సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు ఎం.జి. ప్రధాన్


సాయిభక్తుడు శ్రీ ఎం.జి. ప్రధాన్ ముంబైలోని శాండ్రస్ట్ రోడ్డుకు సమీపంలో ఉన్న చాల్ ప్రాంతంలో వెంకటేశ్వర ప్రెస్ వద్ద నివాసముండేవాడు. అతడు కలెక్టరు కార్యాలయంలో రెవెన్యూ శాఖలో గుమస్తాగా పనిచేశాడు. ఒకప్పుడు అతని ఏడేళ్ల కొడుకు దత్తాత్రేయ అకస్మాత్తుగా చనిపోవడంతో అతడు దిగులుతో చాలా కృంగిపోయాడు. ఆ స్థితిలో అప్పటికే సాయిబాబా గురించి విని ఉన్న అతనికి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని అనిపించింది. తరువాత ఒకరోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. కలలో ఐదుగురు సాధువులు కూర్చొని ఉండటం చూశాడు. వాళ్లను అతడు, "మీలో సాయిబాబా ఎవరు?" అని అడిగాడు. వాళ్ళు ఒక సాధువును చూపించి, "ఆయనే సాయిబాబా!" అని చెప్పారు. అంతటితో ఆ కల ముగిసింది. తరువాత తన శిరిడీ పర్యటనకు అవసరమైన సెలవు మంజూరు కావడం, తగిన నిధులు చేకూరడం వంటివి మొదటిసారి అతనికి సాయిబాబాపై నమ్మకం కలగడానికి దోహదమయ్యాయి. ఇక అతడు జంజీరాలో ఉన్న తన సొంత తోటలలోని సీతాఫలాలు, రామాఫలాలు తీసుకొని శిరిడీకి ప్రయాణమయ్యాడు. అతడు ద్వారకామాయిలో సాయిబాబాను దర్శించుకొని, తనతో తీసుకువెళ్లిన ఫలాలను వారికి సమర్పించి, వారి ముందు కూర్చున్నాడు. సాయిబాబా అచ్చం కలలో తాను చూసిన సాధువులానే కనిపించడంతో అతడు ఆశ్చర్యపోయాడు. అంతలో సాయిబాబా అతనిని చాలా చెడ్డగా తిడుతూ, "ఎందుకీ తెలివితక్కువవాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవడమంటే భూమిలో కలిసిపోవడమే! శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే! దానికి దుఃఖించడం ఎందుకు?" అని అన్నారు. తర్వాత అతని వైపు చూస్తూ, "నీ రామాఫలాలను అంతటా వెదజల్లు!" అన్నారు. బాబా అన్న మాటలను 'సంపాదించిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టు' అని అతను అర్థం చేసుకున్నాడు. తరువాత బాబా అక్కడున్న భక్తులతో ప్రధాన్ ఇళ్ళు, తోటల గురించి చెప్తూ ఆ తోటలోని  సీతాఫలాల చెట్లు, రామాఫలాల చెట్లు, ఇంకా ఇతర చెట్ల గురించి ఖచ్చితమైన సంఖ్యతో సహా వర్ణించారు. ఆయన అంత ఖచ్చితంగా వర్ణిస్తుంటే, ఆయన తన ప్రక్కనే ఉంటూ వాటిని తరచూ చూస్తున్నట్లుగా అతనికి అనిపించింది. అంతేకాదు, అతని కొడుకు పదిహేను రోజుల క్రితం చనిపోయాడని, దానికోసం అతడు వృధాగా విలపిస్తున్నాడని కూడా బాబా భక్తులకు చెప్పారు. ఆ విధంగా బాబా అతని దుఃఖాన్ని తొలగిస్తూనే, అతని గురించేకాక తమను దర్శించే ప్రతి వ్యక్తి గురించి తమకు క్షుణ్ణంగా తెలుసునని తెలియజేయడం ద్వారా వారిపై అతనికున్న భక్తివిశ్వాసాలను దృఢపరిచారు. అతడు నాలుగు రోజులు శిరిడీలో ఉన్నాడు. ఆ నాలుగు రోజుల్లో అతడు గమనించిన దాని గురించి ఇలా చెప్పాడు: "బాబా ఏదీ పట్టనట్లు ఉదాసీనంగా ఉంటూ చాలా తక్కువగా మాట్లాడేవారు. ఆయన సదా అంతర్ముఖులై ఉండి, నిశ్చలంగా మత్తులో ఉన్నవానివలె లేదా పిచ్చివానివలె కనిపించేవారు. ఆయన దర్శనానికి చాలామంది వచ్చారు. ఆయన వారిలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన విషయాలను ఉన్నది ఉన్నట్లు చెప్పారు. దీనినిబట్టి బాబాకు సర్వమూ తెలుసునని, వారివద్ద ఏదీ దాచలేమని స్పష్టమవుతుంది".

బాబా సమాధి చెందిన చాలా సంవత్సరాల తరువాత జరిగిన ఒక అపూర్వ సంఘటన గురించి తప్పక చెప్పి తీరాలి. 1932లో ప్రధాన్ చిన్నకొడుకుకి తీవ్రంగా జ్వరం వచ్చింది. పిల్లవాడు మూడు, నాలుగురోజులు జ్వరంతో బాధపడ్డాక, పరిస్థితి మరింత దిగజారి నాడి అందలేదు. ప్రధాన్ పరుగున తన మిత్రుడైన వైద్యుని వద్దకు వెళ్లి, అతనిని తీసుకొచ్చాడు. వైద్యుడు నాడి పరీక్షించి, "పిల్లవాడు అప్పటికే చనిపోయాడ"ని చెప్పాడు. అది విని రోదిస్తున్న ప్రధాన్ భార్యను ఓదార్చడం మొదలుపెట్టాడు వైద్యుడు. అయితే పిల్లవాడు మరణించాడంటే ప్రధాన్ నమ్మలేకపోయాడు. వెంటనే అతడు కొంచెం బాబా ఊదీ తీసుకొని పిల్లవాడి ముఖంపై పూశాడు. తరువాత పిల్లవాడి దగ్గర ఒక సాయిబాబా ఫోటో ఉంచి, ఆర్తిగా బాబాను ప్రార్థించసాగాడు. అది చూసిన వైద్యుడు, 'ఇదంతా మీ వెర్రితనం' అని అన్నాడు. అందుకు ప్రధాన్, "సాయిబాబా భగవంతుడు. వారు నా బిడ్డని ఖచ్చితంగా బ్రతికిస్తారు" అని బదులిచ్చాడు. తరువాత 45 నిమిషాలు గడిచేసరికి పిల్లవాడు ఆశ్చర్యకరంగా తిరిగి స్పృహలోకి వచ్చాడు. తరువాత మంచం మీద నుండి లేచి ఆడుకోవడం ప్రారంభించాడు. ఈ సంఘటన తరువాత ప్రధాన్‌కి సాయిబాబాపై విశ్వాసం ఇంకా ఇంకా దృఢపడింది. అది అతని ప్రాపంచిక, ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదం చేసింది. ఈ సంఘటన తరువాత అతడు 1935 వరకు శిరిడీ వెళ్ళలేదు. కానీ అతనికి ఏ కష్టం వచ్చినా భక్తి విశ్వాసాలతో బాబాను ప్రార్థించేవాడు. బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి సహాయం చేస్తుండేవారు.

సమాప్తం.

(Ref: Sai Sagar Magazine; 2009; Deepavali issue)
A Divine Journey with Baba – compiled by Vinny Chitluri, Sterlings.

8 comments:

  1. that leela i liked very much.sai baba saved that boy.he gave his rebirth. that is sais power.

    ReplyDelete
  2. Sadhguru sainatha namo namaha 🙏🙏🙏

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Jai sadguru sai maharaj ki jai
    Im Sai Ram🙏🙏🙏

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo