సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1390వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అంతా ఆ సాయి అనుగ్రహం
2. సాయి ఏది చేసినా మన మంచికే
3. సరైన మార్గంలోకి మళ్ళించి శిరిడీకి రప్పించుకున్న బాబా

అంతా ఆ సాయి అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. ఈమధ్య మా అమ్మానాన్నలు కేదార్‍నాథ్ యాత్రకి వెళ్ళారు. వాళ్ళు గౌరీకుండ్ నుండి కేదార్‍నాథ్‍కు హెలికాఫ్టర్‍లో వెళ్ళారు. ఆ సాయినాథుని దయవల్ల వాళ్లకు దర్శనం బాగా జరిగింది. తర్వాత వాళ్ళు తిరిగి వద్దామనుకునేసరికి ఒక హెలికాప్టర్ పైకి వెళ్తుండగా కూలిపోయి 8 మంది సజీవ దహనమయ్యారు. ఆ కారణంగా అన్ని హెలికాప్టర్లు రద్దు అయ్యాయి. దాంతో అమ్మానాన్నలు దట్టమైన మంచులో 26 కిలోమీటర్ల దూరం నడవవలసిన పరిస్థితి వచ్చింది. ఇదివరకే నాన్నకి హార్ట్ ఆపరేషన్ జరిగి ఉన్నందువల్ల మంచులో, అంత చలిలో అంత దూరం ఎలా నడవగలరో అని మాకు టెన్షన్ పట్టుకుంది. పైగా మొబైల్ నెట్వర్క్ లేకపోవడంతో వాళ్ళతో మాకు పూర్తిగా కాంటాక్ట్ లేకుండా పోయింది. అప్పుడు నేను బాబాని ప్రార్థించి, "మీ దయతో అమ్మానాన్న సురక్షితంగా కిందికి చేరుకుంటే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఆ తండ్రి దయవల్ల అమ్మానాన్నలిద్దరూ క్షేమంగా కిందకి దిగారు. అది తప్పనిసరిగా ఆ బాబా దయవల్లే సాధ్యమైంది. "ధన్యవాదాలు బాబా".


ఈమధ్య నేను శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. నేను పారాయణ చేసే సమయంలో నేల మీద ఆసనం వేసి చాలాసేపు కూర్చునేవాడిని. అయితే అలవాటు లేకపోవడం వల్ల అంత సమయం కూర్చుని, వంగి చదివేసరికి బాగా నడుంనొప్పి వచ్చి చాలా ఇబ్బందిపెట్టింది. మొదటి రెండు రాత్రులు నడుంకి మూవ్ స్ప్రే చేసి నిద్రపోయాను. అయినా మరుసటిరోజు మళ్ళీ నడుం నొప్పి వచ్చేది. దాంతో మూడవరోజు నేను బాబాని ప్రార్థించి, ఊదీ మాత్రమే నడుంకి పూసుకుని "బాబా! రేపు ఉదయానికి నడుం నొప్పి తగ్గినట్లైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకుని నిద్రపోయాను. బాబా అద్భుతం చేశారు. తదుపరి రోజుల్లో నడుం నొప్పి అస్సలు రాలేదు. నేను ప్రశాంతంగా సచ్చరిత్ర పారాయణ పూర్తిచేశాను. అంతా ఆ సాయి అనుగ్రహం. "బాబా! ఇలానే కలవరంగా ఉన్న నా మనసు ప్రశాంతంగా మారేలా చూడు తండ్రి. త్వరగా నాకు ప్రమోషన్ వచ్చి ఆర్థిక ఇబ్బందులు తొలిగేలా చేయి తండ్రి. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".


శ్రీసాయినాథుని అనుగ్రహం వల్ల మాకు పుట్టిన బాబు మూడవ నెల నడుస్తున్నప్పుడు ఒకరోజు సాయంత్రం నిరంతరాయంగా ఒకటే ఏడ్చాడు. ఎంత సముదాయించినా, దిష్టి తీసినా ఏడుపు ఆపలేదు. అప్పుడు నేను, "బాబా! బాబు ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్దం కావడం లేదు. తనకి ఏ సమస్య ఉందో తెలియట్లేదు. బాబు ఏడుపు ఆపి రాత్రి చక్కగా నిద్రపోతే, ఉదయాన్నే 'సాయి మహారాజ్ సన్నిధి'లో మీ అనుగ్రహాన్ని పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. తరువాత 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించాను. ఆ తండ్రి అనుగ్రహం వల్ల 10 నిమిషాల్లో బాబు ఏడుపు ఆపేసాడు. రాత్రంతా హాయిగా నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయం నిద్రలేచాక కూడా చక్కగా ఆడుకున్నాడు. "ధన్యవాదాలు బాబా. నిన్ను నమ్ముకుంటే సాధ్యం కానిదంటూ ఏమైనా ఉంటుందా బాబా? నువ్వు కనుక లేకపోతే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో తల్చుకోవడనికి కూడా భయంగా ఉంది తండ్రి. నీ ఋణం తీర్చలేనిది. ఇలానే నీ అనుగ్రహం మా కుటుంబంపై, నీ భక్తులపై ఎల్లప్పుడూ చూపిస్తూ మమ్ము కాపాడు తండ్రి. ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం నా భార్య, బిడ్డపై పడకుండా కాపాడు తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయి ఏది చేసినా మన మంచికే


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నకి, వారి బృందానికి చాలా ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు శ్వేత. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మేము కొత్తగా ఒక ఇంట్లోకి మారామని నేను నా గత అనుభవంలో పంచుకున్నాను. ఆ ఇంట్లోకి చేరిన  కొద్దిరోజుల్లోనే అంటే 2022, అక్టోబర్ నెల చివరి వారంలో మా అబ్బాయి బాస్కెట్ బాల్ ఆడుతూ కిందపడిపోతే, తన చేయి ఫ్రాక్చర్ అయింది. మేము వెంటనే తనని హాస్పిటల్‍కి తీసుకెళ్లాం. డాక్టర్ ఎక్స్-రే తీసి, "బాగా ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేయాలి. మరుసటిరోజు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి. గురువారం సర్జరీ చేస్తాము" అని అన్నారు. మా అబ్బాయికి 13 సంవత్సరాలు. చిన్నవయస్సులోనే సర్జరీ అంటే మాకు భయమేసింది. ఆ రాత్రి మేము ఇంటికి వస్తుంటే, లిఫ్టులో ఒకరు మా అబ్బాయిని చూసి, "అయ్యో! ఫ్రాక్చర్ అయిందా? మాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నారు, చూపించండి" అని అడ్రస్ ఇచ్చారు. మేము సరేనని మరుసటిరోజు ఆ డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. నేను నా మనసులో 'సర్జరీ అవసరం లేదని చెప్తే బాగుండు' అని అనుకున్నాను. కానీ ఆ డాక్టర్ కూడా సర్జరీ చేయాలన్నారు. ఇంకా మేము ఆ రాత్రి వెళ్లి మొదట చూపించిన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. సాయి దయవల్ల గురువారం సర్జరీ బాగా అయింది. నేను సర్జరీ వద్దంటే నా అనుభవం బ్లాగులో పంచుకుంటానని సాయికి చెప్పుకున్నప్పటికీ సర్జరీ అయింది. కానీ నేను 'సాయి ఏది చేసినా మన మంచికే' అని అనుకుంటాను. సాయి దయవల్ల ఇప్పుడు మా అబ్బాయి బాగా రికవరీ అయ్యాడు


నాకు ఇంటి పనుల్లో సహాయం చేయడానికి వచ్చే ఆమెకు ఆ ప్రాంతంలో మా ఇంట్లో తప్ప వేరే ఎక్కడా పని దొరకలేదు. అందువల్ల ఆమె, "ఒక్క ఇంటికోసం రావడం కష్టంగా ఉంది. కాబట్టి నేను ఇక రాలేను" అని చెప్పింది. దాంతో ఇంటి పని, ఆఫీసు పని, అబ్బాయిని చూసుకోవడం ఎలా అని నాకు కొంచెం భయమేసింది. "సాయీ! నువ్వే నాకు సహాయం చేయాలి. ఈ సమస్య తీరితే తోటి సాయి బంధువులతో నా అనుభవం పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, కాసేపట్లో ఆమె ఫోన్ చేసి, "పనికి వస్తాను" అని చెప్పింది. నేను ఆనందంతో మనసులోనే సాయికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. "అన్నింటికీ ధన్యవాదాలు సాయి. సదా అందరికీ తోడుగా ఉండండి సాయి. ఏవైనా తప్పులుంటే క్షమించండి సాయి".


సరైన మార్గంలోకి మళ్ళించి శిరిడీకి రప్పించుకున్న బాబా


అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. బాబా మా మీద చూపించిన దయను మీతో పంచుకుంటున్నాను. 2022, నవంబర్ 12న నా భర్త, తమ్ముడు ప్రసాద్ మరియు ఆఫీసు స్టాఫ్ ఇద్దరు కారులో శిరిడీ వెళ్లారు. నేను నా భర్తతో, "ఔరంగాబాద్ మీదుగా వెళితే రూటు బాగుంటుంది, తొందరగా వెళ్లొచ్చు" అని చెప్పాను. కానీ వాళ్లు మధ్యలో దారి తప్పి షోలాపూర్ వెళ్లారు. సరిగా అప్పుడే నిద్రపోతున్న నాకు హఠాత్తుగా మెలుకువ వచ్చి, టైమ్ చూస్తే మధ్యాహ్నం 2:30 అయింది. నా భర్తకి ఫోన్ చేసి, "ఎక్కడి వరకు వెళ్లార"ని అడిగితే, "షోలాపూర్లో భోజనం చేస్తున్నాము" అని అన్నారు. 'అదేంటి ఆ మార్గంలో షోలాపూర్ రాదు కదా!' అని రూట్ మ్యాప్ చూస్తే, వాళ్ళు వేరే మార్గంలో వెళ్తున్నారని అర్థమైంది. ఇంకా నేను వాళ్లతో, "అది శిరిడీ వెళ్ళడానికి సరైన మార్గం కాదు. తుల్జాపూర్ మీదగా వెళ్ళాలి. అక్కడ స్థానికులను కనుక్కోండి" అని చెప్పాను. తరువాత నేను, "బాబా! వాళ్ళు సరైన మార్గంలో ప్రయాణించేలా చూడండి. అలాగే ఏ సమస్య లేకుండా వాళ్ళని శిరిడీకి రప్పించుకోండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు ఒక అరగంటలో సరైన మార్గంలోకి వెళ్లి అనుకున్న సమయానికంటే కొంచెం ముందుగానే రాత్రి 8:30కి శిరిడీ చేరుకున్నారు. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా".



4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Baba nannu vamsi ni kalupu baba na kapuranni nilabettu baba said.ninne nammukoni yenno years nunchi wait chesthuna sai plsss baba help me

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Jaisairam bless supraja for her neck disk bulge and back pain probluem. Jaisairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo