సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

యోగిరాజు ముంగిట మ్రోకరిల్లిన మృగరాజు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1918 అక్టోబరు 15వ తేదీన శ్రీసాయిబాబా మహాసమాధి చెందారు. బాబా మహాసమాధికి ఒక వారంరోజుల ముందు ఒక పెద్దపులి శ్రీసాయిసన్నిధిలో మసీదు మెట్లపై మ్రోకరిల్లి ప్రాణాలు విడిచింది. బాబా ఆదేశానుసారం ఆ మృగరాజును శిరిడీలోని మహాదేవ మందిర సమీపాన సమాధి చేసారు. ఆ విశేష సంఘటనకు గుర్తుగా ఆ పులి యొక్క విగ్రహం ద్వారకామాయిలో ప్రతిష్ఠించబడిందంటే, ఆ వ్యాఘ్రలీలకు సాయిచరిత్రలోను, సాయిభక్తుల హృదయాలలోను ఎంతటి విశేష స్థానముందో అవగతమవుతుంది.

"పులి వంటి క్రూరజంతువుకు మానవులకు ఉండే జ్ఞానం ఉంటుందా? అటువంటి ఒక క్రూరజంతువు బాబా పాదాల వద్ద శరణాగతి పొందింది. బాబా చర్యలు అంతుపట్టనివి. ఈ విషయానికి సంబంధించిన కథను శ్రద్ధగా వినండి. ఈ కథ మీకు బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని, అన్ని జీవులపట్ల ఆయనకు గల సమదృష్టిని తెలియజేస్తుంది.

బాబా మహాసమాధి చెందడానికి ఏడురోజుల ముందు సాయిసన్నిధిలో ఓ అద్భుతం జరిగింది. ఒక ఎద్దులబండి వచ్చి మసీదు ముంగిట్లో ఆగింది. ఆ బండిలో బలమైన ఇనుప గొలుసులతో బంధింపబడి ఉన్న ఒక పెద్దపులి ఉంది. అది వ్యాధిగ్రస్తమై ఉంది. చూసేందుకు చాలా రౌద్రంగా, అసహనంగా భయంగొల్పుతూ ఉంది. దానిపై జీవిస్తూ ఉన్న ముగ్గురు దర్వేషులు (జంతు ప్రదర్శకులు) బండిపై దానిని పల్లె పల్లెకూ తిప్పుతూ, ఆ ఆదాయంతో పొట్టపోసుకునేవారు. జబ్బుపడిన ఆ పులికి వారు ఎన్నో చికిత్సలు చేయించారు. కానీ దాని వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. చివరకు ఎవరైనా ఒక మహాత్ముని దర్శనభాగ్యం చేతనైనా ఆ పులికి స్వస్థత చేకూరుతుందని ఆశపడ్డారు. అదే సమయంలో బాబా అద్భుత లీలలు వారి చెవినపడ్డాయి. వారు తమతో పాటు పులిని తీసుకుని బాబా దర్శనార్థం శిరిడీ వచ్చారు. మసీదు ముంగిట్లో పులిని బండి నుండి క్రిందికి దించారు. పులిని గొలుసులతో కట్టిపట్టుకుని మసీదు ద్వారం వద్ద వేచివున్నారు. దర్వేషులు బాబా వద్దకు వచ్చి నమస్కరించి పులి పరిస్థితిని బాబాకు విన్నవించారు.

ప్రజలంతా ఈ దృశ్యాన్ని చోద్యంగా చూస్తున్నారు. బాబా అనుమతి తీసుకుని, పులిని గొలుసులతో గట్టిగా పట్టుకుని, జాగ్రత్తగా బాబా ముందుకు తెచ్చారు. పులి మసీదు మెట్ల వద్దకు వచ్చి, ఒక్కసారి బాబావైపు చూచింది. అద్భుతమైన బాబా దివ్య తేజస్సుకు తట్టుకోలేనట్లు శిరస్సు వంచింది. మసీదు మెట్లు ఎక్కుతున్న పెద్దపులిని బాబా చూశారు. పులి కూడా బాబా వంక ప్రేమతో చూసింది. బాబా చూపులో చూపు కలిసిన వెంటనే, ఆ పులి తోకతో నేలను మూడుసార్లు కొట్టి బాబా ముందు మ్రోకరిల్లింది. తరువాత ఒక్కసారి పెద్దగా గర్జించి, ప్రాణాలు విడిచింది. అక్కడున్నవారంతా ఆశ్చర్యచకితులయ్యారు.

దర్వేషులు తమ జీవనాధారం పోయినందుకు ముందు దిగులుపడ్డారు. కానీ జబ్బుతో ఉన్న ఆ పులి మరణించే సమయానికి దాని పూర్వపుణ్యం వలన బాబావంటి మహాత్ముని సన్నిధి చేరి ఉత్తమగతులు పొందిందని ఆనందించారు. మహాత్ముల సన్నిధిలో మరణించిన జీవి క్రిమి అయినా, కీటకమైనా, వ్యాఘ్రమైనా వాటి పాపాలన్నీ పరిహారమవుతాయి.

బాబా పాదాలు కోరికలన్నీ తీర్చే చింతామణి వంటివి. అష్టసిద్ధులు ఆయన పాదాలకు ప్రణామాలర్పిస్తాయి. నవనిధులు ఆయన పాదాలముందు సాగిలపడి ఆయన పాదతీర్థాన్ని స్వీకరిస్తాయి.

ఏ జీవి మహాత్ముల పాదాలవద్ద శిరస్సు ఉంచి మరణిస్తుందో అది తప్పక ఉద్ధరింపబడుతుంది. ఎంతో పూర్వపుణ్యం చేసుకుంటే తప్ప ఏ జీవికైనా మహాత్ముల కనులముందు దేహత్యాగం చేసే అవకాశం రాదు. మహాత్ముల సన్నిధిలో విషం కూడా అమృతంలా మారుతుంది. ఆ సన్నిధిలో మరణించిన వారికి మరుజన్మ అంటూ ఉండదు. వారి పాపాలన్నీ నశిస్తాయి. వారు ముక్తులౌతారు. మహాత్ములను కనులారా నఖశిఖపర్యంతం చూస్తూ శరీరాన్ని వదలటాన్ని మరణమంటారా? కాదు, దాన్ని 'సద్గతి' అంటారు.

బహుశా ఈ పులి గతజన్మలో కొంత పుణ్యం చేసుకున్న జీవి అయివుంటుంది. తన పాండిత్య గర్వంతో హరిభక్తుణ్ణి కించపరచి ఉంటుంది. ఆ హరిభక్తుని శాపం వల్ల క్రూరజంతువుగా జన్మించిందేమో! అదృష్టవశాత్తూ బాబాను దర్శించటంతో ఆ పాపాలన్నీ దహింపబడ్డాయి. ఆ  జీవి ఉద్ధరింపబడింది. అలా ఆ పులి సాయిపాదాల చెంత ముక్తి చెందటం చూసి ఆ దర్వేషులు సంతోషించారు.

పులి దేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాలని వారు బాబాను అడిగారు. అప్పుడు సాయిమహరాజ్, “ఈ పులి పుణ్యజీవి. దాని మరణానికి చింతించవద్దు. దాని మరణం ఇక్కడ జరగాల్సి ఉంది. అది శాశ్వతానందాన్ని పొందింది. తకియా వెనుక శివాలయం ఉంది. అక్కడున్న నంది సమీపంలో దాని అంత్యక్రియలు జరపండి” అని ఆదేశించారు. "అలా చేస్తే పులి సద్గతి పొందుతుంది. దానితో మీకు గల ఋణానుబంధం తీరుతుంది. గతజన్మలో అది మీకు ఋణపడి ఉంది. ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి ఈరోజువరకు అది మీకు సేవచేసింది” అని బాబా వివరించారు. (తమ జీవనోపాధి కోల్పోయి దిగులుగా ఉన్న దర్వేషులకు బాబా 150 రూపాయలు కానుకగా ఇచ్చారు.)

తరువాత ఆ దర్వేషులు ఆ పులి కళేబరాన్ని మోసుకువెళ్ళి నంది విగ్రహం వెనుకగా సమాధిచేసారు. అంతకు ముందు వరకు ప్రాణాలతో ఉన్న పులి హఠాత్తుగా ప్రాణత్యాగం చేయడం ఎంత అద్భుతమైన సంఘటనో కదా! ఈ సంఘటన ఇంతటితో ఆగివుంటే ప్రజలు దాన్ని గుర్తుంచుకునేవారు కాదు. కానీ, సరిగ్గా పులి మరణించిన ఏడవరోజున బాబా మహాసమాధి చెందారు. కనుకనే ఈ సంఘటన అందరి మనసుల్లో చెదరకుండా నిలిచిపోయింది”.

- శ్రీసాయిసచ్చరిత్ర 31వ అధ్యాయం.

బాబా మహాసమాధికి సరిగ్గా ఏడురోజుల ముందు బాబా మసీదు ముంగిట శ్రీసాయి సన్నిధిలో జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా 1969 నవంబర్ 12వ తేదీన ఓజార్ గ్రామానికి చెందిన శ్రీత్రయంబకరావుచే ద్వారకామాయిలో పులి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది.

సోర్సు: సాయిపథం ప్రథమ సంపుటం.

2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo