సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 222వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి అనుగ్రహంతో వచ్చిన ప్రమోషన్
  2. నాకు ఉద్యోగం ఇవ్వడానికి బాబా అద్భుతం చేశారు

సాయి అనుగ్రహంతో వచ్చిన ప్రమోషన్

విజయవాడ నుండి ఒక సాయిభక్తురాలు ఇటీవల తమకు బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నేను సాయిబాబా భక్తురాలిని. మావారు స్కూలులో టీచరుగా పనిచేస్తున్నారు. రెండునెలల క్రితం మావారికి ఉన్నచోటనే స్కూలు అసిస్టెంటుగా ప్రమోషన్ వచ్చింది. మేము చాలా సంతోషించాము. కానీ కొంతమంది అధికారులు రాజకీయం చేసి ప్రమోషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు రాకుండా ఆపుచేశారు. ఎందుకంటే, తమ స్వప్రయోజనాలకోసం అప్పటికే అక్కడ డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నవారిని అక్కడ ఉంచి, మావారిని వేరేచోటుకి బదిలీ చేయించాలని వాళ్ళ ఆలోచన. ఒకవేళ అదే జరిగితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ చాలా దూరప్రాంతంలో ఖాళీ ఉంది. అంతదూరం బదిలీ అయితే మాకు చాలా కష్టమైపోతుంది. ఈ సమస్యల కారణంగా మేము దాదాపు రెండునెలలు మానసికంగా చాలా బాధపడ్డాము. కష్టం నుంచి గట్టెక్కించమని వేంకటేశ్వరస్వామి భక్తులైన మావారు వెంకటేశ్వరస్వామికి మ్రొక్కుకుంటే, నేను బాబాను, "మాకు సహాయం చేయండి. వేరే చోటకు బదిలీ లేకుండా ఇక్కడే ప్రమోషన్‌తో అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల 2019, అక్టోబరు 25న కౌన్సిలింగ్ నిర్వహించి ఉన్నచోటనే మావారికి ప్రమోషన్ ఇవ్వడానికి నిర్ణయించారు. నేను ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ అక్టోబరు 26, 27 రెండురోజులూ దీపావళి సెలవుల కారణంగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ రాలేదు. తరువాత అక్టోబరు 28 ఉదయం మళ్ళీ అపాయింట్‌మెంట్ ఆగిపోయిందని మాకు ఫోన్ వచ్చింది. సమస్య తీరిపోయింది అనుకుంటే మళ్ళీ మొదటికొచ్చిందేమిటని నేను, మావారు చాలా దిగులుపడ్డాము. అప్పుడు నేను, "బాబా! మీరు నా వెంట ఉంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్డర్స్ వచ్చేలా చేయండి. అలా జరిగితే 'సాయిమహరాజ్ సన్నిధి బ్లాగు'లో వచ్చే 'అనుభవమాలిక' శీర్షికలో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా మళ్ళీ దయ చూపారు. 2019, నవంబరు 2న అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. బాబా అనుగ్రహం వలన ఉన్నచోటనే ప్రమోషన్ వచ్చింది. ఇక మా ఆనందమేమని చెప్పను. హృదయపూర్వకంగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. "బాబా! ఎప్పుడూ మీ అనుగ్రహం ఇలానే మా కుటుంబంపై ఉండాలి తండ్రీ!"

నాకు ఉద్యోగం ఇవ్వడానికి బాబా అద్భుతం చేశారు

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తురాలు విజయ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా పేరు విజయ. రెండు దశాబ్దాల నుండి నేను బాబాబిడ్డని. ఆయన నాకు తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి. నేను ఉదయం లేస్తూనే ఆయనను చూస్తాను, రోజంతా ఆయనతో మాట్లాడుతాను, నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఆయనను చూస్తాను. అయితే అప్పుడప్పుడు నేను ఆయనను విస్మరిస్తుంటాను. కానీ బాబా నన్నెప్పుడూ విడిచిపెట్టకుండా తమ దివ్యపాదాల చెంతకు లాక్కుంటున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

నేను ఐటి రంగంలో పనిచేస్తున్నాను. 2018 డిసెంబరులో నా ఉద్యోగానికి సంబంధించిన ఒప్పందం ముగియడంతో నేను ఉద్యోగాన్ని కోల్పోయాను. త్వరలోనే బాబా నాకు మంచి ఉద్యోగాన్నిస్తారని ఆయనపై నమ్మకముంచాను. ఆ నమ్మకంతోనే కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. కానీ ఏవీ కలిసిరాలేదు. ఆ సమయంలోనే అదివరకు నేను పనిచేసిన ఒక సంస్థ ఉద్యోగ నియామకాలు చేస్తున్నట్లు నాకు తెలిసింది. కానీ ఆ సంస్థ వేరే స్టేట్‌లో ఉంది. నా ఇద్దరు పిల్లల్ని వదిలేసి నేను అక్కడికి వెళ్ళలేను. అందువలన దానిగురించి ఆలోచించడం మానేసి నేను 'నవగురువారవ్రతం' మొదలుపెట్టాను. దానితోపాటు సచ్చరిత్ర కూడా పారాయణ చేస్తూ, 9 వారాలు పూర్తి చేసే లోపల బాబా నాకు ఉద్యోగం దొరికేలా చేస్తారని అనుకున్నాను. అదే నిజమైంది. 5 వారాలలోపే ఆయన నాకు సహాయం చేశారు. ఐదవ గురువారంనాడు ఆడవాళ్ళ సమస్య కారణంగా నేను వ్రతాన్ని చేయలేదు. ఆరోజు 9:30 గంటల సమయంలో నా పాత కంపెనీ మేనేజర్ నుండి ఫోన్ వచ్చింది. ఆమె నన్ను ఉద్యోగంలోకి తీసుకుంటున్నాని చెప్పారు. అది కూడా ఇంటినుండి పని చేసుకునే అవకాశమిస్తూ. నా ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులులేవు. ఎందుకంటే, అంతకుముందెప్పుడూ ఆమె ఇంటినుండి పనిచేసే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. బాబా నాకు ఉద్యోగాన్ని ఇవ్వడం కోసం అద్భుతాన్ని చేసి చూపించారు. ఇంతకంటే నేను ఆయనను ఏమి అడగగలను? "బాబా! ఇంత గొప్ప అవకాశాన్నిచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దండి. నా మనస్సు ఎప్పుడూ మీ చుట్టూ తిరుగుతూ ఉండేలా చూడండి. నన్ను ఎల్లప్పుడూ మీ పాదకమలాల వద్ద స్థిరంగా ఉంచండి. నేను మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను". బాబాపై నమ్మకం ఉంచండి, ఆయన ప్రతిదీ చూసుకుంటారు.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo