1. తొందరపాటుతో కోప్పడి మాటన్నా ప్రేమతో అనుగ్రహించే బాబా
2. కొంచం కూడా తేడా లేకుండా అనుకున్నంతా అనుగ్రహించిన బాబా
నా పేరు పద్మజ. నిన్నటి భాగంలో కొన్ని అనుభవాలు పంచుకున్న నేను ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.
తొందరపాటుతో కోప్పడి మాటన్నా ప్రేమతో అనుగ్రహించే బాబా
మా నాన్నగారి రెండు కళ్ళల్లో శుక్లాలు ఏర్పడ్డాయి. వాటికి సర్జరీ చేయాల్సి ఉండగా ఆరునెలల క్రితం ఒక కన్నుకి సర్జరీ అయింది. తర్వాత కుడికన్ను సర్జరీకోసం మేము గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళితే వాళ్ళు అన్ని పరీక్షలు చేసి ఒక నెల తర్వాత అంటే 2023, మే 9న సర్జరీ చేయడానికి డేట్ ఇచ్చారు. ఆ రోజు మంగళవారం వచ్చింది. నాకు మంగళవారం సర్జరీ చేయించడం ఇష్టంలేక నర్సుని, "ఇంకొక డేట్ చూడండి" అని అడిగాను. అందుకు తను, "మూడు నెలల తర్వాత డేట్స్ ఖాళీ ఉన్నాయి. ఈ ఒక్కరోజే పేషంట్స్ కొంచం తక్కువ ఉన్నారు" అని చెప్పింది. కానీ నాన్న కంటిలో శుక్లాలు బాగా ముదిరి ఉన్నందున సర్జరీ త్వరగా చేయించాలని డాక్టర్ చెప్పారు. అందువలన మూడునెలల తర్వాత అంటే ఆలస్యం అయిపోతుందని ఒకసారి ఆలోచించుకొని వస్తానని నర్సుతో చెప్పి ఒకచోట కూర్చొని నా మొబైల్లో బాబా వాల్ పేపర్ చూస్తూ, "బాబా! మీ దయవలన మా నాన్నకి ఏ ఆటంకం లేకుండా ఒక కన్ను సర్జరీ అయిపోయింది. కానీ కుడికన్నుకి దగ్గర బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. అందువల్ల కొంచెం ఒక వైపుగా కనిపించదు. ఇప్పుడు ఆ కన్నుకి ఆపరేషన్ తొందరగా చేయించాల్సిన అవసరం వుంది. నాకేమో మంగళవారం సెంటిమెంటు. అయినప్పటికీ మీకు 9 అంకె చాలా ఇష్టం కాబట్టి మీ మీద భారమేసి నేను ఆరోజు సర్జరీకి ఓకే చెప్తున్నాను" అని మనసులో బాబాకి చెప్పుకున్నాను. తర్వాత నర్స్ దగ్గరకి వెళ్లి 2023, మే 9న సర్జరీకి ఓకే చెప్పాను. తను స్లిప్ రాసిచ్చి "సర్జరీకి వచ్చే ముందు షుగర్ టెస్ట్, బీపీ చెక్ చేయించుకుని రండి" అని చెప్పింది.
2023, మే 9 రానే వచ్చింది. నేను ఆరోజు పొద్దున్నే లేచి బాబాకి పూజచేసి, బాబా గుడికి వెళ్లి, "బాబా! సర్జరీకోసం నాన్నతో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మీరు నాకు తోడుగా రండి" అని దణ్ణం పెట్టుకొని నాన్నని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లాను. ఆ హాస్పిటల్ రెండో అంతస్తులో బాబా విగ్రహం ఉంది. ముందుగా నేను నాన్నని బాబా దగ్గరకి తీసుకొని వెళ్లి బాబాకి దణ్ణం పెట్టించి, నాన్న నుదుటన ఊదీ పెట్టాను. తర్వాత షుగర్ టెస్టుకోసం బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాము. అక్కడున్నవాళ్ళు నర్స్ దగ్గర స్లిప్ తీసుకొని రావాలని చెప్తే, నాన్నని అక్కడే కూర్చోబెట్టి నేను స్లిప్ కోసం పైకి వెళ్లాను. మనసులో చాలా భయంగా, ఒంటరిగా అనిపిస్తుంటే 'బాబా బాబా' అనుకుంటూ వెళ్లాను. సరిగ్గా నర్స్ కూర్చున్న కుర్చీ పక్కన గోడకి పెద్ద బాబా క్యాలెండర్ ఉంది. బాబాని చూడగానే నాకు చాలా ధైర్యంగా అనిపించింది. 'గుడిలో నాకు తోడుగా రండి బాబా' అని అడిగినందుకు 'వచ్చేసారా బాబా' అని అనుకున్నాను. కారణం మేము అక్కడికి చాలాసార్లు వెళ్ళాము కానీ, ముందెప్పుడూ అక్కడ బాబా క్యాలెండర్ లేదు. అలాంటిది సరిగ్గా నాన్న సర్జరీ అప్పుడు బాబా అక్కడ దర్శనం ఇవ్వడంతో చాలా ఆనందంగా, ధైర్యంగా అనిపించింది. తర్వాత నాన్న షుగర్ టెస్టు అయింది. సర్జరీకి ఒక గంట ముందు రిపోర్ట్స్ వస్తాయి అని అన్నారు. నేను, 'నాన్నకి డయాబెటిస్ లేదు, ఆయన సర్జరీ అయిపోతుంది' అనుకున్నాను. కానీ హఠాత్తుగా రిపోర్టులో షుగరు చాలా ఎక్కువగా ఉందని సర్జరీ చేయమన్నారు. నాకు చాలా ఏడుపొచ్చేసింది. 'ఏంటిది ఇలా జరిగింది? బాబాకి ఎంత ప్రార్థించాను. టెస్టుకు ముందు కూడా నాన్న నడవలేకపోయినా రెండో అంతస్తుకి తీసుకెళ్లి మరి బాబాకి దణ్ణం పెట్టించి టెస్ట్ చేయించాను. బాబా నాకు తోడుగా వచ్చారని సంబరపడిపోయాను. అంతా నా భ్రమా?' అని బాబా మీద కొంచెం కోపం వచ్చింది. కానీ సాయి లీలలు మామూలుగా ఉండవు కదా! తర్వాత ఏం జరిగిందో చూడండి.
నేను నర్సు దగ్గరకి వెళ్లి, "నాకెందుకో ఈ రిపోర్ట్ తప్పనిపిస్తుంది. ఎందుకంటే, మా నాన్నకు అసలు షుగర్ లేదు" అని అన్నాను. నర్స్, "మీకు అనుమానం ఉంటే రేపొచ్చి షుగర్ టెస్టు మళ్ళీ చేయించుకోండి. నార్మల్ వస్తే, సర్జరీ చేసేస్తాము. ఈరోజు అయితే ఇంకా చేయరు" అని చెప్పింది. నా మనసులో ఒకటే ఆందోళన. ఎందుకంటే, నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. మళ్లీ ఇప్పుడు డయాబెటిసా అని నాకు చాలా బాధేసింది. సరే ఆరోజుకి నాన్నని తీసుకొని ఇంటికి వచ్చేసాను. "రేపు రిపోర్టులో నార్మల్ రావాల"ని బాబాని ప్రార్థిస్తూ 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని ఆ రోజంతా జపించాను. మరుసటిరోజు వెళ్లి షుగర్ టెస్టుకి ఇచ్చాము. బాబా దయవల్ల రిపోర్టు నార్మల్ వచ్చింది. అప్పుడు నా మనసు కుదుటపడింది. మధ్యాహ్నం సర్జరీ అని చెప్పారు. నేను ఒక్కదాన్నే మా నాన్నతో కూర్చొని ఉన్నాను. ఇంతలో నేను పూర్వం వర్క్ చేసిన చోట ఉండే ఒక సార్ కాల్ చేసి, "ఎలా ఉన్నావమ్మా? చాలా నెలలు అయిపోయింది మాట్లాడి. అమ్మానాన్న ఎలా ఉన్నారు?" అని అడిగారు. నేను ఆయనతో మా నాన్న సర్జరీ గురించి, షుగర్ టెస్ట్ గురించి చెప్పి "సర్జరీ నిన్న జరగాలి సార్. కానీ ఈ రోజుకు మార్చారు" అన్నాను. వెంటనే ఆయన, "అంతా మంచికే. నిన్న మంగళవారం, చవితి కూడా. ఈరోజు జరగడం చాలా మంచిది" అన్నారు. వెంటనే నాకు "మంగళవారం సర్జరీ నాకు ఇష్టం లేదు బాబా" అని బాబాతో చెప్పుకున్న విషయం గుర్తొచ్చి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆపై బాబా నా కోరికకు అనుగుణంగా సర్జరీ జరగాలని ముందురోజు తప్పు రిపోర్టు వచ్చేలా చేస్తే నేను అది అర్థం చేసుకోకుండా బాబాపై కోప్పడ్డాను, ఆయనను నిందించాను అని గ్రహించి వెంటనే బాబాకు క్షమాపణ చెప్పుకున్నాను. ఇకపోతే సర్జెరీకోసం 11 మంది వెయిట్ చేస్తుండగా మొదట మా నాన్ననే పిలిచి సర్జరీ చేశారు. బాబా దయవల్ల ఏ ఆటంకం లేకుండా సర్జరీ పూర్తైంది. నాన్న బయటకు వచ్చి, "నొప్పేమీ లేదు, భయపడకండి" అని మిగిలినవాళ్ళకు ధైర్యం చెప్తుంటే నాకు చాలా ఆనందమేసింది. సర్జరీ అనుకున్న రోజు నుంచి సర్జరీ పూర్తయ్యేవరకు అడుగడుగునా సహాయం చేస్తున్న బాబా అనుగ్రహం గుర్తొచ్చి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆయన దయవల్ల మా నాన్న ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".
కొంచం కూడా తేడా లేకుండా అనుకున్నంతా అనుగ్రహించిన బాబా
ప్రతినెలా నా జీతమంతా పోగా మరో 2000 రూపాయలు అదనంగా నాకు అవసరం పడుతుండేవి. వాటికోసం నేను ఎవరో ఒకరిని అడుగుతుండేదాన్ని. ప్రతినెలా అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఒకరోజు నేను, 'ఇక ఇలా కాదు. ఎవరినీ ఆడకూడదు. ప్రతినెలా అడగటం బాగోదు' అని అనుకోని నా కంప్యూటరుకి అతికించి ఉన్న చిన్న బాబా గ్రీటింగ్ కార్డును చూస్తూ, "బాబా! ప్రతినెలా రెండు వేల రూపాయలు అదనంగా నాకు అవసరమవుతున్నాయి. అది చిన్న మొత్తమే. కానీ ఎవరినైనా అడగాలంటే మొహమాటంగా ఉంది. కాబట్టి నేను క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకుంటాను. అప్పుడు ఇంకెవరినీ అడగాల్సిన పని ఉండదు. నాకు కావాల్సిన డబ్బులు నేనే తీసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో క్రెడిట్ కార్డుకి ఎలా అప్లై చేయాలో నాకు తెలియదు. కాబట్టి బ్యాంకుకి వెళ్లి అప్లై చేయాలి. అందుకోసం నేను సెలవు పెట్టాలి. సెలవుపెడితే ఒకరోజు జీవితం పోతుంది" అని చెప్పుకున్నాను. చెప్పుకోవడం అంటే బాబాకి నేను ఏం మ్రొక్కలేదు, దణ్ణం కూడా పెట్టుకోలేదు, కేవలం ఒక స్నేహితునితో మాట్లాడుకున్నట్టు బాబాతో మాట్లాడను. అంతే, అంతటితో ఆ విషయం మర్చిపోయి నా పనిలో నేను పడిపోయాను. కానీ నాయన(బాబా) పిలిస్తే పలుకుతారు కదా! ఆయన చేసిన అద్భుతానికి ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. విషయమేమిటంటే..
ఆ రోజు ఆదివారం. మా హెడ్ ఆఫీస్ హైదరాబాదులో ఉంటుంది. అప్పుడప్పుడు సార్ వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ మాకు ఒక మేనేజర్ ఉంటారు అంతే. ఆదివారం అస్సలు ఎవరూ రారు. మెయిన్ హెడ్ రాజు సార్ చాలా పెద్దాయన. అసలు ఆయన ఎక్కడికీ రారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆరోజు మధ్యాహ్నం మా బ్రాంచుకి వచ్చారు. హఠాత్తుగా ఆయన్ని చూసి బ్రాంచులో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. 'ఆయన ఏమీ అడుగుతారు? ఎక్కడైనా, ఏమైనా పొరపాట్లు జరిగాయా? అసలు హఠాత్తుగా ఎందుకు వచ్చారు?" అని అందరూ కంగారుకంగారుగా ఉన్నారు. ఆయన క్యాబిన్లో కూర్చోగానే మొదట నన్నే పిలిచారు. 'ఇంతమంది పెద్దవాళ్ళు ఉండగా నన్ను పిలుస్తున్నారెంటి?' అని నాకు చాలా భయమేసింది. నెమ్మదిగా లోపలికి వెళ్లాను. ఆయన నన్ను చూస్తూనే "మేనేజరుని పిలుచుకొని రామ్మా" అని అన్నారు. నేను బయటకి వచ్చి మేనేజర్ సార్‌తో విషయం చెప్పి, ఇద్దరం కలిసి కేబిన్‌లోకి వెళ్ళాము. అప్పుడు పెద్దాయన చెప్పిన మొదటి మాట, "అమ్మా! నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను. అది పూర్తి చేస్తే ప్రతినెలా నీకు 2,000 రూపాయల అదనంగా ఇస్తాము" అని. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడూ, ఎక్కడికీ వేళ్ళని సార్ మా బ్రాంచుకి రావడం, నాతోనే మాట్లాడటం, అది కూడా పొద్దున్న నేను బాబాతో ఎంత మొత్తమైతే చెప్పానో సరిగ్గా అది మొత్తం(2,000) రూపాయలు ఆఫర్ చేయడం చూసి చాలా అంటే చాలా ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. ఆలస్యం చేయకుండా సార్ చెప్పినదానికి 'ఓకే' చెప్పి బయటకు వచ్చాను. సార్ సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోయారు. నా మనసులో, "బాబా! 2,000 రూపాయలు వచ్చేనెల వస్తాయి. మరి ఈ నెల పరిస్థితి ఏంటి? నాకు ఇచ్చిన ఆ టాస్క్ చేయగలనా?" అని అనుకుంటూ ఉండగా మరో బాబా లీల జరిగింది. మా మేనేజర్ నన్ను, నా సహోద్యోగిని పిలిచారు. నేను, ఆ అమ్మాయి లోపలికి వెళ్ళాం. వెంటనే మేనేజర్, "జూన్ నెలలో మీరు టార్గెట్ రీచ్ అయ్యారు కదా! అప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. ఇప్పుడు తీసుకోండి" అని నాకు 2,000 రూపాయలు, ఆ అమ్మాయికి 2,000 రూపాయలు ఇచ్చారు. బాబాని అడిగిన మొత్తమే సార్ ఇవ్వడం ఏంటి అసలు? బాబా పిలిస్తే పలుకుతున్నారు అని ఎంత ఆనందమేసిందో మాటల్లో చెప్పలేను. తరువాత బయటికి రాగానే నా సహోద్యోగి, "అక్కా! నీ టాస్క్‌కి సంబంధించి డేటా నా దగ్గర ఉంది. తీసుకో" అని చూపించింది. నేను నా మనసులో బాబాని, "బాబా! వచ్చే నెల టాస్క్ ఉంది అనుకుంటే ఇంతలోనే ఏ శ్రమపడకుండా డేటా అంతా ఇచ్చేసారు" అని అనుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను మీ ఋణం ఏ జన్మలోనైనా తీర్చుకోలేను. ఏ జన్మ పుణ్యమో నన్ను మీ దగ్గరకి తీసుకున్నావు తండ్రీ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయి రామ్ నాకు మా ఆయన తోడు నా జీవితాంతం కావాలి.మేము యిద్దరం కల కాలం కలిసి వుండేలాగ ఆశీస్సులు అందించండి.నా కోరిక తీర్చు తండ్రి.నీకు నమస్కారములు తండ్రి.ఆయన తోడు లేక పోతే నాకు. మనశ్శాంతి వుండదు.దీనికి నేను చాలా బాధ పడుతున్నాను.ఈ సంగతి లో నాకు మంచి ఆలోచనలు కలిగే లాగా ఆశీస్సులు యియ్యవలెను నాన్న.నాకు థీర్గ సుమంగళి గా ఆశీస్సులు యియ్యవలెను సాయి బాబా
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram naku chala andholanaga undi baba naku prasanthatha ni ivvu baba. Na IVF success aiyela chudu baba 1st September ke result vastundi
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOmsaikapaduTandri
ReplyDelete