శిరిడీ నివాసి బాలాజీ సుతార్ బాబాపట్ల భక్తిప్రపత్తులు కలిగి ఉండేవాడు. ప్రతిరోజూ అతను మసీదుకు వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవాడు. అతనిది నిరుపేద కుటుంబం, పైగా పెద్దది కూడా. కుటుంబమంతటికీ సంపాదించి తిండి పెట్టేది అతనొక్కడే. కానీ బాబా అతనికెప్పుడూ డబ్బివ్వలేదు. అతని భవిష్యత్తు తెలిసిన బాబా ఒకరోజు అతనితో, “అరె బాలా, వెళ్లి పిల్లల్ని చూసుకో! ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండకు. పిల్లలు ఆకలితో చస్తారు. ‘అల్లా మాలిక్’ జాగ్రత్త వహిస్తాడు, వాళ్ళను చూసుకుంటాడు. చింతించకు, ఇక వెళ్ళు! ఇదిగో, ఈ ఊదీ తీసుకో!” అని అన్నారు. మళ్ళీ ఎప్పుడూ అతనికి మసీదు మెట్లెక్కే అవకాశం రాలేదు. అతనికి ఎనిమిదిమంది పిల్లలు. వాళ్లలో పెద్దవాడు అప్పా.
ఒకసారి అప్పా తాను నిరక్షరాస్యుడనని ఎంతో బాధపడి బాబా ముందు సాష్టాంగపడి, “బాబా! మీరెందుకు నాకు అక్షరాస్యతను బహుమతిగా ఇవ్వలేదు? ఇచ్చుంటే, నేను కూడా మీ దర్బారులో గ్రంథపఠనం చేసేవాడిని. దేవా! నన్ను ఈ అజ్ఞానాంధకారంలో, మూర్ఖస్థితిలో వదిలిపెట్టింది మీరే. ఇప్పుడు నేను ఏం చేయాలి?” అంటూ హృదయవిదారకంగా శోకించాడు. ఆ రాత్రి బాలాజీకి బాబా స్వప్నదర్శనమిచ్చి, “అరె బాలా! అప్పాను బడికి పంపు. నేను నీతో ఉన్నాను” అని చెప్పారు. దాంతో బాలాజీ తనకున్న గొర్రెలను అమ్మి అప్పాను బడికి పంపాడు. అయితే, అప్పా ఐదవ తరగతి పూర్తిచేసి, ఆపై చదువుకోవడం మానేశాడు. ఆ విషయాన్ని అతను తరచూ తలచుకుంటూ, “బాబా దయవల్లనే నేను ఇప్పుడు చదవగలుగుతున్నాను. ఈ జ్ఞానాన్ని నాకు బాబానే నేర్పారు” అని అంటుండేవాడు.
బాబా సమాధి చెందిన అయిదు సంవత్సరాల తరువాత (1923) బాలాజీ మరణించాడు. అతని మరణంతో ఇంటికి పెద్ద కొడుకైనందున బాధ్యతలన్నీ అప్పా భుజస్కంధాలపై పడ్డాయి. అతను రత్నపార్ఖే కుటుంబీకుల పశువులను, గొర్రెలను చూసుకుంటూ తన కుటుంబం బాగోగులు చూసుకుంటుండేవాడు. ప్రతిరోజూ నియమబద్ధంగా అతను తన నిత్యకృత్యాలు చేసుకుంటూ, పనులన్నీ పూర్తైన తరువాత బాబా సమాధిమందిరానికి వెళ్లి భజన కార్యక్రమాలలో పాల్గొంటుండేవాడు. ఆ తరువాత నిత్యం దీక్షిత్ చేసే ఏకనాథ భాగవత పఠనానికి హాజరయ్యేవాడు.
ఒకరోజు అప్పాకి సమాధిమందిరంలో గ్రంథపఠనం చేయాలనే దృఢమైన కోరిక కలిగింది. దాంతో అతను ఎక్కువ సమయాన్ని వృధా చేయక వెంటనే కాకాసాహెబ్‌ని కలిసి, తనకు గ్రంథపఠనం నేర్పించమని అడిగాడు. అప్పుడు కాకాసాహెబ్, “అప్పా, నీకు గ్రంథపఠనం నేర్పడానికి నేనెవరిని? సాక్షాత్తూ బాబానే నీకు నేర్పుతారు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, రోజూ గ్రంథపఠనానికి హాజరుకావడమే!” అని చెప్పాడు. దీక్షిత్ సలహాను తు.చ తప్పకుండా పాటించసాగాడు అప్పా. ఒక్కరోజు కూడా గ్రంథపఠనానికి హాజరుకాకుండా ఉండేవాడు కాదు.
ఇలా ఉండగా ఒకనాటి రాత్రి అప్పాకి ఒక కల వచ్చింది. ఆ కలలో తాను సమాధిమందిరంలో చాలామంది భక్తుల నడుమ కూర్చుని గ్రంథపఠనం చేస్తుంటే, అందరూ శ్రద్ధగా వింటున్నట్లు కనిపించింది. ఆ మరుసటివారం కాకాసాహెబ్ దీక్షిత్ ఏదో పనిమీద బొంబాయి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల కాకాసాహెబ్ తాను నిత్యం చేసే గ్రంథపఠనను కొనసాగించమని అప్పాతో చెప్పాడు. ఆరోజు నుండి అప్పా ఎంతో ఇష్టంగా సమాధిమందిరంలో గ్రంథపఠనం ప్రారంభించాడు. అయితే దురదృష్టవశాత్తూ ఆ గ్రంథంలోని లోతైన అర్థాన్ని అతను గ్రహించలేకపోయేవాడు. అందువల్ల ప్రతిరోజూ తాను చదవాల్సిన భాగాన్ని చదివి, గ్రంథాన్ని వస్త్రంలో చుట్టి జాగ్రత్తగా యథాస్థానంలో ఉంచేవాడు. అంతేగానీ ఎటువంటి వివరణా ఇచ్చేవాడు కాదు. ఇలా కొన్ని రోజులు కొనసాగిన తరువాత, ‘చదవడమైతే చదువుతున్నానుగానీ, అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాన’ని అప్పా కలవరపడసాగాడు. అంతలో భక్తులు కూడా చదువుతున్న భాగాన్ని వివరించమని అడిగారు. అందుకు అప్పా, “బాబా ఎప్పుడు నాకు కలలో దర్శనమిచ్చి అర్థాన్ని వివరించమని చెప్తారో ఆ క్షణం నుండి నేను అలాగే చేస్తాను. కారణం, నాకు చదవడం నేర్పించి, గ్రంథపఠన చేసే ఈ అవకాశాన్ని ఇచ్చింది బాబానే. ఇప్పుడు ఆ దయగల తల్లే (బాబా) గ్రంథంలోని లోతైన అర్థాన్ని నాకు విశదపరచాలి” అని బదులిచ్చాడు. భక్తులు అతనితో ఏకీభవించి, “నీకు బాబాపై పూర్తి విశ్వాసముంది. కాబట్టి నీకు నచ్చింది చేయి. అదే మనందరికీ మంచిది” అని అన్నారు.
తరువాత వైకుంఠచతుర్థినాడు (శ్రీమహావిష్ణువు తన యోగనిద్ర నుండి మేల్కొన్న శుభదినం; ఇది సెప్టెంబరు మాసంలో వస్తుంది) తెల్లవారుఝామున 4 గంటలకు అప్పాకి కలలో బాబా దర్శనమిచ్చి, “చదువుతున్న భాగాన్ని వివరించమ”ని చెప్పారు. అదేరోజు సాయంత్రం అప్పా తన మృదుమధుర స్వరంతో శ్రావ్యంగా జ్ఞానేశ్వరిని వివరించడం ప్రారంభించాడు. భక్తులంతా ఎంతో ఆనందించారు.
ఆస్తి విభజన వల్ల వచ్చిన కష్టం
అప్పాకి వివాహమయ్యేనాటికి తన సోదరునితో కలిసి ఉండేవాడు. కానీ త్వరలోనే ఇరువురి మధ్య కొన్ని అపార్థాలు, చెడు తలంపులు చోటుచేసుకున్నాయి. దాంతో ఎవరిదారిన వాళ్ళు బ్రతకాలన్న నిర్ణయానికి రావడంతో ఉన్న కొద్దిపాటి ఆస్తిపంపకాలు జరిగాయి. అయితే సరైన సాక్ష్యాధారం లేకుండా శిరిడీకి చెందిన ముల్తాన్ ఫతేచంద్ అనే మార్వాడికి మూడు వందల యాభై రూపాయలు అప్పా చెల్లించాల్సి వచ్చింది. ఆ కారణంగా అతను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజానికి ఆ విషయం అతనికి మొదట్లో తెలియదు. తెలిశాక జరిగిన పరిణామాలతో అతను ఎంతో బాధను అనుభవించాడు. ఒక కీర్తనకారునిగా గ్రామస్తులు అప్పాని ఇష్టపడి గౌరవించినప్పటికీ, అతనొక గొల్లవాడనీ, ధనవంతుడుకాడనీ అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళెవరూ అతనికి డబ్బు అప్పుగా ఇవ్వరు. ఇదంతా తెలిసి కూడా పరిస్థితిని మరింత దిగజార్చడానికా అన్నట్లు సదరువ్యక్తి ఒక ప్రభుత్వ అధికారిని వెంటబెట్టుకొని తనకు రావాల్సిన డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి అప్పా ఇంటికి వచ్చాడు. ఆ మొత్తాన్ని ఒక నిర్దిష్ట తేదీకల్లా చెల్లించకపోతే అతన్ని జైలులో పెడతామని వాళ్ళు హెచ్చరించారు. దాంతో అప్పా చాలా భయపడ్డాడు. చివరికి అతను తెలివిగా శిరిడీ వదిలి భగవతి కోహ్లార్కరాచివాడి అనే గ్రామానికి వెళ్ళిపోయాడు. అతని చేతిలో డబ్బులు లేవు, చేసేందుకు పనీ దొరకలేదు. దాంతో అతను అక్కడినుండి శిరిడీకి సమీపంలో ఉన్న పింపల్వాడి గ్రామానికి వెళ్ళాడు. ఇక్కడ అతని పరిస్థితి మునుపటికంటే దారుణంగా ఉంది. తినడానికి తిండిలేక, ఉండటానికి నీడలేక నిరాశానిస్పృహలతో అతనెంతో బాధపడ్డాడు. ‘అప్పు ఎలా తీర్చాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?’ అని రాత్రింబగళ్ళు చింతించేవాడు. నిస్సహాయంగా, “పెరుగుతున్న అప్పును తీర్చలేను, నా కుటుంబ సంక్షేమాన్ని చూసుకోలేను, ఆధ్యాత్మిక ఓదార్పును(దైవానుగ్రహాన్ని) కూడా పొందలేను” అని అనుకుంటుండేవాడు. ఇలా ఉండగా పరిస్థితి మరింత దిగజార్చడానికా అన్నట్లు స్థానిక పోలీసులు కొన్ని చిన్న చిన్న నేరాలకు అతనిని జైలులో పెడతామని బెదిరించారు. దాంతో అతను రాత్రికి రాత్రే దొంగతనంగా ఆ ఊరినుండి మరో గ్రామానికి పారిపోయాడు. దారిలో జనసంచారమే లేని ఒకచోట భయపడి సహాయం కోసం బాబాను ప్రార్థించాడు. “బాబా! ఏమి చేయాలో తెలియని నిస్సహాయస్థితిలో ఉన్నాను. నావైపు చూసేవారు ఎవరూ లేరు. మీరు నన్నెందుకు ఇంత కష్టంలో పెట్టారు? నా సమస్యలను ఎవరు వింటారు? నేను చనిపోతే బాగుంటుంది. కానీ నాదొక అభ్యర్థన, మీరు నా అప్పు విషయంలో ఏదో ఒకటి చేయండి లేదా నన్ను చనిపోనివ్వండి” అని దీనంగా బాబాను వేడుకొని నిద్రపోయాడు. దయామయుడైన బాబా అతని మొర విన్నారు. ఆ రాత్రి అప్పాకు బాబా స్వప్నదర్శనమిచ్చి, “అరె అప్పా! చిన్నపిల్లవాడిలా ఎందుకు ఏడుస్తావు? భయపడకు, చింతించవద్దు. అల్లా అందరినీ రక్షించేవాడు. ఆయన అందరినీ చూసుకుంటాడు. ఇప్పుడు లేచి ఇంటికి వెళ్ళు” అని అతనిని ఓదార్చారు. బాబా ఆదేశానుసారం అప్పా శిరిడీకి తిరిగి వచ్చి నేరుగా సమాధిమందిరానికి వెళ్లి, బాబా సమాధి ముందు నిలబడి, “బాబా! ఋణగ్రస్తుడనన్న అవమానాన్ని గుదిబండలా నా మెడలో వ్రేలాడదీయనిచ్చి ప్రశాంతంగా అంతా చూస్తున్నారు” అని సాష్టాంగపడి ఇంటికి వెళ్ళిపోయాడు.
కొన్ని రోజుల తరువాత అప్పాకి భగవద్గీత నేర్చుకోవాలనే బలమైన కోరిక కలిగింది. ఆ సమయంలో మాలిబువా అనే శివారాధకుడు సమాధిమందిరంలో ఉంటుండేవాడు. అప్పా అతనిని కలిసి తనకు భగవద్గీతలోని పదకొండవ అధ్యాయం నేర్పించమని అడిగాడు. ఆయన అందుకు సమ్మతించాడు. ఆ రాత్రి అప్పాకి ఒక కల వచ్చింది. కలలో తనతోపాటు షామా, వెంకటస్వామి, దాసగణు, కొండాజీ సుతార్‌లు కనిపించారు. బాబా ఒక్కొక్కరిని భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పఠించమని అడిగారు. చివరికి అప్పా వైపు తిరిగి, “అప్పా, నీ పఠనం ఉత్తమమైనది. ఏదైనా వరం కోరుకో! నేను దానిని నీకు అనుగ్రహిస్తాను” అని అన్నారు బాబా. అప్పా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ‘తనను ఋణవిముక్తుణ్ణి చేయమ’ని అడిగాడు. బాబా "అప్పు తీరిపోతుంద"ని అభయమిచ్చారు. మరుసటిరోజు ఉదయం ఫతేచంద్ అతని ఇంటికి వచ్చి, తనకొక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగాడు. అలా చేస్తే బాకీ పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాసిచ్చాడు. ఆ మేరకు అప్పా నెలరోజుల్లో ఇల్లు కట్టించి ఇచ్చాడు. దాంతో అతను బాకీ పత్రాలు పత్రాలన్నీ తిరిగి ఇచ్చాడు. అప్పా వాటిని చింపి అవతల పారేసాడు.
అప్పా కాలిపై పుండ్లు నయమగుట
1936లో అప్పా తన ఎడమకాలిపై నయంకాని పుండ్లతో చాలా బాధపడ్డాడు. చీలమండనుండి మోకాలివరకు వ్యాపించిన ఆ పుండ్లనుండి ఎప్పుడూ రసి కారుతూ ఉండేది. అతను మొదట ఆయుర్వేద మందులు, తరువాత అల్లోపతి మందులు వాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అతను ఎంతోమంది వైద్యులను సంప్రదించినప్పటికీ పరిస్థితి ఏ మాత్రమూ మెరుగుపడలేదు. 200 రూపాలు ఖర్చుపెట్టి కోపర్ గావ్ ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాడు. షామా కూడా మందులిచ్చాడు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి అతను విసుగుచెంది నాసిక్ వెళ్లి అక్కడ ఒక ఆసుపత్రిలో చేరాడు. కానీ కొంచమైనా గుణం కన్పించలేదు. అక్కడున్న 8 రోజుల్లో ఒకరాత్రి అతనికి బాబా స్వప్నదర్శనమిచ్చి, “అరె అప్పా! నీ అనారోగ్యం గురించి ఎందుకంత భయపడుతున్నావు? పుండ్లు నయమవుతాయి. శిరిడీ వెళ్లి గ్రంథపఠనం చేయి. ఎందుకంటే, గ్రంథపఠనం చేయడానికి అక్కడ ఎవరూ లేరు. విఠల్‌రావు కీర్తనలు చేయటానికి శిర్వాలా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు శిరిడీలోని నీ ఇంటికి వెళ్లు” అని చెప్పారు. "ఎగ్జిమా బాధ వలన నాశిక్ వచ్చాను కదా!" అని అన్నాడతను. దానికి బాబా, "నా పురాణం పఠనం చేస్తూ ఊదీ రాస్తూ వుండు, నీకు నయమవుతుంది" అని అన్నారు. బాబా ఇచ్చిన భరోసాతో అతను శిరిడీకి బయలుదేరాడు. దారిలో సంగమనేరు వద్ద కొంతసేపు ఆగి, తరువాత తన ప్రయాణాన్ని కొనసాగించి ఉదయం 10 గంటలకు శిరిడీ చేరుకున్నాడు. అతను బస్సు దిగుతూనే శిర్వాల బస్సుకోసం ఎదురుచూస్తున్న విఠల్‌రావుని చూసి ఆశ్చర్యపోయాడు. విఠల్‌రావు అతనిని పలకరించి, “అప్పా! నువ్వు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను శిర్వాలా వెళుతున్నాను. అందువల్ల గ్రంథపఠనం చేసే వాళ్ళెవరూ లేరు. కాబట్టి గ్రంథపఠనం నువ్వు చేయి” అని చెప్పాడు. అతని మాటలు విన్న అప్పా, “ఈ ప్రపంచంలో జరిగే అన్ని సంఘటనలకు బాబానే బాధ్యత వహిస్తారు. నేను ఆయన చేతిలో ఒక పరికరాన్ని మాత్రమే” అని అన్నాడు. అప్పా గ్రంథపఠనం(జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం, ఆధ్యాత్మిక రామాయణం మరియు శ్రీసాయి సచ్చరిత్ర) చేస్తూ బాబా అభిషేకజలాన్ని, ఊదీని తన పుండ్లకు రాయడం ప్రారంభించాడు. బాబా అనుగ్రహంతో ఏడురోజులలో పుండ్లు పూర్తిగా నయమైపోయాయి. వాటి తాలూకు మచ్చలు కూడా మిగలలేదు.
సోర్సు: శ్రీసాయి లీల పత్రిక మే-జూన్ 1940 (బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి)
డీవోటీస్ ఎక్స్పీరియన్సెస్ అఫ్ సాయిబాబా బై బి.వి. నరసింహస్వామి
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Jai sairam
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDelete🙏💐🙏ఓం సాయిరామ్🙏💐🙏
ReplyDeleteOm sai ram baba ma amma arogyam nyam cheyi thandri
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🕉🙏😊
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sai ram sai
ReplyDeleteJAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM JAISAIRAM SAIDEVA MEEKU KOTI KOTI PRANAAMAAALU THANDRI
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve chasinanduku danya vadalu
ReplyDelete