సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్‌పాండే


బాబా దేహధారిగా ఉన్నప్పుడు ఆయనను దర్శించుకున్న భక్తులలో శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్‌పాండే ఒకరు. అతడు ముంబైలోని దాదర్‌లో తన తల్లిదండ్రులు, తాతగారితో కలిసి నివసిస్తుండేవాడు. ఒక విషాద సంఘటన అతన్ని బాబా వద్దకు తీసుకువచ్చింది. అతడెంతో ఇష్టపడే తాతగారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. క్రమంగా ఆయన దృష్టి మందగించింది. అన్నిరకాల నివారణలు, చికిత్సలు ప్రయత్నించారు కానీ, ఆయన పూర్తిగా అంధుడయ్యారు. 

బాంద్రాలో శ్రీగోవిందరావు మాన్‌కర్ అనే ఒక సత్పురుషుడు ఉండేవాడు. ఆయన గొప్ప సాయిభక్తుడు. ఆయన విఠల్ తాతగారిని శిరిడీవెళ్ళి బాబా ఆశీస్సులు పొందితే కంటి సమస్య నయం అవుతుందని సలహానిచ్చారు. తాతగారికి ఆ సలహా నచ్చి శిరిడీ వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. అదే విషయం తన కొడుకుతో చెప్పి తనని శిరిడీకి తీసుకుని వెళ్ళమని చెప్పారు. అయితే ఏదో ఒక కారణం చేత ఆ ప్రయాణం వాయిదాపడుతూనే ఉండేది. 1916 నాటికి విఠల్ 12 సంవత్సరాల వయస్సువాడు. తన మేనమామలకు తాతగారిని శిరిడీ తీసుకుని వెళ్లడం కుదరని కారణంగా తానే తన తాతగారికి తోడుగా శిరిడీ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఒక మంచిరోజు చూసుకుని వారిద్దరూ శిరిడీకి ప్రయాణమయ్యారు.

ఆ అనుభవాన్ని శ్రీవిఠల్ దేశ్‌పాండే ఇలా వివరిస్తున్నారు: "మేము శిరిడీ చేరుకున్న వెంటనే నేరుగా ద్వారకామాయికి వెళ్ళాము. బాబా దర్శనం చేసుకుని, ఆయనకు నమస్కరించాము. బాబా మావైపు చూసి నవ్వుతూ, "నాకు 6 రూపాయలు దక్షిణ ఇవ్వు" అని అడిగారు. నేను జేబులో చేయిపెట్టుకుంటే, నావద్ద ఉన్న రూ.10/- , రూ.5/- నోట్లు చేతికి దొరికాయి. నేను ముందుగా రూ.10/- నోటు బాబాకిచ్చాను. కానీ ఆయన దానిని తీసుకోలేదు. సరేనని రూ.5/- నోటు ఇచ్చాను. కానీ బాబా అది కూడా తీసుకోలేదు. తరువాత కూడా నేను దక్షిణ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆయన మొండిగా, "నాకు 10 రూపాయలు గాని, 5 రూపాయలు గాని వద్దు. సరిగ్గా 6 రూపాయలు మాత్రమే కావాలి" అని చెప్పారు. ఆ విషయంలో ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. దాంతో నేను మా తాతని బయటకు తీసుకుని వచ్చి, ఒక గోడ వద్ద కూర్చోబెట్టాను. (ప్రస్తుతం వంటచెఱకు నిలవచేసుకోవడానికి ఉన్న గది వెంబడి ఆ రోజుల్లో ఒక ఇరుకైన వీధి, దానికి అవతల ఉన్న గోడ ఉండేవి.) 

తరువాత నేను రూ.10 నోటుకు చిల్లరగా 10 రూపాయి నాణాలు తీసుకుని రావడానికి వెళ్ళాను. నేను కనిపించే ప్రతి దుకాణానికి వెళ్లి చిల్లరకోసం అడిగాను. కానీ అంత చిన్న గ్రామంలో నాకెవ్వరూ చిల్లర ఇవ్వలేదు. తిరిగి తిరిగి నేను పూర్తిగా అలసిపోయాను. చిన్నపిల్లవాడినైన నాకు దుఃఖంతో కన్నీళ్ళొచ్చాయి. నా చెంపలమీదుగా కన్నీరు కారుతుండగా నేను రోడ్డు ప్రక్కన నిలబడివున్నాను. అంతలో పంచె, 'బారాబందీ' (ఒక విధమైన జాకెట్), నుదుటిపై గంధం బొట్టు, తలకి పాగా, కాళ్ళకు 'పునేరీ' బూట్లు(పూణేలో ప్రత్యేకంగా తయారైనవి) ధరించిన ఒక పెద్దమనిషి నా వద్దకు నడుచుకుంటూ వచ్చారు. ఆయన నా వీపు మీద తడుతూ ప్రేమతో ఓదార్పుగా, "ఎందుకేడుస్తున్నావు?" అని అడిగారు. నేను వెక్కిళ్ళతో నా దుఃఖానికి కారణమైన కథంతా చెప్పాను. ఆయన మంచి ఉదారస్వభావుడిలా వెంటనే తన జేబులో నుండి పది రూపాయి నాణాలు తీసి నా చేతికిచ్చారు. నాణాలను అందుకున్న వెంటనే నేను ద్వారకామాయికి పరిగెత్తుకుని వెళ్ళి ఆరు రూపాయలు బాబా చేతిలో పెట్టి, ఆయన చరణకమలాలకి సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన నన్ను దీవిస్తూ, "అబ్బాయీ! భయపడకు. అల్లామాలిక్ నిన్ను అనుగ్రహిస్తాడు. నువ్వు వచ్చిన పని పూర్తయింది. ఇక వెళ్ళు" అన్నారు. నేను కేవలం 12 సంవత్సరాల బాలుడినైనందువల్ల ఆయన మాటలలోని గూఢార్థం నాకు బోధపడలేదు. బాబాకు మేము శిరిడీ ఎందుకు వచ్చామో చెప్పలేదు. ఆయన కూడా మమ్మల్ని ఆ విషయం అడగలేదు. మరి, "మీరు వచ్చిన పని నెరవేరింది, ఇక వెళ్ళండి" అని బాబా అన్న మాటలకు నేనాశ్చర్యపోతూ ఆయనవంక చూస్తుంటే ఆయన మళ్ళీ అవే మాటలు అన్నారు.

నాకు ఏమీ అర్థంకాక ద్వారకామాయి నుండి బయటకు వచ్చి మా తాతని కూర్చోబెట్టిన చోటుకు వెళ్ళాను. అక్కడ మా తాత కనపడకపోవడంతో నాకు చాలా భయం వేసింది. విపరీతమైన భయంతో మా తాతని వెతుకుతూ అరుచుకుంటూ శిరిడీ వీధుల్లో పిచ్చిగా పరుగుతీశాను. కానీ లాభం లేకపోయింది, ఆయనెక్కడా కనపడలేదు. 'ఆయనకేమయింది? కనుచూపుమేరలో ఎక్కడా కనిపించటంలేదు? కంటిచూపు లేని ఆయన ఎక్కడికి వెళ్లిపోయారు? ఎక్కడైనా పడిపోయారా?' అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాను. ఏమీ అర్థంకాక అయోమయస్థితిలో ఓ మూల ఒంటరిగా నిలబడిపోయాను. అంతలో నేను అంతకుముందు కలుసుకున్న వ్యక్తి నా ఎదుటకు వచ్చి నా భుజం తడుతూ, "మళ్ళీ ఎందుకేడుస్తున్నావు?" అని అడిగారు. మా తాత అదృశ్యమైన విషయం నేనాయనకి చెప్పాను. కరుణరసం నిండిన కళ్ళతో ఆయన నన్ను గట్టిగా పట్టుకుని ఒక దిక్కుకేసి చూపిస్తూ, "ఆందోళనపడకు, ఆ చివరనున్న సాఠేవాడా వద్ద మీ తాత కూర్చుని ఉండటం ఇప్పుడే చూశాను" అన్నారు. నేను క్షణంకూడా ఆలస్యం చేయకుండా ఆయన చూపించిన వైపు పరిగెత్తుకుని వెళ్ళాను.

ఓహ్! అక్కడ మా తాత చెఱకుగెడల గుట్ట ప్రక్కన కూర్చుని ఆనందంగా చెఱకు ముక్క నములుతూ ఉన్నారు. నేను కోపంతో గట్టిగా, "ఒంటరిగా ఇక్కడికెందుకు వచ్చావు? కళ్ళు కనపడక ఎక్కడైనా క్రిందపడితే దెబ్బలు తగిలి గాయపడి ఉండేవాడివి కదా?" అని అరిచాను. మా తాత ప్రశాంతంగా నా వైపు చూస్తూ తన ప్రక్కన కూర్చోమని, ఇలా అన్నారు: "ఒరేయ్ అబ్బాయీ! నన్ను కూర్చోబెట్టి నువ్వు చిల్లర తేవడానికి వెళ్ళావు. తరువాత కొన్ని క్షణాల్లో ఆశ్చర్యకరంగా ముందు నాకు మసక మసకగా కనపడటం మొదలై, తరువాత అన్నీ స్పష్టంగా కనిపించాయి. నాకు దృష్టి పూర్తిగా వచ్చింది. ఇక నాకక్కడ ఊరికే సోమరిగా కూర్చోవాలనిపించలేదు. కాస్త అలా తిరిగి వద్దామనిపించింది. మనం సామానులు పెట్టిన చోటు నాకు కాస్త అవగాహన ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చేవరకు నీకోసం అక్కడ ఎదురు చూద్దామనుకున్నాను" అని. అది విని నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. "ఇక మీరు వచ్చిన పని నెరవేరింది" అన్న బాబా మాటలు గుర్తుకువచ్చి వాటి వెనుకనున్న రహస్యం అర్థమైంది. మా తాతకి పోయిన కంటిచూపును తిరిగి ప్రసాదించమని బాబాని ప్రార్థించడానికే మేము వచ్చింది. ఆ విషయం మేము చెప్పకుండానే బాబా గ్రహించి, మమ్మల్ని ఏమీ ప్రశ్నించకుండానే అనుగ్రహించారు.

బాబా చూడటానికి మంచి స్ఫురద్రూపిగా, పొడవుగా, చక్కటి శరీరఛాయతో ఉండేవారు. ఆయన చేతులు మోకాళ్ళ వరకు ఉండేవి. ఆరతినిచ్చే సమయంలో ఆయన వదనం ఎంతో దివ్యమైన కాంతితో ప్రకాశవంతంగా ఉండేది. బాబా సాధారణంగా హిందీలో మాట్లాడేవారు. ఆయన ఎల్లప్పుడూ 'అల్లామాలిక్', 'అల్లా అచ్ఛా కరేగా' (భగవంతుడు మేలు చేస్తాడు) అని తన భక్తులను దీవిస్తూ ఉండేవారు. ఆయన తురిమిన ఎండుకొబ్బరిలో పంచదార కలిపి భక్తులకు పంచుతూ ఉండేవారు. స్వయంగా తమ చేతితో భక్తులకు ఊదీని ప్రసాదంగా ఇస్తుండేవారు. ప్రతి భక్తుని నుదుటిమీద ముందుగా ఊదీని రాయడం ఆయనకు అలవాటు. తరువాత వారి చేతులలో ఊదీ వేస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఆయన చుట్టూ 25 నుంచి 30 మంది దాకా భక్తులు ఉండేవారు. ఆరతి సమయంలో ఆయన చేతులమీదుగా ప్రసాదం తీసుకోవడానికి చాలామంది భక్తులు గుమిగూడి ఉండేవారు.

శిరిడీ నుంచి నేనెప్పుడు తిరుగుప్రయాణమవుతున్నా బాబా అనుమతి తీసుకునే వెళ్ళేవాడిని. ఒకసారి నేను శ్రీషిండే కారులో శ్రీదామూఅన్నా రాస్నే, శ్రీశంకరరావు షిండేలతో కలిసి బాబా అనుమతి తీసుకోకుండా హడావిడిగా శిరిడీ నుండి బయలుదేరాను. దారిలో అహ్మద్‌నగర్ వద్ద చాలా వేగంగా వెళుతున్న మా కారుకు అకస్మాత్తుగా కుడివైపునుండి ఒక వ్యక్తి అడ్డంగా రావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఆ వ్యక్తి తెలివితప్పి క్రింద పడిపోయాడు. మేము దారుణమైన పరిస్థితిలో చిక్కుకుపోయాము. రాస్నేగారు కొంత బాబా ఊదీని ఆ గాయపడ్డ వ్యక్తి నోటిలో వేసి, మరికొంత అతని నుదుటిమీద, ఛాతీమీద, పొట్టమీద రాశారు. కొంతసేపటి తరువాత అతనికి స్పృహ వచ్చింది. కానీ, అతనికి కాలు విరిగిందని తెలుసుకొన్నాక మాకు చాలా భయమేసింది. అతనిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాము. రాస్నే, షిండే ఇద్దరూ వెంటనే బాబాని ప్రార్థించడానికి తిరిగి శిరిడీ వెళ్ళారు. నేను కూడా వెళ్లి ఎప్పటిలాగే తిరిగివెళ్ళడానికి బాబా అనుమతి తీసుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో మేము ఆ క్లిష్ట పరిస్థితి నుండి ఎటువంటి సమస్యలు లేకుండా బయటపడ్డాము. ఈ సంఘటనతో బాబా అనుమతి తీసుకోకుండా ఎప్పుడూ శిరిడీ విడిచి వెళ్లకూడదనే గుణపాఠం నేర్చుకొన్నాను.

ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన 1968వ సంవత్సరంలో జరిగింది

ఆరోజు నేను బాబాను స్వప్నంలో గాని, మరింకేవిధంగా గాని చూడలేదు. మిమ్మల్ని చూస్తున్నట్లుగానే బాబాను చూశాను. ఇప్పుడు నేను కూర్చున్నచోటనే ఆ సంఘటన జరిగింది. ఆరోజు అనంత చతుర్దశి. చూడటానికి పూజారిలా ఉన్న ఒక సన్యాసి కిటికీ బయట నిలబడి ఉన్నాడు. ఆయన హిందీలో మాట్లాడుతూ, "నాకు కాస్త టీ ఇస్తావా?" అని అడిగాడు. నేను ఆశ్చర్యపోతూ అతనిని లోపలకు రమ్మన్నాను. అతను గది లోపలికి వచ్చి గోడకు చేరబడి కూర్చున్నాడు.

నేను, "టీ బదులుగా దయచేసి ఒక కప్పు పాలు స్వీకరిస్తారా?" అని అడిగాను.
ఆయన, "నీ ఇష్టం" అని జవాబిచ్చాడు.
నేను, "పాలలో కాస్త పంచదార వేయమంటారా?" అని అడిగాను. దానికి
ఆయన, "నీకు ఇష్టమైతే అలాగే కానీ!" అన్నారు. 

నేను వినయంగా తీయటి పాలు కప్పుతో ఆయన ముందుపెట్టి ఆయనను గమనిస్తున్నాను. ఆశ్చర్యం! అద్భుతం! నాకు సన్యాసి కనపడటం లేదు. సాక్షాత్తూ బాబానే కనపడుతున్నారు. ఆయన బాబా తప్ప మరెవరూ కాదు! అందులో నాకెటువంటి సందేహమూ లేదు. నాతోపాటు నా కుటుంబమంతా ఆయన ముందు సాష్టాంగనమస్కారం చేశారు. ఆయన మమ్మల్ని దీవించి వెంటనే గదినుండి నిష్క్రమించారు. వెంటనే నాకు ప్రేరణ కలిగి బయటకు వెళ్లి ఆయనకోసం చూశాను. కానీ ఆయన జాడ ఎక్కడా కనపడలేదు. బయటకు వెళ్తూనే ఆయన అదృశ్యమైపోయారు. నేనెంతో ఉద్వేగంతో చుట్టుప్రక్కలున్న వారందరినీ "సన్యాసిలా ఉన్న వ్యక్తిని ఎవరైనా చూశారా?" అని అడిగాను. కానీ, "అటువంటి వ్యక్తిని తామెవరూ చూడలేద"ని చెప్పారు. అప్పుడు సన్యాసి రూపంలో దర్శనమిచ్చింది నా బాబాయేనన్న దృఢమైన నమ్మకంతో నేను యింటికి తిరిగి వచ్చాను.

శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్‌పాండే 
బొంబాయి.


యింటర్వ్యూ చేసిన వారు: శ్రీ ఎం.ఎస్. ఘోలప్


Source: సాయిలీల మాసపత్రిక ఫిబ్రవరి 1982 

3 comments:

  1. 🙏 చాలా చాలా బాగుందీ. చదువు తుంటే చాలా సంతోషం కలిగీందీ. " ఓం శ్రీ షిర్డీ సాయినాథ్ మహారాజ్ కి జై ". 🙏💕😍

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo