సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1600వ భాగం..


ఈ భాగంలో అనుభవాలు:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 21వ భాగం

నా పేరు సాయిబాబు. ఒకప్పటి మా విద్యార్ధి సాయికుమార్, అతని కుటుంబం సాయితత్త్వం తెలుసుకొని సాయి భక్తులై బాబాని ఆరాధిస్తున్నారు. ఒకరోజు సాయంత్రం సాయికుమార్ మా ఇంటికొచ్చి "మరికొందరితో కలిసి శిరిడీ వెళ్తున్నాను. సికింద్రాబాద్ వెళ్లి అక్కడ మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఎక్కుతాము" అని అన్నాడు. వెంటనే నా మనసుకి, 'సాయికుమార్వాళ్ళు సికింద్రాబాద్ నుండి మన్మాడ్ ఎక్స్ప్రెస్‌లో వెళ్లరు. విజయవాడ నుండి వచ్చే నాగర్‌సోల్ ఎక్స్ప్రెస్‌లో వెళ్తార'ని అనిపించింది(సిక్స్త్ సెన్స్ ద్వారా బాబా ఆలా తెలియజేసారు). అదే విషయం నేను సాయికుమార్‌తో చెప్తే, "లేదండి, రిజర్వేషన్ కూడా అయింది" అన్నాడతను. నేను, "సరే, వేచి చూడు. ఏం జరుగుతుందో! ఇది బాబా నిర్ణయం" అని చెప్పి బాబాకి దక్షిణ ఇచ్చి పంపాను. తరువాత మూడోరోజు శిరిడీ నుండి సాయికుమార్ నాకు ఫోన్ చేసి, "సార్.. ఎలా చెప్పారు? మీరు చెప్పింది అక్షరాలా జరిగింది. మేము ఎక్కిన ట్రైన్ సికింద్రాబాద్ వెళ్లేసరికి ఆలస్యమై మన్మాడ్ ఎక్స్ప్రెస్ అందుకోలేకపోయాం. తర్వాత మీరు చెప్పినట్లే నాగర్‌సోల్ ట్రైన్ ఎక్కి, ముందు ట్రైన్‌కి తీసుకున్న మన్మాడు టికెట్ మీద ప్రయాణం చేసాము. బాబా దయవల్ల ఏ ఆటంకం లేకుండా శిరిడీ చేరుకున్నాము" అని అన్నాడు. అప్పుడు నేను, "ఇది నేను చెప్పింది కాదు. స్వయంగా బాబానే నాతో నీకు చెప్పించారు సాయికుమార్" అని అన్నాను. చూశారా! ముందుగానే బాబా సిక్స్త్ సెన్స్ ద్వారా జరగబోయేది ఎలా తెలియపరిచారో! మనలో ఆ గమనిక ఉంటే చాలు.

ఒకరోజు నేను, నా భార్య ఉదయం ఏడు గంటలకు బయలుదేరి విజయవాడ దుర్గ గుడికి వెళ్ళాము. 10 గంటలకు దర్శనం అయిపోయినా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి వెళదామని (మొదటిసారిగా) క్యూలైన్‌లో నిలుచున్నాము. రెండు గంటలు గడిచాక మా ముందు ఉన్న వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుంటే పాతికవేల రూపాయల విలువైన మా ఆపిల్ ఐఫోన్ మా దగ్గర లేదని గుర్తించాము. నేను వచ్చేటప్పుడు ఇంటి డోర్ లాక్ చేస్తూ వరండాలో ఉన్న కుర్చీలో ఆ ఫోన్ పెట్టాను. దానిని నేను తెచ్చానని నా భార్య, తను తెచ్చిందని నేను అనుకున్నాము. మొత్తానికి మా ఇద్దరమూ ఆ ఫోన్ తీసుకొని రాలేదు. ఇక ఫోన్ మా దగ్గర లేదని గుర్తించాక మేము ఇంటికి వెళ్లేవరకు ఫోన్ ఆ కుర్చీలో ఉంటుందా, లేదా అనే సందేహం మొదలైంది. ఎందుకంటే, ఇంటి గేటు బయట నుండి చూసినా తెల్లటి కుర్చీలో నల్లటి ఐఫోన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదీకాక పక్కన, పైన అద్దెకు ఉంటున్న కంపెనీవాళ్ళకోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెంట్ రీడింగ్ తీసుకునేవాళ్ళు, వాటర్ క్యాన్‌వాళ్ళు కూడా వచ్చి పోతుంటారు. ఎవరినీ నమ్మటానికి లేదు. అందుచేత తెలిసినవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి కుర్చీలో ఫోన్ ఉందేమో చూడమని చెబుదామనుకున్నాం. కానీ వాళ్ళు వెళ్లి చూసి అక్కడున్న ఫోన్ తీసేసుకుని, 'లేద'ని చెప్తే ఎలా? ఏం చేయాలి? అందుకని, "బాబా! మీరే ఆ ఫోను జాగ్రత్త చేయాలి" అని బాబాను ప్రార్థించాము. అన్నప్రసాదం స్వీకరించాక ఒకరి దగ్గర ఫోన్ తీసుకొని మాకు బాగా నమ్మకస్తుడైన సాయికుమార్‌కి ఫోన్ చేసి, విషయమంతా చెప్పి "ఇంటికి వెళ్లి కుర్చీలో ఫోన్ ఉందేమో చూడమ"ని చెప్పాము. కానీ అతను, "నేను ఈ సమయంలో ఊళ్ళో లేను. సాయంత్రం వెళ్లి చూస్తాన"ని చెప్పాడు. మాకు ఏమీ పాలుపోక బాబా మీద భారమేసి మా పనులు చూసుకుని సాయంత్రం 7 గంటలకు ఇల్లు చేరాము. గేటు బయట నుండే ఎంతో ఆత్రంగా కుర్చీ వైపు చూసాము. అక్కడ మా ఐఫోన్ కనిపించలేదు. అయినా డల్‌గా కూర్చోకుండా ముందు స్నానం చేసి బాబాకి దీపారాధన చేసి, హారతి ఇచ్చాము. ఆ తర్వాత వరండాలో ఫోన్‌కోసం వెతకడం మొదలుపెట్టి కిటికీలో ఉన్న ఒక చిన్న అట్టపెట్టె మూత తీయగానే నా భార్యకి ఐఫోన్ కనిపించింది. 'పెట్టింది ఒకచోట అయితే, ఉన్నది ఇంకోచోట. ఇదెలా?' అని మాకు ఆశ్చర్యమేసింది. విషయమేమిటంటే, మేము రావడానికి అరగంట ముందు సాయికుమార్ మా ఇంటికి వచ్చి ఫోన్ కుర్చీలో ఉంటే తీసి, అట్టపెట్టలో దాచిపెట్టి వెళ్ళాడట. ఆ విషయం మాకు వెంటనే చెప్పాలంటే మా దగ్గర ఫోన్ లేదుగా. ఏదేమైనా ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు బయట అందరికీ కనిపించేటట్టు కుర్చీలో ఉన్న ఐఫోన్ అక్కడ అలాగే ఉందంటే అందుకు కారణం బాబా. మేము కొనుక్కున్న ఫోన్ పోయినా పర్వాలేదు కానీ, మా మేనకోడలు ప్రేమతో అమెరికా నుండి తెచ్చి బహుమతిగా ఇచ్చిన ఐఫోన్ పోతే బాధే కదా. కానీ బాబా కృప ఉండగా అలా ఎలా జరుగుతుంది? "థాంక్యూ బాబా". అందుకే సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబాకి విన్నవించుకుంటే చిటికలో తీసివేస్తారు.

ఆర్తితో అర్థించిన ఒక భక్తుని తన కష్టాల నుండి బాబా ఎలా గట్టెక్కించారో చదవండి. మా ద్వారా సాయితత్వంలోకి వచ్చిన ఒక సామాన్య వ్యక్తికి రెక్కల కష్టమే ఆధారం. పైగా అతను పెద్ద కుటుంబాన్ని పోషించుకోవాలి. అతనికి సెంటు భూమిగాని, ఇల్లుగాని లేవు. అతను బాబాని పూజిస్తూ అప్పుడప్పుడు శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొని వస్తువుండేవాడు. బాబా దయవలన ఇల్లు, భూమి అతనికి అమరాయి. కొంతకాలానికి పిల్లల చదువులు మరియు ఇతరత్రా ఖర్చుల కోసం డబ్బు అవసరమై తనకున్న భూమిలో కొంతభాగం అమ్మాలనుకున్నాడు. కానీ ఆ భూమి కొనడానికి ఎవరూ రాలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా చాలా చాలా తక్కువ రేటుకు అడిగేవారు. ఇలా ఉండగా అతను ఒకరోజు బాబా మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంవాళ్ళు మందిరానికి అవసరమైన కట్టుబడి పనులు, పెయింట్స్, టైల్స్ కోసం చందా అడిగారు. అతడు వెంటనే తన మనసులో, “నా భూమి మంచి ధరకు అమ్ముడైతే ఈ మందిరానికి చందా రూపేణ కొంత పైకం ఇస్తాను. నా కోరిక నెరవేర్చు బాబా. ఒక సంవత్సరం నుండి వేచి చూస్తున్నాను" అని అనుకున్నాడు. అంతే, అతని మదిలోని మాట బాబా విన్నారు. ఒక వారం రోజుల్లోనే అతని భూమిలోని కొంత బాగం రెట్టింపు ధరకు అమ్ముడైంది. ఆ భూమి కొన్న ముస్లిం ఆయన, “నేను కూడా బాబా భక్తుడిని" అని చెప్పడం విశేషం. అతను అనుకున్నట్లుగానే బాబా మందిరానికి చందా రూపేణ కొంత డబ్బు సమర్పించాడు. ఇంకా కుటుంబసమేతంగా బాబా దర్శనానికి శిరిడీ వెళ్లాలనుకుంటున్నాడు.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



8 comments:

  1. Na life ni chrthiilo undhi sai baba sai

    ReplyDelete
  2. OmsaikapaduTandri

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Sai baba pl bless my son sai madava in his studies , career, not to engage with mobile, respect elders , dont get anger, concentrate on his studies.

    ReplyDelete
  6. Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo