సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 312వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా నుండి పొందిన షరతులు లేని ప్రేమ

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

నేను ఒక గృహిణిని. ప్రస్తుతం USA లో నివసిస్తున్నాను. నాకు 15 ఏళ్ళ వయస్సున్నప్పుడు బాబాపట్ల భక్తి ప్రేమలు చిన్న విత్తనంలా నాటుకున్నాయి.  నా జీవితమంతా ఆయన నా ప్రక్కనే నిలబడి ఉన్నారు.  ఆయనకు కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో నాకు తెలియడం లేదు. "బాబా! మీరు నాకు ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. బహుశా ఇది మీ సంకల్పమే అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు దొర్లితే దయచేసి నన్ను క్షమించండి". ఓం సాయిరామ్!

బాబాపట్ల నా భక్తి షరతులు లేనిది. సంవత్సరం క్రితం నేను న్యూజెర్సీ నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళాను. అక్కడకు వెళ్ళాక తరచూ బాబా మందిరానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అందుకు నా బిజీ షెడ్యూల్, నాకున్న పనులు మొదలైనవన్నీ వెర్రి కారణాలే. మునుపటిలా బాబాపట్ల శ్రద్ధ చూపడం లేదని నాకనిపించేది. ఆ అపరాధభావన రానురానూ మరింత వృద్ధి చెంది అభద్రతాభావన చోటుచేసుకుంది. ఆ సమయంలో నాలో నేను, “బాబా! మీ చుట్టూ నిజమైన ప్రేమ, నిజాయతీ గల భక్తులు లక్షలాదిమంది ఉన్నారు. కానీ నేను మునుపటిలా మిమ్మల్ని ప్రేమించడం లేదు, ప్రార్థించడం లేదు. కొన్ని సంవత్సరాలుగా నేను ఎటువంటి పారాయణ చేయలేదు. నేను ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ 'బాబా! దయచేసి నన్ను ఈ పరిస్థితి నుండి బయటపడేయండి' అని మిమ్మల్ని విసిగిస్తున్నాను. ప్రేమతో మీ చేతిని అందించి నన్ను ఆ పరిస్థితుల నుండి బయటపడేసారు. స్వార్థపరురాలైన ఈ అమ్మాయి కోసం మీరు చాలా చేసారు. అలాంటిది ఇప్పుడు నేను మీ గురించి ఆలోచించకుండా రిలాక్స్ అయిపోయాను. మీకు తప్పుగా అనిపించడం లేదా?” అని అనుకున్నాను. నేను ఆశ్చర్యపోయేలా అదేరోజు నా పాతస్నేహితుని నుండి "నీకు మహాపారాయణ గ్రూపులో చేరడం ఇష్టమేనా?" అని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. బాబా ఇప్పటికీ నన్ను తన బిడ్డలా చూసుకుంటున్నారని చాలా సంతోషంగా అనిపించి వెంటనే నేను ఆ గ్రూపులో చేరాను. ఆ గ్రూపు అడ్మిన్ నన్ను స్వాగతిస్తూ 'ఈ గ్రూపులోని ప్రతి ఒక్కరినీ మహాపారాయణ చేసేందుకు బాబానే స్వయంగా ఎంపిక చేసుకుంటున్నార'ని సందేశం పంపారు. ఎప్పటిలాగే బాబా నా మాట వింటున్నారని, ఆయన ప్రేమలో ఎటువంటి తేడా లేదని ఆ సందేశంతో నాకర్థమై ఆనందంలో మునిగిపోయాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" నాలాంటి చాలామందికి మళ్ళీ భక్తి, ప్రేమలను ప్రేరేపిస్తున్న మహాపారాయణ నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు.

ఇక్కడ US లో మందిరానికి వెళ్ళాలంటే ఒకరిపై ఆధారపడాల్సి ఉండటంతో నేను గత రెండు సంవత్సరాలలో చాలా కొద్దిసార్లే బాబా మందిరానికి వెళ్ళాను. అయితే నేను పారాయణ మొదలుపెట్టాక శనివారం ఉండే మా అబ్బాయి మ్యాథ్స్ ట్యూషన్ తల్లిదండ్రుల అభ్యర్థనపై గురువారం సాయంత్రానికి మార్చబడింది. తను ట్యూషన్లో ఉండే సమయంలో నేనిప్పుడు బాబా మందిరానికి వెళ్ళగలుగుతున్నాను. నేను మహాపారాయణ ప్రారంభించి రెండు నెలలే అయ్యింది. ఈ రెండు నెలలలో నేను చాలాసార్లు బాబా మందిరానికి వెళ్ళాను. ప్రతి సంవత్సరం రామనవమి సందర్భంగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో సీతారామకళ్యాణం చేసేవాళ్ళము. ఈ సంవత్సరం బాబా మమ్మల్ని తన మందిరానికి రప్పించుకొని, ఆయన సమక్షంలో జరిగే సీతారామకళ్యాణంలో భాగస్వాములయ్యేలా మమ్మల్ని ఆశీర్వదించారు. బాబా కురిపిస్తున్న ఆశీస్సులతో నేను తన్మయత్వంతో మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి చెందుతున్నాను. "లవ్ యు బాబా!" ఇక నేను నా గతంలోని అనుభవాలలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను....

కాలేజీ రోజుల్లో బాబా పరిచయం:-

1999లో కళాశాల రోజుల నుండి బాబాపట్ల భక్తి, ప్రేమలు నాటుకున్నాయి. నేను తరచూ బాబా మందిరానికి వెళ్తూ పెద్దవాళ్ళ ద్వారా భక్తుల అనుభవాలు వింటూ ఉండేదాన్ని. ఒకరోజు బాబా నాకు కలలో ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన సాయిలీలామృతం చదవమని చెప్తున్నట్లు కనిపించింది. ఆ పుస్తకం ఎక్కడ సంపాదించాలో  తెలియక నేను దాన్ని తీవ్రంగా ఆలోచించలేదు. ఒక సంవత్సరం తరువాత అప్పటి మా కళాశాల ప్రిన్సిపాల్ మరొక ప్రదేశానికి వెళుతున్నారని, కొత్త ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరించబోతున్నారని ప్రకటన వచ్చింది. అందరూ కొత్త ప్రిన్సిపాల్ రాక గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆ స్థానంలో బాబానే వస్తున్నారని నా మనసుకు దృఢంగా అనిపించింది. మరుసటి వారంలో బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్ శ్రీసాయినాథ మహారాజు లాగా నాకు కనిపించడంతో నేను ఆశ్చర్యపోయాను. ఆయన తెల్లని గడ్డంతో ఎంతో దయగలవ్యక్తిలా చూడటానికి బాబాలాగే కనిపించారు. 'ఆయన ఒక సామాన్య మానవుడిలా ఎలా వచ్చారా?' అని నేను ఆశ్చర్యపోయాను.

అదేరోజు బాబా ఫోటో ఉన్న నా కీచైన్ పోగొట్టుకున్నాను. నేను బాధపడుతూ, దాదాపు కన్నీళ్లు పెట్టుకుంటూ దానికోసం వెతుకుతున్నాను. అకస్మాత్తుగా ప్రిన్సిపాల్ నా దగ్గరకు ఎలా వచ్చారో తెలియదుగాని ఆయన నాతో, ”నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? నేను ఇక్కడ ఉన్నాను, కళ్ళు తెరిచి చూడు!” అని అన్నారు. అలా ఎందుకు ఆయన అన్నారో నాకు అర్థం కాలేదుగాని 'ఆయన నా బాబానే!' అని నా మనస్సులో స్థిరపడి ఆయనపట్ల నాకు భక్తి, గౌరవాలు ఏర్పడ్డాయి.

మరుసటిరోజు నేను కళాశాలలోని లైబ్రరీకి వెళ్లగా, అక్కడ సాయిలీలామృతం పుస్తకం దొరికింది. నేను ఆ పుస్తకాన్ని అడిగితే లైబ్రేరియన్, "ఇది ప్రిన్సిపాల్ గారిది" అని అన్నాడు. నేను "ఆ పుస్తకాన్ని ఒక వారంలో తిరిగి ఇచ్చేస్తాన"ని అతనిని అభ్యర్థించి పుస్తకం తీసుకున్నాను. ఆ వారం రోజులు నేను చాలా బిజీ. పుస్తకాన్ని వారంలో పూర్తి చేయగలనో లేదోనని క్లాస్ జరుగుతున్న సమయంలో బ్యాక్ బెంచి మీద కూర్చుని పుస్తకాన్ని రహస్యంగా బెంచి కింద దాచిపెట్టి చదువుతుండేదాన్ని. అప్పుడొకరోజు ఎప్పుడూ క్లాస్ రూమ్ లోకి రాని ప్రిన్సిపాల్ హఠాత్తుగా లోపలికి వచ్చి, నా పేరుపెట్టి పిలిచారు. నేను లేచి నిలబడ్డాను. ఆయన, “నీకు అర్థమైందా? నువ్వు చదువుతున్నదాన్ని ఆచరణలో పెట్టగలవా?" అని అడిగారు. నేను ఆశ్చర్యపోతూ ఆయనకి నమస్కరించాను. మొత్తం క్లాసులో ఉన్నవాళ్ళంతా, "ఏమి జరుగుతోంది? నన్నెందుకు అలా అడుగుతున్నారు? కొద్దికాలంలోనే మా ఇద్దరికీ అంత ఆప్యాయత ఎలా ఏర్పడింది?" అని ఆశ్చర్యపోతున్నారు. ఏమి జరుగుతోందో నేను మాత్రమే అర్థం చేసుకోగలిగాను.

ఆ సాయంత్రం అనుకోకుండా కొంతమంది ఉన్నతాధికారులు మా కళాశాలను సందర్శించారు. వారు విద్యార్థుల సామర్థ్యాన్ని పరిక్షించడం మొదలుపెట్టారు. 500 మంది విద్యార్థులలో వాళ్ళు ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో నేను ఒకదాన్ని. వాళ్ళు 'పాండవులలో అర్జునుడు గొప్పవాడా?' అనే టాపిక్ ఇచ్చి, దాని గురించి మాట్లాడమన్నారు. నేను అనుమతి కోసం ప్రిన్సిపాల్ గారి కళ్ళలోకి చూసాను. ఆయన ఆహ్లాదకరమైన ఒక చిరునవ్వుతో తలవూపారు. బాబా సంకేతంతో, నేను చాలా బాగా మాట్లాడాను. అందుకుగాను వాళ్ళు మా ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కొంత నగదును, భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇప్పించారు. ఆయన అవి నాకిస్తూ నా తలపై చేయి ఉంచారు. ఆ క్షణాన నా వైఖరిలోని అహం జాడలు పోయాయి. కాలేజీ చదువు పూర్తవుతూనే నేను ఉద్యోగంలో చేరాను. అయితే ఆయనిచ్చిన 108 రూపాయల నగదు బహుమతి ఆరోజుల్లో నాకు చాలా విలువైనది. చాలా సంవత్సరాలపాటు నేను ఆ నగదును బాబా ఫోటో వెనుక దాచిపెట్టుకున్నాను. తరువాత ఆ డబ్బు నాది కాదని, బాబాదేనని గ్రహించి ఆ డబ్బు తీసుకుని వెళ్లి బాబా హుండీలో వేసాను. ఆరోజునుండి  డబ్బు కోసం నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు.

నేను కళాశాల వదిలి నేటికి 17 సంవత్సరాలయింది. మహాపారాయణలో చేరిన తరువాత ఫేస్‌బుక్ ద్వారా మా ప్రిన్సిపాల్ (70 ఏళ్లు పైబడిన వారు) "నువ్వు ఎలా ఉన్నావు?" అని అడిగారు. ఇలా నాకు చాలా అనుభవాలున్నాయి. ఇవి బాబాపట్ల నా భక్తిని బలపరుస్తున్నాయి.

రేపటి భాగంలో నా అనుభవాలు మరికొన్ని  పంచుకుంటాను ....


3 comments:

  1. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME
    MAA AMMAKI EMI SAMADHANAM CHEAPPALO THELIYATAM LEDU
    NAA GURINCHI THAPPUGA ANUKUNTUNDI EMO SAINATH
    PLS. HELP ME SAIRAM

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo