1. బాబా ప్రసాదించిన అనుభవాలు
2. బాబా దయతో ఏ సమస్య అయినా పరిష్కారమైపోతుంది
3. బాబా దయతో వీసా ఆమోదం
బాబా ప్రసాదించిన అనుభవాలు
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిబంధువులందరికీ నా నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నాకు చాలాకాలం నుండి బాబాతో అనుబంధం ఉన్నప్పటికీ అంత విశ్వాసంతో ఉండేదాన్ని కాదు. రెండు సంవత్సరాల క్రిందట మహాపారాయణ గ్రూపులో చేరి పారాయణ మొదలుపెట్టాను. అలాగే రోజూ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తులకు బాబా ప్రసాదించిన అనుభవాలు చదువుతుంటే నాకు బాబాపట్ల నమ్మకం కుదిరింది. కానీ నేను పూర్తి నిబద్ధత ఉన్న వ్యక్తిని కాను. నాకంటూ అనుభవాలు ఏవీ ఉండేవి కావు. అందువలన 'అందరికీ అనుభవాలు కలుగుతున్నాయి, నాకెందుకు కలగడం లేదు?' అనుకునేదాన్ని. ఇలా ఉండగా కొన్ని నెలల క్రితం ఒకరోజు నేను ఒకరి ప్రవర్తన వలన చాలా బాధపడ్డాను. ఆ రోజు నేను యూట్యూబ్‍లో, "ఒకరి ప్రవర్తన మూలంగా నీవు దుఃఖపడుతున్నావు. ధైర్యంగా ఉండు" అన్న ఒక సాయి మెసేజ్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆ సమయంలో నాకు ఆ సందేశం ఎంతో ఓదార్పునిచ్చింది. ఇది బాబా నాకు ప్రసాదించిన మొట్టమొదటి అనుభవం.
మేము 4 నెలలు క్రితం యు.ఎస్.ఏలో ఉంటున్న మా అబ్బాయి దగ్గరకి వెళ్ళాము. మా పెద్ద మనవడికి మూడున్నర సంవత్సరాల వయస్సు. మా అబ్బాయివాళ్ళు బాబుకి ఒంటరిగా తన గదిలో పడుకోవడం అలవాటు చేసి, కెమెరా ఆన్ చేసి అందులోనుండి వాడిని గమనిస్తుంటారు. ఎప్పుడైనా పొరపాటున ఆ గది తలుపు తాళం పడినా, ముందు జాగ్రత్తగా దాని స్పేర్ తాళంచెవి ఒకటి బయట ఉంటుంది. మేము ఉన్నప్పుడు ఒకరోజు బాబు లోపల ఉండగా ఆ గది తాళం పడిపోయింది. మా అబ్బాయివాళ్ళు బయట ఉండే తాళంచెవి ఎక్కడో పెట్టి మరచిపోయారు. వెతికితే దొరకలేదు. ఆ సమయంలో నేను చాలా కంగారుపడి బాబాకి నమస్కరించుకుని, "బాబా! మీ దయతో తాళంచెవి వెంటనే దొరికి, బాబు బయటకి వచ్చేలా చేయండి" అని వేడుకున్నాను. బాబా అనుగ్రహం వలన కొద్దిసేపటిలోనే తాళంచెవి దొరికి, బాబు బయటకు వచ్చాడు. ఇది బాబా నాకు ప్రసాదించిన రెండో అనుభవం. "ధన్యవాదాలు బాబా. మీ దయతో మా రెండో అబ్బాయికి కొన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. సరైన నిర్ణయం తీసుకునే శక్తిని మాకు ప్రసాదించండి బాబా. మీ ఆశీస్సులతో అబ్బాయి వివాహం త్వరలో జరిగితే మీ అనుగ్రహాన్ని మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను. ఆ అవకాశాన్ని ప్రసాదించండి బాబా. మీ కరుణ మా అందరిపై సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను తండ్రీ".
బాబా దయతో ఏ సమస్య అయినా పరిష్కారమైపోతుంది
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సుజాత. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. మా పాప ఇప్పుడు పదవ తరగతి చదువుతోంది. కొన్నిరోజుల క్రితం తనకి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. నేను తనని, "ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి?" అని అడిగితే, "అమ్మా! టీచర్ బోర్డు మీద వ్రాసే అక్షరాలు నాకు సరిగా కనిపించట్లేదు" అని చెప్పింది. అది విని నాకు చాలా భయమేసి బాబా ముందు కన్నీళ్లు పెట్టుకుని, "బాబా! పాపకి సరిగా కనిపించేటట్లు చేయండి" అని ప్రార్థించాను. అలాగే రోజూ పొద్దున్నే బాబా ఊదీ నీళ్లలో కలిపి పాపకి ఇవ్వడం మొదలుపెట్టాను. అంతే, మూడోరోజు నుంచి పాపకి అక్షరాలు స్పష్టంగా కనిపించసాగాయి. నేను ఆనందంతో బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.
నాకు ఎప్పుడూ నెలసరి క్రమం తప్పకుండా వచ్చేది. కానీ ఈమధ్య ఒకసారి నెలసరి రావాల్సిన సమయం దాటి 15 రోజులు అయినా రాలేదు. అందువలన నేను, "బాబా! నాకు నెలసరి వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాకి వేడుకుని ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. బాబా దయవల్ల రెండో రోజుకి నాకు నెలసరి వచ్చింది. నేను చాలా సంతోషంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.
ఒకసారి మా చిన్నపాపకి కాళ్లు బాగా నొప్పి పెట్టాయి. నేను బాబా ఊదీ నీళ్లలో కలిపి పాపకిచ్చి, "బాబా! నేను పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాను. ఏ రోగం లేకుండా చూడు దేవా" అని బాబాను ప్రార్థించాను. తరువాత పాపను తీసుకుని హాస్పిటల్‌కి వెళితే డాక్టరు చూసి, "ఇది మామూలు నొప్పే" అని చెప్పారు. నేను సంతోషంగా బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. మా ఇంట్లో నాకు, మావారికి, మా పిల్లలకి, ఎవరికి ఏ చిన్న సమస్య ఉన్నా నీళ్లలో బాబా ఊదీ వేసుకుని త్రాగుతాము. బాబా దయతో అర్ధగంటలోపు సమస్య పరిష్కారమైపోతుంది. "సాయినాథా! మీకు అనేక నమస్కారాలు. నువ్వు నిజమైన దైవానివి, ప్రభువువి. గురువారం వచ్చిందంటే నాకు ఒక పండగలా ఉంటుంది సాయినాథా. నాకు తోచిన విధంగా నిన్ను పూజించుకుంటున్నాను. ఎన్ని జన్మలైనా నేను మీ భక్తురాలిగా ఉండాలి. మీ బిడ్డలమైన మమ్ము ఎల్లప్పుడూ కాపాడు సాయినాథా. ఇంకా కొన్ని సమస్యలున్నాయి ప్రభు. అవి తొందరగా తీరాలని, బ్లాగులో పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సాయినాథా".
ఓం సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా దయతో వీసా ఆమోదం
నేను బాబా బిడ్డను. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఇప్పుడు రెండు అనుభవాలు పంచుకుంటాను. ముందుగా, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులైన సాయికి ధన్యావాదాలు. 2022, డిసెంబర్‍లో జరగనున్న నా పెళ్లికి రావాలని మా తమ్ముడు 2022, సెప్టెంబర్ 25న వీసా స్టాంపింగ్ కోసం యూఎస్ఏ నుండి ఇండియా వచ్చి సెప్టెంబరు 28న హైదరాబాద్‌లో వీసా ఆఫీసులో పత్రాలు సమర్పించాడు. తను ఇక్కడ 2-3 వారాలు ఉండి వీసా స్టాంపింగ్ చేయించుకుని తిరిగి వెళ్లిపోయి మళ్ళీ డిసెంబర్‌లో నా నిశ్చితార్థం మరియు పెళ్లికి వద్దామనుకున్నాడు. కానీ తను అనుకున్న సమయంలో వీసా పని పూర్తి కాలేదు. తమ్ముడికి తన ఆఫీసువాళ్ళు ల్యాప్‌టాప్ ఇవ్వనందున ఇండియా నుండి పని చేసుకునే అవకాశం లేక మా కుటుంబమంతా చాలా టెన్షన్ పడ్డాము. నేను, "బాబా! తమ్మడి వీసా అప్రూవ్ అయి తను క్షేమంగా అమెరికా వెళ్ళాలి. తన వీసా అప్రూవ్ అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అలాగే నాకు వీలుకానందున మా అమ్మని బాబాకి 5రోజులు 5 దీపాలతో పూజ చేయమన్నాను. బాబా దయతో చాలారోజుల తరువాత నవంబర్ 3న తమ్ముడికి వీసా ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది. నేను మా తమ్ముడిని వీసా ఆఫీసుకు వెళ్ళేటప్పుడు బాబా ఊదీ పెట్టుకుని, బాబాని వేడుకుని వెళ్ళమన్నాను. తను అలాగే చేసాడు. నాలుగు గంటలపాటు నాలుగు విడతలుగా ఇంటర్వ్యూ జరిగి చాలా ప్రశ్నలతో తమ్ముడిని బాగా విసిగించినప్పనటికీ బాబా దయవల్ల తన వీసా అప్రూవ్ అయి, తను క్షేమంగా అమెరికా చేరుకున్నాడు. "ధన్యవాదాలు బాబా. తమ్ముడు మళ్ళీ నా పెళ్లికి వచ్చి, క్షేమంగా తిరిగి అమెరికా వెళ్లాలి తండ్రి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి రామ్ రోజు ఎపిసోడ్ అన్ని చదువుతాను.చాలా బాగున్నాయి.ఆ దేవుని దయ ఆశీస్సులు వుంటే కాని పని లేదు.ఆ పరమాత్మ స్వరూపం చూస్తూ వున్నాము అంటే జన్మ ధన్యం అవుతుంది.సాయి పథంలో పయనిస్తున్న భక్తులు అదృష్ట వంతులు
ReplyDeleteOm sai ram, anta bagunde la chayandi tandri anni vishayallo
ReplyDelete