1. మన క్షేమం విషయంలో ఎంతో జాగరూకులుగా ఉంటారు బాబా
2. కోరుకున్న కాలేజీలో సీటు అనుగ్రహించిన బాబా
3. చిన్న విషయమే కానీ సాయి కృప ఎంతో గొప్పది
మన క్షేమం విషయంలో ఎంతో జాగరూకులుగా ఉంటారు బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!! సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు ఎన్నోసార్లు ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకున్నాను. ప్రతి అనుభవం ఆ సాయినాథునికి తన భక్తులపట్ల ఉండే ప్రేమతత్వం మీద అవగాహన కలిగిస్తుంది. మనకు ఆయన్ని కోరుకోవడం ఒక్కటే తెలుసు. కానీ ఆయనకి మన క్షేమం ఎందులో ఉందో కూడా తెలుసు. ఆ విషయం తెలిసి కూడా మనం అనుకున్నవి జరగనప్పుడు 'బాబా కావాలని మనల్ని అనుగ్రహించలేద'ని నిష్టూరం ఆడుతాం. నేను అలా చాలాసార్లు చేసాను. కానీ కొన్ని అనుభవాల ద్వారా బాబా మన క్షేమం విషయంలో ఎంతలా జాగరూకులుగా ఉంటారో నాకు అర్దం అయింది. అటువంటి అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు పంచుకున్న అనుభవంలో నేను LLB ఆఖరి సంవత్సరం ఆఖరి సెమిస్టర్‍లో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యానని, బాబా దయతో రీవాల్యూషన్‍లో పాసయ్యానని పంచుకున్నాను. అలా నేను LLB పూర్తి చేసిన తరువాత ఆన్‌లైన్‍లో ఎన్‌రోల్‌మెంట్‍కి అప్లై చేయడనికి ప్రయత్నిస్తే, అప్పటికే గడువు ముగిసింది. దాంతో నేను చదువు పూర్తయి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను సాయి దివ్యపూజ 11 వారాలు చేసాను. 11 వారాలు పూర్తి అయ్యేలోపు ఎన్‌రోల్‌మెంట్‍కి అప్లై చేసుకోవడం, ఎన్రోల్ అవ్వడం, ఆఫీసులో జాయిన్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. ఇవేవీ నేను అనుకోలేదు. అసలు నేను దివ్యపూజ చేసింది వేరే కోరిక కోసం. దాన్ని తీర్చడమే కాకుండా, చదువు పూర్తయి ఖాళీగా ఉన్న నా జీవితానికి ఒక దారి చూపించారు బాబా. ఈ అనుభవం ద్వారా బాబా నా భవిష్యత్తు గురించి నాకంటే ఎక్కువగా ఆలోచించి, సరైన సమయానికి మంచి జరిగేలా అనుగ్రహిస్తారని నేను తెలుసుకున్నాను.
నేను ఒక సీనియర్ అడ్వకేట్ ఆఫీసులో పని చేయడం మొదలుపెట్టాక మొదట్లో నావల్ల తెలియక పొరపాట్లు జరుగుతుండేవి. ఆ కారణంగా నేను చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నానని భాదపడుతుండేదాన్ని. కాని ప్రతీసారి బాబా ఏదో ఒక రూపంలో నన్ను ప్రోత్సహించేవారు. ఒకసారి మా ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి స్టడీ చేయమని నాకు ఒక ఫైల్ ఇచ్చారు. ఆ ఫైల్లో కొన్ని ఒరిజినల్స్ ఉన్నాయి. కొద్దిసేపు నేను ఆ ఫైల్ చదివి, అక్కడున్న టేబుల్ మీద పెట్టి ఇంటికి బయలుదేరాను. తీరా బస్సు ఎక్కిన తర్వాత ఆ ఫైల్ గుర్తొచ్చి, 'అయ్యో.. ఫైల్ అక్కడ పెట్టేసి, ఆయనకి చెప్పకుండా వచ్చానే! ఎవరన్నా ఆ ఫైల్ తీస్తే, చాలా సమస్య అవుతుంది' అని చాలా ఒత్తిడికి గురయ్యాను. అప్పుడు బాబాకి దణ్ణం పెట్టుకుని, "ఆ ఫైల్ జాగ్రతగా ఉంటే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా కృపవలన ఆ ఫైల్ చాలా భద్రంగా ఉంది. నా పొరపాటు వల్ల ఏ సమస్యా రాలేదు.
నేను ఒకరోజు ఆఫీసులో పని చేసుకుంటుండగా నా ఫోన్ ఎవరో తీసారు. నా పని పూర్తయిన తర్వాత చూస్తే, నా ఫోన్ కనపడలేదు. అంతటా వెతికినా కనపడలేదు. అప్పుడు నేను, "ఫోన్ కనిపిస్తే, పక్కనే ఉన్న బాబా గుడిలో 108 రూపాయల దక్షిణ సమర్పిస్తాను. అలాగే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా కృపతో ఆ రోజు సాయంత్రం నా ఫోన్ దొరికింది. ధన్యవాదాలు బాబా.
నేను దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారికి 9 రోజులు పూజ చేయాలనుకున్నాను. కానీ ఆఫీసుకి వెళ్తుండటం వల్ల పూజ శ్రద్ధగా చేయలేనేమో అనిపించింది. అయినా ఎలాగైనా పూజ చేయాలన్న కోరికతో బాబా మీద భారమేసి పూజ చేసాను. ఆ తండ్రి దయవల్ల ఆఫీసుకి వెళ్తూ కూడా పూజ శ్రద్ధగా చేయగలిగాను. ఆ శక్తినిచ్చింది బాబానే, లేకపోతే నా వల్ల అయ్యేదని నేను అనుకోను. నవరాత్రులు అయిపోతూనే నేను మా బంధువులతో కలిసి కారులో తీర్థయాత్రకు వెళ్ళాను. ఒక గుడిని దర్శించి వస్తుంటే రాత్రివేళ నిర్మానుష్య ప్రదేశంలో మా కారు టైర్ బురదలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కారును ఆ బురదనుండి బయటకి నడపడం మావల్ల కాలేదు. అక్కడ చుట్టూ చెట్లతో పాములు, తేళ్లు సంచరించే ప్రాంతంలా ఉంది. సహాయం అడుగుదామంటే ఒక్క వెహికిల్ కూడా అటు వైపు రావడం లేదు. పోలీసులకి ఫోన్ చేయాలేమో అనిపించింది. మేము చాలా భయపడ్డాము. నేను ఆ సమయంలో, "ఎందుకిలా చేసారు బాబా?" అని చాలాసార్లు అనుకున్నాను. కానీ, 'అప్పట్లో బాబా తమ దర్శనానికి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందిపడితే ఎన్నోసార్లు, ఎన్నో రీతుల వాళ్ళను ప్రమాదాల నుండి రక్షించారు. అలాంటిది నన్ను, నా కుటుంబాన్ని ఈ సంకట స్థితిలో బాబా వదిలేయరు' అని బలంగా తోచింది. ఆయన దయవల్ల కొద్దిసేపు తర్వాత మాకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు పక్క ఊరిలోనే ఉంటారని మాకు తెలిసింది. వాళ్ళని సంప్రదిస్తే, వాళ్ళు వెంటనే స్పందించి వేళకానివేళ మాకు సహాయం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు. వాళ్ళని చూడగానే బాబా స్వరూపాలుగా అనిపించారు. వాళ్ళు ట్రాక్టర్ సహాయంతో కారును బురద నుండి బయటకి లాగారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, అక్కడ అంతా బురదతో నిండి ఉండి ఎటూ పోలేని పరిస్థితి. అలాంటి చోటికి సుళువుగా ట్రాక్టర్ రావడం, మా కారును తేలికగా బయటకి లాగడం జరిగాయి. వాళ్ళు గనక స్పందించకపోయుంటే మేము ఉహించని పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చేదేమో! బాబానే దయతో ఆ పరిస్థితి నుండి మమ్మల్ని బయటపడేసారు. ఈ అనుభవం ద్వారా మనం చేసే శ్రీసచ్చరిత్ర పారాయణాలు ఇటువంటి కష్ట పరిస్థితిలలో మనకు ధైర్యాన్నిస్తాయని నేను తెలుసుకున్నాను. అయినా బాబా ఏది చేసినా మంచే చేస్తారని నమ్మడం మన బాధ్యత. మనం ఆయనకి ఎన్నో రెట్లు అధికంగా పూజ చేసిన ఫలితం ఆయన్ని నమ్మడం మూలంగానే వృద్ధి చెందుతుంది.
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
కోరుకున్న కాలేజీలో సీటు అనుగ్రహించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మరియు సాయి బంధువులకు నా నమస్కారాలు. నాపేరు విష్ణుప్రియ. శ్రీసాయినాథుని దివ్య పాదాలకు నమస్కరిస్తూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను 2022లో ఎంసెట్ పరీక్ష వ్రాశాను. బాబా అనుగ్రహంతో నాకు ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చింది. నేను మొదటి కౌన్సిలింగ్‍లో ఆరు టాప్ టెన్ కాలేజీలను పెట్టుకుంటే ఆ ఆరు కాలేజీలలోని ఏ ఒక్క కాలేజీలో కూడా నాకు సీటు రాలేదు. నేను చాలా బాధపడ్డాను. అయితే అప్పటికి మరో రెండు కౌన్సిలింగులున్నాయి. కాబట్టి నేను బాబాను, "నాకు టాప్ ఫైవ్ కాలేజీలో చదవాలని ఉంది. అందులో 'జి. నారాయణమ్మ' కాలేజీ ఒకటి. ఆ కాలేజీలో నాకు సీటు రావాలి బాబా" అని ప్రార్థిస్తూ, ఆయన దయతో రెండుసార్లు 'శ్రీసాయి సచ్చరిత్ర' చదివాను. అలాగే ఐదు వారాల 'సాయి దివ్యపూజ' చేస్తాను అనుకుని పూజ మొదలుపెట్టాను. మూడో వారం అవ్వగానే బాబా నా కోరిక నెరవేర్చారు. నాకు 'జి.నారాయణమ్మ' కాలేజీలో CST బ్రాంచ్ అలాట్ అయిందని మెసేజ్ వచ్చింది. నేను కోరుకున్నట్లే నాకు నచ్చిన కాలేజీలో సీటు ఇచ్చినందుకు సంతోషంగా బాబాకు నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఐదవ వారం పూజ పూర్తి అవ్వగానే బాబా మందిరానికి వెళ్లి భక్తులకు కిచిడి మరియు పులిహోర ప్రసాదం పంచిపెట్టాను. దాంతోపాటు సాయి దివ్యపూజ పుస్తకాలు కూడా పంచాను. అలాగే దివ్యపూజ ముడుపు బాబా సన్నిధిలోని హుండీలో సమర్పించాను. ఈ విధంగా బాబా అనుగ్రహంతో నా ఐదు గురువారాల దివ్యపూజ పూర్తి చేయగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా. ఐ లవ్ యు బాబా. ఇలాగే నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉంటూ నన్ను ముందుకు నడిపించండి సాయిదేవా".
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
చిన్న విషయమే కానీ సాయి కృప ఎంతో గొప్పది
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ముందుగా శ్రీసాయి బంధువులకు, బ్లాగు నిర్వాహకులకు నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. మా ఊరు నాగార్జునసాగర్ దగ్గర హాలియా. మేము ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాము. ఆ ఇంటి యజమాని ఇంటి బాగోగులు ఏమీ పట్టించుకోరు. ఏవి చెడిపోయినా మేమే వేయించుకోవాలి. ఆ డబ్బులు ఇంటి అద్దెలో కట్ చేసుకోరు. ఈమధ్య సూర్యగ్రహణం వచ్చిన రోజున గ్రహణం విడిపోయాక ఇల్లు శుభ్రం చేసుకుందామని బోర్ మోటార్ ఆన్ చేస్తే విద్యుత్తు సరఫరా అవుతుంది కానీ, నీళ్లు రాలేదు. నాకు భయమేసి, "ఇప్పుడెలా బాబా" అని బాబాని తలుచుకుంటూ మళ్ళీ మోటార్ ఆన్ చేశాను. అయినా నీళ్లు రాలేదు. దాంతో ఉన్న కొంచెం నీళ్లతోనే పని చేసుకున్నాను. కానీ మనసులో, "బాబా! మీరే మార్గం చూపించాలి" అని బాబాను వేడుకున్నాను. ఆ రాత్రి గడిచింది. ఉదయం నేను మళ్ళీ, "బాబా! మెకానిక్ రాకుండానే మోటార్ పనిచేసి నీళ్లు రావాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మొక్కుకున్నాను. ఒక గంటసేపటికి ఆ ఇంట్లో అదివరకు అద్దెకు ఉండి, వెళ్ళిపోయిన ఒకతను పని మీద వస్తే, నేను అతనికి విషయం చెప్పాను. అతను ఒకటి, రెండు స్విచ్చులు ఏవో సరిచేసి మోటార్ ఆన్ చేస్తే, నీళ్లు వచ్చాయి. అది చూసి నా ఆనందానికి అవధులు లేవు. నా కళ్ళలో నీళ్లు ఆగలేదు. వెంటనే బాబా దగ్గరకి వెళ్లి "థాంక్యూ బాబా" అని చెప్పుకున్నాను. చెప్పటానికి చిన్న విషయమే కానీ సాయి కృప ఎంతో గొప్పది. "ఎంతటి దయామయుడవు బాబా. నీ బిడ్డలను ఎంత మాత్రం కష్టపడకుండా చూసుకుంటావు. మీ అనుగ్రహానికి అనేక కృతజ్ఞతలు. థాంక్యూ సాయితండ్రి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Sai nannu Vamsi ni kalupu sai na kapuranni nilabettandi sai pls🙏🙏🙏🙏
ReplyDelete