సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 324వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఎప్పుడూ నా ఇంట, నా వెంట, నాకు జంటై ఉంటున్న బాబా
  2. మందిరానికి సమీపంలోనే ఇంటిని చూపారు బాబా

ఎప్పుడూ నా ఇంట, నా వెంట, నాకు జంటై ఉంటున్న బాబా

ఓం శ్రీ సాయిరామ్!

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు బాలాజీ. నేను పుట్టపర్తి నివాసిని. నాకు జరిగిన మరో అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2018వ సంవత్సరంలో నేను ఎం.బి.ఏ చదువుతున్నాను. మొదటి సెమిస్టర్ పూర్తిచేసి రెండవ సెమిస్టర్ పరీక్షలు వ్రాసే సమయం వచ్చింది. కానీ నాకు ఏమాత్రం చదవాలని లేదు. ఏదో విధంగా ఆ పరీక్షలు వ్రాసి, చదువు ఆపేద్దామని అనుకున్నాను. అయితే ఇంట్లోవాళ్ళు చదవమని అంటుండేవాళ్లు. ఏమి చేయాలో  తెలియని పరిస్థితి. తెల్లవారితే పరీక్షలు మొదలవుతున్నాయి. నేను అస్సలు ప్రిపేర్ కాలేదు. భయంతో గుండె దడదడలాడుతుంటే బాబా ఫోటో చూస్తూ ఉండిపోయాను. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలీదు. తెల్లవారుఝామున 5 గంటల సమయంలో నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను మా కాలేజీ యూనిఫామ్ వేసుకొని కాలేజీకి వెళ్తున్నాను. దారిలో నల్లని మబ్బులలో నుండి బాబా బయటకు రావడం నేను చూశాను. ఆయన నా ముందుకొచ్చి నిలబడ్డారు. అయితే బాబాకు నాకు మధ్య ఒక ముసలాయన నిలబడ్డాడు. నేను అతనితో, "నువ్వు ప్రక్కకు తప్పుకో, నేను బాబాని చూడాలి" అన్నాను. 'నేను తప్పుకోను' అన్నాడతను. మా ఇద్దరికి మధ్య గొడవ జరుగుతుంటే, బాబా అలానే చూస్తూ ఉన్నారు. ఇక నేను ఆగలేక ఆ ముసలాయనను ప్రక్కకు గట్టిగా తోశాను. అతను ప్రక్కనున్న గోడ వద్దకు వెళ్లి పడ్డాడు. నేను ఏమి మ్రొక్కుకుంటున్నానో తెలీదుగానీ బాబా పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. బాబా నావైపు చూస్తూ, “అరే, వాడిని ఎందుకురా అలా తోశావు? వాడు ఎవరనుకున్నావు? వాడు నా తమ్ముడు" అన్నారు. అంతలో నేను, "బాబా! మీరు చాలాసేపటి నుండి నిలబడే ఉన్నారు. కుర్చీలో కూర్చోండి బాబా" అని అంటూ కుర్చీ వేస్తున్నాను. అప్పుడు బాబా, “నీకు కాలేజీకి వెళ్లడం ఒక్కటే పని. కానీ నాకు చాలా పనులున్నాయి. నా భక్తులు నాకోసం ఎదురుచూస్తుంటారు. కాబట్టి  నేను కూర్చోనురా" అని తమ చేతిలో ఉన్న సంచిని నాకు ఇచ్చారు. ఆ సంచి నాకు ఇవ్వగానే అది స్కూలు బ్యాగులా మారిపోయింది. బాబా కూడా స్కూలు యూనిఫామ్ ధరించిన చిన్నపిల్లాడిలా మారిపోయారు. తరువాత ఆయన, "నన్ను అనుసరించు" అన్నారు. నేను ఆయనను అనుసరిస్తూ వెనకాల వెళుతూ ఉన్నాను. అంతలో నాకు మెలకువ వచ్చింది. ఆ కల ద్వారా బాబా నన్ను చదువుకోమని చెప్తున్నారని గ్రహించాను.

బాబా చెప్పినట్లే కాలేజీకి వెళ్లి పరీక్షలు వ్రాశాను. ఏ మాత్రం ప్రిపేర్ కాని నేను ఏం వ్రాశానో నాకే తెలీదు. కానీ తరువాత వచ్చిన ఫలితాల్లో నాకు 67% మార్కులు వచ్చి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. అంత అనుగ్రహం చూపించారు బాబా నాపై. ఇప్పుడు 'ఉద్యోగం చేయాలా, లేక ఇంకేమైనా చేయాలా' అని బాబాని ప్రార్థిస్తూ, ఆయన సమాధానం కోసం వేచి చూస్తున్నాను.

మరో ముఖ్య విషయం మీకు చెప్పాలి. ఆ కలలో కనిపించిన ముసలాయన నిజానికి ప్రతిరోజూ నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగేవాడు. ఆ కల వచ్చినప్పటి నుండి అతను మళ్ళీ కనిపించలేదు. ఇన్నాళ్లూ ఆ రూపంలో వచ్చింది నా బాబానే అని నాకు తెలియలేదు. "ఎప్పుడూ నా ఇంట, నా వెంట, నాకు జంటై ఉంటూ కాపాడుతున్న మీ గురించి ఎంత చెప్పినా, ఏమి చేసినా తక్కువే బాబా. మీకివే నా శతకోటి ప్రణామాలు".

బాబా అవకాశమిచ్చినప్పుడు మరికొన్ని అనుభూతులను మీతో పంచుకుంటాను.

జై సాయిరామ్!

మందిరానికి సమీపంలోనే ఇంటిని చూపారు బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! సాయి కుటుంబసభ్యులందరికీ నమస్కారం. నేను కొన్ని సంవత్సరాల క్రితం బాబా దర్బారులో చేరిన చిన్న భక్తురాలిని. బాబా కుటుంబంలో భాగం కావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతిదానికీ సాయినాథ మహారాజుకి నా ధన్యవాదాలు.

నేను కోల్‌కత్తాలో ఒక కంపెనీలో పనిచేస్తుండేదాన్ని. ఇటీవల బెంగళూరులో ఉన్న అలాంటి కంపెనీ నుండే నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది. సాయినాథుని దయవలన ఇంటర్వ్యూ, నియామక ప్రక్రియ సజావుగా జరిగింది. నేను పాత కంపెనీలో నోటీసు పీరియడ్‌లోకి వచ్చినప్పటి నుండి కోల్‌కత్తాలో ఉంటూనే బెంగళూరులో అద్దె ఇంటిని వెతకడం మొదలుపెట్టాను. నేను చాలా ఇళ్ళు చూసాను. కానీ ఆ ప్రాంతం ఎలాంటిదో తెలియకుండా ఇంటిని ఖరారు చేసుకోవడం ప్రమాదకరమని ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయాను. తరువాత నేను గూగుల్ మ్యాప్స్‌లో చూస్తున్నప్పుడు సాయిబాబా మందిరం ఉన్న ఒక ప్రాంతాన్ని చూశాను. దాంతో ఆ మందిరానికి సమీపంలో ఏదైనా ఇల్లు దొరుకుతుందేమోనని వెతికాను, కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను నా హృదయంలో ఉన్న బాబాను ఇలా ప్రార్థించాను: "బాబా! మీరే నాకు బెంగళూరులో ఉద్యోగం ఇచ్చారు. నేను బెంగళూరు చేరుకున్నాక ఇల్లు దొరకడంలో కూడా మీరే నాకు సహాయం చేస్తారు. మీరు ఏ ఇంటిని ఏర్పాటు చేసినా, ఆ ఇల్లు మీ మందిరానికి సమీపంలో ఉండాలి" అని. తరువాత నేను బెంగళూరు వెళ్ళాను. కంపెనీ నాకు రెండు వారాలపాటు గెస్ట్‌హౌస్ వసతి కల్పించింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ రెండు వారాలు చకచకా గడిచిపోతుండటంతో నేను భయపడసాగాను. కానీ మనసులో మాత్రం రెండు వారాలు ముగిసేలోపు బాబా నాకు ఇల్లు చూపిస్తారని పూర్తి నమ్మకం ఉండేది. నా నమ్మకమే నిజమైంది. బాబా నా కంపెనీకి దగ్గరలోనే ఒక ఇంటిని చూపించారు. కంపెనీ దగ్గరే కాబట్టి ఒకరోజు నేను నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్తున్నాను. అద్భుతం! దారిలో సద్గురు సాయినాథుని ఆలయం చూసి ఆనందాన్ని పట్టలేకపోయాను. నా ఇంటి నుండి కేవలం 7 నిమిషాల నడక దూరంలో ఆ ఆలయం ఉంది. "బాబా! నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు, నన్ను మీ భక్తురాలిగా ఎన్నుకున్నప్పటి నుండి నాకు రక్షణనిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు". జీవితంలో క్లిష్టదశలో ఉన్నవారికి, కఠినమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియనివారికి నా హృదయపూర్వక ప్రార్థన ఒకటే - సాయిని ప్రార్థించి, మీ భారాలన్నీ ఆయన పాదాల వద్ద వదిలివేయండి. ఆయనపై దృఢమైన విశ్వాసం ఉంచండి. సాయి మిమ్మల్ని తప్పక కాపాడుతారు.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2545.html


3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo