సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శాంతాబాయి జోషీ


1913 నుండి శాంతాబాయి తన తండ్రితో తరచూ శిరిడీ సందర్శిస్తుండేది. ఇక్కడ ఆమె శిరిడీ గురించి మరియు బాబా గురించి కొంత విలువైన అవగాహన ఇస్తుంది:

"నేను నా చిన్నతనంలో బాబాను చూశాను. చిన్నవయస్సు అయినప్పటికీ బాబా వేపచెట్టు క్రింద ఎలా కూర్చొనేవారో నాకు స్పష్టంగా గుర్తుంది. అప్పట్లో అక్కడ సిమెంటు అరుగు లేదుగానీ, ఒక విధమైన పిట్టగోడ వంటి నిర్మాణం మాత్రం ఉండేది. మధ్యాహ్నం పూట గ్రామానికి చెందిన పిల్లలతోపాటు నేను అక్కడ ఆడుకునేదాన్ని. ఆ చెట్టుకు పసుపురంగు  పండ్లు పుష్కలంగా ఉండేవి. అవి తియ్యగా, అతిమధురంగా ఉండేవి. పెద్ద మొత్తంలో ఆ పండ్లను సేకరించే ప్రయత్నంలో మేము బాబాపైకి ఎక్కేవాళ్ళము. కానీ క్షణకాలం పాటైనా ఆయన సమాధిస్థితి చెదిరేది కాదు. ఆయన ఎప్పుడూ మమ్మల్ని తిట్టలేదు, కొట్టలేదు. మేము పరిమితికి మించి ఆయనను ఇబ్బందిపెట్టినప్పుడు ఎండిన వేపచెట్టు కొమ్మను తీసుకొని మమ్మల్ని తరిమికొట్టడానికి పిట్టగోడ మీద కొట్టేవారు.

బాబా తరచుగా మమ్మల్ని ఆనందింపజేయడానికి పాటలు పాడేవారు. నేను ఇష్టపడిన ఒక ప్రత్యేకమైన పాట, 'వేపచెట్టు కొమ్మల మధ్య చంద్రుడు ఎలా దాక్కున్నాడో' అంటూ 'బయటకు వచ్చి, తన ముఖాన్ని మాకు చూపించమ'ని బాబా అడుగుతూ, చివరగా ఆయన చంద్రుడిని 'వెన్న, చక్కెరలో ముంచిన చపాతీలను మాకు ఇవ్వమ'ని అడుగుతున్నట్లుగా ఉంటుంది. నాతోపాటు ఆడుకున్న పిల్లలు చాలా పేదవారు. వారి తల్లిదండ్రులు రైతులు, వలస కార్మికులు, ఇంకా రోడ్లు వేసే కార్మికులు. తమ పిల్లలను బాబా వద్ద విడిచిపెట్టడం వాళ్లకు చాలా సౌకర్యంగా ఉండేది. బాబా తమ పిల్లలను చూసుకుంటారని, వారికి ఏ హానీ జరగదని, వాళ్ళు క్షేమంగా ఉంటారని వాళ్ళకి తెలుసు. విశ్వానికి ప్రభువైన బాబా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం, చీమిడి కారే మా ముక్కులను తుడవడం నిజంగా మా అదృష్టం.

మేము తరచుగా లెండీబాగ్‌లో ఆడుకునేవాళ్ళము. ఆ సమయంలో చాలా మేకలు, గొర్రెలు అక్కడ మేపబడుతుండేవి. మేము ఆ మేకలు వేసే పెంటికలను సేకరించి వాటితో గోళీలు ఆడేవాళ్ళము. లెండీబాగ్‌లో ఒక పెద్ద చింతచెట్టు ఉంది. దానికున్న చింతపళ్ళను తినడానికి పిల్లలందరం దానిపైకి రాళ్ళను విసిరేవాళ్ళము. నేను ఆ చింతపండు కోసం ఆశగా చెట్టుకింద నిలబడేదాన్ని. బాబా కూడా మాకు తరచూ సహాయం చేస్తుండేవారు.

బాబా చాలా సాధారణమైన జీవనాన్ని గడిపారు. ఆయన అవసరాలు చాలా తక్కువ. ఆయన పాదరక్షలు ధరించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ద్వారకామాయిలో చాలా కఫ్నీలు పేర్చబడి ఉన్నప్పటికీ ఆయన క్రొత్త కఫ్నీ ధరించేవారు కాదు. బాబా ఎప్పుడూ ఖరీదైన బట్టలు, నగల కోసం ఆరాటపడలేదు. ఇప్పుడు ఆయన సమాధిమందిరం బంగారంతో అలంకరించబడి ఉండటం నేను చూశాను. ఈ ప్రదర్శన ఆయన జీవించిన జీవితానికి చాలా విరుద్ధం. సంకల్ప మాత్రం చేత తన భక్తులకు ఇహపర సౌఖ్యాలను ప్రసాదించగల శ్రీసాయి తాను మాత్రం ఫకీరు జీవితాన్నే గడిపారు.

శాంతాబాయికి బాబాతో ఉన్న అంతర్గత జ్ఞాపకాలు:

శాంతాబాయి ఇలా చెబుతున్నారు: "సాయి భగవానుని నామం జపించడంలో నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పటికీ నేను బాబాను 'సాయినాథ్' అనే పిలుస్తాను, ఎందుకంటే ఆయన దిక్కులేనివారికి రక్షకుడు. ఆయనెప్పుడూ ప్రజలను తనవైపుకు ఆకర్షించుకోవడానికి అద్భుతాలుగానీ, మరేవిధమైన తంత్రముగానీ చేయలేదు. ఆయనను దర్శించిన తరువాత దుష్టుల జీవితాలు పరివర్తన చెందాయి. ఆయన అందరిపట్ల సమాన దృష్టి కలిగి ఉండేవారు. తమ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ తమ ద్వారకామాయిలోకి అనుమతి ఉండేది.

బాబా చాలా సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆయన వద్ద పట్టుతో తయారుచేసిన పాత మెత్తని బొంత ఉండేది. దానిపై జరీ (గోల్డెన్ ఎంబ్రాయిడరీ) కుట్టు ఉండేది. బాబా స్పర్శకి నోచుకున్న ఆ బొంత ఎంతో ధన్యతనొందింది. ఆయన దానినెన్నడూ విసిరిపారేయలేదు. ఆ బొంతకున్న ఆసక్తికరమైన లక్షణమేమిటంటే, బాబా అవసరాలకు అనుగుణంగా అది మార్పు చెందేది. అది నా కళ్ళతో నేను ఎన్నోసార్లు చూశాను.

శిరిడీలోని తప్పిపోయిన జంతువులకు ద్వారకామాయే ఆశ్రయం. బాబా తరచూ ఒక మేకపిల్లను తమ ఒడిలో ఉంచుకొని లాలించేవారు. అవసరమైతే తమ స్వహస్తాలతో దానికి నీళ్ళు త్రాగించేవారు. కుక్కలు, పిల్లులు ఆయన పాదాల చెంత ఆశ్రయం పొందేవి. ఆయనకు కుక్కలపట్ల ప్రత్యేక అభిమానం ఉండేది. అక్కడ తెల్లటిచారలున్న ఒక నల్ల ఆవు ఉండేది. అది, దాని దూడ ద్వారకామాయినే వాటి నివాసంగా చేసుకున్నాయి. బాబా ఆ ఆవుకు తినిపించి, దాని వెనుక భాగంలో ప్రేమతో నిమిరేవారు.నేను చూసిన మరో అద్భుత విషయం ఏమిటంటే, కొన్నిసార్లు బాబా చిలిం వెలిగించకుండా ఆ చిలిం గొట్టాన్ని తీసుకొని ఊదేవారు. అకస్మాత్తుగా చిలిం దానంతటదే వెలిగి, పొగ ఆకాశం వరకు ఎగసేది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తరువాత నేను శిరిడీ వెళ్ళినప్పుడు, మొదటిసారి నేను చూసిన సాయినాథ ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతున్నాను. జీవితాంతం నాతో ఉంటూ, నా ప్రతి అవసరాన్ని చూసుకుంటున్న ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను". 

రెఫ్: సాయి ప్రసాద్ పత్రిక; 1998 (దీపావళి సంచిక)
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ. 

1 comment:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo