1. అంతటా తోడుగా ఉన్న బాబా
2. “నేను నీ వెనుకనే ఉన్నాను, నువ్వే నన్ను చూసుకోవట్లేదు” అని తెలియజేస్తున్న బాబా
3. సమస్యలను తొలగించిన బాబా
అంతటా తోడుగా ఉన్న బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఏ దారీ లేనివాళ్ళకి బాబానే దిక్కు. ఆ విషయాన్ని ఎన్నోసార్లు బాబా నా జీవితంలో నిరూపించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. మీరు చేసిన ఏ ఒక్క ఉపకారాన్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను తండ్రీ". ఇక నా అనుభవానికి వస్తే.. కొన్ని నెలల క్రితం నేను కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటానని మ్రొక్కుకున్నాను. ఆలస్యం చేయొద్దని ఒకరోజు టికెట్లు బుక్ చేద్దామని టిటిడి వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఒక నెల తర్వాత దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకేమీ ఆలోచించుకోకుండా వెంటనే టిక్కెట్లు బుక్ చేశాను. ఎందుకంటే, దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళ్తే, దర్శనానికి చాలా సమయం పడుతుంది. తరువాత తిరుపతి వెళ్లేరోజు రానే వచ్చింది. నేను చాలా సంవత్సరాల క్రితం కాలినడకన కొండెక్కాను కానీ, ఈమధ్య ఎప్పుడూ ఎక్కలేదు. అందువల్ల నడవగలనా, లేదా అని చాలా భయమేసి, "బాబా! ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల కొండెక్కి శ్రీస్వామి దర్శనం చేసుకునేలా చూడండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఏ ఆటంకం లేకుండా కొండపైకి నడిచి వెళ్లగలిగాను. తొందరగా దర్శనమైతే అదేరోజు హైదరాబాదుకి తిరుగు ప్రయాణమవ్వాలని మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ అది వారాంతమైనందున దర్శనానికి ఎంత సమయం పడుతుందో, అసలు టిక్కెట్లు ఉంటాయో, లేదో అని చాలా భయమేసింది. సరే, ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకి దర్శనం టికెట్లు బుక్ చేసివున్నప్పటికీ సాయంత్రం 5:30కే మేము దర్శనం క్యూలోకి వెళ్ళాం. బాబా దయవల్ల అభ్యంతరం చెప్పకుండా మమ్మల్ని దర్శనానికి అనుమతించారు. క్యూలైన్లో చిన్న సమస్య ఎదురైనప్పటికీ అది పెద్దది కాకుండా చక్కటి దర్శనాన్ని బాబా అనుగ్రహించారు. దర్శనానంతరం బస్సు టిక్కెట్లు బుక్ చేయడానికి ఫోన్ తీసి, "ఏ ఆటంకం లేకుండా టిక్కెట్లు దొరకాలి బాబా" అని అనుకున్నాను. ఆయన దయవల్ల టికెట్లు దొరికాయి. అయితే అప్పటికి రాత్రి 8.30 అయింది. మేము ఇంకా కొండపైనే ఉన్నాము. అదీకాక, కిందికి వెళ్ళాక రూముకి వెళ్లి బ్యాగులు సర్దుకుని, ఫ్రెషప్ అయి బస్సు అందుకోవాల్సి ఉంది. అందరూ కొండపైనుంచి కిందకు బస్సులో లేదా ప్రైవేట్ వాహనంలో వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. దాంతో బస్సు అందుకోగలమో, లేదో అనిపించి, "బాబా! ఎలాగైనా బస్సు అందుకునేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. తరువాత ఒక ప్రైవేట్ వెహికిల్ మాట్లాడుకున్నాము. అతను చాలా తొందరగా మమ్మల్ని కిందకు చేర్చాడు. మేము ఫ్రెష్ అయి సరైన సమయానికి బస్సు అందుకుని సురక్షితంగా హైదరాబాద్‍కి తిరిగి వచ్చాం. ఇదంతా బాబా దయవల్లే జరిగింది. "అంతటా మాకు తోడుగా ఉన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా. నేను ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు బాబా. నిజానికి ఇటీవల బ్లాగులో ఒక భక్తురాలు పంచుకున్న తిరుపతి ప్రయాణం గురించి చదివాకే నేను నా అనుభవం పంచుకోలేదని నాకు గుర్తుకొచ్చింది. అలా మీరే గుర్తుచేశారు. ఇంకా ఏదైనా అనుభవం పంచుకోవడం మర్చిపోయివుంటే దయచేసి గుర్తుచేయండి బాబా. ఎందుకంటే, నేను ఎన్నో సమస్యల్లో పడి చాలా విషయాలు మర్చిపోతున్నాను. కానీ మిమ్మల్ని మరిచిపోలేదు బాబా".
సైకిల్ మీద వెళ్తుంటే నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని, బాబా దయతో తనకి ఆపరేషన్ జరిగిందని నేను ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్నాను. అప్పుడు నేను, "బాబా! ఆ బాబుకి త్వరగా తగ్గిపోవాల"ని బాబాని వేడుకున్నాను. ఈమధ్య ఆ బాబు కాలికి ఉన్న కట్లు విప్పేసి స్కాన్ చేసి, "చాలా త్వరగా నయమైంది" అని డాక్టర్లు చెప్పి, ప్రస్తుతం ఫిజియోథెరపీ చేస్తున్నారు. బాబా దయవల్ల ఇదంతా బాగానే ఉంది కానీ, ఆపరేషన్ సమయంలో బోన్ సెట్ చేసేటప్పుడు బోన్ యొక్క కొద్ది భాగం పక్కకి వచ్చింది. అది రోజులు గడిచే కొద్దీ సెట్ అవుతుందని డాక్టర్ చెప్పారు. అప్పుడు నేను, "బోన్ తొందరగా సెట్ అయి బాబు నడవగలిగేలా చేయండి బాబా" అని బాబాని కోరుకున్నాను. ఆరునెలలకి తన కాలు నయమైందిగానీ బాబు సరిగా నడవలేకపోతున్నాడు. డాక్టర్లు స్కాన్ చేసి, "అదనంగా ఉన్న బోన్ సరిగా అటాచ్ అవలేదు. ఒక నెలలోపు బోన్‍లో గ్రోత్ వస్తే సరే, లేకపోతే మళ్లీ సర్జరీ చేసి ఏదో ఒక బోన్ తాలూకు యాక్టివ్ సెల్స్ ఉన్న చిన్న భాగం తీసి అక్కడ పెట్టాలి. అప్పుడు గ్రోత్ వస్తుంది" అని చెప్పారు. "సర్జరీ వల్ల ఆరునెలలుగా బాధపడుతున్న చిన్నపిల్లాడికి మళ్ళీ సర్జరీ అంటే నాకు చాలా బాధగా ఉంది బాబా. ఎలాగైనా దయతో ఆ బాబు బోన్‍లో గ్రోత్ వచ్చేలా చూసి ఆపరేషన్ అవసరం లేకుండా చేయండి ప్లీజ్. ఇప్పటివరకు నువ్వే దగ్గరుండి ఏ సమస్య లేకుండా తగ్గేలా చేసావు. ఇకమీదట కూడా తనని ఇలాగే చూసుకుంటూ తనకి తొందరగా తగ్గి, నడిచేలా చేయండి బాబా. చిన్నపిల్లాడు, చాలా భవిష్యత్తు ఉంది కదా బాబా". బాబాను ప్రార్థించే సమయంలో ఆ బాబుని తలచుకోమని సాటి సాయిభక్తులందరికీ విన్నవించుకుంటున్నాను.
“నేను నీ వెనుకనే ఉన్నాను, నువ్వే నన్ను చూసుకోవట్లేదు” అని తెలియజేస్తున్న బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. బాబా తరచూ నాకు స్వప్నంలో దర్శనమిచ్చి, “నేను నీ వెనుకనే ఉన్నాను, నువ్వు నన్ను చూసుకోవట్లేదు” అని చెబుతూ ఉంటారు. ఇటువంటి స్వప్నదర్శనం ప్రథమంగా బాబా నాకు 2012వ సంవత్సరంలో ప్రసాదించారు. ఆ ప్రథమ స్వప్నదర్శనం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా పాప పుట్టిన సంవత్సరం తరువాత నాకు ఈ స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను, మావారు, మా బాబు, మా పాప నలుగురం కలిసి బండి మీద ఒక బాబా గుడికి వెళ్ళాము. ఆ గుడి ప్రాంగణమంతా ఒక కొండ ప్రాంతం. ఆ గుడి ప్రాంగణాన్ని నేను అంతకుముందెప్పుడూ చూడలేదు, కేవలం స్వప్నంలోనే చూశాను. అసలు ఆ గుడి నిజంగా ఉందో, లేదో అనే విషయం కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బండి దిగి మా పాపని ఎత్తుకుని నిలబడ్డాను. మావారు, మా బాబు బండిని పార్కింగ్ ప్లేస్‌లో పెట్టడానికి వెళ్లారు. అప్పుడే నా స్నేహితురాలు నాకు కనిపించింది. నిజానికి నేను, నా స్నేహితురాలు కలుసుకొని అప్పటికి 7 సంవత్సరాలు అయింది. తను ఆరోజు నాకు స్వప్నంలోనే కనిపించింది. తను నన్ను చూసి, “హాయ్, ఏంటి ఇక్కడున్నావ్?” అని అడిగింది. “మావారు, మా బాబు బండి పార్క్ చేయడానికి వెళ్లారు. వాళ్ళు వచ్చాక లోపలికి వెళదామని వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను” అని చెప్పాను. దాంతో నా స్నేహితురాలు, “సరే, మనం వెళ్దాం రా, వాళ్లు వస్తారులే” అని అంది. నేను సరేనని నా స్నేహితురాలితో కలిసి గుడి లోపలికి వెళ్దామనుకున్నాను. అయితే అక్కడ చాలామంది జనం ఉన్నారు. నేను ఆ జనాన్ని చూసి, ‘నా చెప్పులు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఈ రద్దీలో అవి పోతాయేమో’ అనుకుని, మళ్ళీ అక్కడే ఒక ప్రక్కగా పెట్టి బాబా గుడిలోకి వెళ్లాను. ఆ గుడిలో ఉన్నది బాబా విగ్రహమో, ఫోటోనో కాదు, అచ్చంగా ఫకీరు రూపంలో ఉన్న బాబానే! నేను బాబాను చూసిన వెంటనే నిర్ఘాంతపోయి ఆయన వైపే చూస్తూ ఉన్నాను. బాబా కూడా నా వైపు చూస్తున్నారు. నా స్నేహితురాలు నన్ను చూసి, “ఏంటి అలా చూస్తున్నావ్? రా, బయటికి వెళ్దాం” అని అంది. “అదేంటి, అప్పుడే వెళ్ళిపోదామంటున్నావ్? కాసేపు ఉందాం” అన్నాను నేను. అందుకు తను, “ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు” అని అంది. “ఎందుకు ఉండకూడదు?” అని అడిగాను నేను. దానికి తను, “ఇక్కడ మనం ఎక్కువసేపు ఉంటే బాబాను బాధపెట్టినవాళ్ళం అవుతాం. మనల్ని చూసి ‘నా భక్తులు ఇన్ని కష్టాల్లో ఉన్నందుకే నా దగ్గరకి వస్తున్నారు’ అని బాబా బాధపడతారు” అని చెప్పి, నా చేయి పట్టుకుని నన్ను బయటకు తీసుకుని వెళ్ళింది. నేనలాగే తన వెనుకనే వెళ్ళిపోయాను. బయటకు వెళ్లిన తర్వాత నేను అనుకున్నట్టుగానే నా చెప్పులు కనిపించలేదు. చుట్టుప్రక్కలంతా వెతికాను. చాలాసేపటి తరువాత చెప్పులు కనిపించాయి. చెప్పులు వేసుకుని నేను, మా పాప, నా స్నేహితురాలు ముగ్గురం నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు మా పాప వయసు రెండు సంవత్సరాలు. నేను మా పాపని నా ఎడమవైపు ఎత్తుకున్నాను. అలా వెళ్తూ ఉండగా నా వెనకాల ఆ ఫకీరు(బాబా) రావడం కనిపించింది. నేను వెనక్కి వెనక్కి చూసుకుంటూ నడుస్తున్నాను. నా స్నేహితురాలు నాతో, “నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వెందుకు అటు చూస్తున్నావు?” అని అంటోంది. “నీకు నా ఎడమవైపున ఎవరూ కనిపించట్లేదా?” అని అడిగాను. తను, “నాకెవ్వరూ కనిపించడం లేదు” అని అంది. నేను నా ఎడమవైపుకి తిరిగాను. బాబా నా వెనుకనే ఉన్నారు. ఆయన మా పాప బుగ్గ పట్టుకుని ముద్దుపెట్టుకున్నారు. నేను ఆయన వైపు చూస్తూ, “ఏమైంది, లోపల ఉండాల్సిన ఈ ఫకీరు ఇలా వచ్చేశారు?” అని అనుకుంటున్నాను. అప్పుడు బాబా నాతో, “నేను నీ వెనుకనే ఉన్నాను, నువ్వే నన్ను చూసుకోవట్లేదు” అని అన్నారు. బాబా మాటలు విని, నేను బాబాను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నానో అర్థం చేసుకున్నాను. ‘ఎంత ప్రేమ ఉంటే ఆయన మన వెనకాలే ఉంటారు?’ అన్న విషయం నేనప్పుడు గ్రహించాను. ఇలా ‘బాబా నా వెనకాలే ఉన్నారు’ అనేటువంటి నిదర్శనాలు నా జీవితంలో చాలా జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా త్వరలోనే ఈ బ్లాగ్ ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను. అలాగే, మావారు చేసే పనిలో తనకు ప్రమోషన్ రావాలని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మావారికి ప్రమోషన్ వస్తే ఆ అనుభవాన్ని కూడా ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాటిస్తున్నాను. స్వార్థంతో కాకుండా భక్తిశ్రద్ధలతో బాబాకు దగ్గర కావాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాను.
సమస్యలను తొలగించిన బాబా
సాటి సాయి బంధువులకు, బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈమధ్య నా ఉంగరం ఒకటి కనపడలేదు. బీరువాలో, ఇంకా ఇల్లంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను, "బాబా! మీ కృపతో ఉంగరం దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని బాబాను వేడుకున్నాను. అప్పటివరకు చాలాసార్లు వెతికినా కనిపించని ఉంగరం అలా బాబాను వేడుకున్నంతనే కనిపించింది.
ఇంకోసారి మా పిల్లలిద్దరికీ ఒకేసారి జ్వరం వచ్చింది. ఎన్ని మందులు వాడినా, రెండు రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు. మేము చాలా భయపడ్డాము. అప్పుడు నేను, "బాబా! పిల్లలకి జ్వరం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల వెంటనే పిల్లలకి జ్వరం తగ్గింది. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి. ఎల్లప్పుడూ మీ అనుగ్రహాన్ని మాపై వర్షించండి బాబా".
ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Sai nannu vamsi ni kalupu sai na kapuranni nilabettu sai ee kotha samvasram yela untundho naku bayam ga undhi sai
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and foot pain relief from the pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteOm sai ram 🙏
ReplyDelete