సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 240వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. శ్రీసాయి చేసేది మన మేలుకోసమే
  2. ఆనందం దక్కదనుకున్న సమయాన బాబా నాపై కురిపించిన ఆశీస్సులు

శ్రీసాయి చేసేది మన మేలుకోసమే

సింగపూర్‌ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబా భక్తురాలిని. నేను భక్తుల అనుభవాలను చాలా ఆసక్తిగా చదువుతాను. అవి జీవితంపై ఆశను, ధైర్యాన్ని ఇస్తాయి. ఇక నా అనుభవానికి వస్తే..

నేను చదువుకునే రోజులనుండి ఒక పత్రికను నిర్వహిస్తున్నాను. అయితే బహుశా ఇదే మొదటిసారి, నేను నా ఆలోచనలను ఒక పబ్లిక్ ఫోరమ్‌లో వ్రాస్తున్నాను. నేను మొదటినుండి మతపరమైన వ్యక్తిని కాబట్టి కాలేజీరోజుల్లో వారానికి ఒకసారి నేను మందిరాన్ని దర్శిస్తుండేదాన్ని. అది ఏ సంవత్సరం, ఏ రోజు అన్నది నాకు గుర్తులేదు కానీ, ఒకరోజు నేను మందిరానికి వెళ్ళినప్పుడు మందిరం మూసివుంది. సమీపంలో ఉన్న సాయిబాబా మందిరం తెరచివుండటం చూసి మొదటిసారి నేను ఆయన ఆశీస్సుల కోసం మందిరం లోపలికి వెళ్ళాను. తెల్లని పాలరాతి విగ్రహరూపంలో చాలా ఆకర్షణీయంగా బాబా, శుభ్రమైన ప్రాంగణం, నిశ్శబ్దమైన వాతావరణంతో చాలా అద్భుతంగా ఉంది. బాబాను చూస్తూ నిలబడివున్న నాలో ఎటువంటి భావోద్వేగాలు లేవు. మనస్సు చాలా ప్రశాంతంగా అయిపోయింది. మధురమైన అనుభూతి. కాలం గడిచిపోయింది, నేను ఆ అనుభవాన్ని మరచిపోయాను. దశాబ్దాల తరువాత నేను ఆ అనుభవాన్ని వ్రాస్తుంటే, 'ఇంతకాలంగా నేనెలా అర్థం చేసుకోలేకపోయాన'ని ఆలోచిస్తున్నాను. మార్గాలన్నీ మూసివేసిన సమయంలో బాబా నా రక్షకుడిగా, మార్గదర్శకుడిగా నా జీవితంలోకి ప్రవేశించారని నాకిప్పుడు అర్థమవుతోంది. నాకప్పుడు అర్థం కాకపోయినా ఈరోజు నేను ప్రతిదానికీ ఆయనపై ఆధారపడుతున్నాను. అయితే ప్రతి సంబంధంలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. ఒకానొక సమయంలో నేను బాబాను అనుమానించాను. ఆయన నాకు గొప్ప పాఠం నేర్పారు.

చాలాకాలం క్రితం నా కుటుంబసభ్యులలో ఒకరు ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తనకి చాలా సమస్యలు ఎదురయ్యాయి. పుట్టబోయే బిడ్డకు రక్షణనివ్వమని నేను రాత్రి పగలు తేడా లేకుండా ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. ఆయన బిడ్డను 100% కాపాడుతారని నేను నమ్మకంగా ఉండేదాన్ని. అయితే తను ఆ బిడ్డను కోల్పోయింది. దానితో నేను బాబా ముందు నిలబడి నమస్కరించడం కూడా మానేశాను. ఆ సంఘటనకు ముందు కూడా మాకు కొన్ని వరుస దురదృష్ట సంఘటనలున్నాయి. నా మనసులో చాలా సందేహాలు, అపోహలు చోటుచేసుకుని ప్రతికూల భావాలు నా మనస్సులో నిండిపోయాయి. ఇదిలా ఉంటే, కొంతకాలానికి మా కుటుంబసభ్యురాలు మళ్ళీ గర్భందాల్చి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. మనం తార్కికంగా ఆలోచిస్తామని అనుకుంటాము, కానీ బాబా మనకన్నా ఎక్కువ తార్కికంగా ఆలోచించి ప్రతి విషయాన్నీ నడిపిస్తారు. కడుపులో బిడ్డ పిండంగా ఉన్నప్పుడే కోల్పోవడం నిజంగా బాబా మాపై కురిపించిన ఆశీర్వాదం. ఎందుకంటే, ఆ బిడ్డ ఆరోగ్యంగా లేదు. ఆ బిడ్డ జన్మించివుంటే జీవితాంతం బాధపడేది. జీవితకాలం మేము దుఃఖాన్ని అనుభవించకుండా ఆయన మమ్మల్ని రక్షించారు. ఇప్పుడు ఈ బిడ్డ జననంతో అంతా మారిపోయింది. అదంతా ఆయన లీల. ఆ లీల నా జీవితాన్ని మలుపు తిప్పింది. నేను బాబాకు చాలా దగ్గరయ్యాను.

ఆయన నా జీవితంలో చేసిన సహాయాలకు లెక్కలేదు. నేనెన్ని తప్పులు చేసినా ఆయన వాటిని సరిచేసి సాధారణ స్థితికి తెచ్చి సరైన దారిలో పెట్టిన రీతి నమ్మశక్యం కానిది. "బాబా! నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తూ మీ ఆశీస్సులను కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. శ్రద్ధ, సబూరీలతో నేను మిమ్మల్ని ఆశ్రయించుకుని ఉన్నాను. దయచేసి మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఇవ్వండి".

ఆనందం దక్కదనుకున్న సమయాన బాబా నాపై కురిపించిన ఆశీస్సులు

సాయిభక్తురాలు జయశ్రీ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! నా పేరు జయశ్రీ. సాయిబాబా నాపై కురిపించిన ఆశీస్సులను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్నకూతురికి సరైన సంబంధం దొరకకపోవడం, నా పెద్దకూతురికి వీసా రాకపోవడం వంటి సమస్యల వల్ల నేను చాలా నిరాశకు గురయ్యాను. నేను నామజపం, పారాయణ చేస్తున్నప్పటికీ రోజురోజుకూ సమస్య భారంగా తయారయింది. కాబట్టి శివరాత్రి ఉదయం జపం చేశాక మహాపారాయణ ఆపుచేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, నా కుటుంబంలో మంచి విషయాలు జరిగేలా నేను ఎప్పటికీ ఆశీస్సులు పొందలేను అనుకున్నాను. నేను బాధతో, "బాబా! మీకు నచ్చినట్లు చేయండి. మీరు నా కుటుంబాన్ని ఆశీర్వదించలేరని నాకు తెలుసు. మీరు మా జీవితాలను ఆనందంగా మార్చలేరు. అది మా కర్మ” అని బాబాతో చెప్పుకున్నాను. అదేరోజు రాత్రి బాబా తన అద్భుతాన్ని చూపించారు. నా పెద్దకూతురికి వీసా వచ్చింది, చిన్నకూతురికి తన సహోద్యోగి 'తనని ఇష్టపడుతున్నట్లు, వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు' ప్రతిపాదన తీసుకొచ్చాడు. బాబా ఆశీస్సులతో రెండు సమస్యలు పరిష్కారమయ్యాయి. నేను ఇంటికి వచ్చి ముందుగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, తరువాత మమ్మల్ని ఆశీర్వదించట్లేదని నిరాశ చెందినందుకు క్షమాపణలు కూడా చెప్పుకున్నాను. బాబా ఇచ్చిన ఈ గొప్ప అనుభవంతో 'నా చివరి శ్వాస వరకు పారాయణ చేస్తాను' అని నిర్ణయించుకున్నాను.

ఓం సాయిరామ్!

జయశ్రీ. 


4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo