సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దుర్గాబాయి కర్మార్కర్


అది 1913వ సంవత్సరం. ఒకరోజు దుర్గాబాయి కర్మార్కర్ అనే ఆమె, చేతిలో 8 నెలల చంటిబిడ్డతో తొలిసారిగా ద్వారకామాయికి వచ్చింది. తన బిడ్డను మశీదుమాయి నేలపై ఉంచి సాయిబాబాకు నమస్కరించింది. బాబా దర్శనంతో తన్మయత్వంతో ఆమెకు కన్నీళ్లు కారాయి. ఆమె చాలా పేదరాలైనందున షిర్డీలో ఉండటానికి తన వద్ద నయాపైసా ధనం కూడా లేదు. సర్వాంతర్యామి అయిన బాబాకి ఆమె పరిస్థితి తెలుసు కాబట్టి ఆమెతో, “దేనికీ దిగులుపడవద్దు, ఇక్కడ నిన్ను ఏదీ ఇబ్బంది కలుగజేయదు. ఈ ద్వారకామాయి అందరికీ మేలు చేస్తుంది. తక్షణమే ఇక్కడనుండి వెళ్లి, మూడురోజుల పాటు ఒక్కమాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటూ, అన్నపానీయాలు తీసుకోకుండా వేపచెట్టు క్రింద కూర్చో! నాల్గవరోజు ఉదయానికి అన్నీ చక్కబడతాయి” అని చెప్పారు. అప్పుడామె, “బాబా! నేను చాలా బీదరాలిని, నాకెవరూ అండలేరు. మీరు చెప్పినట్లు మూడురోజులపాటు అన్నపానీయాలు లేకుండా నేను ఉండగలను కానీ, పాలపై ఆధారపడే నా బిడ్డ ఎలా ఉండగలడు? అందుకని వాడికోసం కొంచెం పాలు తీసుకుంటాను” అన్నది. అప్పుడు బాబా, “వెళ్ళు! వెళ్ళు!" అంటూ, "బిడ్డకు పాలుగానీ, ఇంకేమిగానీ ఇవ్వవద్దు. కేవలం వాడిని పడుకోనివ్వు, అల్లామాలిక్!” అన్నారు. ఆమె కంటినుండి నీళ్ళు కారుతున్నాయి. బాబా మాటలందు ఆమెకు ఎటువంటి అనుమానం లేదు. బాబా మాటలే ఆమెకు కొండంత బలాన్నిచ్చాయి. మంచి జరిగినా, చెడు జరిగినా బాబా మాటలకు కట్టుబడాలని ఆమె  నిశ్చయించుకుంది. ఆమె బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్లి, వేపచెట్టు(గురుస్థాన్) క్రింద కూర్చుంది. భక్తులకు బాబా ఆజ్ఞే బలాన్ని చేకూరుస్తుంది. దుర్గాబాయి ఒడిలో బిడ్డని పెట్టుకొని, బాబా చెప్పినట్లుగానే ఒక్కమాటైనా మాట్లాడకుండా, అన్నపానీయాలు తీసుకోకుండా అలానే కూర్చుంది. అద్భుతమేమిటంటే, ఆమె బిడ్డ కూడా ఆ మూడురోజుల్లో పాలకోసంగానీ, ఆహారంకోసం గానీ ఒక్కసారి కూడా ఏడవనేలేదు. మూడురోజులలో తల్లీ, బిడ్డ ఇద్దరూ కాలకృత్యాలు కూడా తీర్చుకోలేదు.

నాల్గవరోజు వేకువఝామున బాబా దుర్గాబాయి వద్దకు వచ్చి, రెండు చపాతీలు ఆమెకిచ్చి, రెండు రూపాయలు బిడ్డ చేతిలో పాలకోసం పెట్టారు. తరువాత బాబా ఆమెతో, “అనవసరంగా ఎవ్వరితో మాట్లాడవద్దు. వీలైనంతవరకు మౌనంగా ఉండు. నా సేవగా భావించి, ఇతరులను సేవించు” అని చెప్పారు. ఈ సంభాషణ జరుగుతుండగా బాలాభావు అక్కడికి వచ్చాడు. అతనికి షిర్డీలో ఒక హోటల్ ఉన్నది. అతడు బాబాతో, “బాబా! ఈమె బాధ్యత నా భుజాలపై వేసుకుంటాను” అన్నాడు. బాబా "సరే" అన్నారు. అలా బాబా ఆ తల్లీ, బిడ్డలకు పోషణ ఏర్పాటు చేసారు. అప్పటివరకు ఆ బిడ్డకు నామకరణం జరగలేదు. అప్పుడే ఆ బిడ్డకు 'రఘునాథ్' అని బాబా నామకరణం చేసారు.

నిజానికి దుర్గాబాయి 7, 8 రోజులు షిర్డీలో ఉండాలని వచ్చింది. ఆ గడువు దాటిన తర్వాత ద్వారకామాయికి వెళ్లి షిర్డీ విడిచి వెళ్ళడానికి బాబాని అనుమతి అడిగింది. బాబా, “వెళ్ళు, నీ స్థానంలో కూర్చో, నేను నిన్ను ఇక్కడికి లాక్కొని వచ్చింది తిరిగి పంపటానికి కాదు. ఎవరైతే నా వారో, వారినే నేను ఇక్కడకు తీసుకువస్తాను” అన్నారు. ఆమె బాబా అజ్ఞాను శిరవహించి షిరిడిలోనే ఉండిపోయింది.

దుర్గాబాయి రెండు వేర్వేరు చోట్ల పనిచేస్తూ సంపాదించుకొనేది. ఆమె లెండీబాగ్ కు ద్వారకామాయికి మధ్యలో ఇల్లు కట్టుకున్నందున, ప్రతిరోజు బాబా ఉదయం, సాయంత్రం లెండీకి వెళ్లివచ్చేటప్పుడు ఆమెకు సులువుగా బాబా దర్శనభాగ్యం కలుగుతుండేది. అయితే దుర్గాబాయి ముక్కుసూటితనం ఎవరికీ నచ్చేది కాదు. అందువలన అందరూ ఆమె గురించి చెడుగా మాట్లాడేవారు. అటువంటి వారికి ఆమె ఏ సమాధానమూ చెప్పేది కాదు. ద్వారకామాయికి పోయి ఓ మూలన కూర్చుని నెమ్మదిగా ఏడ్చేది. ఒకరోజు మధ్యాహ్నం బాబా పాదాలు ఒత్తుతూ, ఇతరులు తన గురించి అనే చెడు మాటలు గుర్తుకొచ్చి ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది. అప్పుడు సర్వజ్ఞుడైన బాబా ఆమె మనసెరిగి, “దుర్గా! ప్రజలు ఏమైనా చేయనీ, ఏమైనా మాట్లాడనీ, వాటికి విలువ ఇవ్వవలసిన అవసరం మనకేమైనా ఉందా? వాళ్లతో మనకు పనేమిటి? కష్టపడి పనిచేయి, నీవు చేయవలసింది చాలా ఉంది. నేను ఇక్కడ నీ కోసమే ఉన్నాను. ఎల్లప్పుడూ నీ సహాయార్థమే నేనిక్కడ కూర్చొని ఉన్నాను” అన్నారు. బాబా యొక్క ఈ అద్భుతమైన పలుకులు విని దుర్గాబాయి సంతోషంతో పరవశించిపోయింది.

దుర్గాబాయి ఎటువంటి పనినైనా తిరస్కరించేది కాదు. ఎంత కష్టమైన పనైనా పూర్తి చేసేది. ఆమె తన పని పూర్తైన తర్వాత ఒక కుండలో బియ్యం పోసి ద్వారకామాయికి తీసుకొని వచ్చి పవిత్రమైన బాబా ధునిపై పెట్టేది. బియ్యం ఉడికేవరకు ఆమె బాబా శరీరాన్ని మర్దన చేస్తూ ఉండేది. బాబా ఆపమని చెప్పేవరకు మర్దన చేసేది. ఆ ఉడికిన అన్నంతో బాబాకు నైవేద్యం తయారుచేసి సమర్పించుకునేది. దాదాసాహెబ్ ఖపర్డే ఆమె బాబాకు చేసే అనుపమానమైన సేవకు మెచ్చి, ప్రతినెలా ఆమెకు 15 రూపాయలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నారు.

బాబా ‘నిజమైన ప్రేమ’ను మాత్రమే భక్తులనుండి కోరుకున్నప్పటికీ, దుర్గాబాయి మాత్రం కఠినమైన నియమ నిష్ఠలతో బాబాను సేవించేది. ఆమె అంటరానితనం పాటించేది. ఒకసారి దుర్గాబాయి బియ్యం ధునిపై పెట్టి బాబాకు మర్దన చేస్తూ వుంది. అంతలో ఒక కడజాతి భక్తుడు వచ్చి ధుని మీద నుండి అన్నంకుండను ప్రక్కకు దించి, ధునిలోని నిప్పుతో చిలిం వెలిగించుకొని, మరలా అన్నంకుండ ధునిపై పెట్టాడు. అతనికి అంటరానితనం అనే భావాలేమీ లేవు. అతనికి ఒక్కటే తెలుసు, అది బాబా సన్నిధి. అక్కడ పేద - గొప్ప, ఎక్కువ - తక్కువ అనే భేదాలుండవు. అక్కడ అంతా సమానమే. దుర్గాబాయి అటువంటి వారు ఏమి చేసినా ఏమీ అనేది కాదు, తను బాబా సేవను విడిచిపెట్టేదీ కాదు. కానీ తన మనస్సులో, "నా బిడ్డ భోజనవేళ అయ్యింది. ఎలా ఇటువంటి కడజాతి వాడు ముట్టిన ఆహారం బిడ్డకి పెట్టేది? ఆ ఆహారం వాడికి ఎటువంటి మేలూ చేయదు. నేను ఎప్పుడు దుకాణానికి పోయి, బియ్యం తెచ్చి, అన్నం వండి బిడ్డకు తినిపించేది?" అని అనుకుంటూ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది. ఒక కన్నీటి బొట్టు బాబాపై వెనుకవైపు(వీపుపైన) రాలింది. సర్వజ్ఞుడైన బాబాకి ఆమె మనస్సులోని ఆలోచనలు, బాధ తెలుసుకదా! వెంటనే బాబా, “దుర్గా! ఏడవవద్దు. నా సన్నిధిలో అంటరానితనానికి స్థానమేలేదు. ఈ మశీదుమాయి విలువలేనిది కాదు. ప్రజలు ఇక్కడికి వచ్చి కోట్ల జన్మల పాపాలను కడిగేసుకుంటారు. అయినా దానికి ఏ పాపమూ అంటదు, అది అంత పవిత్రమైనది. నా స్వహస్తాలతో ఈ ధునిని నేను వెలిగించాను. ఈ ధునిలో అగ్నిదేవుడు కొలువైవున్నాడు. అంతటి పవిత్రమైన అగ్నిపై వండబడిన ఆహారం ఒకరు ముట్టినంత మాత్రాన అపవిత్రం అయిపోతుందా? ఇటువంటి ఆహారం తినడం వలన నీ బిడ్డకు ఎంతో మేలు చేకూరుతుంది. నీయందు నాకు దయ కలిగి నేను ఈ మాటలు చెప్తున్నాను. నాకు ఎవరియందు ఎటువంటి చెడు అభిప్రాయాలు లేవు. ప్రజలు ఎక్కడెక్కడినుండో వచ్చి ఈ ధునిలోని ఊదీని వారి వ్యాధులు నయమవడానికి వారి నుదుట రాసుకుంటారు. వారి అదృష్టాన్ని నేనేమని చెప్పను! అందువలన, దుర్గా! మనస్సులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా, ఈ ఆహారాన్ని రఘుకు తినిపించి, నీవు కూడా తిను” అని చెబుతూ ఆమెను ఆశీర్వదించి, "సరే, ఇప్పుడు లే, లేచి అన్నాన్ని తీసుకొని ఇంటికి వెళ్లి నువ్వు, రఘు తినండి" అన్నారు. ఈవిధంగా బాబా తన దృష్టిలో అందరూ సమానమని, కులం, మతం మరియు అంటరానితనం వంటి భేదభావాలు గమ్యం చేరడానికి అడ్డంకులని అపూర్వమైన బోధ చేసారు.

ఒకసారి బాబా దుర్గాబాయిని, "ఓ దుర్గా! నీవు ఖండోబా మందిరానికి వెళ్తున్నావా?" అని అడిగారు. దుర్గాబాయి, "అవును, నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాను" అని ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు బాబా, "ఉపసానీ చాలా బలహీనంగా అయిపోయాడు. దుర్గా, నీవు ఇక్కడ నన్ను సేవిస్తున్నట్లే ఖండోబా ఆలయంలో ఉన్న ఉపాసనీని సేవించు. అది కూడా నన్ను సేవించిన దానితో సమానం" అని చెప్పారు. ఆ సమయంలో ఉపాసనీ మహరాజ్ తీవ్రమైన ధ్యానంలో ఉండేవాడు. ఎవరైనా అతని దగ్గరకు వెళ్లినట్లయితే, అతను వారిని తిట్టిపోసేవాడు. అతను ఎవ్వరినుండి ఆహారాన్ని స్వీకరించేవాడు కాదు. ఎవరైనా నిర్భయముగా ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినా ఆయన కొట్టి, తిట్టి తరిమివేసేవాడు. కానీ ఈ విషయాలేవీ పట్టించుకోకుండా, బాబా మాటలను శాసనంగా భావించి ఖండోబా మందిరానికి వెళ్ళి ఉపాసనీని సేవించడం మొదలుపెట్టింది దుర్గాబాయి. జూలై 27, 1914న ఉపాసనీ మహరాజ్ షిర్డీ విడిచి వెళ్లిపోయారు. అతను ఎక్కడికి వెళ్లారన్నది ఎవరికీ తెలియదు. అయినప్పటికీ దుర్గాబాయి తన అలవాటు ప్రకారం ఖండోబా ఆలయానికి వెళ్లి ఉపాసనీ మహరాజ్ పేరు మీద మర్రిచెట్టు కింద ఆహారాన్ని పెట్టేది. 1916లో ఉపాసనీ మహరాజ్ సాకోరిలో నివసిస్తున్నారని ఆమెకి తెలిసింది. అప్పటినుండి సాయిబాబాకు నైవేద్యం సమర్పించిన తరువాత, అతనికి నైవేద్యం సమర్పించడం కోసం ఆమె నడుచుకుంటూ సాకోరి వెళ్ళేది.

ఒకసారి రహతాకి చెందిన దౌలూ శేట్ రహతాలో ఉపాసనీ మహరాజ్ సత్సంగాన్ని ఏర్పాటు చేసారు. ఆ సత్సంగం జరిగే రోజులలో ఆమె షిర్డీ నుండి ఉపాసనీ మహరాజ్ కి నైవేద్యం ఇవ్వడానికి రహతా వెళ్ళేది. అలా వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక పెద్దముల్లు ఆమె పాదంలో గుచ్చుకుంది. ముల్లు తీయడానికి ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది. అయినప్పటికీ ఆమె తన సేవలో ఎటువంటి అంతరాయం కలగనివ్వలేదు. ఉపాసనీ నైవేద్యం స్వీకరించిన తర్వాతే ఆమె తన ఆహారాన్ని తీసుకొనేది. రోజులు గడిచే కొద్దీ వాపు, నొప్పి పెరిగి ఆమె సాధారణంగా నడవలేక చాలా కష్టపడేది. ఒకరోజు ఉపాసనీ మహరాజ్ గాయపడిన దుర్గాబాయి కాలు గమనించి, కోపాన్ని నటిస్తూ, "ఎవరికీ చెప్పకుండా ఎందుకు ఇన్ని రోజులుగా బాధపడుతున్నావు? నీవు చెప్పినట్లయితే నీ బాధకు పరిష్కారం చూపుతాం కదా!" అని చెప్పి, ఉపాసనీ మహరాజ్ దుర్గాబాయి కాలిని పట్టుకొనగా మరొక వ్యక్తి ఆమె పాదంలోకి లోతుగా వెళ్లిపోయిన పెద్ద ముల్లును తీసేసాడు. అంతలా బాబా ఆజ్ఞను శిరసావహించి ఉపాసనీకి సేవ చేస్తుండేది. అంతటి సేవాతత్పరురాలు ఆమె.

రోజులు గడుస్తూ రఘుకి ఐదు సంవత్సరాలు వచ్చాయి. దుర్గాబాయి తన కొడుకుకి ఉపనయనం చేయ సంకల్పించింది. నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్, రావు బహదూర్ ధుమాల్, దాదాసాహెబ్ ఖాపర్డే వంటి స్థోమత కలిగిన భక్తులు కొంత సొమ్ము భక్తుల వద్ద నుండి సేకరించి, మరియు వారివారి చందాలు కలిపి రూ. 75/-  దుర్గాబాయికి ఇచ్చారు. ఉపనయనానికి ఇంకా నాలుగు రోజులు ఉందనగా దుర్గాబాయి ఇంట నలుగురు దొంగలు దోపిడీ చేసారు. ఇంటిలో ఉన్న డబ్బంతా దోచుకుపోయారు. దుర్గాబాయికి తన ఇంట్లో ఏమీ మిగలలేదని తెలిసి పూర్తిగా నిరాశపడిపోయింది. రోజంతా ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయాయి. ఆ దిగులుతో ఆమె సాయంత్రం ఆరాధన కూడా చేయలేదు. మరుసటిరోజు ఉదయం 9.00 గంటలకు సాయిబాబా లెండీకి వెళ్తూ ఆమె ఇంటికి సమీపంగా వచ్చారు. బాబాను చూస్తూనే ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి బాబా పాదాలపై పడి బిగ్గరగా ఏడ్చింది. బాబా శాంతముగా దుర్గాబాయి తలపై తమ చేతిని ఉంచి, "దుర్గా, ఈవిషయంలో అంతగా బాధపడడానికి ఏముంది? మన ఖజానాలో డబ్బుకు ఏమైనా కొరత ఉందా? వేలాది రూపాయలు ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. నేను మీకు బండ్లకొద్దీ డబ్బులు ఇస్తాను. ఆ డబ్బు పోతేపోనీ, అది మనది కాదు" అని అన్నారు. ఈ మాటలు ఆమెకు చాలా ప్రశాంతత చేకూర్చాయి.

కొన్నిరోజుల తరువాత దుర్గాబాయి ద్వారకామాయిలో బాబాకు మర్దన చేస్తూ తన కుమారుని విద్య గురించి ఆందోళన చెందుతూ ఉంది. అప్పుడు బాబా, "రఘుని చదివించడానికి ఇక్కడ మాస్టారు ఎవరూ లేరు. ఎవరు తనకి బోధిస్తారు? అల్లామాలిక్ అతని మాస్టారు" అన్నారు. తరువాత బాబా దాదాసాహెబ్ ఖాపర్డే పర్యవేక్షణలో రఘు యొక్క విద్యను అమరావతిలో ఏర్పాటు చేశారు.

బాబా మహాసమాధి అనంతరం ఉపాసనీ మహరాజ్ ని సేవించడం కోసం దుర్గాబాయి సాకోరినే తన శాశ్వత నివాసంగా చేసుకుంది. బాబా మాటను శిరసావహించి నిస్వార్థమైన సేవ చేసి అనేక సంవత్సరాల తరువాత షోలాపూర్ సాయిధామ్ లో ఆమె తన చివరిశ్వాస విడిచింది.


2 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🤗🌹😃🌺🥰🌸

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo