- బాబాపై నమ్మకమే మనలను కాపాడుతూ ఉంటుంది
- శిరిడీయాత్రకు సంబంధించిన అనుభవాలు
బాబాపై నమ్మకమే మనలను కాపాడుతూ ఉంటుంది
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. అలాగే, ఈ బ్లాగును ఆధునిక సాయిసచ్చరిత్రలా తీర్చిదిద్దుతున్న బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారాలు. నేను పది సంవత్సరాలుగా సాయిభక్తురాలిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తున్నారు. వాటిలోనుండి కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. అయితే ముందుగా, ఈ అనుభవాలు పంచుకోవటంలో జరిగిన ఆలస్యానికి బాబాను క్షమించమని వేడుకుంటున్నాను. ఈమధ్య మా పాప శరీరంపై కొంచెం భయంగొలిపే ప్రదేశంలో మొదట ఒక మచ్చలా వచ్చింది. దాన్ని మా పాప నాకు చూపిస్తే, నేను అది పుట్టుమచ్చ అయివుంటుందని అన్నాను. తర్వాత అది చిన్న పొక్కులా పైకి వచ్చి, పెరగడం మొదలుపెట్టింది. అయితే పాపకి దానివల్ల నొప్పిగానీ, ఇబ్బందిగానీ ఉండేవి కాదు. నేను మావారికి చెప్తే, "అదేం కాదు, కొన్నిరోజులు చూద్దామ"ని అన్నారు. ఈలోగా పాపకు పరీక్షల సమయం వచ్చింది. అది చూస్తే, చిన్న గడ్డలా పెరుగుతూ ఉంది. హాస్పిటల్‌కి వెళ్దామంటే మా పాప, "పరీక్షలు అయిన తర్వాత వెళదాం" అంది. తీరా పరీక్షలవుతూనే స్కూలువాళ్ళు సమ్మర్ క్యాంపు పెట్టారు. దాంతో మా పాప, "10 రోజులే కదా! నేను క్యాంపుకి వెళ్తాను. అక్కడనుండి వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్దాం" అని అంది. కానీ నేను తనని బలవంతంగా మా ఫ్యామిలీ డాక్టరుకి చూపిద్దామని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. కానీ హాస్పిటల్ స్టాఫ్, "డాక్టరుగారు ఊరు వెళ్లారు. రావడానికి రెండు రోజులు పడుతుంది" అని చెప్పారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మావారు మాత్రం, "ఏం కాదులే, భయపడకు" అన్నారు. కానీ నేను చాలా భయపడి, "వేరే డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళదామ"ని అన్నాను. మావారు, "నువ్వు కంగారుపడకు. ఇటువంటివి ముందుగా ఫ్యామిలీ డాక్టరుకి చూపించుకుని, వాళ్ళ సలహా ప్రకారం నడుచుకోవాలి. వేరేవాళ్ళైతే మనల్ని భయపెడతారు" అని అన్నారు. ఇక చేసేదిలేక ఇంటికి తిరిగి వచ్చేశాం. నేను మా పాపని బాబా గుడికి తీసుకుని వెళ్లి సమ్మర్ క్యాంపులో జాయిన్ చేశాను. తనని హాస్టల్‌కి పంపేటప్పుడు బాబా ఊదీ ఇచ్చి, ప్రతిరోజూ పెట్టుకోమని చెప్పాను. నాలుగు రోజులు తర్వాత పాప ఫోన్ చేసి, "అమ్మా! గడ్డ బాగా పెరుగుతోంది" అని చెప్పింది. అది విని నాకు చాలా భయమేసి, "బాబా! పాపను ఆరు రోజులు కాపాడు తండ్రీ" అని వేడుకున్నాను. తరువాత పాపతో, "అమ్మా, గడ్డ దగ్గర ఊదీ రాస్తూ ఉండు" అని చెప్పాను. అద్భుతం చూడండి! రెండు రోజుల తరువాత మా పాప ఫోన్ చేసి, "అమ్మా! ఆ గడ్డ దానంతట అదే పగిలి లోపల రసి బయటకు వచ్చేసింది. అక్కడ గాయమైనట్లుగా చాలా పెద్ద పుండులా ఉంది. కానీ నొప్పి ఏమీ లేదు" అని చెప్పింది. ఇక నా ఆనందం ఏమని చెప్పను? వెంటనే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోవాలనుకున్నాను. కానీ, పెళ్లిళ్లు, చుట్టాలు ఆ సందడిలో పడి చాలా ఆలస్యం అయిపోయింది. ఇలా ఉండగా నేను తరచుగా బ్లాగుకి పంపే నా అనుభవాలలోని ఒక అనుభవం ప్రచురితమైనప్పుడు దాన్ని చదవడానికి బ్లాగ్ ఓపెన్ చేస్తే, అక్కడ నా అనుభవంతోపాటు వేరే సాయిభక్తురాలు పంచుకున్న మా పాప సమస్య వంటి అనుభవమే అక్కడ ఉంటే అది చదివాను. ఆ అనుభవం చదవగానే బాబా ఈ విధంగా నా అనుభవాన్ని పంచుకోమని గుర్తుచేస్తున్నారనిపించింది. వెంటనే ఆలస్యం చేసినందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆలస్యం జరిగి ఎట్టకేలకు ఇప్పుడిలా పంచుకున్నాను. "నన్ను క్షమించండి బాబా".
