- శ్రీసాయి అనుగ్రహ లీలలు - పద్దెనిమిదవ భాగం
సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
దైవ దర్శనాలు - తీర్థయాత్రలు :
ముందు భాగంలో నేను నా భార్య 'చార్‌ధామ్' యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి దర్శించినప్పుడు జరిగిన అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు ఆ యాత్రలోని తదుపరి అనుభవాలతోపాటు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను.
గంగోత్రి దర్శనానంతరం వాళ్లంతా కేదార్‌నాథ్‍కు ప్రయాణమయ్యారు. వాళ్ళలో కొంతమంది వ్యాను డ్రైవరుకు తలా 6,500/- రూపాయల చొప్పున డబ్బిచ్చి హెలికాప్టర్ టిక్కెట్లు తీసుకురమ్మని పంపారు. అయితే నాలుగు గంటల సమయం గడిచినా ఆ వ్యాను డ్రైవర్ తిరిగి రాలేదు. అప్పుడు నా భార్య నాకు ఫోన్ చేసి, “కేదార్‌నాథ్‍కు గుఱ్ఱాల మీద లేదా హెలికాప్టర్ మీద లేదా డోలీలో లేక నడచి వెళ్లాలా అని బాబాను అడిగండి” అని చెప్పింది. నేను బాబాను అడిగితే, “గుఱ్ఱాల మీద వెళ్ళమ"ని బాబా సమాధానం వచ్చింది. దాంతో నా భార్య గుఱ్ఱం మీద బయలుదేరింది. తనని చూసి మరికొంతమంది, “మేమూ గుఱ్ఱాల మీద వస్తామ"ని ఆమెతో బయలుదేరారు. మిగిలిన వాళ్ళు అక్కడే హెలికాప్టర్ టిక్కెట్ల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. కొంతసేపటికి “టిక్కెట్లు దొరకలేదని” డ్రైవరు తిరిగి వచ్చాడు. దాంతో వాళ్ళు కూడా బాబా చెప్పినట్టు గుఱ్ఱాలు ఎక్కక తప్పలేదు. బాబా మాట పొల్లు పోదు కదా! కేదార్‍నాథ్ పర్వతం పైకి వెళ్ళాక కేదారేశ్వరుని దర్శనం చేసుకున్న తరువాత కొంతమంది కిందికి వెళ్ళిపోయారు. మరికొంతమంది ఆ రాత్రి అక్కడ నిద్ర చేస్తే మంచిదని పైనే ఉండిపోయారు. వాళ్లలో నా భార్య కూడా ఉంది. అర్ధరాత్రి 2.30 గంటలకు గంట మ్రోగిన శబ్దం వినిపించి గుడి తెరిచారేమోనని నా భార్య తను బస చేసిన చోటు నుండి బయటికి వెళ్లి చూసింది. అప్పుడు జనం పెద్దగా లేరు. గుడి తలుపులు ఇంక తెరవలేదు. నా భార్య వెళ్లి గుడి ముందున్న మెట్లపై కూర్చుంది. బాబా దగ్గరుండి తమ భక్తులను ఎలా నడిపిస్తారో చూడండి. నా భార్య వద్దకు ఒక సెక్యూరిటీ గార్డు వచ్చి, "గుడి లోపలికి వెళతావా?" అని అడిగాడు. అందుకామె, “ఇంకా గుడి తలుపులు తీయలేదు కదా” అని అంది. అతను, "నేను తీసుకెళ్తాను. నాతోరా" అని గుడికి మరో వైపు తెరిచి ఉన్న ద్వారం గుండా నా భార్యను లోపలికి తీసుకెళ్లి అక్కడున్న పూజారులతో చెప్పి, దగ్గరుండి నా భార్య చేత శివునికి అభిషేకం చేయించి, గోత్రనామాలు చెప్పించి, ప్రసాదం ఇప్పించాడు. బాబానే ఈ గార్డు రూపంలో నాకు ఇంత సహాయం చేశారని నా భార్య ఆనందంతో ఉప్పొంగిపోతూ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసింది. అలా ప్రదక్షిణ చేస్తుండగా తనకి శివలింగానికి వెనుక వైపు గోడకు పంచ లోహాలతో చేసిన శివుని విగ్రహం కన్పించి, ఆ మూర్తి పాదాలకు నమస్కరించింది. తను పైకి లేచేసరికి పసుపు, కుంకుమ, గాజులు ఉన్న ఒక ప్యాకెట్ కనిపించింది. తను అది తన కోసమే అనుకుని శివానుగ్రహానికి పొంగిపోతూ ఆ ప్యాకెట్ తీసుకుని, దీపారాధన చేసి బయటికి వచ్చి ఆ సెక్యూరిటీ గార్డుకు కృతజ్ఞతలు చెప్పింది. 5000/- రూపాయల టిక్కెట్టు తీసుకున్న వాళ్ళకే అలా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటిది పైసా ఖర్చు లేకుండా బాబా నా భార్యకి అంతటి భాగ్యాన్ని ప్రసాదించారు. సద్గురు అనుగ్రహం వల్లే యాత్ర సఫలమవుతుందని జ్ఞానులు చెప్పిన మాట అక్షర సత్యం.
‘దైవం మానుష రూపేణ’ అన్నారు కదా! కాశీలో దైవం మానవ రూపంలో వచ్చి, నా భార్యకు సోమవారం నాడు కాశీ విశ్వేశ్వరుని స్పర్శ దర్శనం చేయించిన సంఘటన చదవండి. 'చార్‌ధామ్' యాత్ర ముగించుకుని నా భార్య వాళ్ళు కాశీ చేరారు. ఆదివారం సాయంత్రం నా భార్యతో పాటు అందరూ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. మరుసటిరోజు సోమవారం తెల్లవారుఝామున 3 గంటలకు నా భార్య ఒక్కతే స్పర్శ దర్శనం చేసుకుందామని తన బస నుండి బయటికి వచ్చి ఒక ఆటోలో మందిరానికి బయలుదేరింది. తను ఒక్కతే ప్రయాణిస్తున్నప్పటికీ తనకు ఏ మాత్రమూ భయం లేదు. ఎందుకంటే అది కాశీ. అదికాక బాబా ఎల్లప్పుడూ మా ముందుండి మమ్మల్ని నడిపిస్తారు. కనుక మాకు భయపడవలసిన అవసరం లేదు. ఆటో సగం దూరం వెళ్ళాక ఒక బ్రాహ్మణుడు చేయెత్తి ఆటో ఆపి, డ్రైవర్ పక్కన కూర్చుని మందిరానికి వెళ్లాలని చెప్పాడు. మందిరం ఇంకాస్తా దూరంలో ఉండగా ఆ బ్రాహ్మణుడు ఆటో ఆపించి, దిగి గుడి వైపు వెళ్ళసాగాడు. అప్పుడు ఆటోడ్రైవర్ నా భార్యతో, “మీరు కూడా మందిరానికి వెళ్ళాలి కదా! ఆయన వెంట వెళ్ళండి. ఆయన మందిరానికే వెళ్తున్నాడు'" అని చెప్పాడు. నా భార్య ఆటో వాడికి డబ్బులు ఇచ్చి త్వరత్వరగా నడుచుకుంటూ ఆ బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళి, “స్వామీ, మీరు మందిరానికి వెళుతున్నారా? ఈ రోజు సోమవారం కదా! నాకు విశ్వేశ్వరుని స్పర్శ దర్శనం చేయిస్తారా?” అని అడిగింది. ఆయన, “అలాగేనమ్మా” అని తల ఊపాడు. ఇద్దరూ మందిరం దగ్గరకు వెళ్లారు. అప్పటికీ స్పర్శ దర్శనం కోసం చాలామంది భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. అంతమందిని చూడగానే నా భార్య, "ఈ రోజు నాకు స్పర్శ దర్శన భాగ్యం లభిస్తుందా? అసలే 4 గంటల నుండి 4.30 గంటల వరకు, కేవలం అరగంటసేపే శివలింగాన్ని చేతితో తాకనిస్తారు” అని బాబాని తలుచుకుని ఆ బ్రాహ్మణుని అనుసరించింది. అతను నా భార్యను క్యూలైనును దాటించి బాగా ముందుకు తీసుకు వెళ్ళి, అక్కడున్న ఒక షాపు ముందు తనని నిల్చోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమెను చూసి క్యూలైన్లో ఉన్నవాళ్ళు, షాపువాళ్ళు వెనక్కి వెళ్ళి క్యూలో నిల్చోమని అన్నారు. ఆమె వాళ్లతో, “ఒక స్వామి నన్ను ఇక్కడ ఉండమన్నారు” అని చెప్పింది. వాళ్ళు, “ఏ స్వామి, పేరేమిటి?” అని అడిగారు. అయితే ఆమెకు ఆ స్వామి వివరాలేమీ తెలియనందున వాళ్లతో ఏమీ చెప్పలేక బాబాని తలుచుకుంది. అంతే, క్షణంలో ఆ బ్రాహ్మణుడు వచ్చి, నా భార్యను ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్ళి అక్కడున్న ఇంకో షాపులోని కుర్చీలో కూర్చోబెట్టి, 'మందిర ద్వారాలు తెరవగానే లోపలికి వెళ్ళమ్మా' అని చెప్పాడు. అప్పుడు నా భార్య, “స్వామీ మీ పేరేమి?” అని అడిగితే, అతను 'చంద్రమౌళి' అని దైవం పేరు చెప్పి వెళ్ళిపోయాడు. పది నిమిషాల తర్వాత మందిరం తలుపులు తెరిచారు. మొట్టమొదట నా భార్య లోపలికి వెళ్ళి శ్రీవిశ్వేశ్వరుని శివలింగం తాకి, తల ఆనించి, స్పర్శ దర్శనం చేసుకుని ఎంతో ఆనందంతో బయటికి వచ్చి కొంచెం సేపు అక్కడ కూర్చుంది. ఐదు నిమిషాల తర్వాత తనకి, “లైన్లో ఎక్కడో చివరన ఉండాల్సిన నన్ను అందరి కంటే ముందు గుడిలోనికి పంపి, స్పర్శ దర్శనం చేయించిన ఆ బ్రాహ్మణుని పేరు అడిగితే, 'చంద్రమౌళి' అని చెప్పారు. అది శివుని పేరు కదా! అంటే సాక్షాత్తు శివుడే వచ్చి నా చేత స్పర్శ దర్శనం చేయించారు” అనిపించి అమితానందాన్ని పొంది, "అయ్యో! ఆయనకు పాద నమస్కారం చేయలేకపోయానే" అని బాధపడింది. సాయే శివుడు, శివుడే సాయి. ఆయన బ్రాహ్మణుని రూపంలో నా భార్యకు సహాయం చేశారు. అంతటి మహాభాగ్యం నా భార్యకు తప్ప ఆమెతో యాత్రకు వెళ్లిన ఎవరికీ లభించలేదు. ఆమెకున్న దైవచింతనే ఆమెకు అంతటి భాగ్యాన్ని ప్రసాదించింది. తరువాత నా భార్య తోటి యాత్రికులతో బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళింది. అలా బాబా దయవలన నా భార్య ఎప్పటి నుండో తను చూడాలనుకున్న కేదార్‌నాథ్, బద్రినాధ్, గంగోత్రి, యమునోత్రి చూసి వచ్చింది. ధన్యోస్మి బాబా. 2017 సంవత్సరాంతంలో వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న కొంతమంది భక్తులు అరుణాచలంలో కలుసుకుని యాత్ర చేయాలని అనుకున్నారు. ఆ విషయంలో నా భార్య బాబా అనుమతి తీసుకుని అరుణాచలేశ్వరుని దర్శించి, గిరి ప్రదక్షిణ చేసి మిగతా వాళ్ళని కలవాలని అనుకుంది. అయితే మా ఊరు నుండి నా భార్య ఒంటరిగా ఎలా వెళ్తుంది అనుకుంటుంటే, బాబా దయవల్ల గుంటూరు నుండి ఒకామె అరుణాచలం వెళ్తున్నట్లు మాకు తెలిసింది. ఆమె పదిరోజుల ముందు నా భార్యకి ఫోన్ చేసి, "నేను రైలు టికెట్లు రిజర్వ్ చేయిస్తాను. విజయవాడ నుండి ఉదయం 7-30, 8 మరియు సాయంత్రం 8-30 గంటలకు రైళ్లు ఉన్నాయి. ఏ రైలుకు చేయించాల"ని అడిగింది. మేము బాబాను అడిగితే, ఉదయం 7-30 గంటల రైలుకు అని సమాధానమిచ్చారు బాబా. అదే విషయం మేము ఆమెతో చెప్పాము. అయితే ఆమె మరుసటిరోజు మాకు ఫోన్ చేసి, "శనివారం ఉదయం 7-30 గంటలకు రైలు లేనందున 8-30 గంటల రైలుకు రిజర్వేషన్ చేయించాను. బాబా మీకు చెప్పిన మాట నిజం కాలేదు కదా!" అని అంది. మాకు ఆమెతో వాదించటం ఇష్టం లేక సౌమ్యంగా, “బాబా లీలలు ఒక పట్టాన అర్థం కావు. ఆయన మాట ఎన్నటికీ వమ్ము కాదు. ఇంకా పది రోజులు సమయముంది కదా, ఏమి జరుగుతుందో వేచి చూద్దాం” అని చెప్పాము. ఆ రోజు సాయంత్రం యధావిధిగా పూజ చేసుకుని బాబా పుస్తకం తెరవగానే, “ఆదివారం వరకూ ప్రయాణం వద్దు” అనే వాక్యం కన్పించింది. మరుసటిరోజు, ఆ మరుసటిరోజు అలా వారం రోజులూ సాయంత్రం పూజ తర్వాత పుస్తకం చదువుదామని తెరిస్తే, అదే వాక్యం వస్తుండేది. అప్పుడు అది బాబా సందేశమని మేము గ్రహించి గుంటూరులో ఉన్న ఆమెకు ఫోన్ చేసి, "శనివారం వద్దు. డిసెంబర్ 31, ఆదివారం బయల్దేరుదాం. టిక్కెట్లు ఆ రోజుకు తీసుకోమ"ని చెప్పాము. ఆమె సరేనని రిజర్వేషన్ టిక్కెట్లు మార్పించింది. తీరా చూస్తే, ఆ టికెట్లు బాబా ముందు చెప్పిన ప్రకారం ఆదివారం ఉదయం 7-30 గంటల రైలువి. చూశారా! చివరికి బాబా చెప్పింది ఎలా నిజమైందో. అంతటితో ఆ గుంటూరు ఆమెకు బాబా సమాధానంపై నమ్మకం కుదిరింది. ఇకపోతే ప్రయాణం ముందురోజు పుస్తకం తెరవగానే "ఖరగ్‍పూర్ ఎక్స్ ప్రెస్‍కు ఆటంకం” అనే వాక్యం కన్పించింది. మేము మొదట రిజర్వ్ చేసింది ఆ రైలుకే. అందుకే బాబా మమ్మల్ని ఆ రైలులో ప్రయాణం చేయనివ్వకుండా మరుసటి రోజుకు మార్చారని మాకు అర్థమైంది. ఆదివారం తెల్లవారుఝామున 2 గంటలకు నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసుకుని స్నానం చేసి, పూజ ముగించాక బాబా పుస్తకం తెరిస్తే, “రైలు చాలా చాలా ఆలస్యంగా వస్తుంది. తొందర వద్దు” అనే వాక్యం కన్పించింది. పది నిమిషాల తర్వాత గుంటూరు ఆమె ఫోన్ చేసి, "రైలు ఆలస్యంగా వస్తుంది. మనం నిదానంగా వెళదామ"ని చెప్పింది. దాంతో మేము తొందరపడకుండా నిదానంగా స్టేషనుకు వెళ్ళాము. బాబా దయవల్ల వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగి రాత్రి 2 గంటలకు అరుణాచలం చేరుకున్నారు. 2018 కొత్త సంవత్సరంనాడు తెల్లవారుఝామున 4 గంటలకు నా భార్య అరుణాచలేశ్వరుని దర్శించుకుంది. అదే రోజు నా భార్య పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణకి వెళ్ళింది. పావు కిలోమీటరు దూరం కూడా నడిచే అలవాటు లేని ఆమె కేవలం రెండు గంటలలో గిరి ప్రదక్షిణ పూర్తి చేసింది. అది నిజంగా బాబా అనుగ్రహం, ఈశ్వరుని కృపాకటాక్షం. ప్రదక్షిణ పూర్తిచేశాక ఆమె తన గదికి వెళ్ళకుండా మరోసారి అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలని గుడి ముందే రాత్రి 11-30 నుండి తెల్లవారుఝామున 3-30 గంటల వరకూ కూర్చుని, గుడి తెరవగానే స్వామి దర్శనం చేసుకుని సంతోషంగా బయటకు వచ్చింది. బాబా అనుక్షణం తోడుగా ఉండబట్టే ఒంటరిగా ఆమెకు అదంతా సాధ్యమైంది.
తర్వాత నా భార్య మిగతా వాళ్లతో కలిసి అక్కడినుండి శ్రీకాళహస్తి వెళ్ళింది. అక్కడ దర్శనమయ్యాక వాళ్లంతా తిరుపతి చేరుకుని తిరుమల కొండపైకి వెళ్లారు. అందరూ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే నా భార్య మాత్రం తెల్లవారుఝామున స్వామి దర్శనానికి వెళ్ళింది. ఆమెకు అరగంటలో స్వామి దర్శనం అయింది. ఆమె వెంటనే మరోసారి దర్శనానికి వెళ్ళింది. ఈసారి ఆమెకు స్వామివారి 'నిజపాద దర్శన భాగ్యం' కలిగింది. ఆమె తన దగ్గర ఉన్న మరమరాల ప్యాకెట్‍ను స్వామివారికి నివేదించి, ప్రసాదంగా తీసుకుని బయటకు వచ్చి ఒక మంటపం వద్ద కూర్చుంది. ప్రసాదాన్ని ఎవరికైనా పెట్టాకనే తినే అలవాటున్న ఆమె కొంచెం దూరంలో ఉన్న ఒక బ్రాహ్మణుని దగ్గరకు పిలిచింది. వెంటనే అతను ఆమె దగ్గరకు వచ్చి, “ఏమిటమ్మా, ప్రసాదమా?" అని మూడుసార్లు మూడు గుప్పెళ్ళు స్వీకరించాడు. ఆమెకు వెంటనే శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చాడు. అంతలో అతను తన దగ్గర తమలపాకులో చుట్టి ఉన్న వెన్న ఆమెకిచ్చి, “నువ్వు అదృష్టవంతురాలివి. ఈ స్వామివారి నైవేద్యం నీకు దక్కింది. ఇది ఈ రోజు తెల్లవారుఝామున స్వామివారికి నివేదించిన వెన్న” అని అన్నాడు. ఆమె మహదానందంతో కళ్ళకద్దుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించింది. ఇదంతా బాబా నడిపిస్తున్న లీల. ఎందుకంటే యాత్రలో భాగంగా ఏ క్షేత్ర దర్శనానికి వెళ్తే, ఆ క్షేత్ర దైవం రూపంలో లీలలు ప్రదర్శిస్తారు.
శ్రీసాయీశ్వరుని దయవల్ల పది జ్యోతిర్లింగాలను దర్శించుకున్న నా భార్య, "ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరుని, ఓంకారేశ్వరుని, మమలేశ్వరుని కూడా ఎప్పుడు, ఎలా దర్శనం చేయిస్తావో బాబా" అని మనసులో బాబాకు విన్నవించుకుంటుండేది. ఇలా ఉండగా ఒకరోజు మా అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నా భార్య మాటల మధ్యలో, "ఉజ్జయిని వెళ్లడానికి టికెట్లు ఎప్పటికున్నాయో చూడు” అని అంది. వారం రోజుల తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసి నా భార్యతో, "బెంగుళూరు వచ్చేయి అమ్మా, ఇక్కడినుండి కారులో వెళ్లి అన్నీ చూసి వద్దాం” అని చెప్పి వెంటనే బెంగుళూరుకు టికెట్ బుక్ చేసింది. నా భార్య, "ప్రయాణం సాఫీగా, అన్ని దర్శనాలు సంతృప్తికరంగా జరిగేలా చూడు బాబా” అని బాబాని వేడుకుని బెంగుళూరు ప్రయాణమై 2019, మార్చి 25, ఉదయం అక్కడ బస్సు దిగింది. ఆరోజు మంగళవారం అయినందున కె.ఆర్.పురంలో సంత జరుగుతుంది. అక్కడున్న పూలమాలలు చూడగానే నా భార్య ఒక మాల తీసుకొని వెళ్లి మా అమ్మాయివాళ్ళ అపార్టుమెంటులో ఒక ప్రక్కగా ఉన్న చిన్న మందిరంలోని బాబాకి వేయాలని అనుకుంది. కానీ తన చేతిలో ఉన్న పెద్ద బాబా ఫోటోని జాగ్రత్తగా చూసుకోవడం మీద తన దృష్టాంతా ఉండటం వలన వెంటనే ఆటో మాట్లాడుకుని ఆటోవాడ్ని లగేజి ఆటోలో పెట్టమని, తను ఆటో ఎక్కేసింది. ఆటో బయలుదేరిపోయాక పూలమాల విషయం గుర్తొచ్చి దారి పొడుగునా బాబాకోసం పూలమాల తీసుకోలేదే అని మనసులో చింతిస్తుంది. మధ్యలో అక్కడక్కడ పూల దుకాణాలు కనిపిస్తున్నప్పటికీ తన ఒడిలో ఉన్న బాబా ఫోటోను ప్రక్కన పెట్టి ఆటో దిగి, మాల తీసుకోలేకపోయింది. తీరా మా అమ్మాయివాళ్ళ ఇల్లు చేరుకున్నాక ఆటోలో నుండి లగేజీ దింపుతుంటే ఒక బ్యాగు కన్పించలేదు. ఆటో అతను తనకు తెలియదన్నాడు. వెంటనే మా అమ్మాయి నా భార్యను స్కూటి మీద ఎక్కించుకుని నా భార్య బస్సు దిగిన చోటుకి తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ముందు బ్యాగుకోసం వెతకకుండా బాబాకోసం పూలమాల, కొన్ని గులాబీపూలు, పండ్లు తీసుకున్నారు. ఆ తర్వాత నా భార్య బస్సు దిగాక లగేజీ ఉంచిన చోటుకి వెళ్ళి చూస్తే బ్యాగు కన్పించలేదు. నిజానికి అక్కడికి వెళ్తున్న దారిలోనే నా భార్యకి 'బ్యాగు అక్కడ ఉండదు, కానీ దొరుకుతుంది' అని అనిపించింది. అదే నిజమయ్యేసరికి ఏం చేయాలో తెలియక నా భార్య ఒక నిమిషంపాటు అలాగే నిలబడిపోయింది. తరువాత ప్రక్కనే ఉన్న చిన్న హోటల్ క్యాష్ కౌంటరులో కూర్చుని ఉన్న వ్యక్తిని బ్యాగు గురించి అడిగింది నా భార్య. అతను వెంటనే “ఇదేనా” అని బ్యాగు చూపించి, “ఒక అతను తెచ్చి ఇచ్చి ఎవరైనా వచ్చి అడిగితే, ఇవ్వమని చెప్పాడు" అని చెప్పాడు. నా భార్య 'హమ్మయ్య దొరికింది” అని బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంది. అందులో మా మనవడి కోసం తీసుకెళ్ళిన చిన్న టేబుల్ ఫ్యాన్ ఉంది. అది పోయుంటే మేము బాధపడేవాళ్ళం. కానీ బాబా అలా జరగనివ్వరు కదా! నా భార్యతో పూలమాల వేయించుకోవడం కోసమే ఆ బ్యాగు మర్చిపోయేలా చేసి మళ్ళీ వెనక్కు రప్పించి మాల తీసుకునేలా చేశారు బాబా. ఆయనే ఆ బ్యాగును హోటల్లో ఇచ్చి, నా భార్యకు అందేలా చేసుంటారు.
సరే, తరువాత నా భార్య, మా అమ్మాయి, అల్లుడు, మనవడు కలిసి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. శిరిడీలో ఉండగా మా మనవడు సాయీష్‍కు తీవ్రమైన జ్వరం వచ్చింది. కళ్ళు ఎర్రబడిపోయి ఒళ్ళంతా మంటలు, వేడి. టాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గి, మళ్ళీ వచ్చింది. అప్పుడు మా అమ్మాయి ఒక ఊదీ ప్యాకెట్ మొత్తం ఒక లీటర్ బాటిల్ నీళ్ళలో వేసి బాగా కలిపి తాగించింది. అంతే వెంటనే జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ రాలేదు. అదీ ఊదీ మహిమంటే. తరువాత నా భార్య ఆశపడినట్లే వాళ్ళు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. బాబా వాళ్ళకి వెళ్లిన చోటల్లా దర్శనమిస్తూ, 'నేను మీతోనే ఉన్నాన'ని అభయమిస్తూ పదిరోజుల యాత్రను ముందుండి నడిపించారు. "కృతజ్ఞతలు బాబా".
బాబా సర్వాంతర్యామి. శ్రీసచ్చరిత్రలో ఉన్నట్లు, 'వర్షపు బిందువులను లెక్కించవచ్చు. తోలు సంచిలో గాలిని మూయవచ్చు. కానీ అనంతమైన బాబా లీలలను లెక్కించడం అసంభవం'. ఆయన లీలలకు అంతం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక లీలను ఆయన ప్రదర్శిస్తూనే ఉంటారు. కాబట్టి ఆయన మాకు అనుగ్రహించిన లీలలు ఇంతటితో సమాప్తమని అనలేను. ఆయన అనుగ్రహంతో మరికొద్ది రోజుల్లో మా అనుభవాలు మరికొన్ని పంచుకుంటాను. ప్రస్తుతానికి ఇంతవరకు నేను పంచుకున్న బాబా అనుగ్రహాన్ని భక్తితో చదవండి, సాయితత్వం తెలుసుకోండి, సాయి మీద భక్తిని పెంచుకోండి. సాయి భక్తులైన మీరు కూడా మీకు జరిగిన అనుభవాలను సాయి భక్తులతో పంచుకోండి. శ్రీసాయితత్వాన్ని భావితరాలకు అందచేయండి. ఇంటింట బాబా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. పొరపాట్లేమైనా ఉంటే పెద్ద మనసుతో బాబా క్షమిస్తారని ఆశిస్తూ... వారి పాదపద్మములకు వినమ్రపూర్వక నమస్కారాలర్పిస్తూ...
- సాయికృపతో సాయిబాబు.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai Ram 🙏🏼🙏🏼🙏🏼
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteom sairam sai nannu na barthani kalupu sai na kalpuranni nilabettu sai pls ...na bartha nannu ardham cheskoni Mali natho kalisipoyyela chudu sai.thanaki dhuram ga nenu undalenu sai nenu na anubhavanni sai maharaj sannidhi blog lo panchukuntanu sai
ReplyDelete