సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1395వ భాగం....


ఈ భాగంలో అనుభ
వం:

  • అంతులేని శ్రీసాయి అనురాగం - మొదటి భాగం


ప్రియమైన సాయిబంధువులందరికీ నా శుభాశీస్సులు. నా పేరు రమాదేవి. నేను కూడా మీలాగే ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలను చదువుతూ ఆనందించే ఒక సామాన్య సాయిబంధువుని. ఈ బ్లాగును నిర్వహిస్తూ, ఈనాటి సాయిభక్తుల అనుభవాలనే కాక, శ్రీసాయిసచ్చరిత్రలో లేని ఆనాటి బాబా సమకాలీన భక్తుల అనుభవాలను (కొన్ని వారి డైరీల ద్వారా, కొన్ని వారి మనుమల, బంధువుల ఇంటర్వ్యూల ద్వారా, మరికొన్ని ఆనాటి సాయిపత్రికల సంపుటిల ద్వారా) ఎంతో శ్రమతో శ్రద్ధగా సేకరించి ఈ బ్లాగ్ ద్వారా మనకు అందిస్తూ, ‘మనం కూడా ఆ కాలంలోని వాళ్ళతోనే కలసివున్నామా’ అన్నట్లు కళ్ళకు కట్టినట్లు చేస్తున్న సాయికి ఎంతని ధన్యవాదాలు చెప్పగలం? ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. నేను ఇదివరకు సాయిభక్తుల అనుభవమాలిక 1312వ భాగంలో బాబా నా జీవితంలోకి ఎలా వచ్చిందీ, వారి మహత్యం మొదటిసారి ఎలా అనుభూతి చెందిందీ మీతో పంచుకున్నాను. ఆ తరువాత బాబా నా జీవితంలో ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలోనుండి కొన్ని ముఖ్యమైన అనుభవాలను నేనిప్పుడు పంచుకుంటాను.

మన బాబా కరుణ, ఊదీ మహిమ అందరికీ అనుభవమే. అలాగే నేనూ ఎన్నో ఊదీ మహిమలు (అనుభవాలు) చవిచూశాను. వాటిని మీతో పంచుకోవాలని నా మనసూ ఆరాటపడుతోంది. ఇది 1994 నాటి విషయం. అప్పుడు నా వయస్సు 43 సంవత్సరాలు. కానీ, అప్పటికే నాకు మోకాళ్ళనొప్పులు ఉండేవి. నేను ప్రతి శుక్రవారం రాహుకాలంలో (10.30 గంటల నుండి 12 గంటల వరకు) దుర్గమ్మవారి సన్నిధిలో నిమ్మకాయ దీపాలు పెట్టడానికి నా స్నేహితురాలితో కలిసి దుర్గమ్మగుడికి వెళ్లేదాన్ని. ఇంటినుండి గుడికి బస్సులో వెళ్ళాలి. బస్సు దిగిన తర్వాత, కొండపైన ఉన్న ఆ గుడికి చేరుకోవాలంటే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మోకాళ్ళనొప్పుల వల్ల బస్సులో ఫుట్ స్టెప్స్ ఎక్కాలన్నా, గుడి మెట్లు ఎక్కాలన్నా మోకాళ్ళు సహకరించేవికావు. చాలా కష్టంగా ఉండేది. అందువల్ల మొదటిసారిగా మోకాళ్ళనొప్పిని తగ్గించమని బాబాను ప్రార్థించి ప్రతిరోజూ బాబా ఊదీని మోకాళ్ళకి రాసుకోవడం ప్రారంభించాను. బాబా మహత్యం చూపించారు. ఊదీ ప్రభావంతో నా మోకాళ్ళనొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. గుడి మెట్లు కూడా సునాయాసంగా ఎక్కగలిగేదాన్ని.


ఇలాగే ఇంకోసారి అమ్మవారి గుడికి శనివారం సాయంకాలం వెళ్ళినప్పుడు, గుడి బయట పువ్వులు కొందామని వెళుతూ, క్రిందనున్న మెట్టు చూసుకోకపోవటంతో నా పాదం మెలికపడి బొటనవ్రేలు పూర్తిగా వంగిపోయింది. నొప్పి విపరీతంగా ఉన్నప్పటికీ ఆరోజు నేను నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేసుకోవాల్సి ఉండటంతో అలాగే కుంటుకుంటూనే మొండిగా ప్రదక్షిణలు చేశాను. రాత్రి బస్సులో ఇంటికి రావాలి. ఆ సమయంలో బస్సులో చాలా రద్దీగా ఉంటుంది. బస్సు ఎలా ఎక్కానో, ఎలా ఇంటికి చేరుకున్నానో ఆ భగవంతునికే ఎరుక. ఇంటికి వచ్చాక కాలినొప్పి గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. నొప్పి ఉన్నచోట బాబా ఊదీ రాసుకుంటూ, రాత్రిపూట కాలికి గట్టిగా కట్టు కట్టుకుని పడుకునేదాన్ని. ఇంటిపనులన్నీ అలాగే చేసుకుంటుండేదాన్ని. బాబా దయవల్ల వారం రోజుల్లో వాపు, నొప్పి నిదానంగా తగ్గిపోయాయి. చెబుతూపోతే ఇలాంటి ఊదీ మహిమలు నాకు బాబా ఎన్నో చూపించారు. మరిన్ని ఊదీ అనుభవాలను మరోసారి పంచుకుంటాను.


శ్రీసాయిసచ్చరిత్రలో అప్పాసాహెబ్ కులకర్ణి అనుభవంలోని తాయెత్తు మహిమ నా మనస్సుపై చెరగని ముద్ర వేసింది. అది ఒకరి జీవితాన్ని ఎలా కాపాడిందో ఇప్పుడు మీకు చెప్తాను. మావారి స్నేహితుడొకరు ఆర్మీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్. మేము వారి కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. వారికి ఇద్దరు కొడుకులు. వారి పెద్దకొడుకు 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడివాళ్ళు వెంటనే అతని తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన నేరుగా ఆ అబ్బాయిని తన హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అన్ని పరీక్షలూ చేయించారు. ఆ రిపోర్టుల్లో వారు ఎదురుచూడని, అనుకోని నిజం బయటపడింది. అదేమిటంటే – ఆ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ అని. తల్లితండ్రులకు ఒక్కసారిగా భూమి కదిలినట్లయింది. మరికొన్ని పరీక్షల తర్వాత ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ అబ్బాయి తల్లికి భగవంతుడంటే చాలా నమ్మకం. ఎన్నో పూజలు చేస్తారు. పైగా ఆవిడ కూడా బాబా భక్తురాలే. అందుకే (తాయెత్తు మహిమను ఇంతకుముందే ఒక అనుభవంలో చవిచూసిన) నేను ఆమెతో, “బాబా తాయెత్తును బాబుకు కట్టడానికి మీకేమైనా అభ్యంతరమా?” అని అడిగాను. ఆవిడ కూడా బాబా భక్తురాలే కాబట్టి వెంటనే అందుకు అంగీకరించారు. ఆరోజు సాయంకాలమే ఒక తాయెత్తును తయారుచేసి వారింటికి తీసుకుని వెళ్ళాను. ఆ తాయెత్తులో పవిత్రమైన బాబా ఊదీతో పాటు, బాబాకు పూజచేసిన పువ్వులు, అక్షింతలు, సాయిగాయత్రి మంత్రం అన్నీ ఉంచాను. ఆ తాయెత్తుని వాళ్ళింట్లో ఉండే బాబా ఫోటో దగ్గర పెట్టి, మనస్ఫూర్తిగా ఒకటే మాట బాబాతో అన్నాను: బాబా, నీ చరిత్ర ఇతిహాసం కాదు. అది నిత్యం – సత్యం – నిజమని నిరూపించు తండ్రీ!” అని. ఆవిడ వెంటనే ఆ తాయెత్తుని ఆ అబ్బాయి మెడలో కట్టారు. ఇక చూడండి అద్భుతం. మరుసటిరోజు పొద్దున్నే ఆ అబ్బాయి తండ్రి మావారికి ఫోన్ చేసి, “ఈరోజు వచ్చిన రిపోర్టులో ఏమీ భయపడాల్సిందేమీ లేదు, బాబుకి నయమైపోతుంది” అని సంతోషంగా చెప్పారు. ఇది బాబా మహత్యం కాకపోతే ఏమిటి? ఈ సంఘటన తర్వాత ఆ అబ్బాయి చక్కగా ఇంజనీరింగ్ పూర్తిచేసి, పెళ్ళిచేసుకుని చాలా సంతోషంగా ఉన్నాడు. అంతా బాబా దయ.


మన బాబాకు జంతువులంటే ఎంత ప్రేమో అందరికీ తెలుసు. బాబానే అనేవారు, “ఈగలో, దోమలో, ప్రతి ప్రాణిలో నేను ఉన్నాను” అని. ఈ అనుభవం చూడండి. ఇది 2001లో జరిగింది. మా ఇంటి(గవర్నమెంట్ హౌస్) వెనకాల చాలా ఖాళీ స్థలం ఉండేది. అటువైపు ఉన్న గోడ వద్దకి రోజూ ఒక కుక్క వచ్చి ఉంటుండేది. దాని కాలు ఒకటి పూర్తిగా విరిగిపోయింది. తోలు మాత్రం వ్రేలాడుతూ ఉండేది. పాపమది మూడు కాళ్ళతోనే కుంటుకుంటూ వస్తుండేది. దాని పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉండేది. నేను ప్రతి గురువారం బాబాకు పాలతోనూ, చందనంతోనూ అభిషేకం చేసి, ఆ చందనాన్ని అలాగే తీసిపెట్టుకుంటాను. ప్రతిరోజూ ఆ చందనంలో బాబా ఊదీని కలిపి ఆ కుక్క కాలికి రాస్తూ ఉండేదాన్ని. బాబా దయవల్ల దానికి నయమవుతుందని ఏదో ఒక ఆశ, అంతే. ఎవ్వరూ నమ్మరు. కొన్ని రోజులకో, లేక ఒక నెలరోజులు అయిందో నాకు గుర్తులేదుగానీ, ఆ కుక్క కాలు పూర్తిగా మామూలుగా వచ్చేసింది. అపారమైన తమ కరుణ జీవరాశులన్నింటిపైనా ఉన్నదని బాబా ఈ సంఘటన ద్వారా మరోసారి నిరూపించారు. “ధన్యులమయ్యా సాయీ!”


ఇకపోతే, నా కుటుంబ విషయాలకి వస్తే.. నా భర్తని, మా పిల్లల్ని బాబా ఎలా ఆదుకున్నారో చెప్తాను. మాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అబ్బాయిలిద్దరూ ఇంజనీరింగ్ చేశారు. అమ్మాయి లాయర్. ఇప్పుడు చెప్పబోయే సంఘటన 1999లో జరిగింది. ఒకరోజు మా పెద్దబ్బాయి తన స్నేహితులతో కలిసి హోలీ పండుగ జరుపుకుని, రాత్రి బాగా ఆలస్యంగా స్కూటరు మీద ఇంటికి వస్తున్నాడు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. తను వచ్చే రోడ్డులో లైట్లు లేవు, చీకటిగా ఉంది. ఆ చీకట్లో స్కూటరుపై వేగంగా వస్తున్న మా అబ్బాయి ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ చూసుకోకపోవటంతో యాక్సిడెంట్ అయి కుడిచేతి కాలర్‌బోన్ విరిగింది. లోతుగా గాయాలయ్యాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవ్వరూ లేరు. ఆ విరిగిన ఎముకతోనే వాడు స్కూటర్ నడుపుకుంటూ ఎలా ఇంటికి వచ్చాడో, అంత లోతుగా గాయాలైనప్పటికీ కూడా మమ్మల్ని ఎవ్వరినీ లేపకుండా ఎలా వాడి రూములోకి వెళ్ళి పడుకున్నాడో (ఇంట్లోకి రావడానికి తన దగ్గర స్పేర్ కీ ఉంటుంది.) బాబాకే తెలియాలి. బాబా దయ కాకపోతే ఏంటి? ఆ స్థితిలో ఆయనే వాడిని ఇంటికి చేర్చారు. మరుసటిరోజు ఉదయం నేను లేచి వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే తన చెయ్యి, షర్ట్ అంతా రక్తమయం. కంగారుగా మావారిని లేపాను. అంతే, ఆయన వెంటనే బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. ఆరోజు సెలవురోజు. డాక్టర్లు ఎవ్వరూ లేరు. కానీ బాబా దయచూపారు. మావారు ఫోన్ చెయ్యగానే డాక్టర్లు వచ్చి బాబుని చూసి, వెంటనే కావలసిన ట్రీట్‌మెంట్ ఇచ్చారు. కాలర్ బోన్ విరిగింది కాబట్టి బ్యాండేజ్ గట్టిగా కట్టి, 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. విరిగిన బోన్‌తో ఇంటికి చేర్చినా, సెలవురోజైనప్పటికీ డాక్టర్లని హాస్పిటల్‌కి రప్పించినా ఇది బాబా దయే కదండీ?


ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన కూడా మా పెద్దబ్బాయి యాక్సిడెంట్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే జరిగింది. మా రెండో అబ్బాయి ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కాలేజీకి సెలవులు ఇవ్వటంతో ఇంటికి వచ్చాడు. అంతకు కొంత కాలం క్రితమే మేము క్రొత్తగా కారు కొన్నాము. ఇంట్లో కారు ఉండటంతో ‘నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుంటాన’ని చెప్పి, కొద్దిరోజులపాటు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇంకా తనకి లైసెన్స్ రాలేదు. సరిగ్గా ఆ సమయంలో ఊరినుంచి మా చెల్లెలి కొడుకు, వాళ్ళ మేనత్త కొడుకు కూడా మా ఊరు చూడటానికి వచ్చారు. ఆ సమయంలో మావారు ఊరిలో లేరు. దాంతో మా రెండో అబ్బాయి, “వాళ్ళందరినీ నేను మన కార్లోనే తీసుకెళ్తాను, ఏం భయం లేదు” అన్నాడు. మా చెల్లెలి కొడుకు బాగా డ్రైవ్ చేస్తాడు. అందుకని తనే డ్రైవింగ్ చేస్తాడని నేను ధైర్యంగా సరేనన్నాను. కానీ మా చెల్లెలి కొడుకు డ్రైవ్ చేస్తానంటే మా అబ్బాయి వినకుండా తనే డ్రైవ్ చేశాడు. వీళ్ళ ముగ్గురితో పాటు ఆ ఊర్లోనే ఉండే మా అడపడుచు ఇద్దరు పిల్లలు కూడా కారులో వెళ్ళారు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇంతలో ఒక బస్సు వచ్చి వీళ్ళ కారుని డీకొట్టింది. డ్రైవింగ్ సైడ్ ఉండే డోర్ తుక్కుతుక్కు అయింది. అంతేకాదు, రెండోవైపు ఉండే రెండు డోర్ల గ్లాసులు పూర్తిగా ముక్కలు ముక్కలై సీటు లోపలంతా పడ్డాయి. ఇక్కడ చూడండి బాబా దయ. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా డ్రైవింగ్ సీటులో ఉన్న మా అబ్బాయికి గానీ, వెనకాల సీటులో కూర్చున్నవారికి గానీ ఏమీ కాలేదు. కారులో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఆ గాజుపెంకులు గుచ్చుకోలేదు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. పిల్లలకేమైనా అయివుంటే నేను మా అడపడుచుకి, చెల్లెలికి ఏం సమాధానం చెప్పేదాన్నని తలచుకుంటేనే నాకు భయమేస్తుంది. ఇకపోతే, ప్రమాదం జరిగిన తర్వాత కూడా మా అబ్బాయే కారు డ్రైవ్ చేసుకుంటూ కారును ఇంటికి తీసుకొచ్చాడు. కారుకి పూర్తిగా ఇన్సూరెన్స్ ఉన్నందున ఏ ఖర్చూ లేకుండా పూర్తిగా రిపేర్ అయి కారు ఇంటికి వచ్చింది. ఇంకో ముఖ్య విషయం, కారును ఆపిన పోలీసులు మా అబ్బాయిని డ్రైవింగ్ లైసెన్స్ అడిగివుంటే ఏమైవుండేదో ఆ భగవంతుడికే ఎరుక. కానీ బాబా దయ, వాళ్ళు లైసెన్స్ అడగలేదు. ఇదంతా బాబా తోడునీడగా ఉండటం వల్లే జరిగింది. “కృతజ్ఞతలు తండ్రీ!”.


మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో...

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sri sai ram 🙏🏻🙏🏻🙏🏻 Baba vaakku satyam.. baba leelalu nityam. Om sai ram 🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Sai please bless us, udi mahima maku ayana health vishayamlo chupinchandi baba please

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo