సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1586వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - పంతొమ్మిదవ భాగం

నా పేరు సాయిబాబు. మా అమ్మగారు శ్రీమతి సుభద్రమ్మ చేసిన పూజా ఫలితమేమోగాని 1960వ సంవత్సరం నుండి మా కుటుంబానికి అంటే మా అమ్మగారి నుండి ఈనాటి మా మనుమడు చిరంజీవి సాయీష్ వరకూ ఒకరి తర్వాత ఒకరికి వరుసగా సాయితత్వం అబ్బింది. మాకు సాయిబాబా పాదాలే శరణ్యం. అయితే బాబాకి మేము చేసే సేవ బహిర్గతంగా తక్కువ, అంతర్గతంగా ఎక్కువ. ఆ సాయినాథుని కృప వర్ణించతరం కాదు. ఆ తండ్రి నాటినుండి నేటివరకు చిన్న నొప్పి కూడా తెలియనివ్వకుండా సర్వవేళలా మమ్మల్ని కాపాడుతున్నారు. మా కుటుంబానికి ఏది మంచో, ఏది అవసరమో అదే ఆయన చేస్తున్నారు. అంతలా తమ తపోనిష్ఠను మాకోసం ఖర్చుపెడుతున్నందుకు మేము సర్వదా ఆయనకు కృతజ్ఞులం. నేను ఇదివరకు 1960 నుంచి 2018 వరకు బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు ఆ మధ్యకాలంలో జరిగిన ఒకటి, రెండు అనుభవాలతోపాటు ఆ తరువాత బాబా మాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటాను.

1976వ సంవత్సరం, నాకు అప్పుడు పదహారు సంవత్సరాల వయస్సు. నేను నిత్యం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి బాబాకి ధూపం వేసి, దణ్ణం పెట్టుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు సైకిలు మీద బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద జనం పెద్దగా లేరు. కుర్రాడిని కదా! చాలా హుషారుగా సైకిలును మోటారుసైకిల్లా భావించి అతివేగంగా సైకిలు తొక్కుతున్నాను. నా ముందు కొంచెం దూరంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని చేతిలో మూరెడు పొడవున్న దృఢమైన దబ్బనం వుంది. అతను ఆ దబ్బనం ఒక చేతిలోనుండి మరో చేతిలోకి మార్చుకుంటూండగా నేను సైకిలు మీద అతనికి చాలా దగ్గరగా వెళ్ళాను. ఆ దబ్బనం మొన నా ఛాతీభాగానికి దగ్గరగా వచ్చిన క్షణంలో నా చెవిలో "ముందు అపాయం, ముందు అపాయం" అని పెద్దగా వినిపించడంతో నేను అతని మీద, అతని చేతిలో ఉన్న దబ్బనం మీద దృష్టిపెట్టి అపాయాన్ని గుర్తించి సైకిలును ఒక ప్రక్కకు వంచాను. బాబా దయవల్ల నేను కింద పడకుండా వెంట్రుకవాసిలో ఆ ప్రమాదం నుండి తప్పించుకొని ముందుకెళ్లి రోడ్డు ప్రక్కన సైకిలు ఆపి వెనక్కి చూశాను. సమయానికి బాబా నా చెవిలో అలా హెచ్చరించకపోయుంటే ఆ దబ్బనం బలంగా నా ఛాతిలో గ్రుచ్చుకొని వుండేది. బాబా అనుక్షణం కనిపెట్టుకొని ఉండబట్టే అంత ప్రమాదం నుండి నేను బయటపడ్డాను.

ఇప్పుడు చెప్పబోయే అనుభవం 1993లో జరిగింది. గుంటూరులో మాకు ఒక వ్యాపార స్థలం ఉంది. ఒకసారి అందులో ఉన్న రావిచెట్టు మీదకి ఒక పిల్ల కోతి వచ్చింది. అది ఆ చెట్టు మీద నుండి ఎక్కడికి వెళ్లకపోవడంతో మూడు రోజుల్లో దాన్ని మచ్చిక చేసుకున్నాం. అది అదరుబెదరు లేకుండా మా దగ్గరికి వచ్చేది. నేను దాన్ని ఆడిస్తూ, అది తినేవి పెడుతూ కొన్ని ఫీట్లు కూడా నేర్పాను. అది చాలా బాగా నేర్చుకుంది. తెలివైన కోతి పిల్ల. ఆరునెలలు గడిచాక మేము రాయలసీమలోని తాడిపత్రి సమీపంలో ఆలూరు కోనలో ఉన్న రంగనాథస్వామి ఆలయానికి గుంటూరు నుండి లారీలో వెళుతూ ఆ కోతిపిల్లను కూడా మాతో తీసుకొని వెళ్ళాము. ఆలూరుకోనలోని దేవాలయం వద్ద మేము ఉదయం నుండి సాయంత్రం వరకు గడిపి ఇక చీకటి పడుతుందనగా తిరిగి బయలుదేరుదామనకుంటే మేము తీసుకెళ్లిన కోతిపిల్ల ఆలయ శిఖరం పైకెక్కి ఎంత పిలిచినా, పండ్లు ఆశచూపినా కిందకి రాకుండా అక్కడే కూర్చుంది. మేము దానికోసం ఒక గంటసేపు వేచి చూసాం. కానీ అది కిందకి దిగి రాలేదు. ఇక చేసేదిలేక మేము వ్యాపార నిమిత్తం తాడిపత్రి వచ్చేసాం. అయితే ఆ కోతిపిల్లని వదిలేసి వచ్చినందుకు చాలా బాధేసి, “బాబా! ఆ కోతిపిల్ల మాకు బాగా అలవాటైంది. చిన్నపిల్లలాగా చెప్పినట్లు వినేది. దాన్ని నీవే మా దగ్గరకి చేర్చాలి” అని బాబాను ప్రార్థించాము. రెండురోజుల తర్వాత సాయంత్రం వేళ నేను, నా స్నేహితుడు తాడిపత్రిలో రోడ్డు పక్కన నిల్చుని మాట్లాడుకుంటున్నాం. ఒక రిక్షావాడు లాగుడు బల్ల రిక్షాను నడిపిస్తూ వెళ్తున్నాడు. ఆ రిక్షా మీద మా కోతిపిల్ల కూర్చొని ఉంది. దాన్ని నా స్నేహితుడు చూసి, "అది మన కోతిలా ఉన్నదే" అని అన్నాడు. ఆ మాట విని నేను దాని వైపు చూసి ఆశ్చర్యపోయాను. నేను దాన్ని చూసిన క్షణంలోనే అది కూడా నన్ను చూసి చెంగున రిక్షా మీద నుండి కిందకు దూకి నా దగ్గరకు వచ్చేసింది. తప్పిపోయిందనుకున్నది తిరిగి మా వద్దకు రావడంతో తప్పిపోయిన పిల్లాడు తిరిగి దొరికాడన్నంత ఆనందమేసింది నాకు. మేము ఆ రిక్షా అతన్ని, "ఇది నీ దగ్గరకి ఎలా వచ్చింది?” అని అడిగితే, "నేను వస్తుంటే దారిలో ఈ పిల్ల కోతి నా కంటపడింది, వచ్చి నా రిక్షా పైకెక్కి కూర్చుంది. పెంపుడు వానరమై ఉంటుంది, తప్పిపోయిందనుకోని నేను పెంచుకుందామని తీసుకెళ్తున్నాను. మిమ్మల్ని చూసి మీ దగ్గరకి చేరింది. ఇది మీదే కదా!” అని వెళ్ళిపోయాడు. దాన్ని చూస్తుంటే, పాపం చాలా ఆకలితో ఉన్నట్లు ఉందనిపించి వెంటనే దానికి ఆహారం పెట్టి బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆలూరుకోన నుండి తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరం. అంతదూరం నుండి దారి వెతుక్కుంటూ మా దగ్గరకి చేరడం నిజంగా బాబా మహిమ. ఆరోజు సాయంత్రం మేము లారీలో తాడిపత్రి నుండి గుంటూరుకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నానికి ఒంగోలు చేరుకొని భోజనం చేయడానికి ఒక హోటల్ వద్ద ఆగాము. ఆ హోటల్ ముందు తాడుతో కట్టి ఉన్న ఒక కోతిని గమనించి అది, మా కోతితో గొడవ పడుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. మా భోజనం అయిన తర్వాత మేము లారీ ఎక్కి బయలుదేరాం. లారీ మెల్లగా కదులుతుండగా హోటల్‌వాళ్ళ కోతి పరిగెత్తుకుంటూ వచ్చి మా లారీపైకి ఎక్కింది. అది ఎలా తాడు విప్పుకుందో మరి!. మేము గుంటూరు చేరాక అవి రెండు చాలా స్నేహంగా చాలాకాలం మా దగ్గరే పెరిగాయి. మా కోతిని తిరిగి మా వద్దకు రప్పించడమే కాకుండా దానికి ఒక స్నేహితుని ఇచ్చారు. ఇదంతా బాబా చలవే. ఆయనకు మూగజీవులపట్ల ఉన్న ప్రేమ.


 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



6 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. OmsaikapaduTandri

    ReplyDelete
  3. Saibaba maababu sai madavalo maarpu ravali. Examslo all subjects A1 raavaali swamh

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Sri sairam
    Om srisairam
    Om srisairam
    Om srisairlliikiijqaaajqjqjjahajjj

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo