సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1389వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దగ్గరికొచ్చి తల నిమిరి కోవిడ్ బారినుండి బయటపడేసిన బాబా
2. ఆపదలో ఉన్నవారి చెంతకు పరుగున వచ్చే బాబా
3. బాబా దయ

దగ్గరికొచ్చి తల నిమిరి కోవిడ్ బారినుండి బయటపడేసిన బాబా


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయినాథునికి నా కృతజ్ఞతలు. నేను సాయిభక్తురాలిని. నా పేరు హేమలత. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్రపంచమంతా కూడా చాలా భయపడ్డాం. చాలామంది కుటుంబాలకు దూరమైనవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో బాబా నన్ను కోవిడ్ బారినుండి ఎలా కాపాడారో చెప్తాను. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల మేముండే ప్రాంతమంతా రెడ్ జోన్ ప్రకటించారు. బయటికి వెళ్లే సూచనలు అసలేమాత్రం లేవు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. కానీ, 10 సంవత్సరాల వయస్సున్న మా పాపకి ఇంజక్షన్ చేయించాలని మావారు తనని బయటికి తీసుకుని వెళ్లారు. పాపకి ఇంజక్షన్ చేయించి ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరూ ఫ్రెష్ అయ్యారు. అయితే, ఇంజక్షన్ చేయించడం వల్ల మా పాపకి జ్వరం వచ్చింది. రెండు రోజుల వరకు జ్వరం తగ్గలేదు. నేను హాస్పిటల్ వాళ్లకి కాల్ చేసి అడిగితే, “ఆ ఇంజక్షన్ ప్రభావం అలాగే ఉంటుంది, ఏం కంగారుపడవద్దు. ఇంకొక రోజు వేచిచూడండి. అప్పటికీ జ్వరం తగ్గకపోతే తనకి కోవిడ్ టెస్ట్ చేయించండి” అని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. ‘అనవసరంగా పాపని బయటికి పంపించాను, ఆ ఇంజక్షనేదో తర్వాత చేయించవలసింది’ అనుకున్నాను. బాబా దయవల్ల ఆ మరుసటిరోజే పాపకి జ్వరం తగ్గింది. కానీ, పాపకి జ్వరం ఉన్నప్పుడు నేను తనని చూసుకుంటూ తన ప్రక్కనే ఉండడం వల్ల నాకు కూడా జ్వరం లక్షణాలు వచ్చాయి. దాంతో తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి, “పాపకి జ్వరం వచ్చింది, నేను తన ప్రక్కన ఉండటం వల్ల నాకు కూడా జ్వరం వచ్చింది” అని చెప్పాను. డాక్టర్ నాకు ఒక ఇంజెక్షన్ చేసి, మూడు రోజుల పాటు వాడమని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. ‘అప్పటికీ జ్వరం తగ్గకపోతే కోవిడ్ టెస్ట్ చేయించుకోమ’ని చెప్పారు. మందులు వాడిన ఆ మూడు రోజుల్లో నాకు మళ్ళీ జ్వరం రాలేదు. కానీ మందులు అయిపోయిన మరుసటిరోజు రాత్రి బాగా ఆయాసం వచ్చింది. అసలు ఊపిరి ఆడలేదు. నాకు చాలా భయమేసింది. నా పరిస్థితి చూసిన మా బాబు, పాప నా దగ్గరకు వచ్చి, “అమ్మా! నీకు కోవిడ్ వచ్చిందా? నువ్వు చనిపోతావా?” అని అడిగినప్పుడు నేనెంతో ఏడ్చాను. మావారు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తానన్నారు. కానీ నేను మాత్రం, “నేను ఎక్కడికీ రాను, హాస్పిటల్‌కి వెళ్తే వాళ్లు ఇంకా భయపెడతారు” అని చెప్పి, ముక్కుదిబ్బడ పోవడం కోసం ‘నాసల్ స్ప్రే’ తీసుకురమ్మని చెప్పాను. ఆ సమయంలో బయట బాగా వర్షం పడుతోంది. అయినప్పటికీ మావారు స్ప్రే తీసుకురావడానికి బైటికి వెళ్ళారు. తను వచ్చేలోపు ఇంటి చిట్కా ఒకటి ప్రయత్నిద్దామని, వేడినీళ్ళలో కొంచెం ఉప్పు కలిపి ఆ నీటిని ముక్కులో పోసుకున్నాను. దానివల్ల, ముక్కులోని తేమ కాస్తా కఫంలాగా గొంతులోకి వచ్చేసింది. అలా రెండు మూడుసార్లు జరిగింది. సుమారు 30 నిమిషాల తర్వాత నాసల్ స్ప్రే తీసుకుని మావారు వచ్చారు. నేను స్ప్రే చేసుకున్నాను. కానీ ముక్కులో ఉప్పునీళ్ళు పోసుకున్నందువల్ల నాకు ఏమీ తెలియలేదు. రూములో ఊపిరాడట్లేదని బయటకు వచ్చి కూర్చున్నాను. ఊపిరాడక సతమతమవుతున్న నన్ను చూసి పిల్లలు కూడా నా ప్రక్కన కూర్చుని ఏడుస్తున్నారు. “నాకేం కాదు, మీరు పడుకోండి. నేను పది నిమిషాలు ఆగి వస్తాను” అని చెప్తే, పిల్లలు పడుకోవటానికి రూములోకి వెళ్లారు. నేను, మావారు బయటే కూర్చున్నాము. రాత్రి 11 గంటలైంది. కానీ నా పరిస్థితి ఇంకా అలాగే ఉంది. దాంతో, ఏదైతే అదే అవుతుందిలే అని మళ్ళీ స్ప్రే చేసుకుని, నోటితోనే ఊపిరి పీల్చుకుంటూ పడుకున్నాను. కొంతసేపటి తర్వాత మెలకువ వచ్చింది. అప్పుడు కొద్దిగా ఊపిరి ఆడుతోంది. ‘హమ్మయ్య, ఇప్పుడు కాస్త పరవాలేదు’ అనుకున్నాను. కానీ జ్వరం మాత్రం బాగా ఎక్కువైపోయింది. బాగా చలి వేసేస్తోంది. మావారు చూసి, “చూస్తుంటే ఇవి కోవిడ్ లక్షణాల్లాగానే ఉన్నాయి. నీ నుంచి మళ్ళీ పిల్లలకి వస్తే ఇబ్బంది కదా. అందుకని నువ్వు విడిగా ఈ రూములోనే ఉండు” అని చెప్పి, తను పిల్లలతో కలిసి వేరే రూములో ఉన్నారు. అలా ఒక మూడు రోజుల పాటు నా పరిస్థితి అలాగే కొనసాగింది. ఊపిరి ఆడలేదు; వాసన, రుచి తెలియలేదు. దాంతో భయపడి కోవిడ్ టెస్ట్ చేయించుకుందామని అనుకున్నాను. కానీ ‘ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది’ అని అనుకుని, నా స్నేహితురాలికి కాల్ చేసి విషయం చెప్పాను. ‘నిమ్మరసం కలిపిన నీటిని ఎక్కువగా త్రాగుతూ ఉండు’ అని తను సలహా ఇచ్చింది. ఇంక నేను రెండు మూడు రోజుల పాటు ఏమీ తినకుండా కేవలం నిమ్మకాయనీళ్ళు మాత్రమే త్రాగుతూ ఉన్నాను. అలా జరుగుతుండగా, మూడవరోజు రాత్రి ఒక సంఘటన జరిగింది. నేను మంచం మీద పడుకుని ఉన్నాను. కానీ నేను నిద్రపోవటం లేదు, అలా అని నేను మెలకువగానూ లేను. అటువంటి స్థితిలో.. నాకు చాలా స్పష్టంగా గుర్తుంది, బాబా ధరించే దుస్తుల (ధోతి) వంటి దుస్తులు వేసుకున్న 20 సంవత్సరాల వయసుగల ఒక అబ్బాయి (కలలో నాకు అతను బాబా అనే తెలుస్తోంది.) నా దగ్గరికి వచ్చి, నాకు కనిపించేటట్టుగా జీడిపప్పు, బాదంపప్పు మా అలమరా పైన పెడుతున్నాడు. అది చూసి నేను, “ఎందుకు వాటిని అక్కడ పెడుతున్నావ్? అవి పడిపోతాయి” అని అన్నాను. దానికి బాబా, “ఎవరు పెడుతున్నారు? నేను పెడుతున్నాను. ఎందుకు పడిపోతాయి? నువ్వు బాగా నీరసంగా ఉన్నావ్. అన్నీ వెతుక్కోవాలంటే కష్టం. అందుకే నీకు కనిపించేటట్లుగా ఎదురుగా పెడుతున్నాను” అని చెప్పి, వచ్చి నా తల దగ్గర కూర్చుని నా తల నిమురుతూ ఉన్నారు. నేను, “ఏంటి, ఏమీ మాట్లాడవు?” అని అడిగాను. దానికి బాబా, “ఏం మాట్లాడను? ఎలా మాట్లాడను? నాతో మాట్లాడినట్టు మాట్లాడనా? మనతో మాట్లాడినట్టు మాట్లాడనా?” అని అడిగారు. “మనతో మాట్లాడినట్టే మాట్లాడు” అన్నాను నేను. కానీ బాబా ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నేను, “బాబా, నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటున్నాను. నేను పడుకున్నాను కదా అని నువ్వు శిరిడీ వెళ్ళిపోతావేమో! వెళ్లవద్దు. నీకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఆరతి ఇస్తారు. అప్పటివరకు నాతోనే ఉండు” అన్నాను. అంతే! ఆ తర్వాత ఏం జరిగిందో నాకసలు తెలియలేదు. నేను గాఢనిద్రలోకి జారుకున్నాను. 


ఉదయం నిద్రలేచేసరికి నేను చాలా ఫ్రీ అయిపోయాను. అంతకుముందు మూడు రోజుల నుంచి ఎంత బాధ అయితే పడ్డానో, బాబా నా తల నిమిరిన వెంటనే నాకు ఇంక ఏ బాధా లేదు. వెంటనే లేచి ఫ్రెష్ అయి, మావారు, పిల్లలు ఎప్పుడు లేస్తారా, వాళ్ళకు ఎప్పుడెప్పుడు ఈ విషయం చెప్పాలా అని ఆతృతగా ఎదురుచూడసాగాను. ఇంతలో మావారు లేచి నన్ను చూసి, “ఏంటి, అప్పుడే లేచావు?” అని అడిగారు. నేను ఎంతో ఆనందంతో, “నాకు మెలకువ వచ్చేసింది. రాత్రంతా బాబా నాతోనే ఉన్నారు” అని జరిగినదంతా మావారితో చెప్పాను. తను వెంటనే, “నీ మొహంలో ఆనందం తెలుస్తోంది. నీ వాయిస్‌లో కూడా మార్పు వచ్చింది. పోనీలే, నువ్వు రోజుకన్నా చాలా ఫ్రీ అయ్యావు. కానీ ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకు. ఎందుకంటే, ఇలాంటివి అందరూ నమ్మరు” అని అన్నారు. ఆ మరుసటిరోజు నేను మామూలుగానే ఇల్లంతా తిరిగేశాను. ఎటువంటి టాబ్లెట్ లేదు, ఎటువంటి ఇంజక్షన్ లేదు. కేవలం బాబా నా దగ్గరికి వచ్చి నా తల నిమరడం వల్ల నేను కోవిడ్ బారినుండి బయటపడ్డాను. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ, ‘మనం బాబాను ఎంత ప్రేమతో పిలుస్తామో, అంతే ప్రేమ ఆయనకి మనపై ఉంటుంది’ అనడానికి ఇదే నిదర్శనం. నేను ఈ అనుభవాన్ని అందరికీ చెప్పకపోయినా, నమ్మినవాళ్లకి, మా బంధువులలో కొంతమందికి మాత్రమే చెప్పాను. కానీ ఈ బ్లాగులో ప్రచురించే అనుభవాలు చూశాక, ‘ఈ బ్లాగును కేవలం నిజమైన సాయిభక్తులు మాత్రమే చూడగలర’నే ఉద్దేశ్యంతో బాబా నాకు ఇచ్చిన ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. “సాయినాథా! తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. సాయీ! ప్రతి ఒక్కరిపై మీ దయ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సాయీ!”.


ఆపదలో ఉన్నవారి చెంతకు పరుగున వచ్చే బాబా


సాయి బంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నిత్యజీవితంలో బాబా ఎన్నో అనుభవాలను ప్రసాదిస్తున్నారు. ఆయన దయవలన ఈ బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. నాకు షుగరు వ్యాధి ఉంది. రెండు నెలల క్రిందట మా పిల్లలు "బండి మీద వద్దు, బస్సులో వెళ్ళండి" అని అంటున్నా వినకుండా నేను, మావారు చిలకలూరిపేట నుండి గుంటూరులోని హాస్పిటల్‍కి వెళ్ళాము. హాస్పిటల్లో చూపించుకుని తిరిగి వస్తుంటే గుంటూరు సిటీ దాటాక బండి ఆగిపోయింది. అక్కడివాళ్ళు, "రెండు కిలోమీటర్ల దూరంలో మెకానిక్ షెడ్ ఉంది. వెళ్లండి" అని అన్నారు. విపరీతమైన ఎండలో బండిని తోసుకుంటూ అక్కడికి వెళితే మెకానిక్ బండిని చూసి, "బండి మొత్తం విప్పాలి. బాగు చేయడానికి రెండు రోజులు పడుతుంది" అని అన్నాడు. మాకు ఏం చేయాలో అర్థంకాక మళ్లీ బండి తోసుకుంటూ మునుపు ఆగిన చోటుకే వచ్చాము. మావారు ఐదారు లారీలను ఆపారు. కానీ వాళ్ళు ఆపకుండా వెళ్లిపోయారు. నాకు కళ్ళు తిరిగి పోతున్నాయి. అప్పుడు బాబా గుర్తుకు వచ్చి, "ఏంటి బాబా ఈ పరీక్ష? ఇప్పుడు ఏం చేయాలి. ఎండలో నిలబడలేకపోతున్నాను. మాకు సహాయం చేసి ఇంటికి చేర్చండి బాబా" అని ఆయన్ని వేడుకుని కన్నీళ్లు పెట్టుకున్నాను. అంతలో ఒక అతను ఒక ఆటో, లారీతో వచ్చి మమ్మల్ని చూసి, "ఏమైంది?" అని అడిగారు. మేము జరిగింది చెప్పాక ఆయన నన్ను ఆటోలో కూర్చోమని, ఆయన, ఇంకొక అతను, మావారు కలిసి బండిని లారీ పైకి ఎక్కించి మమ్మల్ని చిలకలూరిపేట చేర్చారు. నిజానికి ఆయనకు పేట వరకు రావలసిన అవసరం లేదు. కేవలం మాకోసమే వచ్చారు. "ఎంత డబ్బులివ్వమంటారు?" అని అడిగితే, "మీ ఇష్టం. ఎంతో కొంత ఇవ్వండి" అని అన్నారు. ఆయన ఎవరో కాదు, బాబానే. "ఎంతని చెప్పను తండ్రి మీ కృపను? ఇలాగే  ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి సాయి. మా ఇబ్బందులు మీకు తెలుసు. మా పిల్లల విషయంలో సహాయం చేయండి. మీ చిన్న మనవడికి మంచి ఉద్యోగం ఇప్పించండి. ఈమధ్య నా గుండెల్లో నొప్పి వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటే, గుండెకు గాలి సరఫరా అయ్యే పైపు వంగిందని, మందులు వాడితే తగ్గుతుంది అన్నారు. మీకన్నా గొప్ప డాక్టర్ ఎవరు బాబా? మీ ఊదీని మించిన ఔషధం ఏముంది? మందులుతోపాటు ఊదీ తీర్థం తీసుకుంటున్నాను. ఈసారి రిపోర్టు నార్మల్ వచ్చేటట్లు చేయండి సాయి. నా పిల్లలిద్దరికీ అక్షింతలు వేసేదాకా నాకు ఆయుష్షునివ్వండి సాయి. మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను తండ్రి. నేను మీ బిడ్డను. తెలిసితెలియక తప్పులు చేస్తే క్షమించండి. మా కుటుంబ భారం మీపై వేశాను. మా తమ్ముడు, తన భార్య గొడవలు పడుతున్నారు. మనస్పర్థలు తొలగి మంచిగా ఉండేటట్లు వాళ్ళకి సహాయం చేయండి తండ్రి".


బాబా దయ


నా పేరు లలిత. నేను ఒక సాయి భక్తురాలిని. ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు 'ఆధునిక సచ్చరిత్ర' అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్లాగులో పంచుకుంటామంటే శ్రీసాయినాథుడు మన కోరికలు తీరుస్తున్నారు. నేను ఈ మధ్య వాషింగ్ మెషిన్‍లో బట్టలు వేస్తుంటే చిన్నగా షాక్ కొట్టింది. పైగా మెషిన్ పని చేయలేదు. లూజ్ కనెక్షన్ వల్లనేమో అని ప్లగ్ సరిచేసాను. కానీ ఎంత గట్టిగా ప్లగ్ పెట్టినా మెషిన్ ఆన్ అవ్వలేదు. దాంతో ఇంట్లోవాళ్ళు ఏమంటారో అని చాలా భయపడి మన సాయినాథునికి దణ్ణం పెట్టి, "వాషింగ్ మెషిన్ ఆన్ అయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల వాషింగ్ మెషిన్ ఆన్ అయ్యింది. అయితే మరుసటి రోజు కూడా మళ్లీ అదే ప్రాబ్లమ్ వచ్చింది. ఇంక విషయం మా ఆయనకి చెప్పాను. ఆయన వెంటనే ఒక మెకానిక్‍ని పిలిపించి వాషింగ్ మెషిన్ బాగు చేయించారు. బాబా దయవలన ఇప్పుడు వాషింగ్ మిషన్ బాగా పని చేస్తుంది.


ఈమధ్య మా ఆయనకి తల, కాళ్ళు, చేతులు, పిక్కలు నొప్పులు, జ్వరం వచ్చాయి. వాటితో ఆయన చాలా బాధపడ్డారు. డాక్టర్ దగ్గరకి వెళితే టెస్టులు చేసి యూరిన్‌‍లో ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ ఉన్నాయని మందులిచ్చారు. ఆ తర్వాత షుగరు టెస్ట్ చేయించమన్నారు. అప్పుడు నేను చాలా టెన్షన్ పడి శ్రీసాయిబాబాకి దణ్ణం పెట్టి, "బాబా! ఆయనకి షుగరు ఉండకూడదు. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవలన ఆయనకి షుగర్ లేదని రిపోర్టు వచ్చింది. జ్వరం కూడా తగ్గింది. కానీ నీరసంగా ఉంటుంది. అది కూడా తగ్గిపోవాలని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. "సాయితండ్రి! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను? మీ దయతో మావారి ఆరోగ్యం బాగుండాలి. మీ పాదాలందు నాకు స్థిరమైన నమ్మకం ఉండేలా ఆశీర్వదించు తండ్రి".


6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sai ram all Sai Leela’s are nice.who saw baba in dream and real darshan they are lucky devotees .I am praying for darshan in dream.om sai mata

    ReplyDelete
  3. Sai naku na anubhavanni sai maharaj sannidhi blog lo panchukune adhrustanni prasadinchandi sai.guruvaram roju baba ashirvadham tho na pelli jarigindhi asalu nenu anubhavanni yeppuatiki marchipolenu sai yentha happy na matallo cheppalenu sai. Kani Mali naku ee pariksha yenti sai na kapuranni nilabettu sai ninne nammukoni yenno years nunchi yeduruchusthuna sai nannu na barthani kalapandi sai thanu manchi ga Mari nannu kapuraniki thiskellela ashirvadhindhinchandi sai plssss😥😥 thana ki dhuram ga undalenu sai thandi kapadu sai

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Omsairam nice msg mam

    ReplyDelete
  6. రక్ష రక్ష సాయి రక్ష.. రక్ష రక్ష సాయి రక్ష.. రక్ష రక్ష సాయి రక్ష .. ఓం సాయిరాం

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo