- నామస్మరణతో ఎంతటి కష్టం నుండైనా బాబా మనల్ని కాపాడుతారు
- మొర ఆలకించి కోరిక నెరవేర్చిన బాబా
- బాబా దయతో తగ్గిన జ్వరం
నామస్మరణతో ఎంతటి కష్టం నుండైనా బాబా మనల్ని కాపాడుతారు
అందరికీ నమస్కారం. నేనొక చిన్న సాయిభక్తురాలిని. మేము మా చిన్నతనంనుండి బాబాను పూజిస్తున్నాము. బాబా మా జీవితంలో ఎన్నో అనుభవాలను చూపించారు. వాటిలోనుండి రెండు అనుభవాలను ఇప్పుడు నేను మీతో పంచుకుందామని అనుకుంటున్నాను.
ఒకరోజు ఉదయం మావారు కడుపునొప్పితోనూ, వాంతులతోనూ బాధపడ్డారు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మావారి కడుపునొప్పి, వాంతులు త్వరగా తగ్గేలా మీరే అనుగ్రహించాలి” అని బాబాను వేడుకుని, మావారికి బాబా ఊదీని రాసి, బాబా నామస్మరణ చేస్తూ ఆయన ప్రక్కనే కూర్చున్నాను. బాబా ఊదీ ప్రభావంతోనూ, బాబా నామస్మరణతోనూ సాయంత్రానికల్లా మావారి కడుపునొప్పి, వాంతులు తగ్గిపోయాయి.
అలాగే ఒకసారి మా అబ్బాయి సంక్రాంతి పండుగకు ముందు బాగా జలుబు, జ్వరంతో బాధపడ్డాడు. శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాడు. మందులు వాడితే కాసేపు ఉపశమనం లభిస్తుండేదేగాని మళ్ళీ జ్వరం ఎక్కువవుతుండేది. నేను బాబానే నమ్ముకుని, “బాబా! మీరే ఎలాగైనా బాబుకి ఆరోగ్యం కుదుటపడేలా చేయండి” అని బాబాకు చెప్పుకుని, బాబా నామస్మరణ చేసాను. అలా బాబా నామాన్ని స్మరించడం వల్ల బాబు ఆరోగ్యం మెరుగైంది. మనం ఎల్లప్పుడూ భక్తివిశ్వాసాలతో బాబా నామస్మరణ చేస్తే ఎంతటి కష్టం నుండైనా బాబా మనల్ని కాపాడుతారు. “బాబా! మీ ప్రేమను ప్రతి ఒక్కరిపైనా సదా కురిపిస్తూ అందరినీ ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”. ఈ అనుభవాన్ని చదివిన మీ అందరికీ నా ధన్యవాదాలు.
బాబా భక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగును ‘ఆధునిక సచ్చరిత్ర’ అనడంలో అతిశయోక్తి లేదు. నేను యుఎస్ఏ నుండి ఒక సాయి భక్రూరాలిని. నా చిన్నతనంనుంచి నాకు బాబా అంటే చాలా ఇష్టం, ప్రేమ. నన్ను, నా కుటుంబాన్ని బాబా సదా రక్షిస్తున్నారు. ఒకసారి నా భర్తకు బాగా జలుబు చేసింది. ఇంటి చిట్కాలు, మందులు వాడినప్పటికీ జలుబు తగ్గలేదు. అసలే అది కరోనా సమయం కాబట్టి నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను మనఃపూర్వకముగా బాబాకు నమస్కరించి, మావారికి జలుబు తగ్గించమని ప్రార్థించి, బాబా ఊదీని మావారికి పెట్టి, కొంచెం ఊదీని నీళ్లలో కలిపి తనకు ఇచ్చాను. బాబా దయవలన తన జలుబు కొంచెం తగ్గింది. తరువాత డాక్టరుని సంప్రదిస్తే కరోనా టెస్టు చేయించమన్నారు. దాంతో ఇంకా భయమేసి, "బాబా! మీ అనుగ్రహంతో కరోనా రిపోర్టు నెగిటివ్ రావాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. ఒకరోజు తరువాత వచ్చిన కరోనా టెస్టు రిపోర్టు నెగెటివ్ అని వచ్చింది. "నా కోరిక నెరవేర్చారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ దయతో మావారి జలుబు పూర్తిగా తగ్గాలని సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. ఆయన తొందరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యంతో ఉండేలా ఆశీర్వదించండి బాబా! లవ్ యు బాబా! థాంక్యూ బాబా!"
బాబా దయతో తగ్గిన జ్వరం
"సాయిబాబా! మీరు నా జీవితంలో చూపిన అద్భుతాలు మాటల్లో చెప్పలేనివి. ధన్యవాదాలు తండ్రీ!". నా పేరు నీలిమ. 2021, జనవరి 20న మా తమ్ముడికి జ్వరం వచ్చింది. ఒక్కసారిగా తను చాలా నీరసించిపోయి అస్సలు లేవలేకపోయాడు. వాడి పరిస్థితి చూసి నాకు చాలా బాధగా అనిపించి, "బాబా! రేపటికల్లా నా తమ్ముడికి జ్వరం తగ్గి, ఆరోగ్యంగా ఉండేలా దయ చూపండి" అని బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా దయవల్ల తమ్ముడు లేచి హాస్పిటల్‌కి వెళ్ళొచ్చాడు, తెల్లవారేసరికల్లా పూర్తిగా కోలుకున్నాడు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ!"
