సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1312వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

శ్రీసాయి అనురాగం

నా పేరు రమాదేవి. ప్రప్రథమంగా మనందరి ఆరాధ్యదైవమైన శ్రీసాయికి నమస్సుమాంజలి అర్పిస్తూ సాయిబంధువులందరికీ శుభాశీస్సులను, శుభాకాంక్షలను తెలియజేస్తూ సాయిభక్తుల అనుభవాలన్నింటినీ ఎంతో శ్రద్ధతో చక్కగా కూర్చి మిగిలిన సాయిభక్తులలో ఎంతో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని మరింతగా వృద్ధిచేస్తున్న ఈ బ్లాగ్ బృందానికి, ముఖ్యంగా దీని నిర్వాహకులైన సాయికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకోవడం ఇదే మొదటిసారి. నేను 30 ఏళ్లుగా శ్రీసాయి సన్నిధిలో ఉన్నా, సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించినా, అవన్నీ ఒకెత్తు అయితే ఇటీవల బాబా అనుగ్రహించిన అనుభవం నాకు ఎంతో అమూల్యమైనది. ఆ అనుభవాన్ని పంచుకునే ముందు శ్రీసాయి నా జీవితంలోకి ఎలా ప్రవేశించారో, ఎన్నెన్ని లీలలు చేశారో చెప్తాను.


నేను పుట్టింది, పెరిగింది చెన్నైలో. వివాహమైన తర్వాత మావారి ఉద్యోగరీత్యా మేము ఢిల్లీలో ఉంటున్నాము. మాది సాంప్రదాయ కుటుంబం. మా కుటుంబంలో అందరూ భగవద్భక్తులు. ఇంట్లో పూజలు వంటివి జరుగుతుండటం వల్ల సహజంగానే నాకు భక్తి అలవడింది. నేను శ్రీహనుమాన్ చాలీసా మండలం రోజులు 108 సార్లు పారాయణ, అమ్మవారి స్తోత్రాలు పఠిస్తుండేదానిని. నాకు శ్రీఆంజనేయస్వామి, అమ్మవారు తప్ప మిగతా దేవుళ్ళతో అంతగా పరిచయం లేదు. మా వదిన బాబా భక్తురాలు. ఒకసారి ఏదో సందర్భంలో తను నన్ను కలిసినప్పుడు నాకో పుస్తకం చూపించి, “వదినా! ఇది శ్రీసాయి సచ్చరిత్ర. చాలా బాగుంటుంది. దీన్ని పారాయణ చేయి” అని చెప్పింది. నేను, “సరే! చేస్తాలే వదినా” అని ఆ పుస్తకాన్ని తెచ్చుకున్నాను. కానీ దాన్ని చదవటానికి నాకు సమయం దొరకలేదు. రెండేళ్ళు గడిచిపోయాయి. అప్పుడు ఒకరోజు కలలో తలకు గుడ్డకట్టుకున్న ఒక వృద్ధుడు కనిపించి, “చదువుతానని పుస్తకం తెచ్చుకున్నావు, ఇంకెప్పుడు చదువుతావు?” అని అడిగాడు. నాకు మెలకువ వచ్చిన తర్వాత ఆ కలను గుర్తుచేసుకున్నప్పుడు కలలో కనబడింది ‘సాక్షాత్తూ శ్రీసాయినాథుడే’నని నాకు అర్థమైంది. దాంతో ఒక గురువారం శ్రీసాయి సచ్చరిత్ర చదవటం మొదలుపెట్టాను. అయితే కొద్దికొద్దిగా చదవడం వల్ల పూర్తిచేయడానికి చాలారోజులు పట్టింది. సరిగ్గా పూర్తిచేయడానికి ముందురోజు మధ్యరాత్రిలో నా పొట్ట మీద అటునుంచి ఇటు తడుముతున్నట్లుగా చేతిస్పర్శ  స్పష్టంగా తెలిసి నాకు మెలకువ వచ్చింది. చూస్తే, మావారు దూరంగా మంచానికి ఆ చివర నిద్రపోతున్నారు. పొరపాటుగానైనా ఆయన చేయి ఇంతదూరం తగిలే అవకాశం లేదు. ఆయన తప్ప గదిలో ఇంకెవరూ లేనందున అది బాబా చేతిస్పర్శ అని అర్థమై పులకించిపోయాను. ‘అందరూ సచ్చరిత్ర సప్తాహపారాయణ చేస్తారు, నేను కూడా ఈసారి సప్తాహపారాయణ చేస్తే బాగుంటుంది‘ అని అనుకొని, తరువాత ఒక గురువారం తెల్లవారుఝామున నాలుగు గంటలకి నిద్రలేచి, స్నానం చేసి, బాబాకి గంధంతో అభిషేకం చేసి, (అలా చేయమని నాకెవరూ చెప్పలేదు. నాకే చేయాలనిపించి చేశాను) పారాయణ మొదలుపెట్టాను. ఈసారి ఏరోజు పారాయణ ఆరోజు పూర్తిచేసి, బాబాకి పాలో, పంచదారో, పటికబెల్లమో, పండో ఏదో ఒకటి నైవేద్యం పెడుతుండేదాన్ని. అలా వారం రోజులు చేశాను. అలా తరువాత కూడా అప్పుడప్పుడు చేస్తూ మొత్తం ఎనిమిదిసార్లు పారాయణ పూర్తిచేశాను. అప్పుడొకరోజు బాబా స్వప్నదర్శనమిచ్చి, “వందసార్లు సచ్చరిత్ర పారాయణ చేయి” అని ఆదేశించారు. శ్రీహనుమాన్ చాలీసా 108 సార్లు చదివే అలవాటు నాకుంది కాబట్టి సచ్చరిత్ర కూడా 108 సార్లు చదవాలన్నది బాబా నిర్ణయం కాబోలు అనుకొని, “సరే బాబా! అలాగే చేస్తాను” అని అన్నాను. ఈసారి మరింత శ్రద్ధాభక్తులతో పారాయణ మొదలుపెట్టాను. అయితే వారం వారం కాకుండా వారం రోజులు పారాయణ చేశాక ఒక వారం, పదిహేను రోజులు విరామం ఇచ్చి మళ్ళీ చదువుతుండేదాన్ని. ఆ సమయంలో సాయి తమపై నాకు మొదటిసారి నమ్మకం ఎలా కలిగించారో చెప్తాను. ఒకరోజు సాయి నాకు స్వప్నదర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో సాయి ఒక గదిలో కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ భక్తబృందం ఉంది. నేను ఆయన్ని, "మీ చిరిగిన బట్టలు, మీ వేషధారణ చూసి మిమ్మల్ని దైవమని ఎలా నమ్మమంటారు? ఎవరంటారు అలా?" అని అడిగాను. వెంటనే సాయి అక్కడినుండి లేచి రోడ్డు మీదకి వెళ్లారు. ఒక వ్యక్తి స్కూటర్ మీద వెళ్తున్నాడు. ముందునుంచి ఒక లారీ వచ్చి అతన్ని గుద్దేసింది. అతను రక్తపుమడుగులో పడివున్నాడు. నేను సాయినే చూస్తున్నాను. సాయి కళ్ళనుండి రెండు కాంతిపుంజాలు వెలువడి ఆ వ్యక్తిని తాకాయి. అంతే, ఆ వ్యక్తి ఏమీ జరగనట్టు లేచి, తన శరీరాన్ని దులుపుకుని వెళ్లిపోయాడు. సాయి నా వంక చూస్తూ, నవ్వుతూ మళ్ళీ గదిలోకి వెళ్లిపోయారు. నేనడిగిన ప్రశ్నకు సమాధానం నాకు దొరికింది. అప్పటి దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.


ఒక వీధికుక్క రోజూ మా ఇంటి గుమ్మంలోకి వస్తుండేది. నేను రోజూ దానికి అన్నం పెట్టటం, పాలు పోయటం చేస్తుండేదానిని. అది మాకు బాగా దగ్గరయింది. అది ఆడకుక్క కావటాన ఒకసారి అయిదారు పిల్లల్ని కనింది. అవి ముద్దుగా, బొద్దుగా బాగున్నాయి. వాటిని అతికష్టంమీద తెలిసినవాళ్ళకి పంచిపెట్టాను. కానీ అది తరచూ ఐదారు పిల్లల్ని కంటుండేసరికి అస్తమానం నేను ఎవరికి వాటిని పంచిపెట్టగలను? అందుకని బాగా ఆలోచించి ఆ కుక్కని హాస్పటల్‍కి తీసుకెళ్ళి, పిల్లల్ని కనకుండా ఆపరేషన్ చేయించాను. అయితే, అప్పటినుంచి ఆ కుక్కకి ఏదో ఇన్ఫెక్షన్ అయి అది బాగా నీరసించి, బక్కచిక్కిపోయింది. ఎత్తుగా గుఱ్ఱంలాగా ఉన్న కుక్క కాస్తా ఎముకలగూడులాగా అయిపోయింది. రేపోమాపో అన్నట్టుగా ఉండే దాని స్థితి చూస్తూంటే నా ప్రాణం ఉసూరుమనేది. దానికోసం ఏదైనా చేయాలనిపించేది. నేను చేస్తున్న సచ్చరిత్ర పారాయణలో తాయెత్తు మహిమ గురించిన కథలు గుర్తొచ్చి ఆ కుక్కకి ఒక తాయెత్తు వేస్తే బాగుంటుదేమో అనిపించింది. అనిపించిందే తడవుగా ఒక తాయెత్తు కొనుక్కొచ్చి, దాన్ని బాబా ఊదీ, గంధం, అక్షింతలు, పూలరెక్కలతో నింపి, ఆ కుక్క మెడలో కట్టాను. ఆ కుక్క వీధిలోకి వెడితే ఇతర కుక్కలు దాని మెడలోని తాయెత్తు లాగేస్తాయనిపించినా ఏదైతే అదవుతుందని బాబా మీద భారం వేశాను. వారం అంటే వారం తిరిగేసరికల్లా ఆ కుక్క మునుపటిలా ఆరోగ్యంగా, అందంగా, పుష్టిగా తయారైంది. అప్పటివరకు బాబా మహత్యం గురించి చదవటమేకానీ, స్వయంగా చవిచూడటం అదే మొదటిసారి. 


7 comments:

  1. Om sai ram 🙏🏻

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. E roju anubhavaalu chaalaa baagunnai

    ReplyDelete
  4. Om sai ram today sai experience is nice..udi can cure anything.udi is sai.sai is udi.sai I love you.please take care of my family.

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo