సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1611వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భక్తుల మనోవేదనలను తీర్చే కల్పవృక్షం శ్రీసాయిబాబా
2. బాబా ఉన్నారు - మనల్ని రక్షిస్తారు

భక్తుల మనోవేదనలను తీర్చే కల్పవృక్షం శ్రీసాయిబాబా.

ఓం శ్రీసాయినాథాయ నమః!!! బాబా భక్తులకు నమస్కారం. నా పేరు నాగరాజ్. మా ఇంట్లో అందరం సాయిబాబా భక్తులం. మనకు ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం కలిగినా మన అనుకునేవాళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చు కానీ, ఆర్తితో మనస్పూర్తిగా బాబాని ధ్యానించిన మరుక్షణం ఆయన సహాయం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అంది తీరుతుంది. ఆ కారుణ్యం ఏదో ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు. కష్టం కలిగిన ప్రతిసారీ లభించే భరోసా. దానికి ఉదాహరణలు నా ఒక్కడి జీవితంలోనే కాదు, కోట్లమంది భక్తుల జీవితాలలో లభిస్తాయి. ఇక విషయానికి వస్తే..

మా అమ్మకి సుమారు 55 ఏళ్ల వయస్సు. అయినా తను ఒక్కతే ఇంటి పనులన్నీ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటువంటి అమ్మకి ఓ చలికాలంలో ముగ్గు వేస్తుంటే చిన్నగా దగ్గు ప్రారంభమైంది. మొదట్లో ఆ దగ్గుని అమ్మతో సహా మేమెవరమూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రానురానూ దగ్గు  తీవ్రం అవ్వడంతో అమ్మ బాగా ఇబ్బందిపడసాగింది. వెంటనే అమ్మని ఓ పల్మనాలజిస్ట్ దగ్గరకి తీసుకొని వెళ్ళాము. డాక్టరు పరీక్షలన్నీ చేసి అమ్మ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని చెప్పారు. నాకు మా అమ్మ అంటే ప్రాణమైనందువల్ల ఆ మాట విని నేను తట్టుకోలేకపోయాను. హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఓ పాల వ్యాన్ మీద బాబా ఫోటో కనిపించింది. వెంటనే ఆర్తితో బాబాని, "అమ్మ క్షేమంగా ఉండాలి. అమ్మని కాపాడు బాబా. మా అమ్మ నాకే కాదు, నీకు కూడా అమ్మే" అని కన్నీళ్ళతో దీనంగా వేడుకున్నాను. డాక్టర్ రెండో రోజు వారం రోజులకు మందులు వ్రాసిచ్చారు. అమ్మ క్రమం తప్పకుండా బాబాని ధ్యానిస్తూ ఆ మందులు వాడింది. వారం రోజుల తర్వాత మళ్లీ హాస్పిటల్‌కి తీసుకెళ్లి చెక్ చేయించాం. ఆశ్చర్యం! "అమ్మ నిమ్ము పూర్తిగా తగ్గిపోయింది. చలికాలం కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు" అని డాక్టర్ చెప్పారు. ఒక్కసారిగా నాకు ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. ఉద్విగ్నంగా డాక్టరుకి కృతజ్ఞతలు చెప్పుకుందామని ఆయన వైపు తిరిగితే డాక్టర్ వెనకగా ఆశీర్వదిస్తున్నట్టుగా గోడకి వేలాడదీసిన నిలువెత్తు బాబా ఫోటో దర్శనమిచ్చింది. వారం క్రితం మొదటిసారి మేము హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫోటో అక్కడ లేదు. "అంటే డాక్టర్ కేవలం నిమిత్తమాత్రుడేనని, మీ వ్యాధులకు, లౌకిక బాధలకు అసలైన వైద్యుడిని, హాజీని నేనే" అని బాబా చెప్పకనే చెప్పారనిపించింది. భక్తుల మనోవేదనలను తీర్చే కల్పవృక్షం శ్రీసాయిబాబా. ఇంతకన్నా ఏం చెప్పాలి శ్రీసాయిబాబా అనుగ్రహం గురించి. ఆయన అనుగ్రహం ఏదో కేవలం ఒక్కసారికే పరిమితం అయిపోయే బిక్షపాత్ర కాదు. అది అంతులేని అక్షయ పాత్ర. ఇలాంటి అనుభవాలు నాకు, నా కుటుంబసభ్యులకు వేలల్లో ఉన్నాయి. నాకే కాదు ఈ భక్తుడికైనా బాబా అనుగ్రహం ప్రార్ధించిన తక్షణమే లభిస్తుంది. కావాల్సిందల్లా కేవలం బాబా పాదాలందు అంతులేని శ్రద్ధ, తీవ్రమైన భక్తి, సబూరీ.. అంతే! "ధన్యవాదాలు బాబా".


బాబా ఉన్నారు - మనల్ని రక్షిస్తారు

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. నేను బాగా నమ్మిన నా స్నేహితులే వెనకాల నన్ను మోసం చేస్తుంటే నేనేంతో బాధపడ్డాను, ఈ లోకంలో ఇంకా ఎవరినీ నమ్మకూడదని నిశ్చయించుకున్నాను. అటువంటి సమయంలో ఒకరోజు అనుకోకుండా నేను బాబా మందిరంకి వెళ్ళాను. అప్పుడు, 'నేను ఉన్నాను కదా! నీ బాధ నాతో పంచుకో' అని బాబా నాతో అంటున్నట్లు అనిపించి, 'అది నిజమే కదా!' అని బాబాని ఒక్కటే అడిగాను: "నా స్నేహితులు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపపడితే నేను నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాను" అని. నిజంగా బాబా సహాయం చేసారు. నా స్నేహితులు నా విషయంలో వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని, "మమ్మల్ని క్షమించు. ఇక మీదట అలా చేయము" అని నాతో చెప్పారు. ఇది బాబా చేసిన అద్భుతం. బాబా ఉన్నారు - మనల్ని రక్షిస్తారు. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1610వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అంతా సాయి దయ
2. పది నిముషాల ముందే పూజ అయిపోయేలా ఆశీర్వదించిన బాబా

అంతా సాయి దయ

సాయిభక్తులకు నమస్కారం. నా పేరు లలిత. 2023, జూన్ 13న మా కుటుంబం, మా తమ్ముడు కుటుంబం, మా నాన్నవాళ్ళ కుటుంబం, మా చిన్నమావయ్యవాళ్ళ కుటుంబం అరుణాచలం, తిరుపతి, శిరిడీ దర్శించి వద్దామని 15 రోజుల యాత్ర ప్లాన్ చేసుకున్నాము. అయితే అది నా నెలసరి సమయం. అందువలన నేను, "బాబా! ప్రయాణానికి ముందే నాకు నెలసరి వచ్చేలా దయ చూపండి. అదే జరిగితే మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. సాయి దయవలన నెలసరి ముందుగానే వచ్చింది. మేము బయలుదేరే రోజుకి నాకు ఐదురోజులు స్నానం కూడా అయిపొయింది. నిజంగా ఇది ఒక అద్భుతం. ఎందుకంటే, నాకు ఇదివరకేప్పుడూ ముందుగా నెలసరి రాలేదు. ఇదంతా నా సాయితండ్రి దయవలనే సాధ్యమైంది. లేకుంటే నెలసరి రాకుండా ఉండటానికి నేను చాలా మాత్రలు వేసుకోవాలి వచ్చేది. సాయి దయవలన మాత్రలు వేసే బాధ తప్పింది.

సంతోషంగా 2023, జూన్ 13న యాత్రకు బయలుదేరాము. ముందుగా అరుణాచలం వెళ్ళాము. వెళ్లేటప్పుడు మా అమ్మకి కన్ను మీద ఎలర్జీ వచ్చింది. అప్పుడు నేను బాబా ఊదీ అమ్మ కన్ను మీద రాశాను. అలా రెండు రోజులు రాసాక 'అమ్మకి తొందరగా ఎలర్జీ తగ్గిపోవాల'ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అరుణాచలంలో దర్శనమై మేము తిరుపతి వచ్చేసరికి మా పెద్ద మావయ్య స్వర్గస్తులయ్యారని మాకు ఫోను వచ్చింది. దాంతో మేము స్వామి దర్శనం చేసుకోకుండానే తిరిగి ఇంటికి వచ్చేసాము. మేము వైజాగ్ వచ్చిన తర్వాత అమ్మని డాక్టరుకి చూపిస్తే, "ఇది మామూలు ఎలర్జీనే, పర్వాలేదు తగ్గిపోతుంది" అని ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. దాంతో అమ్మకి తొందరగానే తగ్గిపోయింది.

ఇకపోతే నేను అరుణాచలం నుండి వచ్చినప్పటినుండి రోజూ, "తొందర్లోనే తిరుపతి, శిరిడీ వెళ్లేలా అనుగ్రహించమ"ని బాబాని ప్రార్థిస్తుండేదానిని. బాబా దయవలన జూలై 13న మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాము. కాలినడకన కొండ ఎక్కుతామని మొక్కుకున్నందువల్ల మేము నడక మొదలుపెట్టాము. కానీ పిల్లలు నడవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడు నేను, "సాయిని తలుచుకొని మెట్లు ఎక్కండి" అని పిల్లలతో చెప్పి నేను కూడా 'సాయి సాయి' అనుకుంటే మెట్లు ఎక్కాను. ఆ సాయి దయవలన అంత కష్టం అనిపించలేదు. మూడు గంటల్లోనే కొండ పైకి చేరుకున్నాం. దర్శనానికి 3:30కి వెళితే, ఆరు గంటలకల్లా బయటికి వచ్చేసాము. స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది. 'ఇంత వేగంగా దర్శనమెలా అయింద'ని అందరూ ఆశ్చర్యంగా డిగారు. అంతా సాయి దయ. "ధన్యవాదాలు సాయి. మీ పాదాలందు స్థిరమైన భక్తివిశ్వాసాలు కలిగి ఉండేలా నన్ను ఆశీర్వదించండి. ఎప్పుడూ నేను మిమ్మల్ని మరువకుండా చూడండి బాబా. నేను ఏవైనా  అనుభవాలు పంచుకోవడం మర్చిపోతే గుర్తు చేయండి బాబా. తప్పులు ఏమైనా ఉంటే  క్షమించండి బాబా.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


పది నిముషాల ముందే పూజ అయిపోయేలా ఆశీర్వదించిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. నేను 2023, ఆగష్టు నెల ఆరంభంలో 11 రోజులపాటు రోజుకు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలని అనుకున్నాను. నేను రోజూ ఉదయం 4 గంటలకే పూజ మొదలుపెట్టి హనుమాన్ చాలీసా చదివి 5.10 కల్లా పూజ ముగించి యోగ క్లాసుకి వెళ్తుండేదాన్ని. ఇలా జరుగుతుండగా 2023, ఆగస్టు 10న, గురువారం వచ్చింది. అయితే మాములుగా ప్రతి గురువారం చేసే బాబా పూజతోపాటు హనుమాన్ చాలీసా పఠనం కూడా  చేయాల్సి ఉండడంతో 'నేను సమయానికి యోగ క్లాసుకి వెళ్లలేనేమో! నాతోపాటు యోగ చేసేవాళ్ళు ఎదురుచూస్తారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి?' అని టెన్షన్ పడ్డాను. చివరకి, "మీ దయ బాబా" అని బాబా పూజ చేసి, హనుమాన్ చాలీసా పఠనం మొదలుపెట్టాను. మొత్తం పూర్తయ్యాక టైం చూస్తే,  5 గంటలే అయింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, రోజూ పూజ అయ్యేసరికి 5.10 ఖచ్చితంగా అయ్యేది. అలాంటిది ఆరోజు 10 నిమిషాల ముందే అయిపోయింది. ఏమైనా మర్చిపోయానేమో అని చెక్ చేసుకుంటే అంత సరిగానే జరిగింది. ఏమీ మిస్స్ కాలేదు. అప్పుడు అంతా బాబా ఆశీర్వాదమని బాబాకి దణ్ణం పెట్టుకొని యోగ క్లాసుకి వెళ్ళాను. ఇంకో చిన్న ఆనందం, ముందురోజు ఎప్పటిలాగే నేను బాబా గుడికి వెళ్ళాను. అప్పుడు బాబా చాలాసేపు నన్నే చూస్తున్నట్టు అనిపించి చాలా ఆనందమేసింది. ఈ బ్లాగు రూపంలో మనందరికీ మన అనుభవాలు పంచుకొనే ఒక వేదికను బాబా ఇచ్చారు. "శతకోటి వందనాలు బాబా. ధైర్యంగా 2 వీలర్ నడిపే ధైర్యాన్ని ఇవ్వు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1609వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:

1. తొందరపాటుతో కోప్పడి మాటన్నా ప్రేమతో అనుగ్రహించే బాబా
2. కొంచం కూడా తేడా లేకుండా అనుకున్నంతా అనుగ్రహించిన బాబా

నా పేరు పద్మజ. నిన్నటి భాగంలో కొన్ని అనుభవాలు పంచుకున్న నేను ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.

తొందరపాటుతో కోప్పడి మాటన్నా ప్రేమతో అనుగ్రహించే బాబా

మా నాన్నగారి రెండు కళ్ళల్లో శుక్లాలు ఏర్పడ్డాయి. వాటికి సర్జరీ చేయాల్సి ఉండగా ఆరునెలల క్రితం ఒక కన్నుకి సర్జరీ అయింది. తర్వాత కుడికన్ను సర్జరీకోసం మేము గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళితే వాళ్ళు అన్ని పరీక్షలు చేసి ఒక నెల తర్వాత అంటే 2023, మే 9న సర్జరీ చేయడానికి డేట్ ఇచ్చారు. ఆ రోజు మంగళవారం వచ్చింది. నాకు మంగళవారం సర్జరీ చేయించడం ఇష్టంలేక నర్సుని, "ఇంకొక డేట్ చూడండి" అని అడిగాను. అందుకు తను, "మూడు నెలల తర్వాత డేట్స్ ఖాళీ ఉన్నాయి. ఈ ఒక్కరోజే పేషంట్స్ కొంచం తక్కువ ఉన్నారు" అని చెప్పింది. కానీ నాన్న కంటిలో శుక్లాలు బాగా ముదిరి ఉన్నందున సర్జరీ త్వరగా చేయించాలని డాక్టర్ చెప్పారు. అందువలన మూడునెలల తర్వాత అంటే ఆలస్యం అయిపోతుందని ఒకసారి ఆలోచించుకొని వస్తానని నర్సుతో చెప్పి ఒకచోట కూర్చొని నా మొబైల్లో బాబా వాల్ పేపర్ చూస్తూ, "బాబా! మీ దయవలన మా నాన్నకి ఏ ఆటంకం లేకుండా ఒక కన్ను సర్జరీ అయిపోయింది. కానీ కుడికన్నుకి దగ్గర బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. అందువల్ల కొంచెం ఒక వైపుగా కనిపించదు. ఇప్పుడు ఆ కన్నుకి ఆపరేషన్ తొందరగా చేయించాల్సిన అవసరం వుంది. నాకేమో మంగళవారం సెంటిమెంటు. అయినప్పటికీ మీకు 9 అంకె చాలా ఇష్టం కాబట్టి మీ మీద భారమేసి నేను ఆరోజు సర్జరీకి ఓకే చెప్తున్నాను" అని మనసులో బాబాకి చెప్పుకున్నాను. తర్వాత నర్స్ దగ్గరకి వెళ్లి 2023, మే 9న  సర్జరీకి ఓకే చెప్పాను. తను స్లిప్ రాసిచ్చి "సర్జరీకి వచ్చే ముందు షుగర్ టెస్ట్, బీపీ చెక్ చేయించుకుని రండి" అని చెప్పింది.


2023, మే 9 రానే వచ్చింది. నేను ఆరోజు పొద్దున్నే లేచి బాబాకి పూజచేసి, బాబా గుడికి వెళ్లి, "బాబా! సర్జరీకోసం నాన్నతో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మీరు నాకు తోడుగా రండి" అని దణ్ణం పెట్టుకొని నాన్నని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లాను. ఆ హాస్పిటల్ రెండో అంతస్తులో బాబా విగ్రహం ఉంది. ముందుగా నేను నాన్నని బాబా దగ్గరకి తీసుకొని వెళ్లి బాబాకి దణ్ణం పెట్టించి, నాన్న నుదుటన ఊదీ పెట్టాను. తర్వాత షుగర్ టెస్టుకోసం బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాము. అక్కడున్నవాళ్ళు నర్స్ దగ్గర స్లిప్ తీసుకొని రావాలని చెప్తే, నాన్నని అక్కడే కూర్చోబెట్టి నేను స్లిప్ కోసం పైకి వెళ్లాను. మనసులో చాలా భయంగా, ఒంటరిగా అనిపిస్తుంటే 'బాబా బాబా' అనుకుంటూ వెళ్లాను. సరిగ్గా నర్స్ కూర్చున్న కుర్చీ పక్కన గోడకి పెద్ద బాబా క్యాలెండర్ ఉంది. బాబాని చూడగానే నాకు చాలా ధైర్యంగా అనిపించింది. 'గుడిలో నాకు తోడుగా రండి బాబా' అని అడిగినందుకు 'వచ్చేసారా బాబా' అని అనుకున్నాను. కారణం మేము అక్కడికి చాలాసార్లు వెళ్ళాము కానీ, ముందెప్పుడూ అక్కడ బాబా క్యాలెండర్ లేదు. అలాంటిది సరిగ్గా నాన్న సర్జరీ అప్పుడు బాబా అక్కడ దర్శనం ఇవ్వడంతో చాలా ఆనందంగా, ధైర్యంగా అనిపించింది. తర్వాత నాన్న షుగర్ టెస్టు అయింది. సర్జరీకి ఒక గంట ముందు రిపోర్ట్స్ వస్తాయి అని అన్నారు. నేను, 'నాన్నకి డయాబెటిస్ లేదు, ఆయన సర్జరీ అయిపోతుంది' అనుకున్నాను. కానీ హఠాత్తుగా రిపోర్టులో షుగరు చాలా ఎక్కువగా ఉందని సర్జరీ చేయమన్నారు. నాకు చాలా ఏడుపొచ్చేసింది. 'ఏంటిది ఇలా జరిగింది? బాబాకి ఎంత ప్రార్థించాను. టెస్టుకు ముందు కూడా నాన్న నడవలేకపోయినా రెండో అంతస్తుకి తీసుకెళ్లి మరి బాబాకి దణ్ణం పెట్టించి టెస్ట్ చేయించాను. బాబా నాకు తోడుగా వచ్చారని సంబరపడిపోయాను. అంతా నా భ్రమా?' అని బాబా మీద కొంచెం కోపం వచ్చింది. కానీ సాయి లీలలు మామూలుగా ఉండవు కదా! తర్వాత ఏం జరిగిందో చూడండి.


నేను నర్సు దగ్గరకి వెళ్లి, "నాకెందుకో ఈ రిపోర్ట్ తప్పనిపిస్తుంది. ఎందుకంటే, మా నాన్నకు అసలు షుగర్ లేదు" అని అన్నాను. నర్స్, "మీకు అనుమానం ఉంటే రేపొచ్చి షుగర్ టెస్టు మళ్ళీ చేయించుకోండి. నార్మల్ వస్తే, సర్జరీ చేసేస్తాము. ఈరోజు అయితే ఇంకా చేయరు" అని చెప్పింది. నా మనసులో ఒకటే ఆందోళన. ఎందుకంటే, నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. మళ్లీ ఇప్పుడు డయాబెటిసా అని నాకు చాలా బాధేసింది. సరే ఆరోజుకి నాన్నని తీసుకొని ఇంటికి వచ్చేసాను. "రేపు రిపోర్టులో నార్మల్ రావాల"ని బాబాని ప్రార్థిస్తూ 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని ఆ రోజంతా జపించాను. మరుసటిరోజు వెళ్లి షుగర్ టెస్టుకి ఇచ్చాము. బాబా దయవల్ల రిపోర్టు నార్మల్ వచ్చింది. అప్పుడు నా మనసు కుదుటపడింది. మధ్యాహ్నం సర్జరీ అని చెప్పారు. నేను ఒక్కదాన్నే మా నాన్నతో కూర్చొని ఉన్నాను. ఇంతలో నేను పూర్వం వర్క్ చేసిన చోట ఉండే ఒక సార్ కాల్ చేసి, "ఎలా ఉన్నావమ్మా? చాలా నెలలు అయిపోయింది మాట్లాడి. అమ్మానాన్న ఎలా ఉన్నారు?" అని అడిగారు. నేను ఆయనతో మా నాన్న సర్జరీ గురించి, షుగర్ టెస్ట్ గురించి చెప్పి "సర్జరీ నిన్న జరగాలి సార్. కానీ ఈ రోజుకు మార్చారు" అన్నాను. వెంటనే ఆయన, "అంతా మంచికే. నిన్న మంగళవారం, చవితి కూడా. ఈరోజు జరగడం చాలా మంచిది" అన్నారు. వెంటనే నాకు "మంగళవారం సర్జరీ నాకు ఇష్టం లేదు బాబా" అని బాబాతో చెప్పుకున్న విషయం గుర్తొచ్చి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆపై బాబా నా కోరికకు అనుగుణంగా సర్జరీ జరగాలని ముందురోజు తప్పు రిపోర్టు వచ్చేలా చేస్తే నేను అది అర్థం చేసుకోకుండా బాబాపై కోప్పడ్డాను, ఆయనను నిందించాను అని గ్రహించి వెంటనే బాబాకు క్షమాపణ చెప్పుకున్నాను. ఇకపోతే సర్జెరీకోసం 11 మంది వెయిట్ చేస్తుండగా మొదట మా నాన్ననే పిలిచి సర్జరీ చేశారు. బాబా దయవల్ల ఏ ఆటంకం లేకుండా సర్జరీ పూర్తైంది. నాన్న బయటకు వచ్చి, "నొప్పేమీ లేదు, భయపడకండి" అని మిగిలినవాళ్ళకు ధైర్యం చెప్తుంటే నాకు చాలా ఆనందమేసింది. సర్జరీ అనుకున్న రోజు నుంచి సర్జరీ పూర్తయ్యేవరకు అడుగడుగునా సహాయం చేస్తున్న బాబా అనుగ్రహం గుర్తొచ్చి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆయన దయవల్ల మా నాన్న ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".


కొంచం కూడా తేడా లేకుండా అనుకున్నంతా అనుగ్రహించిన బాబా

ప్రతినెలా నా జీతమంతా పోగా మరో 2000 రూపాయలు అదనంగా నాకు అవసరం పడుతుండేవి. వాటికోసం నేను ఎవరో ఒకరిని అడుగుతుండేదాన్ని. ప్రతినెలా అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఒకరోజు నేను, 'ఇక ఇలా కాదు. ఎవరినీ ఆడకూడదు. ప్రతినెలా అడగటం బాగోదు' అని అనుకోని నా కంప్యూటరుకి అతికించి ఉన్న చిన్న బాబా గ్రీటింగ్ కార్డును చూస్తూ, "బాబా! ప్రతినెలా రెండు వేల రూపాయలు అదనంగా నాకు అవసరమవుతున్నాయి. అది చిన్న మొత్తమే. కానీ ఎవరినైనా అడగాలంటే మొహమాటంగా ఉంది. కాబట్టి నేను క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకుంటాను. అప్పుడు ఇంకెవరినీ అడగాల్సిన పని ఉండదు. నాకు కావాల్సిన డబ్బులు నేనే తీసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో క్రెడిట్ కార్డుకి ఎలా అప్లై చేయాలో నాకు తెలియదు. కాబట్టి బ్యాంకుకి వెళ్లి అప్లై చేయాలి. అందుకోసం నేను సెలవు పెట్టాలి. సెలవుపెడితే ఒకరోజు జీవితం పోతుంది" అని చెప్పుకున్నాను. చెప్పుకోవడం అంటే బాబాకి నేను ఏం మ్రొక్కలేదు, దణ్ణం కూడా పెట్టుకోలేదు, కేవలం ఒక స్నేహితునితో మాట్లాడుకున్నట్టు బాబాతో మాట్లాడను. అంతే, అంతటితో ఆ విషయం మర్చిపోయి నా పనిలో నేను పడిపోయాను. కానీ నాయన(బాబా) పిలిస్తే పలుకుతారు కదా! ఆయన చేసిన అద్భుతానికి ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. విషయమేమిటంటే..


ఆ రోజు ఆదివారం. మా హెడ్ ఆఫీస్ హైదరాబాదులో ఉంటుంది. అప్పుడప్పుడు సార్ వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ మాకు ఒక మేనేజర్ ఉంటారు అంతే. ఆదివారం అస్సలు ఎవరూ రారు. మెయిన్ హెడ్ రాజు సార్ చాలా పెద్దాయన. అసలు ఆయన ఎక్కడికీ రారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆరోజు మధ్యాహ్నం మా బ్రాంచుకి వచ్చారు. హఠాత్తుగా ఆయన్ని చూసి బ్రాంచులో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. 'ఆయన ఏమీ అడుగుతారు? ఎక్కడైనా, ఏమైనా పొరపాట్లు జరిగాయా? అసలు హఠాత్తుగా ఎందుకు వచ్చారు?" అని అందరూ కంగారుకంగారుగా ఉన్నారు. ఆయన క్యాబిన్లో కూర్చోగానే మొదట నన్నే పిలిచారు. 'ఇంతమంది పెద్దవాళ్ళు ఉండగా నన్ను పిలుస్తున్నారెంటి?' అని నాకు చాలా భయమేసింది. నెమ్మదిగా లోపలికి వెళ్లాను. ఆయన నన్ను చూస్తూనే "మేనేజరుని పిలుచుకొని రామ్మా" అని అన్నారు. నేను బయటకి వచ్చి మేనేజర్ సార్‌తో విషయం చెప్పి, ఇద్దరం కలిసి కేబిన్‌లోకి వెళ్ళాము. అప్పుడు పెద్దాయన చెప్పిన మొదటి మాట, "అమ్మా! నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను. అది పూర్తి చేస్తే ప్రతినెలా నీకు 2,000 రూపాయల అదనంగా ఇస్తాము" అని. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడూ, ఎక్కడికీ వేళ్ళని సార్ మా బ్రాంచుకి రావడం, నాతోనే మాట్లాడటం, అది కూడా పొద్దున్న నేను బాబాతో ఎంత మొత్తమైతే చెప్పానో సరిగ్గా అది మొత్తం(2,000) రూపాయలు ఆఫర్ చేయడం చూసి చాలా అంటే చాలా ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. ఆలస్యం చేయకుండా సార్ చెప్పినదానికి 'ఓకే' చెప్పి బయటకు వచ్చాను. సార్ సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోయారు. నా మనసులో, "బాబా! 2,000 రూపాయలు వచ్చేనెల వస్తాయి. మరి ఈ నెల పరిస్థితి ఏంటి? నాకు ఇచ్చిన ఆ టాస్క్ చేయగలనా?" అని అనుకుంటూ ఉండగా మరో బాబా లీల జరిగింది. మా మేనేజర్ నన్ను, నా సహోద్యోగిని పిలిచారు. నేను, ఆ అమ్మాయి లోపలికి వెళ్ళాం. వెంటనే మేనేజర్, "జూన్ నెలలో మీరు టార్గెట్ రీచ్ అయ్యారు కదా! అప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. ఇప్పుడు తీసుకోండి" అని నాకు 2,000 రూపాయలు, ఆ అమ్మాయికి 2,000 రూపాయలు ఇచ్చారు. బాబాని అడిగిన మొత్తమే సార్ ఇవ్వడం ఏంటి అసలు? బాబా పిలిస్తే పలుకుతున్నారు అని ఎంత ఆనందమేసిందో మాటల్లో చెప్పలేను. తరువాత బయటికి రాగానే నా సహోద్యోగి, "అక్కా! నీ టాస్క్‌కి సంబంధించి డేటా నా దగ్గర ఉంది. తీసుకో" అని చూపించింది. నేను నా మనసులో బాబాని, "బాబా! వచ్చే నెల టాస్క్ ఉంది అనుకుంటే ఇంతలోనే ఏ శ్రమపడకుండా డేటా అంతా ఇచ్చేసారు" అని అనుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను మీ ఋణం ఏ జన్మలోనైనా తీర్చుకోలేను. ఏ జన్మ పుణ్యమో నన్ను మీ దగ్గరకి తీసుకున్నావు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1608వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా సన్నిధి నుంచి రాగానే సమస్యకు పరిష్కారం
2. గురుపౌర్ణమినాడు రోజుంతా తమతోనే ఉంచుకున్న బాబా
3. కేవలం ఊదీతో కొన్ని నెలలుగా ఏ ఔషదాలు తగ్గిన నొప్పి మాయం

బాబా సన్నిధి నుంచి రాగానే సమస్యకు పరిష్కారం 


నా పేరు పద్మజ. ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని అనుభవాలు చదువుతున్న సాయి బిడ్డలకు నా నమస్కారం. దాదాపు 8 సంవత్సరాల క్రితం బాబా నా జీవితంలోకి వచ్చారు. అప్పట్లో సాయిబాబా అంటే ఒక దేవుడని మాత్రమే నాకు తెలుసు. మా ఇంటి పక్కనే బాబా గుడి ఉండేది కానీ, నేను అంతగా ఆయన్ని నమ్మేదాన్ని కాదు. నేను ఇంకో దైవాన్ని నమ్ముకొని ఆ దేవుని గుడి మా ఇంటినుండి కొంచం దూరంలో ఉన్నప్పటికీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడిచి వెళ్లి అక్కడ 108 ప్రదక్షిణాలు చేసి ఆపై నా డ్యూటీకి వెళ్లేదాన్ని. నేను ఒక సమస్యతో ఇంకా పోరాడలేక చాలా పెద్ద నిర్ణయం తీసుకుందామనుకున్న సమయంలో మన సాయితండ్రి నా జీవితంలోకి వచ్చారు. అదెలా అంటే, ఒకరోజు నేను చాలా బాధతో ఏడ్చాను. గుడికి వెళితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. కానీ అంత దూరం వెళ్లి 108 ప్రదక్షిణాలు చేయాలంటే నా కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. అందువలన అంతదూరం వెళ్లలేకపోయాను. ఆ సమయంలో నాకు ఏ ప్రేరణ కలిగిందో తెలీదుగాని, ఇంటి పక్కనే ఉన్న బాబా గుడికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి, "సాయిబాబా అంటే మీరే కదా!" అని ఒక స్నేహితునితో మాట్లాడినట్టు బాబాతో మాట్లాడుతూ చాలాసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చుని నా మనసులో బాధంతా చెప్పుకున్నాను. 108 ప్రదక్షిణాలు చేయలేదు, ఉపవాసాలు ఉండలేదు, ఏ పూజ చేయలేదు, కేవలం నా బాధ చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చాను. అంతే! ఎన్నో సంవత్సరాల నుంచి ఎటూ తేల్చుకోలేని సమస్య, ఇక జరగదనుకున్నది బాబా సన్నిధి నుంచి రాగానే పరిష్కారం అవడం మొదలయ్యింది. నేను ఆశ్చర్యపోయాను. చివరికి నేను ఊహించని రీతిలో బాబా ఆ సమస్యను తీర్చేసారు. అది కూడా చాలా తేలికగా. నిజానికి ఆ సమస్య విషయంలో ఏమీ తేల్చుకోలేక నేను చావే గతి అనుకున్నాను. అలాంటి స్థితిలో బాబా నా జీవితాన్ని మార్చేశారు. నేను ఈరోజు చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నానంటే అందుకు కారణం బాబానే. ఆరోజు ఏ నమ్మకమూ లేకుండా బాబా గుడికి వెళ్లిన నాకు ఈరోజు 'సాయీ' అంటే కంటనీరు(ఆనందబాష్పాలు) వచ్చేంత ఇష్టం. స్నేహితులు, బంధువులు వద్ద సహాయం అందుతుందో, లేదో తెలియదు కానీ సాయి వద్ద సహాయం ఖచ్చితంగా అందుతుంది. ఆయన పిలిస్తే పలుకుతారు. ఆయన చేసిన అద్భుతాలు ఒకటో, రెండో కాదు ఎన్నో. వాటి గురించి నేను ఏమని, ఎన్నని చెప్పాలి? ఇప్పుడు మాత్రం కొన్ని పంచుకుంటాను.


గురుపౌర్ణమినాడు రోజుంతా తమతోనే ఉంచుకున్న బాబా

సాయి నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాలలో ప్రతి గురుపౌర్ణమికి నేను ఒక అతిథిలా గుడికి వెళ్లి బాబాని దర్శించి, ప్రసాదం తీసుకొని వచ్చేస్తుండేదాన్ని. కానీ ఈ సంవత్సరం(2023) నాకెందుకో 'మా బాబాకి మనం దగ్గరుండి గురుపౌర్ణమి చేయాలి, నేను ఏదో రకంగా ఆయన సేవలో పాల్గొనాలి' అనిపించి బాబాని, "'ఇన్ని సంవత్సరాలుగా మీ సహాయం తీసుకుంటున్న నాకు గురుపౌర్ణమినాడు మీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి బాబా" అని అడుగుతుండేదాన్ని. ఆయనని అడిగితే చేయకుండా ఉంటారా? గురుపౌర్ణమి ముందురోజు నేను, నా స్నేహితురాలు మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడికి వెళ్ళాం. అక్కడ చాలామంది పని చేస్తుంటారు. మా అవసరం ఏమీ ఉండదు. ఆ గుడి మేనేజర్ నా స్నేహితురాలితో బాగా మాట్లాడతారు. అతను ఆరోజు నా స్నేహితురాలిని పిలిచి, "రేపు మీరు కూడా బాబాకి సేవ చేసుకోవచ్చు కదా!" అని నా స్నేహితురాలితో అని, మరుసక్షణం నావైపు చూసి, "మీరు కూడా రండమ్మా. పొద్దున్నే భక్తులు చేతుల మీదగా బాబాకి పాలాభిషేకం ఏర్పాటు చేశాం. మీరు సేవలో పాల్గొనండి" అన్నారు. ఇంకా నా ఆనందానికి అవదులులేవు. నా స్నేహితురాలు తనకి సెలవు ఇవ్వరని చెప్పింది. నేను మాత్రం ఈ అవకాశం అసలు వదులుకోనని మరుసటిరోజు పొద్దున్నే బాబా గుడికి వెళ్లి మధ్యాహ్నం వరకు బాబాకు ఎదురుగా నిల్చొని, ఆయన దర్శనం చేసుకుంటూ గురుపౌర్ణమినాడు ఆయన సేవ సంతోషంగా చేసుకున్నాను. అప్పుడు మేనేజరుగారు, "సాయంత్రం కూడా కాస్త రామ్మ. భక్తులు ఎక్కువగా వస్తుంటారు కదా!" అని అన్నారు. బాబా సేవ చేసుకొనేందుకు మరో అవకాశం వస్తే ఎలా కాదంటాను? సంతోషంగా వెళ్ళాను. సాయంత్రం పల్లకి సేవ అయిపోయాక అందరం నిల్చోని ఉన్నాము. పల్లకి సేవ చేయించినవాళ్ళకి ఆ పల్లకిలో ఉన్న చిన్న బాబా విగ్రహం ఇచ్చారు. అది చూడగానే నేను బాబా వైపు చూస్తూ, "వాళ్ళు ఎంత అదృష్టవంతులో బాబా!  గురుపౌర్ణమినాడు పల్లకి సేవ చేయించుకొని మీ ప్రతిమను బహుమానంగా తీసుకున్నారు. నేను మిమ్మల్ని ఒక కోరిక కోరాను. అది నెరవేరితే నేను, నా భర్తతో కలిసొచ్చి పల్లకి సేవ చేయించుకుంటాను" అని బాబాతో చెప్పుకొని అప్పుడు నాకు కూడా విగ్రహం ఇస్తారనుకుంటున్నాను. అంతలో మేనేజరుగారు పూజారితో, "పల్లకిలో ఇంకా ఐదు బాబా విగ్రహాలున్నాయి కదా! ఒకటి ఈ అమ్మాయికి ఇవ్వండి" అని అన్నారు. అసలు ఎంత ఆనందమేసిందో మాటల్లో చెప్పలేను. 'గురుపౌర్ణమినాడు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి' అని అడిగిన నన్ను గురుపౌర్ణమి రోజంతా తమతోనే ఉంచుకొని అంతలా అనుగ్రహించారు బాబా. ఇంకో విషయం, బాబా విగ్రహం నాకు ఇచ్చినప్పుడు నా స్నేహితురాలు నా పక్కనే ఉంది. తను కూడా మనసులో, "అబ్బా! నేను కూడా సేవ చేసుకొని ఉంటే, నాతో కూడా బాబా వచ్చేవాళ్ళు కదా" అనుకుంది. వెంటనే తనకి కూడా ఒక బాబా విగ్రహం ఇచ్చారు. తను కూడా చాలా సంతోషించింది.

కేవలం ఊదీతో కొన్ని నెలలుగా ఏ ఔషదాలు తగ్గిన నొప్పి మాయం

చాలా నెలల క్రిందట మా అమ్మ చేతి ణికట్టు దగ్గర కొంచెం నరం వాపు వచ్చి, బరువులు మోయలేక బాధతో కొంచెం ఇబ్బందిపడుతుండేది. నేను తగ్గిపోతుందిలే అని కొంచెం అశ్రద్ధ చేశాను. పోనుపోను నొప్పి ఎక్కువైపోయింది. ఇక అప్పుడు నేను అమ్మ బాధని చూడలేక, "హాస్పిటల్‌కి వెళ్దామ"ని అమ్మని అడిగాను. తను పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హోమియో మందులు వాడుకుంటాను అని చెప్పి, మా పిన్నివాళ్ళుకు తెలిసిన ఒక హోమియో డాక్టర్ దగ్గర రెండు నెలలు మందులు వాడింది. కానీ నొప్పి కొంచెం కూడా తగ్గలేదు. ఇక అప్పుడు తప్పనిసరై నేను, అమ్మ హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టర్ ఎక్స్‌రే తీయించుకొని రండి అని అన్నారు. సరేనని, ఎక్స్‌రే తీయించాము. డాక్టర్ ఆ ఎక్స్‌రే చూసి, "కొంచెం నరం నలిగింది. పది రోజులు టాబ్లెట్లు వాడండి తగ్గిపోతుంది" అని టాబ్లెట్లు వ్రాసి ఇచ్చారు. కానీ పది రోజులైనా నొప్పి కొంచెం కూడా తగ్గలేదు. అందువల్ల మళ్లీ డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చి, మూడు రోజులకి మందులు వ్రాసి, "వీటితో తగ్గకపోతే చిన్న సర్జరీ చేయాలి" అని అన్నారు. అది విని నాకు, అమ్మకి చాలా భయమేసింది. ఆ భయంలో అమ్మ మందులు వాడటం పూర్తిగా ఆపేసింది. ఒకరోజు రాత్రి నిద్రలో అమ్మ చేయి మంచంకి తగిలేసరికి అమ్మ నొప్పి తట్టుకోలేక చాలా ఏడ్చింది. నాకు చాలా భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ తెచ్చి అమ్మ చేతికి రాసి, బాబా పుస్తకం అమ్మ దిండు కింద పెట్టాను. అయిదు నిమిషాల్లో అమ్మ నిద్రపోయింది. పొద్దున్న లేచిన తరువాత అమ్మ, "బాబా పుస్తకం పట్టుకుని పడుకున్నాను, నిద్ర వచ్చేసింది. నొప్పి కూడా అనిపించలేదు" అని చెప్పింది. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే బాబాని బాగా నమ్ముతాను. అలాంటిది అమ్మ బాబా గురించి అలా సానుకూలంగా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే, "బాబా! అమ్మకి తగ్గిపోతే అమ్మతో కలిసి గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి, అమ్మచేత తొమ్మిది ప్రదక్షిణాలు చేయిస్తాను సాయి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అసలు ఏ మందులు వాడకుండా ప్రతిరోజూ పొద్దున్న, రాత్రి స్నానం చేశాక అమ్మ చేతికి ఊదీ రాస్తుండేదాన్ని. దాదాపు 6 నెలల నుంచి ఎన్ని మందులు వాడుతున్నా తగ్గని నొప్పి, మందులన్నీ ఆపేసి ఊదీ రాయడం మొదలుపెట్టిన 10 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. అమ్మ చాలా ఆశ్చర్యపోయింది. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం అమ్మతో మొక్కు చెల్లించుకున్నాను. ఇప్పుడు అమ్మ ఏ చిన్న కష్టమొచ్చినా బాబాకి చెప్పుకుంటుంది. "చాలాచాలా ధన్యవాదాలు బాబా".

మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో పంచుకుంటాను.                                                                


సాయిభక్తుల అనుభవమాలిక 1607వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది 
2. పెద్దది అనుకున్న సమస్యను చిన్నది చేసేసిన బాబా

బాబాను నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది 


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేనొక చిన్న సాయిభక్తురాలిని. మాది నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ. మేము మా ఆస్తి విషయంలో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాం. దానికోసం మేము 2012లో కోర్టులో కేసు వేశాము. కానీ 2014 వరకు ఆ కేసు అస్సలు ముందుకు సాగలేదు. ఆ విషయంగా బాధపడుతుంటే, మా బాబాయి, "బాబాను నమ్ముకో! ఆయన సచ్చరిత్ర పారాయణ చేయి!" అని నాకు సలహా ఇచ్చారు. నేను ఆయన చెప్పినట్లే బాబాపై నమ్మకముంచి ఆరోజు నుంచి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. బాబా దయవల్ల 7 సంవత్సరాల తర్వాత 2021, డిసెంబరులో మా ఆస్తిపై మాకు హక్కు వచ్చింది. మేము చాలా సంతోషించాము. అయితే, మావారి అన్నదమ్ములు పైకోర్టుకు వెళ్లారు. మేము మాత్రం 'బాబాను  నమ్ముకుంటే ఆయనే మాకు దారి చూపిస్తార'ని నమ్మకంతో ఉన్నాము. వాళ్ల మనసు మారి అందరం సంతోషంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నా ఈ అనుభవం పంచుకోవాలని చాలారోజుల నుంచి అనుకుంటున్నాను కానీ, ఎలా పంపాలో తెలియక చాలా ఆలస్యం జరిగింది. "బాబా! నన్ను క్షమించండి. సదా మీ స్మరణలో ఉండేలా అనుగ్రహించండి బాబా". 


మాకు ఇద్దరు అబ్బాయిలు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న పెద్దబ్బాయికి వివాహమై తన కుటుంబం చాలా సంతోషంగా ఉంది. కానీ చిన్నబ్బాయి పెళ్లి విషయంలో నేను చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే, ఈ కాలంలో అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఒక పెద్ద సమస్య అయిపోయింది. అదీకాక, మా చిన్నబ్బాయి మూలానక్షత్రంలో పుట్టాడు. ఆ నక్షత్రంలో పుట్టినవారికి పెళ్లి ఆలస్యమవుతుందని అందరూ అనేవాళ్ళు. నేను బాబాను నమ్ముకొని భారం ఆయన మీద పెడితే ఆయన చమత్కారం చేశారు. మొదట వచ్చిన సంబంధమే కుదిరింది. ఒక్క నెలలో నిశ్చితార్థం, పెళ్లి రెండూ అయిపోయాయి. సంవత్సరంలో వాళ్ళకి బాబు కూడా పుట్టాడు. ఇదంతా బాబా దయ. నాకు చాలా సంతోషంగా ఉంది. బాబాను నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది. "ధన్యవాదాలు బాబా. చిన్నబ్బాయికి జీతం తక్కువగా ఉంది బాబా. మీ దయతో వాడు ఏదైనా కంపెనీకి మారితే జీతం పెరుగుతుందని ఆశపడుతున్నాను బాబా. దయచూపు తండ్రీ. అలాగే ఎల్లప్పుడూ మీ చల్లని చూపు అందరిపైనా ఉండేలా అనుగ్రహించు బాబా".

 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


పెద్దది అనుకున్న సమస్యను చిన్నది చేసేసిన బాబా

సాయిభక్తులకు నమస్కారం. నా పేరు ఉష. నేను నా చిన్నతనం నుంచి సాయిభక్తురాలిని. పెద్ద పెద్ద ప్రమాదాల నుండి బాబా నన్ను చాలాసార్లు రక్షించారు. గురువుగా, దైవంగా నా సాయితండ్రి కరుణ నాకు ఎప్పుడూ ఉంది. అది నా పూర్వజన్మ సుకృతమనిపిస్తుంది. 2023, జూలై 10న నాకు విపరీతమైన నడుమునొప్పి వచ్చింది. పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ వేసుకున్నా నొప్పి తగ్గలేదు. “నొప్పి తగ్గించమ”ని బాబాని వేడుకున్నప్పటికీ నొప్పి తగ్గలేదు. బాబా ‘వైద్యుల అవసరం ఉంద’ని సూచించారు. దాంతో డాక్టరుని సంప్రదిస్తే, ఎక్స్-రే తీసి, “డిస్క్ జారింది” అని MRI టెస్టుకి వ్రాశారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “సమస్య మందులతో తగ్గిపోవాలి. ఆపరేషన్ అవసరం రాకూడద”ని వేడుకున్నాను. బాబా దయవల్ల డాక్టర్ MRI రిపోర్ట్ చూసి, “ఫిజియో ఎక్సర్సైజ్‌తో తగ్గుతుంది. భవిష్యత్తులో ఇబ్బందికలగకుండా మీ జీవన విధానం మార్చుకోండి” అని చెప్పారు. నిజంగా బాబా పెద్దది అనుకున్న సమస్యను చిన్నది చేసేశారు. నా ఆరోగ్యం పట్ల నాకన్నా సాయినాథునికే ఎక్కువ శ్రద్ధ. ఇలా ఎందుకు అన్నానంటే, పైన చెప్పిన సమస్య వచ్చాక ఒకరోజు కారు గుద్ది నేను బండి మీద నుంచి పడిపోయాను. కానీ నా ఒంటిపై చిన్న గీత కూడా పడలేదు. నాకేమీ కాలేదని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నా అదృష్టం, సాయినాథుడే దయతో నన్ను రక్షించారు. “నాకు, నా కుటుంబానికి ఎల్లవేళలా మీ ఆశీస్సులు ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని సాయిదేవా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి తండ్రీ”.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1606వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 22వ భాగం

నా పేరు సాయిబాబు. 2019లో దీపావళి పండగకి బెంగుళూరు నుండి మా అమ్మాయి, అల్లుడు, మనువడు మా ఇంటికి వచ్చారు. మేము "పండగ బాగా చేసుకోవాల"ని బాబాని వేడుకున్నాము. మేము మా ఇంటిని ‘బాబా గుడి’ అని భావిస్తాం గనక ప్రతి సంవత్సరం దీపావళికి ఇంటికి లైటింగ్ పెడతాము. ఆ పని మా స్టూడెంట్ల సహకారంతో మేమే స్వయంగా చేసుకుంటాము. కానీ ఆ సంవత్సరం పనుల ఒత్తిడి వల్ల లైటింగ్ పెట్టడానికి మాకు కుదరలేదు. అందువల్ల బయటవాళ్ళని పిలిస్తే వాళ్ళు పైనా, క్రింద లైటింగ్ పెట్టడానికి 16,000/- అని, పైన మాత్రమే అయితే 12,000/- అని చెప్పారు. మేము 'అంత రేటా? చాలా ఎక్కువ' అని, “బాబా గుడికి పెడుతున్నామనుకొని పెట్టి వెళ్ళండి. 3000/- ఇస్తాము" అని చెప్పాము. వాళ్ళు ఏదో మైకంలో ఉన్నట్లు, "సరేనండీ పెడతాము" అని అన్నారు. మేము కొంచెం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే, 16000/- ఎక్కడ? 3000/- ఎక్కడ? ఏదేమైనా బాబానే వాళ్ళ మనసుని సమాధానపరిచి లైటింగ్ పెట్టిస్తున్నారని మేము భావించాము. వాళ్ళు చాలా అందంగా లైటింగ్ పెట్టారు. ఫోటోలు, వీడియోలలో మా ఇల్లు(బాబా గుడి) చాలా బాగా కన్పించింది. అవి చూసుకుని మేము చాలా ఆనందించాము. తరువాత ఒకరోజు నేను అనుకోకుండా అమ్మవారి దర్శనానికని విజయవాడ వెళ్ళాను. అప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసి, "ప్రతిసారీ లైటింగ్‌వాళ్ళను పిలిపించటం ఎందుకు? మన బాబా గుడికి మనమే స్వయంగా లైటింగ్ కొనుక్కొని, ప్రతి సంవత్సరం వేసుకుందాం. కొత్త లైట్లు, దానికి కావల్సిన మెటీరియల్ తీసుకోండి" అని చెప్పింది. సరేనని, షాపుకి వెళ్ళాను. అది హోల్సేల్ షాపు కావటాన బాబా దయవలన చాలా తక్కువ ధరకే లైటింగ్ సామాగ్రి దొరికింది. అమ్మాయి ఫోన్ పే ద్వారా షాపువాళ్ళకు డబ్బు పంపింది. అలా మా బాబా గుడికి సొంత లైటింగ్ అమరింది. అలాగే చాలా తక్కువ ధరకు చాలా క్రాకెర్స్ కూడా ఇప్పించారు బాబా. వరుసగా ఐదురోజులు కాల్చిన తరువాత కూడా మరుసటి సంవత్సరానికి మిగిలిపోయాయి.

తర్వాత ఒక బుధవారం రాత్రి మా అమ్మాయికి బాబా స్వప్న దర్శనమిచ్చారు. ఆ కలలో తను బాబాతో మాట్లాడుతూ తనకున్న చిన్న చిన్న సందేహాలను ఆయనకి చెప్తుంటే, ఆయన ఓపికగా విని వాటికి సమాధానాలిచ్చారు. మా అమ్మాయికి ఎంతో మనశ్శాంతిగా అనిపించింది. తెల్లవారితే గురువారం. ఉదయం 4 గంటలకు నిద్రలేచి స్నానాలు ముగించుకుని అభిషేకం చేద్దామని నా భార్య బాబా విగ్రహానికి ఉన్న వస్త్రాలు తొలగిస్తూ "వెంటనే రండి" అని నన్ను పిలిచింది. నేను వెళ్లి విగ్రహాన్ని చూస్తూనే మా అమ్మాయిని, అల్లుడిని, మనవడిని పిలిచి త్వరగా స్నానం చేసి రండి అన్నాను. అందరూ వచ్చాక అందరం ఆనందాశ్చర్యాలతో, ముకుళిత హస్తాలతో బాబాకి నమస్కరిస్తూ తన్మయత్వం చెందాము. విషయమేమిటంటే, బాబా విగ్రహం మీద పలు చోట్ల ఊదీ ప్రకటమై ఉంది. ఆవిధంగా రాత్రి మా అమ్మాయికి నిజంగానే దర్శనమిచ్చి, మాట్లాడమని బాబా తెలియజేసారు. మేమందరం చుట్టూ కూర్చొని మద్యలో బాబాని పెట్టుకొని ఆయనకి అభిషేకం చేశాము. "రాత్రి బాబా దర్శనమివ్వడం. ఊదీ ప్రకటమవడం, మనమందరం కలిసి బాబాకి అభిషేకం చేయడం చాలా ఆనందంగా వుంది" అని మా అమ్మాయి అంది. పూజయ్యాక అందరం కొంచెం ఊదీ నుదుటన ధరించి, కొంచెం నోటిలో వేసుకున్నాము. మా మనవడు, "ఇది అచ్చం శిరిడీ ఊదీలానే వుంది" అని అన్నాడు. బాబా ఎక్కడున్నా శిరిడీ బాబానే. ఏ ఊదీ అయినా శిరిడీ ఊదీయే. ఇలా ఊదీ ప్రకటమవడం ఇది రెండోసారి(ఇదివరకు పంచుకున్న అనుభవాలలో చిన్న విగ్రహం నుంచి ఊదీ రావడం గురించి తెలియజేశాను).

దీపావళి పండగ అయ్యాక మా అమ్మాయివాళ్ళు తిరిగి బెంగుళూరు వెళ్ళడానికి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళేది ఎలాగూ కారులోనే కాబట్టి నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. మేము ముందుగా శ్రీశైలం వెళ్ళి, అక్కడ స్వామివారి దర్శనం చేసుకొన్ని వెళ్లాలనుకున్నప్పటికీ కొంతదూరం వెళ్ళాక, ‘ఈ సమయంలో శ్రీశైలం వెళితే, మరుసటిరోజు మా అల్లుడు ఆఫీసుకి, మనవడు స్కూలుకి సమయానికి చేరుకోలేమ’ని నేరుగా బెంగళూరు మార్గంలో వెళ్ళాము. మధ్యాహ్నం 12 గంటలకి 'శ్రీకాళహస్తి' చేరుకున్నాం. గుడి దగ్గర చాలా కార్లు కనిపించడంతో చాలా రద్దీగా ఉందేమోనని 'కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవాలా? వద్దా?' అని బాబాని అడిగాము. 'దర్శనానికి వెళ్ళమ'ని బాబా సెలవిచ్చారు. ఇంకా వెళ్లి దర్శనం చేసుకుని, అమ్మవారిని కూడా దర్శించుకొని ప్రసాదం తీసుకుని బయలుదేరాము. 'పోనీలే, శ్రీశైలం దర్శించకపోయినా కాళహస్తీశ్వరుని దర్శనం చేయించారు బాబా' అని అనుకున్నాము. తిరుపతి దాటాక సాయంత్రం 5 గంటల సమయంలో ఎదురుగా బాబా అద్భుతం, అమోఘం అయిన ఒక దృశ్యాన్ని చూపించారు. మాకు ఎదురుగా ఎటువంటి మేఘాలు లేకుండా చాలా నిర్మలంగా వున్న ఆకాశంలో వరుసగా శ్రీశైల క్షేత్ర గోపురం, పానపట్టం మీద శివలింగం, నందీశ్వరుడు చాలా సృష్టంగా దర్శనమిచ్బాయి. చీకటిపడేవరకూ అలా కన్పిస్తూనే వున్నాయి. అలా శ్రీశైలం వెళ్ళలేకపోయామే అనే భాధ మాకు లేకుండా శ్రీశైలక్షేత్రాన్ని ఆకాశంలో దర్శింపజేశారు బాబా.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



సాయిభక్తుల అనుభవమాలిక 1605వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బిడ్డలని కాపాడిన బాబా
2. బాబా దయతో తగ్గిన దగ్గు, జ్వరం

బిడ్డలని కాపాడిన బాబా


సాయిభక్తులకి నమస్కారం. నా పేరు పావని. సాయి నన్ను ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఒకసారి మేము కొన్ని పరిస్థితుల కారణంగా డిగ్రీ చదువుతున్న మా పెద్దబాబుని కొన్ని రోజులు హాస్టల్లో ఉంచాం. మా సమస్యలు కొంత సర్డుకున్నాక బాబుని, "ఇక హాస్టల్లో వద్దు, ఇంటికి వచ్చేయి. ఇంటి నుండే కాలేజీకి వెళ్ళు" అంటే వచ్చాడు. కానీ రెండు రోజులు ఇంటి నుండి కాలేజీకి వెళ్లిన తరువాత, "నేను హాస్టల్లోనే ఉంటాన"ని అనడం మొదలుపెట్టాడు. ఎంత చెప్పినా మాట అస్సలు వినకుండా బ్యాగు సర్దుకోసాగాడు. వాళ్లనాన్న చెప్పినా వినలేదు. దాంతో వాడు చెడు అలవాట్లు నేర్చుకున్నాడని నాకు అనిపించింది. తర్వాత అదే నిజమని తెలిసింది. అంటే, హాస్టల్లో ఉన్న సమయంలో వాడు చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. కానీ నేను ఆ విషయం మావారికి చెప్పలేదు.   ఆయనకి తెలియక సరే, వాడి ఇష్ట ప్రకారం వాడిని హాస్టల్‌కి పంపించాలనుకొని ఆ విషయం బాబుకి చెప్పటానికి వెళ్లబోయారు. నేను, "ఇప్పుడే చెప్పకండి. మళ్ళీ ఒకసారి అడిగిచుద్దాం" అని అన్నాను. అందుకు మా ఆయన, "వాడు వెళ్తానంటే వెళ్లనివ్వు. నువ్వెందుకు అంత పట్టు పట్టుకొని కూర్చున్నావు. అయినా వాడు బాగానే చదువుతున్నాడుగా" అని అన్నారు. ఇక అప్పుడు మావారికి విషయం చెప్పాను. దాంతో మావారు షాకై బాబుని కొట్టబోయారు. అయినాసరే వాడు హాస్టల్‌కి వెళ్తానని అన్నాడు. అప్పుడు నేను, "బాబా! వాడు మా మాట వినేలా చేయి తండ్రీ. అలాగే వాడు చెడు అలవాట్లు మానేసేలా దయచూపు బాబా" అని బాబాను వేడుకున్నాను. 'వాడు మారితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను' అని కూడా అనుకున్నాను. అంతే, పది నిమిషాలలో బాబు వాడంతటవాడే, "ఇంటి దగ్గర నుండే కాలేజీకి వెళ్తాను" అని అన్నాడు. అంతేకాదు, బాబా దయవలన ఇప్పుడు తను చెడు అలవాట్లన్నీ మానేసి చాలా చక్కగా ఉంటున్నాడు. తను మంచిగా మారిపోయాడు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. తను చెడిపోతున్నాడని మాకు తెలిసేలా చేసి, అలాగే వాడిని మంచి మార్గంలోకి తీసుకొచ్చింది బాబానే. ఇదంతా ఆయన దయే. "కోటి కోటి వందనాలు బాబా".


ఒకసారి మా కుటుంబమంతా ఒక పంక్షన్‌కి వెళ్ళాము. అక్కడ మా చిన్నబాబు భోజనం చేసే సమయంలో ఎక్కువగా ఉన్న మసాలా ఘాటుకి నీళ్లు త్రాగబోయాడు. అంతలో ఏమైందో తెలీదుగానీ ఉన్నట్టుండి కిందపడి గిలగిలా కొట్టుకోసాగాడు. అందరూ వాడి చుట్టూ చేరారు. నాకు ఏమి అర్ధంకాక తింటున్న ప్లేట్ పక్కన పడేసి గబగబా అక్కడికి వెళ్ళాను. అందరూ వాడిని లేపే ప్రయత్నం చేస్తున్నారు. బాబు పరిస్థితి చూసి నాకు మాటలు రాక, లోలోపల "సాయిబాబా.. సాయిబాబా! నా బిడ్డని నువ్వే కాపాడాలి" అని ఏడ్చాను. కానీ మాటలు పైకి రావటం లేదు. ఇంతలో అరుపులు, కేకలతో మిగతా వాళ్ళందరూ కూడా బాబు చుట్టూ చేరారు. నేను అందరి ముందు, "బాబా.. బాబా! నా బిడ్డని కాపాడు తండ్రీ. నాకు నువ్వే దిక్కు" అని గట్టిగా అరిచాను. బాబా దయవల్ల బాబుకి గాలి విసిరి, కాళ్ళుచేతులు రుద్దాక చిన్నగా లేస్తే మంచినీళ్ళు త్రాగించారు. మొత్తానికి బాబా నా బిడ్డని కాపాడారు. కళ్లు తిరిగి పడితే లేస్తారు కదా! కానీ బాబు విషయం అలా కాదు. ఏం జరిగిందో బాబాకే ఎఱుక. మేము మాత్రం చాలా అంటే చాలా భయపడ్డాం. ఇప్పుడు ఈ అనుభవాన్ని వ్రాస్తుంటే కూడా నా కళ్లలో నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు బాధలో నా ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాననుకున్నానో, లేదో నాకు గుర్తులేదు కానీ, అనుకున్నా, అనుకోకపోయనా బాబా నా బిడ్డని కాపాడారు. అందుకే ఆయన అనుగ్రహాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. బాబాని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే  క్షమిచండి సాయి".


బాబా దయతో తగ్గిన దగ్గు, జ్వరం


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు మల్లీశ్వరి. నాకు 20 సంవత్సరాలుగా బాబాతో అనుబంధం ఉంది. ఆయన నా జీవితంలో ఎన్నో సమస్యల నుండి కాపాడారు. ఈమధ్య 2 సంవత్సరాల మా మనమరాలు దగ్గు, జ్వరంతో చాలా బాధపడింది. మూడోరోజు మేము తనని హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్లో ఆరురోజులు గడిచినా పాపకి దగ్గు, జ్వరం ఎక్కువగా ఉండేసరికి నేను, "బాబా! పాపకి తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, మరుసటిరోజు నుండి పాపకి దగ్గు, జ్వరం తగ్గిపోయి ఆడుకోవడం మొదలుపెట్టింది. మనకి వీలైనంతవరకు బాబా చెప్పిన మాటలు పాటిస్తూ, ఓర్పు, విశ్వాసంతో ఉంటే బాబానే మనకు దారి చూపిస్తారు. ఇది నా అనుభవం. "ధన్యవాదాలు సాయితండ్రి. అందరూ బాగుండాలి, అందులో మేమూ ఉండాలి".


సాయిభక్తుల అనుభవమాలిక 1604వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. హాస్పిటల్‌కి వెళ్లకుండా, ఏలాంటి మెడిసిన్ వాడకుండానే కంటి సమస్య తగ్గించిన బాబా
2. స్వప్న దర్శనంతో దైర్యనిచ్చి వడ్డీ భారాన్ని తీసేసిన బాబా

హాస్పిటల్‌కి వెళ్లకుండా, ఏలాంటి మెడిసిన్ వాడకుండానే కంటి సమస్య తగ్గించిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు అనూష. సాయి తనని నమ్ముకున్నవాళ్ళకి అడుగడుగునా తోడుంటారన్నది సత్యం. బాబా నన్ను ప్రతి సమస్య నుండి కాపాడుతున్నారని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నాకు అండగా నిలుస్తారని నాకు చాలా నమ్మకం. నా పెద్దకొడుకుకి 6 సంవత్సరాలు ఉంటాయి. 2023, జూన్ నెలలో వాడి కంటి పైరెప్ప లోపలి భాగంలో చిన్న చిన్న గుల్లలు ఏర్పడి చూస్తేనే భయమేసేలా కన్ను అంత ఎర్రగా మారిపోయింది. కంటిపైన కూడా గుల్ల ఉంది, కన్ను బాగా వాచిపోయింది. అది చూసి నేను ఏమైందో అని చాలా కంగారుపడ్డాను. బాబా దగ్గర ఏడుస్తూ, "బాబా! వాడు చాలా బాధపడుతున్నాడు. తన కంటి సమస్య తగ్గిపోయేలా చూడండి" అని చెప్పుకొని కంటిపైన ఊదీ రాసి బాబా తగ్గించేస్తారని నమ్మకంతో ఉన్నాను. కానీ తర్వాత రోజుకి కన్ను ఇంకా ఎర్రగ్గా అయిపోయి మరింత వాచిపోయింది. నేను అది చూసి, "తగ్గట్లేదు. హాస్పటల్‌కి తీసుకెళదామ"ని మావారితో అన్నాను. ఆయన, "ఈరోజు చూసి, తగ్గకుంటే రేపు వెళ్దాం" అన్నారు. ఆ రోజు సాయంత్రం బాబు స్నాక్స్ తింటుంటే వాటికున్న కారం తన చేతికి అంటుకుంది. అనుకోకుండా వాడు ఆ చేతిని కంటిలో పెట్టుకున్నాడు. అసలే చిన్న చిన్న గుల్లలున్నాయి కదా! వాటికి కారం తగిలేసరికి విపరీతమైన మంట పుట్టి బాబు తట్టుకోలేకపోయాడు. ఏమి చేసిన కూడా మంట తగ్గలేదు. 10 నిమిషాలు అలాగే ఉంది. అప్పుడు బాబా దగ్గరకు వెళ్లి, "ప్లీజ్ బాబా! వాడికి చాలా మంటగా ఉంది. దయచేసి తగ్గించు తండ్రీ" అని వేడుకొని బాబు కంటిపై ఊదీ రాసాను. అంతే, ఏదో అద్భుతం జరిగినట్టు బాబు, "మంట తగ్గిపోయింది" అన్నాడు. నేను సంతోషంగా బాబాకి ధన్యవాదలు చెప్పుకున్నాను. తర్వాత రోజుకి కంటిలోని గుల్లలు, ఎర్రదనం కూడా తగ్గిపోవడం గమనించాను. బాబా దయతో హాస్పిటల్‌కి వెళ్లకుండా, ఏలాంటి మెడిసిన్ వాడకుండానే రెండురోజుల్లో బాబు సమస్య తగ్గిపోయింది. ఇదంతా బాబా కృప. "ధన్యవాదాలు సాయి. మీరు ఎప్పుడూ నాకు తోడుగా ఉండండి బాబా. అలాగే నా బిడ్డలకు ఎలాంటి అనారోగ్యం రాకుండా చూసుకో తండ్రీ. బాధల్లో ఉన్నవారిని ఆదుకో సాయి. నా కోరికలు తీర్చు తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


స్వప్న దర్శనంతో దైర్యనిచ్చి వడ్డీ భారాన్ని తీసేసిన బాబా


నా పేరు మేఘన. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నాకు అందరి దేవుళ్ళతోపాటు బాబా అంటే కూడా ఇష్టం. నేను మా తమ్ముడి వల్ల చాలా ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నాను. 2 లక్షల రూపాయలకి 30,000 రూపాయల వడ్డీ ఎలాగో 6 నెలలు కట్టాను. కానీ నాకొచ్చే జీతానికి ప్రతినెలా అంత వడ్డీ కట్టలేక 2023, జూలై నెలలో 2 లక్షల రూపాయలు సర్దుబాటు అయితే నెలనెలా అంత పెద్ద మొత్తం వడ్డీ కట్టాల్సిన పని ఉండదని ఆ డబ్బు సర్దుబాటు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసాను. ఆ సమయంలో ఒకరోజు కలలో ధ్యానావస్థలో బాబా నాకు దర్శనం ఇచ్చారు. అప్పుడు నా సమస్యను బాబా తీరుస్తారని చాలా ధైర్యం వచ్చి, "బాబా! ఈ నెలలో ఆ 2 లక్షల రూపాయలు ఏర్పాటు చేసి నా సమస్య తీర్చండి. నేను మీ కృపను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా కరుణించారు. డబ్బు సర్దుబాటై నేను ఆ అప్పు తీర్చగలిగాను. "ధన్యవాదాలు బాబా. మీరు ఎప్పుడూ ఇలానే నాకు అండగా ఉండాలి బాబా. నాకున్న సమస్యలు మీకు తెలుసు. వాటన్నిటి విషయంలో మీరు నా వెనకే ఉండి నన్ను కాపాడుతారని నమ్ముతున్నాను బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1603వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. చెప్పుకున్నంతనే లభిస్తున్న బాబా అనుగ్రహం
2. బాబా చెప్పినట్లే అందిన డబ్బులు

చెప్పుకున్నంతనే లభిస్తున్న బాబా అనుగ్రహం


అందరికీ నమస్కారం. సాయిబాబాకి పాదాభివందనాలు. నా పేరు మౌనిక. నాకు పెళ్ళై ఒక పాప వుంది. నేను డిగ్రీ చదువుతున్నప్పటినుంచి బాబా భక్తురాలిని. బాబా ఎల్లవేళలా నాకు తోడుగా ఉన్నారు. నాకు ఏది కావాలన్నా తల్లిదండ్రులని ఎంత చనువుగా అడుగుతామో అంత చనువుగా బాబాని అడుగుతాను. ఆయన ప్రేమతో నాకు కావాల్సింది ఇస్తారు. పెళ్లయ్యాక ఉద్యోగం చేయడానికి కుదరక నేను ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. ఆ వ్యాపారంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా, "బాబా! నీదే భారం అయ్యా. నేను ఏమీ చేయలేను" అని అనుకుంటాను. నిజంగా మీరు నమ్మరు. ఒక గంటలో నాకు మార్పు తెలుస్తుంది. అలా చాలా జరిగాయి


మాది టైలరింగ్ మరియు మగ్గం వర్క్ షాప్. మాకు వ్యాపారం నడిచే సీజన్ కన్నా అన్‌సీజన్ ఎక్కువగా ఉంటుంది. బుకింగ్స్ కూడా సరిగా ఉండవు. పైగా కరోనా తరువాత వ్యాపారం ఎప్పుడు మంచిగా నడుస్తుందో, ఎప్పుడు నడవదో తెలియటం లేదు. అలాంటి పరిస్థితుల్లో, 'ఇలా అయితే వ్యాపారం ఏం చేయాలి? ఇదే కొనసాగితే వ్యాపారం మూసేయాల్సి వస్తుందని' చాలా బాధగా ఉంటుంది. కానీ నాకున్న ఆధారం అదొక్కటే. మావారిది చిన్న ఉద్యోగం. అందువలన ఆదాయం సరిగా లేకపోతే మాకు చాలా కష్టమైపోతోంది. అందువల్ల నేను బాబాని తలచుకొని, "సాయీ! నాకు ఈ పరిస్థితి ఏమిటి తండ్రీ? బుకింగ్స్ మరియు ఆర్డర్స్ రాకపోతే నేను ఎలా జీవనం సాగించాలి? వర్క్ వచ్చేలా చేయి తండ్రీ. మీరే నాకు ఉన్న తోడు. కాబట్టి మీరే సహాయం చేసి మా కష్టానికి తగ్గ ఫలితమివ్వాలి నాయనా" అని బాబాతో చెప్పుకుంటాను. అంతే, ఒక గంట తరువాత బుకింగ్స్ వస్తాయి. ఆరోజు కనీసం 3 ఆర్డర్స్ అయినా ఉంటాయి. అలాగే ఒక్కోసారి ఆర్డర్స్ పూర్తైయ్యాక డబ్బులు రాకుండా ఆగిపోతాయి. కష్టపడి పని చేసిన తర్వాత ఇన్కమ్ రాకపోతే ఎంత ఏడుపొస్తుందో చెప్పలేను. అలాంటప్పుడు కూడా నేను, "ప్లీజ్ సాయీ! కస్టమర్స్ వచ్చి పూర్తైన ఆర్డర్స్ తీసుకొని వెళ్ళాలి" అని బాబాకి విన్నవించుకుంటాను. అంతే, ఆరోజు సాయంత్రం లోపు కస్టమర్ వస్తారు. లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ అయినా వస్తుంది


కరోనా వల్ల మన ఆరోగ్యాలే కాదు, చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు ఆర్ధికంగా నష్టపోయారు. వాళ్లలో మేము కూడా ఒకరం. మేము ఆర్ధికంగా చాలా బాధపడుతున్నాo. అందుకని మేము లోన్‌కి అప్లై చేశాం. కానీ మాకు సొంతిల్లు లేకపోవడం వల్ల లోన్ ప్రాసెస్‌లో ఇబ్బందులు వచ్చాయి. మేము దాదాపు మాకు లోన్ రాదు అని అనుకున్నాం. అటువంటి సమయంలో నేను మనసులో, "బాబా! నాకు సహాయం చేయటానికి ఎవరూ లేరు. మీరే నాకు సహాయం చేయాలి. ఈ లోన్ మాకు సెంక్షన్ అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్నిరోజులకు మాకు లోన్ వచ్చింది. "ధన్యవాదాలు సాయినాథా. మాకు ఇంకొక భాధ ఉంది, దాన్ని కూడా నెరవేర్చి ఇంకొకసారి నా అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇవ్వండి తండ్రీ".


సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!!!


బాబా చెప్పినట్లే అందిన డబ్బులు


సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు నందకిషోర్. నేను తొలిసారి నా అనుభవం ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. నాకు ఒకరి నుంచి డబ్బులు రావలిసి ఉండగా నేను దాని గురించి టెన్షన్ పడుతుండేవాడిని. ఆ సమయంలో నేను, "బాబా! నాకు రావాల్సిన డబ్బులు వస్తే, మీ అనుగ్రహాన్ని మీ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను. అలాగే గుడిలో ప్రసాదం పంచిపెడతాను" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత ఒకరోజు రాత్రి డబ్బులు గురించి టెన్షన్ వచ్చి సరిగా నిద్రపోలేకపోయాను. మర్నాడు ఉదయం లేచి ఈ బ్లాగు చూస్తే, "నీ డబ్బు ఎక్కడికీ పోదు. నీ దగ్గరకే వస్తుంది. నేను ఉన్నాను" అని బాబా సందేశం కనిపించింది. దాన్ని నాకోసమే బాబా పంపించారని భావించాను. బాబా దయవలన 2023, జూలై 29న డబ్బులు నాకు అందాయి. "ధన్యవాదాలు బాబా. అందరినీ చల్లగా చూడు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1602వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి  చెప్పుకుంటే కానిది ఏదీ ఉండదు
2. దేనికీ తగ్గని నడుంనొప్పిని తగ్గించిన బాబా

బాబాకి  చెప్పుకుంటే కానిది ఏదీ ఉండదు


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ముందుగా తల్లి, తండ్రి అయిన శ్రీసాయినాథునికి సాష్టాంగ ప్రణామాలు. సాయిబిడ్డలందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఒకరోజు నా చిన్ననాటి స్నేహితురాలు, "మన స్నేహితులందరూ వస్తున్నారు. నువ్వు కూడా రా" అని వాళ్ళ ఊరికి రమ్మని నన్ను పిలిచింది. నేను వెళ్ళాలనుకున్నాను కానీ, నాకు ఆరోగ్యం బాగుండదు. ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళను. అందుకని మావారు నన్ను వెళ్ళవద్దన్నారు. నాకు మాత్రం వెళ్లాలని చాలా అనిపించింది. నేను కష్టమైనా, సుఖమైనా, సంతోషమైనా బాబా దగ్గర చెప్పుకుంటాను. అలాగే ఈ విషయంలో కూడా, "బాబా! వెళితే అందరూ కలుస్తారు. నాకు అందర్నీ చూడాలని ఉంది. కాబట్టి ఒక్కదాన్నైనా వెళ్లాలని అనుకుంటున్నాను. మీరు నాకు తోడుగా ఉండండి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల అప్పటివరకూ వద్దన్న మావారు, "ట్రైన్ ఎక్కిస్తాను. వెళ్ళు" అని  అన్నారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. తర్వాత ప్రయాణమయ్యేరోజు బాబాకి నమస్కారం చేసుకొని ఇంటినుండి బయలుదేరాం. మా ఇంటి గేటు దాటి మలుపు తిరగగానే బాబాను ఊరేగిస్తూ ఒక బండి మాకు ఎదురొచ్చింది. నేను ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా నాకు తోడుగా ఉన్నారని అర్థమైంది. అలాగే నా ప్రయాణంలో అడుగడుగునా బాబా దర్శనమిస్తూ నాకు తోడుగా ఉన్నారు. నాకు ఎటువంటి కష్టం రాలేదు. నా చిన్ననాటి స్నేహితులను కలుసుకొని చాలా సంతోషంగా గడిపి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను.


మేము బాబా అనుగ్రహంతో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాము. కాకపోతే మావారి వయస్సు దృష్ట్యా EMI నెలకు 30,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది. ఒక సంవత్సరం ఎలాగో గడిచింది. ఇక అప్పుడు "అంత కట్టలేకపోతున్నాం. కాస్త తగ్గించండి" అని బ్యాంకువాళ్ళని అడిగాము. వాళ్ళు మా ప్రయత్నం మేము చేస్తామన్నారు. మేము బాబాకి సమస్య గురించి చెప్పుకొని 11 వారాలు 'సాయి దివ్యపూజ' చేశాము. 11 వారాలు పూర్తయ్యేనాటికి 4,000 రూపాయల EMI తగ్గింది. ఇదంతా బాబా అనుగ్రహమే. బాబాకి  చెప్పుకుంటే కానిది ఏదీ ఉండదు. "బాబా! మీకు కోటానుకోట్ల నమస్కారాలు. వయోభేదమున్నా తల్లీబిడ్డల్లా కలిసిమెలిసి ఉండే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మమ్మల్ని అపార్థం చేసుకొని సరిగా మాట్లాడటం లేదు బాబా. వాళ్లు మాపట్ల ప్రవర్తిస్తున్న తీరుకి నేను తట్టుకోలేకపోతున్నాను. మేము ఏం తప్పు చేశామో అర్థం కావడం లేదు బాబా. దయచేసి అపార్థాలు తొలగిపోయి ఇదివరకటిలా ఉండేలా ఆశీర్వదించండి బాబా. నాకు ఎవరున్నారు బాబా, మీరు తప్ప? అందుకే ఈ సమస్యను మీ ముందు పెట్టాను. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మీ నీడలో, రక్షణలో మమ్మల్ని సంరక్షించండి బాబా".


సర్వం సాయినాథార్పణమస్తు!!!


దేనికీ తగ్గని నడుంనొప్పిని తగ్గించిన బాబా


నా పేరు సృజన. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. ఒకసారి ఏం జరిగిందంటే, నాకు బాగా నడుంనొప్పి వచ్చింది. ఎన్ని హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గలేదు. డాక్టర్లు, "మూడు నెలలు బెడ్ రెస్ట్‌లో ఉండమ"ని అంటే మా పుట్టింట్లో ఉంటూ నేను బెడ్ రెస్ట్ తీసుకోసాగాను. కానీ మూడు నెలలవుతున్నా నొప్పి తగ్గలేదు. అప్పుడు ఎవరో చెప్తే ఆపరేషన్‌తోనైనా తగ్గుతుందేమోనని ఆపరేషన్‌కి వెళ్లాలని అనుకున్నాము. ఈలోగా మాకు తెలిసినవాళ్ళు, "బాబా పుస్తకం పారాయణ చేస్తే, బాబా కరుణిస్తార"ని చెప్పారు. దాంతో నేను ఆ పుస్తకం చదవటం ప్రారంభించాను. కానీ మొదట్లో నొప్పి అలాగే ఉండటం వల్ల 'ఈ పుస్తకం చదివితే తగ్గుతుందా?' అనే అనుమానం నాలో మొదలై పెరగసాగింది. అయినప్పటికీ నాకు ఇంకొక దారిలేక బాబానే ప్రార్థించాను. పారాయణ మొదలుపెట్టిన వారం లోపల మా బాబాయ్ ఒకరు "సమాధి సిద్ధ యోగలో జాయిన్ అయితే నడుం నొప్పి తగ్గుతుంద"ని చెప్పారు. సరేనని అక్కడ జాయిన్ అయ్యాను. కొద్దిగా ఉపశమనం కనిపించిందిగానీ పూర్తిగా తగ్గలేదు. దాంతో నడుంనొప్పి తగ్గదేమోనని నాకు భయమేసి బాగా ఏడ్చాను. తర్వాత ఒకరోజు రాత్రి కలలో బాబాలాగా కనిపించి ఒక తెల్లబల్లి నా కాలుని తాకింది. అంతే, అప్పటినుంచి కొద్దిగా కూడా నొప్పి లేదు. ఆ తర్వాత మాకు ఒక బాబు జన్మించాడు. ఇదంతా సాయి కృప. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే మీరు మాపై కృప చూపించాలని కోరుకుంటున్నాను తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo