సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 237వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సద్గురువుపై అచంచల విశ్వాసం - సమస్యకు చూపును పరిష్కారం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

అందరికీ ఓం సాయిరాం!

2009 నుండి నేను సాయిబాబా భక్తురాలిని. పరిస్థితులు ఎలాంటివైనా బాబా తమ భక్తులకు సదా అండగా ఉంటారు. నా జీవితం చక్కబడితే నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను ఈ అనుభవాన్ని వ్రాస్తున్నానంటే అందుకు సాయిబాబా ఆశీస్సులే కారణం.

2017 నవంబరులో నేను భరించలేని బాధను అనుభవించాను. నా జీవితంలో నేనెప్పుడూ అంతటి బాధను అనుభవించలేదు. హఠాత్తుగా ఒక గురువారంనాడు నా భర్త, అతని సిస్టర్స్ కలిసి నన్ను, ఏడాది వయసున్న నా బిడ్డను నిష్కారణంగా నా పుట్టింట విడిచిపెట్టారు. నన్ను వాళ్ళతో తీసుకెళ్లమని మా నాన్న వాళ్ళని ఎంతగానో అభ్యర్థించారు. కానీ మితిమీరిన అహంకారంతో వాళ్ళు మా మాటలు ఏమీ వినకుండా వెళ్లిపోయారు. సమయం గడుస్తోంది, నేను నా బిడ్డతో పుట్టింట్లో ఉన్నాను. చుట్టూ ఉన్న సమాజంలోని ప్రజలు, "ఏమి జరిగింది? మీ అల్లుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు?" అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక నేను, నా తల్లిదండ్రులు ఎంతో వేదనను అనుభవించాము.

సాయిబాబా భక్తురాలినైన నేను వివాహమయ్యాక ఆయనను మరచిపోయాను. బహుశా కొత్తగా జీవితంలో వచ్చిన మార్పు కారణం కావచ్చు. మెల్లగా నా వైవాహిక జీవితంలో చాలా సమస్యలు చోటుచేసుకున్నాయి. చివరికి గురువారంనాడే నా భర్త నన్ను నా ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సాయి ఆశీస్సులవలనే నా జీవితంలో ప్రతిదీ లభించింది. అసలు సాయిలేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. అలాంటిది ఆయననే మరచిపోయాను. ఎంతో పెద్ద తప్పు జరిగింది. అందుకే నాకీ దుస్థితి ఏర్పడిందని గ్రహించాను. నేను నా సద్గురువు నుండి చాలా దూరం వెళ్ళి పొరపాటు చేశానని అర్థం చేసుకుని ఎంతో బాధపడ్డాను. 'ఆయనను ఎందుకు మర్చిపోయాన'ని నేను ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ప్రేమమూర్తి అయిన నా సద్గురువు ఈ బిడ్డ వ్యధ చూడలేక కరిగిపోయారు, నా చేతిని మళ్ళీ పట్టుకున్నారు. నిదానంగా నేను ఆయనతో పూర్తిగా అనుసంధానమయ్యాను. నా జీవితం మళ్ళీ ఆయన పర్యవేక్షణలోకి వచ్చింది. నేను నా సమస్య గురించి ప్రశ్నలు - సమాధానాల వెబ్‌సైటులో బాబాను అడుగుతుండేదాన్ని. బాబా నుండి సానుకూలమైన సమాధానాలు వస్తుండేవి. తదనుగుణంగా పరిస్థితులు మెరుగుపడటం కూడా ప్రారంభించాయి. నేను పూర్తిగా బాబానే నమ్ముకున్నాను. అందువలన నేనుగాని, నా తల్లిదండ్రులుగాని నా భర్తను, అత్తమామలను అస్సలు సంప్రదించలేదు. ఎందుకంటే నా తప్పు ఏమీలేదని వాళ్ళకి కూడా తెలుసు. ఒక నెల తరువాత నా అత్తమామలు మమ్మల్ని సంప్రదించడం ప్రారంభించారు. వాళ్ళు నన్ను నా భర్త ఇంట్లో దించమని నా తండ్రిని కోరారు. కానీ నేను నా తండ్రితో, "బాబా నుండి నాకు, "ఎవరూ తక్కువ కాదు. పని సహజంగా పూర్తి అవుతుంది" అని సందేశం వచ్చింది. కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళడానికి ఖచ్చితంగా వాళ్లే వస్తారు" అని చెప్పి అక్కడికి వెళ్ళడానికి తిరస్కరించాను. దాంతో నా తండ్రి నా అత్తమామలను సంప్రదించలేదు. నాలుగురోజుల తరువాత మళ్ళీ నా అత్తమామలు నా తండ్రిని సంప్రదించి అదే మాట చెప్పారు. ఈసారి మా నాన్న వాళ్ళనే స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించుకోమని చెప్పారు.

2018, జనవరిలో భోగి పండుగ సందర్భంగా మళ్ళీ నా అత్తమామలు నా తండ్రికి ఫోన్ చేసి, "మా కోడలు, మనవడితో భోగి పండుగ జరుపుకోవాలని ఎదురుచూస్తున్నామ"ని చెప్పారు. వాళ్లతో మా నాన్న శాంతంగా, "ఎటువంటి తప్పూ లేకుండా మీరు నా కూతురిని, మనవడిని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. మీరు ఎప్పుడైనా వచ్చి వాళ్ళని మీతో తీసుకెళ్లవచ్చు" అని సమాధానం చెప్పారు. సమయం గడుస్తూ ఉంది. నాకు నా బాబాపై అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. నేను బాబాని అడిగినప్పుడల్లా నాకు సానుకూల సమాధానం వచ్చేది. సుమారు రెండు నెలలు గడిచాక నా అత్తమామలు నా తండ్రికి, నాకు ఫోన్ చేసి, "మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తున్నాం, సిద్ధంగా ఉండండి. నీ భర్తకు కొంత పనిభారం ఉన్నందున తను రావడం లేదు" అని చెప్పారు. నా భర్త కాస్త మొండివాడు కాబట్టి తను రావడానికి సంకోచిస్తాడని నాకు తెలుసు. నాన్న సరేనని అంగీకరించారు. చివరికి నన్ను పూర్తి గౌరవంతో తిరిగి తీసుకెళ్లడానికి నా అత్తమామలు వచ్చారు. ఇదంతా నా బాబా వల్ల మాత్రమే జరిగింది. లేకపోతే నా వైవాహిక జీవితం పరిస్థితులకు అనుగుణంగా ముగిసిపోయేది. "ఐ లవ్ యు సాయిబాబా!" తరువాత బాబా ఆశీస్సులతో నేను మళ్ళీ మగబిడ్డకు తల్లినయ్యాను. "ధన్యవాదాలు బాబా! నా జీవితంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు, అవి కూడా మీ ఆశీస్సులతో సమసిపోతాయని నాకు తెలుసు. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో నేను ఆలస్యం చేసినందుకు, ఏదైనా రాయడం మర్చిపోయివుంటే అందుకు దయచేసి నన్ను క్షమించండి బాబా. మీరే నా సర్వస్వం. దయచేసి ఎప్పుడూ నాతో ఉండండి". 

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై! 

2 comments:

  1. Anantakoti brahmandanayaka rajadiraja Yogi raja Sri sachchidananda sadguru sainathmaharajuki jai

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo