరూ వెనక్కి తిరిగి మసీదు నుండి బయటకు వచ్చి, దాని వెనుక గోడ ప్రక్కన కూర్చున్నారు. శంకరరావు మనస్సు కలతతో చాలా గందరగోళానికి గురైంది. తనలో తాను "బాబా తనని పిలిస్తే తప్ప, దర్శనానికి వెళ్ళకూడద"ని నిశ్చయించుకున్నాడు. ఏదేమైనప్పటికీ బాబా దర్శనంతో అతనికి కలిగిన మొదటి అనుభూతి ఏమిటంటే, బాబా అక్కల్‌కోటకు చెందిన స్వామిసమర్థలా ఉన్నారని. అందువలన బాబా సద్గురువని, ఆయనకు తనపై తల్లిప్రేమ ఉంటుందని అతను భావించాడు. అతను ఈవిధంగా ఆలోచిస్తూ ఉండగా ఒకటి, రెండు నిమిషాలు గడిచేసరికి బాబా వారిని రమ్మని ఒక వ్యక్తితో కబురు పంపారు. ఆనందంతో ఇద్దరూ లోపలికి ప్రవేశించి బాబా పాదాల వద్ద కూర్చున్నారు. బాబా ప్రేమగా వారిని పలకరించారు. అదే సరైన సమయమని తలచి మిగిలిన భక్తులు కూడా మశీదులోకి వెళ్లారు. శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు జామకాయలను, పూలను, పూలదండలను, పండ్లను బాబాకు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేశారు. తరువాత ఇద్దరూ ఆచారపూర్వకంగా బాబాకు పూజ చేశారు. బాబా ఒక భక్తునితో జామపళ్ళను అందరికీ ప్రసాదంగా పంచమని చెప్పి, ఒక జామపండును తమ చేతుల్లోకి తీసుకుని రెండు భాగాలుగా చేసి వారిద్దరికీ ఇచ్చారు. తరువాత వాళ్ళ నుదుటిపై ఊదీ పెట్టి, "భోజనం చేసి, వాడాలో విశ్రాంతి తీసుకోండి(ఖానా ఖావో, ఔర్ వాడా మే ఆరామ్ కరో)" అని చెప్పారు.

తరువాత రెండు, మూడు రోజుల్లో శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు వాడాలో ఉండేవారే గానీ ఎక్కువ సమయం మసీదులో గడపలేదు. వాళ్ళు రోజూ ఉదయాన్నే ఒకసారి, తరువాత లెండీబాగ్‌కు వెళ్ళేటప్పుడు దారిలో ఒకసారి బాబాను దర్శించుకుంటుండేవారు. రెండు రోజుల తరువాత ముంబాయి నుండి వచ్చిన భక్తులు వెళ్ళిపోయారు. శంకరరావు, లాలాలక్ష్మీచంద్, నూల్కర్, నీలకంఠలు మాత్రమే మిగిలారు. నీలకంఠ శంకరరావుతో, "శిరిడీ వచ్చిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది" అని చెప్పాడు. అయితే శంకరరావు మనసులో అసాధారణమైన వింత ఆలోచనలు తలెత్తుతూ ఉండేవి. "బాబా నిజంగా సత్పురుషులైతే, ఆయనకు కోపగించడం, తిట్టడం వంటి తామసిక ప్రవృత్తి ఎలా సాధ్యం? ఆయన ప్రజలను ఎందుకు తిడుతున్నారు? ఆయన ఎందుకు అంత కోపాన్ని కలిగి ఉన్నారు? దీనివల్ల ప్రజలకు గాని, లోకానికి గాని జరిగేదేమిటి? ఆయన నాకు ఉపదేశం ఇవ్వకపోతే, నేను అనవసరంగా ఇక్కడకు వచ్చినట్లే. అలాంటప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండటం? ఆయన ఎప్పుడూ "భోజనం చేసి, విశ్రాంతి తీసుకో!(ఖానా ఖావో ఔర్ ఆరామ్ కరో)" అని చెప్తున్నారు. ఇది తప్ప ఆయన వేరే ఏమీ చెప్పడం లేదు" - వంటి ఆలోచనలతో ఇంకా రెండురోజులుపైనే శంకరరావు శిరిడీలో ఉన్నాడు.

ఆ తరువాత ఒకరోజు ఉదయం 8 గంటలకు శంకరరావు అల్పాహారం చేస్తూ నూల్కర్‌తో మాట్లాడుతున్న సమయంలో అతనికి ధూపపు సువాసన వచ్చింది. నూల్కర్ ధూపం వేయలేదని అతనికి తెలుసు. అలాంటప్పుడు ఇది ఎక్కడనుండి వస్తోందో తెలుసుకోవాలని శంకరరావు ఆ సువాసనను అనుసరిస్తూ అడుగులు వేశాడు. చివరికి ఆ సువాసన మసీదు నుండి వస్తుందని అతడు గుర్తించాడు. కానీ అక్కడ ఎవరూ సాంబ్రాణికడ్డీలు వెలిగించలేదు. తనని ద్వారకామాయికి రప్పించడానికి అది బాబా పద్ధతి అని అతను గ్రహించాడు. శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు ఇద్దరూ మశీదులోకి వెళ్లారు. బాబా కాళ్ళు చాపుకుని కూర్చుని ఉన్నారు. ఆయన కోరిక ప్రకారం ఇద్దరూ చెరోవైపు కూర్చున్నారు. శంకరరావు కుడివైపున, లక్ష్మీచంద్ ఎడమవైపున కూర్చుని బాబా కాళ్ళు ఒత్తడం ప్రారంభించారు. అప్పుడు బాబా ఒక భక్తుడిని చిలిం తీసుకురమ్మని చెప్పారు. అతడు తీసుకుని రాగానే బాబా ఒకసారి చిలిం పీల్చి, తరువాత శంకరరావుకు అందించారు. అతడు పీల్చాక బాబా మరోసారి చిలిం పీల్చి లక్ష్మీచంద్‌కు ఇచ్చారు. ఇలా మూడుసార్లు జరిగాక లక్ష్మీచంద్ ఒకటి రెండుసార్లు చిలిం పీల్చాడు. తరువాత శంకరరావు వంతు వచ్చినప్పుడు అతడు చిలిం పీల్చకుండా చేతిలో పట్టుకుని ఉండిపోయాడు. ఆ సమయంలో అతను తన మనస్సులో, "బహుశా బాబా కొంతసేపు విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశ్యంతో చిలిం నాకు అందించారేమో! నేను ఆయనంతటి ఆధ్యాత్మిక స్థితిలో లేకపోవడం వల్ల ఈ చిలిం నాకు పీల్చడానికి ఇచ్చుండకపోవచ్చు. నేను చిలిం పీల్చినట్లయితే అది బాబాను అవమానించినట్లవుతుంది" అని ఆలోచించసాగాడు. మరుక్షణంలో బాబా, "పొగ పీల్చి, చిలిం అతనికి ఇవ్వు. అతను ఒకసారి పీలుస్తాడు" అని అన్నారు. ఇలా ఒకరి తరువాత ఒకరు మళ్ళీ మళ్ళీ చిలిం పీలుస్తున్నారు. ఇది ఇలా జరుగుతుండగా బాబా ఏదో చెబుతున్నారు. బాబా చెపుతున్నది గతంలో తన కుటుంబంలో జరిగిన సంఘటనలకు సంబంధించినదని శంకరరావు త్వరగానే గ్రహించాడు. బాబా తేదీలతో సహా తన తాతలకాలంనాటి కుటుంబ చరిత్రను చెప్తున్నారు. తన తాతగారి గురువు పన్నెండు సంవత్సరాలపాటు వాళ్లతో ఎలా ఉన్నారో కూడా బాబా చెప్పారు. కొన్ని సంఘటనలు శంకరరావుకు తెలుసు. మిగిలినవాటిని అతను ఇంటికి తిరిగి వెళ్లాక ధృవపరుచుకున్నాడు.

బాబా ఇలా చెప్పారు: "నా తల్లి, తండ్రి అక్కడ ఉన్నారు. పన్నెండు సంవత్సరాలు నేను వారితోనే ఉన్నాను. వారు నన్ను బాగా చూసుకున్నారు. బంధువులు, స్నేహితులు మొదలైన చాలామంది చెడు విషయాలు చెప్పి వారిని చాలా ఇబ్బంది పెట్టారు. కానీ వాళ్ళు ఏమీ కోల్పోలేదు. వాళ్ళకి దేనికీ కొరత లేదు. వాళ్ళని ఇబ్బందిపెట్టిన వారిని అల్లా చూస్తాడు! చూడండి! మీరు సరైన పద్దతిలో జీవిస్తూ మంచి చేస్తే, అల్లా మంచి చేస్తాడు! కానీ మీరు చెడు చేస్తే, అల్లా చెడు చేస్తాడు. నేను గాణ్గాపురంలో, పండరీపురంలో ఉన్నాను. నిజానికి, నేను ప్రతిచోటా ఉన్నాను. నేను మొత్తం ప్రపంచంలో ఉన్నాను, ప్రపంచం మొత్తం నాలో ఉంది. ప్రస్తుతం నువ్వు పట్టుకున్నది వదిలివేయవద్దు, రెండు లేదా నాలుగు రోజుల్లో నువ్వు అల్లాను కనుగొంటావు" అని. ఇలా చెప్పిన తరువాత, బాబా తమ పిడికిలినిండా ఊదీ తీసుకుని శంకరరావు ముఖమంతా రాసి, "భోజనం చేసి విశ్రాంతి తీసుకో!" అన్నారు. తరువాత బాబా ఒక ఎండు కొబ్బరికాయను తీసుకుని వారికి ప్రసాదంగా ఇచ్చి, "వెళ్లి భోజనం చేయమ"ని చెప్పారు.

అదేరోజు శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు ఇద్దరూ తిరుగు ప్రయాణం కాబోతున్నారు. వాళ్ళు భోజనం చేసిన తరువాత, బాబా వద్దకు వెళ్లి బయలుదేరడానికి అనుమతి తీసుకున్నారు. అప్పటికే శంకరరావు వద్ద ఉన్న డబ్బంతా అయిపోయినందున నూల్కర్ వద్ద ఐదు రూపాయలు అప్పుగా తీసుకుని, ఉన్న బకాయిలను చెల్లించాడు. తరువాత అతని వద్ద రూపాయిన్నర మాత్రమే మిగిలింది. నూల్కర్‌ను ఇంకా డబ్బులు అడగడానికి అతను ఇబ్బందిపడ్డాడు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు అతను తన విధుల్లో చేరవలసి ఉంది. కాబట్టి ఆ చిన్నమొత్తంతోనే అతను మరుసటిరోజుకి వసయీకి చేరుకోవాల్సి ఉంది. అయితే అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు అయింది. టాంగా ఏదీ అందుబాటులో లేదు, చేతిలో డబ్బు లేదు, పైగా బాబా శిరిడీ విడిచిపెట్టడానికి అనుమతి ఇచ్చారు. అందువలన ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాడతడు. ఆ స్థితిలో అతనికి మరోసారి బాబా దర్శనం చేసుకుని చివరిసారిగా నమస్కారాలు చెప్పుకోవాలని అనిపించింది.

వెంటనే ఒక కొబ్బరికాయ తీసుకుని అతను మశీదుకు చేరుకున్నాడు. బాబా అప్పుడే తమ భోజనం ముగించుకుని శంకరరావు వైపు చూస్తూ, "నువ్వు రేపు డ్యూటీలో చేరాలి. నువ్వు ఇప్పుడే బయలుదేరితే రైలును అందుకోగలుగుతావు" అన్నారు. అదే సమయానికి ఇండోర్ నుండి శంకరరావు స్నేహితుడొకడు అక్కడికి వచ్చాడు. అతడు ప్రఖ్యాత దాల్వి కుటుంబానికి చెందినవాడు, కస్టమ్స్ డిపార్టుమెంటులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అతను, శంకరరావులు ఎల్ఫెన్‌స్టన్ హైస్కూల్‌లో కలిసి చదువుకున్నారు. అతను ముంబాయి వెళుతూ బాబా దర్శనం కోసం మధ్యలో ఆగి రానూపోనూ టాంగా కట్టించుకుని శిరిడీ వచ్చాడు. బాబా శంకరరావును అతనితోపాటు వెళ్ళమని చెప్పారు. ఆ విధంగా శంకరరావు, లాలాలక్ష్మీచంద్‌లు ఇద్దరూ ఏ కష్టం లేకుండా అతనితో శిరిడీ నుండి బయలుదేరారు.

వాళ్ళు కోపర్‌గాఁవ్ స్టేషన్ చేరుకునేసరికి వాళ్ళు ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇండోర్ స్నేహితుడు రాత్రి 8 గంటల సమయంలో ఉన్న తదుపరి రైలుకు టిక్కెట్లను కొనుగోలు చేశాడు. వాళ్ళు మన్మాడు చేరేసరికి పట్టాలు తప్పిన కారణంగా కనెక్టింగ్ రైలు మూడు గంటలు ఆలస్యంగా వస్తుందని తెలిసింది. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు శంకరరావు డ్యూటీలో చేరాల్సి ఉండగా వాళ్ళు ఆ సమయానికింకా ప్రయాణంలోనే ఉన్నారు. చివరకు మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళు ముంబాయి చేరుకున్నారు. లాలాలక్ష్మీచంద్ అదేరోజు విధుల్లో చేరాడు గానీ, శంకరరావు చేరలేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల తరువాత కలుసుకున్న తన స్నేహితుని ఆతిథ్యాన్ని కాదనలేక సియోన్‌లో ఉన్న అతని ఇంటికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు శంకరరావు యొక్క ఖర్చులన్నీ చూసుకోవడం వలన అతనివద్ద రూపాయిన్నర ఇంకా మిగిలే ఉంది.

అదేరోజు సాయంత్రం శంకరరావు పని ముగించుకుని వస్తున్న ఒక సహోద్యోగిని కలుసుకున్నాడు. అతడు, "ఆఫీసులో ఒకరు మీ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు బాధ్యతారహితంగా ఉన్నారని, సెలవు దాటిపోయినా విధుల్లో చేరలేదని పైఅధికారికి ఫిర్యాదు చేస్తున్నారు" అని చెప్పాడు. అతని మాటలు శంకరరావుకి ఏమాత్రమూ ఆందోళన కలిగించలేదు. మరుసటిరోజు అతడు తన విధులకు హాజరవ్వడానికి వెళ్ళినప్పుడు తన అత్తగారు ఛాంబర్‌లో ఉండటం చూశాక అతనికి విషయం అర్థమయ్యింది. వెంటనే అతడు తన పైఅధికారిని కలిశాడు. పైఅధికారి అతనిని సెలవు దాటిపోయాక కూడా విధుల్లో చేరకపోవడానికి కారణం ఏమిటని అడిగాడు. శంకరరావు జరిగినదంతా నిజాయితీగా చెప్పాడు. అతని గురించి బాగా తెలిసిన అధికారి ఆ వివరణతో సంతృప్తి చెంది, ఒకరోజు సెలవు పొడిగింపుకోసం పెట్టిన దరఖాస్తుపై సంతకం చేశాడు. శంకరరావుకు అంత తేలికగా సెలవు మంజూరు కావడం చూసిన అతని అత్తగారు కలవరపడింది.

శంకరరావు ఇలా చెప్పాడు: "సత్పురుషులు వివిధ కారణాల వల్ల చమత్కారాలను (అద్భుతాలు లేదా లీలలను) చేస్తారు. కొన్నిసార్లు విశ్వాసాన్ని పెంపొందించడానికి, కొన్నిసార్లు సరైన ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికి, ఇంకో సందర్భంలో భక్తుడి ఆధ్యాత్మికోన్నతికోసం. కానీ సత్పురుషుని వద్దకు వెళ్ళే ప్రతి భక్తుడు తను వెళ్ళడానికి గల కారణాన్ని మాత్రం తప్పకుండా హృదయగతం చేసుకోవాలి".

సమాప్తం.


2 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo