- అడిగితే తప్పక అనుగ్రహిస్తారు బాబా
- దయగల సాయితండ్రి కరుణించారు
అడిగితే తప్పక అనుగ్రహిస్తారు బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. నేనొక సాయిభక్తురాలిని. సాయినాథుడు నాతోనే ఉన్నారన్న అనుభూతిని నేను ప్రతిరోజూ పొందుతుంటాను. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఒకరోజు మా అమ్మ వంటిల్లు శుభ్రం చేస్తున్నప్పుడు వంటింట్లో ఉన్న గ్రానైట్ రాయి తన కాలిపై పడింది. అది చాలా బరువుగా ఉండటంతో అమ్మ కాలికి బాగా దెబ్బతగిలింది. నొప్పి ఎక్కువగా ఉన్నప్పటికీ వాపు రాకపోవటంతో మేము అమ్మ కాలికి ఫ్రాక్చరేమీ కాలేదని అనుకున్నాము. కానీ సాయంత్రానికల్లా నొప్పి తీవ్రమై నడవడానికి కూడా కష్టంగా ఉండటంతో అమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాము. అమ్మ కాలిని పరీక్షించిన డాక్టర్ ఎక్స్-రే తీయాలని చెప్పి ఎక్స్-రే తీశారు. నేను, “ఎక్స్-రే రిపోర్టులో ఏ ఫ్రాక్చరూ లేకుండా ఉండాలి” అని బాబాని వేడుకున్నాను. సాయి దీవెన వలన ఎటువంటి ఫ్రాక్చర్స్ లేవని రిపోర్టులో తేలింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”.
ఇది మా పెద్దమ్మాయికి సంబంధించిన అనుభవం. మా పెద్దమ్మాయికి నెలసరి సమయంలో బాగా కడుపునొప్పి వస్తుంటుంది. 2020 చివరిలో నేను బాబాకు నమస్కరించుకుని, "మా అమ్మాయికి కడుపునొప్పి తగ్గించమ"ని వేడుకొని బాబా ఊదీ నీళ్ళలో కలిపి మా అమ్మాయి చేత త్రాగించాను. బాబా అనుగ్రహంతో తన కడుపునొప్పి చాలావరకు తగ్గింది. కానీ తర్వాత 2022, జనవరిలో మళ్లీ తనకి కొడుపునొప్పి వచ్చింది. అప్పుడు బాబాను స్మరించుకుంటూ, మా పాపకు వేడినీళ్ళు ఇచ్చి, శిరిడీ లైవ్ దర్శనంలో బాబాను దర్శింపజేశాను. బాబాను దర్శించినప్పటినుండి మా అమ్మాయి కడుపునొప్పి కొద్దికొద్దిగా తగ్గింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”
మేము మా ఊళ్ళో కొంత పొలం కొన్నాము. 2020, ఆగస్టులో ఆ పొలానికి రిజిస్ట్రేషన్ అయింది. కానీ దానికి రైతుబంధు పథకం వర్తించలేదు. నేను బాబాను మ్రొక్కుకుని అక్కడున్న ఆఫీసరు ద్వారా అన్ని ప్రయత్నాలూ చేశాను. ఎట్టకేలకు బాబా దయవలన గురువారంరోజున రైతుబంధు పథకం క్రింద కొంత డబ్బు నా అకౌంటులో జమ అయింది. “ధన్యవాదాలు బాబా!” ఇలా నాపై ఎల్లప్పుడూ దయచూపాలని బాబాను మనసారా ప్రార్థిస్తున్నాను.
దయగల సాయితండ్రి కరుణించారు
బాబా భక్తకోటికందరికీ నా నమస్కారాలు. నా పేరు అంజలి. ఈమధ్య బాబా నాపై చూపించిన అనుగ్రహాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మా బాబుకి జ్వరం తగ్గిన తరువాత మా పాపకు కూడా జ్వరం వచ్చింది. బాబా దయవల్ల రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. అలాగే బాబా దయవల్ల పండుగకు కాస్త ముందే ఆఫీసుకు క్రొత్త బ్యాటరీలు వచ్చాయి. అందువల్ల వాటిని భోగి ముందురోజున ఆఫీసులో ఛార్జ్ చేసి, సంక్రాంతి పండుగకి అమ్మావాళ్ళ ఇంటికి వెళదామని అనుకున్నాము. సంక్రాంతి పండుగరోజున తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఆన్‌లైన్లో టికెట్లు బుక్ చేశారు మావారు. దాంతో, భోగిరోజున వేటపాలెంలోని దత్తాత్రేయస్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకుని, మరుసటిరోజు తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుందామనుకున్నాము. కానీ పండుగ ముందురోజు ఆఫీసులో పని పూర్తికాలేదు. అందువల్ల తిరుమల వెళ్ళడానికి నాకు సెలవు దొరుకుతుందో లేదోనని కాస్త ఆందళనగా అనిపించింది. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని ఉంది. ఎలాగైనా ఆఫీసులో నాకు సెలవు ఇప్పించు ప్లీజ్!” అని వేడుకున్నాను. దయగల సాయితండ్రి వెంటనే కరుణించారు. నాకు సెలవు దొరికింది. అందరం కలిసి ఆనందంగా తిరుమల వెళ్ళి వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని వచ్చాము. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. ప్రయాణ సమయంలో నాకు నెలసరి వస్తుందేమోనని భయపడ్డాను. కానీ, ఎలాంటి అడ్డంకీ లేకుండా బాబా దయవల్ల అంతా చాలా ఆనందంగా జరిగింది. పండుగ తరువాత వచ్చి ఆఫీసులో జాయినయ్యాను. బ్యాటరీలకు సంబంధించిన పనిని జనవరి 18న బాబా పూర్తిచేయించారు. అంతా బాబా దయ.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