2022, జూన్‌లో మేము, మా బంధువులందరం కలిసి తిరుపతి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. నాకు మామూలుగా వారం రోజులు ముందే నెలసరి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ, నాకు ఎప్పుడూ వచ్చే విధంగా నెలసరి ముందుగా రాలేదు. దాంతో నాకు టెన్షన్ పట్టుకుంది. అప్పుడు నేను, "ఏమిటి బాబా? శ్రీవెంకటేశ్వరస్వామి మమ్మల్ని పరీక్షిస్తున్నట్లుగా ఉంది. 40 మందిమి ప్రయాణం పెట్టుకున్నాము. మీ దయతో ఏ విధమైన ఆటంకం లేకుండా మేము తిరుపతికి వెళ్లి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే మా ప్రయాణానికి ఆటంకం లేకుండా నాకు నెలసరి ముందే వచ్చేలా చేశారు బాబా. మేమందరమూ సంతోషంగా తిరుపతి వెళ్లి వచ్చాము. మనం బాబా మీద పెట్టుకున్న నమ్మకమే మనలను సమస్యల నుండి కాపాడుతూ ఉంటుంది. ఎందరో భక్తులకు ఇది అనుభవమే. ఒకసారి బాబాను శరణువేడితే తల్లి కన్నా ఎక్కువగా మన బాధ్యత తీసుకుని ఎప్పుడూ మన వెంటే ఉంటారు.
శిరిడీయాత్రకు సంబంధించిన అనుభవాలు:
సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో మావారికి సెలవులు ఉండటం వల్ల మేము మొదటిసారి శిరిడీ వెళ్లదలచి మాతోపాటు మా ఆడపడుచువాళ్ళని కూడా తీసుకుని వెళ్లాలనుకున్నాము. అయితే ఆ సమయంలోనే మేము ఒక స్థలం కొనడం వల్ల మా దగ్గర శిరిడీ ప్రయాణానికి కావాల్సిన డబ్బులు లేవు. అందుకని మా అమ్మావాళ్ళను డబ్బులు పంపించమని అడిగితే, పంపించారు. కానీ బాబాకి అప్పుచేసి శిరిడీ రావడం ఇష్టం ఉండదు కదా! అది మాకు అర్థమయ్యేలా ట్రైన్‍లో ఒక అనుభవాన్ని ప్రసాదించారు. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక అరగంటకి టీసీ టికెట్ చెకింగ్ కోసమని వచ్చారు. అతను ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లో సీలింగ్‌కి ఉండే ఫ్యాన్‌కి తగిలేంత ఎత్తు ఉన్నాడు. అతను తత్కాల్ టికెట్లు బుక్ చేసినప్పుడు ప్రూఫ్‍గా పెట్టిన మా ఆధార్ కార్డుల ఒరిజినల్స్ కావాలని అడిగారు. కానీ మావారు ఒరిజినల్ ఆధార్ కార్డులు తేలేదు. అందుకని ప్రభుత్వోద్యోగి అయిన మావారు తన జాబ్ ప్రూఫ్ ఒరిజినల్, పాన్ కార్డు ఒరిజినల్ చూపించారు. కానీ ఆ టీసీ ఆధార్ కార్డు ఒరిజినల్సే కావాలని పట్టుబట్టాడు. మా పక్కవాళ్ళ పరిస్థితి కూడా అదే. వాళ్ళ దగ్గర కూడా ఒరిజినల్ ప్రూఫ్స్ లేవు. వాళ్ళు టీసీతో గట్టిగా గొడవపడ్డారు. కానీ టీసీ పట్టు వీడలేదు. ఈలోగా సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది. ఆ టీసీ మమ్మల్ని ట్రైన్ దిగమనీ, లేదంటే 7,500 రూపాయల జరిమానా కట్టమని కూర్చున్నాడు. పోలీసులు కూడా వచ్చారు. నేను మావారితో, "మనం అమ్మావాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని శిరిడీ వెళ్తున్నాము. అది బాబాకి నచ్చలేదేమో! అందుకే ఈవిధంగా పరీక్షిస్తున్నారు. మీరు 'రెండు రూపాయలు దక్షిణగా హుండీలో వేస్తాము, మమ్మల్ని రక్షించండి' అని బాబాను వేడుకోండి" అని చెప్పాను. ఆయన అలాగే చేశారు. అంతే, క్షణాల్లో అద్భుతం జరిగింది. పోలీసులు, "ఆధార్ లేకపోయినా మిగిలిన అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి కదా, ఆధార్ ఒరిజినల్ లేకపోతే ఏమైంది? వదిలేయండి" అని టీసీతో అన్నారు. దాంతో టీసీ మా టికెట్లు మాకు ఇచ్చేశారు. మరునిమిషంలో ట్రైన్ కదిలింది. మేము సంతోషంగా శిరిడీ చేరుకున్నాము. ఆరోజు మొత్తంలో ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు బాబా దర్శనానికి వెళదామని నేను అనుకున్నాను. బాబా దయవల్ల అందరం నాలుగుసార్లు బాబా దర్శనం చేసుకున్నాం. ఇకపోతే, నాకు సంధ్య ఆరతి అంటే చాలా ఇష్టం. అందువల్ల సంధ్య ఆరతికని లైన్లోకి వెళ్ళాము. కానీ నేను, మా ఆడపడచు, తన మామగారు ఆరతి లైన్లోకి కాకుండా మామూలు దర్శనం లైన్లోకి వెళ్లిపోయాము. మావారు, మిగిలిన బంధువులంతా ఆరతి లైన్లోకి వెళ్లారు. అందువల్ల వాళ్లు ఆరతి దర్శనం చేసుకున్నారు, కానీ మేము చేసుకోలేకపోయాము. ఇంక నాకు దుఃఖం ఆగక ఏడ్చేశాను. అప్పుడు మావారు, "శేజారతికి వెళదాములే" అని అన్నారు. ఈసారి అన్ని విషయాలు సరిగా కనుక్కొని ఆరతి లైన్లోకి వెళ్ళాము. అక్కడ మాకు ఒకావిడ పరిచయమయ్యారు. ఆవిడ, "నేను ఇప్పటికి 18సార్లు శిరిడీ వచ్చాను. మీరు నా వెనకాలే రండి. నేను తీసుకెళ్తాను" అని అన్నారు. కానీ మావారు, "నాకు నిలబడే ఓపిక లేదు. నాకు ఎక్కడ కూర్చోడానికి స్థలం దొరికితే, అక్కడే నేను ఆరతికి కూర్చుంటాను" అని అన్నారు. సరేనని నేను మాత్రం ఆవిడ వెనకాలే వెళ్లాను. అప్పుడు ఆవిడ, "నేను నిన్ను సమాధిమందిరంలోకి తీసుకుని వెళ్తాను. ఎందుకంటే, అక్కడ ఉన్నవాళ్ళకే ఆరతి అనంతరం బాబా దర్శనం జరుగుతుంది, వెనుక హాళ్లలో ఉన్న మిగిలినవాళ్ళకి బాబా దర్శనం ఉండదు" అని చెప్పారు. ఆవిడ చెప్పినట్లే అంతమంది జనంలో నుండి నన్ను సమాధిమందిరంలోనికి తీసుకుని వెళ్ళింది. ఆవిడ ఆరతి అయిపోయిన తర్వాత, "ప్రసాదం ఇస్తారు. నువ్వు లైన్లో నుంచి పక్కకి వెళ్లొద్దు" అని చెప్పారు. అలాగేనని నేను ఆవిడతోనే ఉన్నాను. మేమిద్దరం ప్రసాదం తీసుకుని వస్తుంటే, మావారు మగవాళ్ళ లైన్లో నుంచి బయటికి వచ్చారు. ఆయన, "నేను నిలబడలేక బాబాకి ఎదురుగా వెనక హాల్లో కూర్చుని ఆరతి చూద్దామని అనుకున్నాను. కానీ అక్కడున్న సెక్యూరిటీ నన్ను పిలిచి మరీ, "సమాధిమందిరంలో ఖాళీగా ఉంది. లోపల నిలబడండి" అని లోపలికి పంపారు. అందుచేత నాకు కూడా బాబా దర్శనం బాగా జరిగింద"ని చెప్పారు. ఆయా వ్యక్తుల రూపంలో బాబా మాకు అంత చక్కటి ఆరతి దర్శనం ప్రసాదించారని అనిపించి నేను మా పక్కన ఉన్న ఆవిడ పాదాలకు నమస్కరించాను. అలా మా మొదటి శిరిడీ దర్శనం జరిగింది.
మేము రెండోసారి శిరిడీ వెళ్ళినప్పుడు కూడా నేను సంధ్య ఆరతికి సమాధిమందిరం సమీపం వరకు వెళ్లి లైన్లో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు నేను అక్కడ ఉన్న టీవీలో బాబాను చూస్తూ ఆరతి పాడుకున్నాను. ఆరతి అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న భీమవరం నుంచి వచ్చిన భక్తులు, "ఆరతి చాలా బాగా పాడావమ్మా. మాకోసమే నువ్వు ఇక్కడ ఆగిపోయావు" అన్నారు. ఆ మాటలకి నాకు చాలా ఆనందమేసి ఏడుపొచ్చింది. బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత బాబా సేవకు వచ్చిన కొంతమంది సేవకులు(తెలుగువాళ్లు), "మేము సేవ పూర్తిచేసుకుని వెళ్లిపోతున్నాము. మేము సాయిసత్యవ్రతం చేసుకున్నాము. ప్రసాదం తీసుకోండి" అని ఇచ్చారు. నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత మావారు, "మొదటిసారి శిరిడీ వచ్చినప్పుడు శేజారతికి అవకాశం దొరికింది. ఈసారి కూడా దొరుకుతుందిలే" అని నన్ను లైన్‍లోకి తీసుకెళ్లారు. అయితే ఈసారి సమాధిమందిరం లోపల పూర్తిగా నిండిపోవడం వలన బయటనే కూర్చుని ఆరతి చూశాము. నేను, "బాబా! మొదటిసారి మేము శిరిడీ వచ్చినప్పుడు మీరు మీ ఉనికిని మాకు చూపించారు. ఈసారి కూడా గుర్తుండిపోయే అనుభవాన్ని ప్రసాదించు తండ్రీ" అనుకుని బయటకు వచ్చాము. అక్కడ చెప్పులు వేసుకుంటుంటే, నా చెప్పుల దగ్గర ఊదీ ప్యాకెట్ దొరికింది. బాబా అనుగ్రహానికి నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆయన ప్రసాదించిన ఊదీని భద్రంగా దాచిపెట్టుకున్నాను.
మేము మూడోసారి శిరిడీయాత్ర చేద్దామనుకున్నప్పుడు మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు నేను, "బాబా! అమ్మకు ఆరోగ్యం బాగైతే అమ్మను కూడా శిరిడీ తీసుకొస్తామ"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. కానీ కరోనా కారణంగా మేము శిరిడీ వెళ్లలేకపోయాం. తరువాత మావారు 2022, జూలై నెలలో రెండో శనివారం, ఆదివారం కలిసి వచ్చేలా శిరిడీకి టికెట్లు బుక్ చేస్తుంటే నేను మావారితో, "అమ్మ అస్సలు నడవలేకపోతోంది. మళ్ళీ మనం ఎప్పుడు శిరిడీ వెళ్తామో తెలీదు కదా! కాబట్టి తనకి కూడా టికెట్ బుక్ చేయండి" అని చెప్పాను. అలాగే అమ్మకి కూడా టిక్కెట్లు బుక్ చేశారు. కానీ, సరిగ్గా ప్రయాణ సమయానికి భారీ వర్షాలు మొదలయ్యాయి. అయినా మేము ధైర్యంగా శిరిడీ వెళ్ళాము. బాబా దయవల్ల ఒక్కరోజులో నేను ఏడుసార్లు బాబా దర్శనం చేసుకున్నాను. అయితే ఎప్పటిలానే సంధ్య ఆరతికి లైన్‍లోనే ఉండిపోయాను. కానీ శేజారతికి బాబాకి ఎదురుగా కూర్చునే భాగ్యం దక్కింది. ఆరతి అనంతరం నేను, మావారు మా రూముకి వెతుకుతున్నప్పుడు మావారు, "నువ్వు మధ్యాహ్నం నుండి ఏమీ తినలేదు కదా! ఏదైనా కొంచెం తిందాం" అన్నారు. సరిగా అదే సమయానికి మూడో నెంబర్ గేటు వైపు వెళ్లే దారిలో సెక్యూరిటీవాళ్ళు బాబాకి ఉపయోగించిన పువ్వులు, చిన్న శాలువాలు, ప్రసాదం పంచుతున్నారు. అదృష్టం కొద్దీ మేము తినడానికి ఆగడం వలన మాకు బాబా వస్త్రం లభించింది.
మరుసటిరోజు మేము మా అమ్మకు, అత్తయ్యకు శ్రీత్రయంబకేశ్వరుని దర్శనం చేయిద్దామని త్రయంబకేశ్వరం వెళ్ళాము. అక్కడ బస్సు దిగగానే పెద్ద వర్షం పడింది. ఆ సమయంలో అక్కడ ఒకే ఒక్క ఆటో ఉంది. దాన్ని కూడా మాతో వచ్చినవాళ్లు మాట్లాడేసుకున్నారు. వాళ్లు ఆ ఆటోలో తమతోపాటు అమ్మని, అత్తయ్యని ఎక్కించుకుంటామన్నారు. సరేనని అమ్మని, అత్తయ్యని వాళ్లతో పంపాము. అమ్మని, అత్తయ్యని గుడి దగ్గర దించి వాళ్ళు దర్శనానికి వెళ్లిపోయారు. మేము వేరే గేటు నుంచి వెళ్లడం వల్ల ఎంత వెతికినా వాళ్ళు మాకు కనబడలేదు. సరే, వాళ్ళు దర్శనం చేసుకుని ఉంటారులే అనుకుని మేము దర్శనానికి వెళ్ళిపోయాము. మేము బయటకి వచ్చేటప్పటికి మూడు గంటల సమయం పట్టింది. అప్పుడు మా అత్తయ్య మాకు ఫోన్ చేసి, "మేము దర్శనం చేసుకోలేద"ని చెప్పారు. మాకు ఏం చేయాలో తెలియక మా బస్సు దగ్గరకి చేరుకున్నాము. అప్పటికి మాతో వచ్చినవాళ్ళెవరూ బస్సు దగ్గరకి రాలేదు. ఇంక నేను ధైర్యం చేసి వెంటనే అమ్మని, అత్తయ్యని తీసుకుని ఆటోలో గుడికి బయలుదేరాను. అంతలో మళ్ళీ పెద్ద వర్షం మొదలైంది. "ఏమిటి బాబా, అమ్మకు, అత్తయ్యకు శివుడంటే చాలా ఇష్టం. వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చి దర్శనం చేయించలేకపోతున్నానే" అని బాబాతో అనుకున్నాను. మరుక్షణం ఆటో నడుపుతున్న అబ్బాయి, "మేడమ్! 200 రూపాయల దర్శనం లైన్ దగ్గర ఆపుతాను. టిక్కెట్లు తీసుకుని వెళ్ళండి. వెంటనే దర్శనం అయిపోతుంది" అని అక్కడికి తీసుకుని వెళ్లి ఆపాడు. మేము ఆ వర్షంలో తడుస్తూనే దర్శనానికి వెళ్ళాము. బాబా అమ్మావాళ్లకు ఎంత చక్కని దర్శనాన్ని ఇచ్చారంటే, నిజరూప దర్శనాన్ని అనుగ్రహించారు. అదే అమ్మావాళ్లు మాతో వచ్చి ఉంటే, ఆ దర్శనం వాళ్లకు లభించేది కాదు. ఎందుకంటే, మామూలు వేళల్లో అలంకరణ చేసి ఉంటుంది. కానీ అమ్మావాళ్ళు వెళ్ళినప్పుడు ప్రదోషకాలమని అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకాన్ని చూసే అదృష్టాన్ని బాబా వాళ్లకు కలిగించారు. అలా తుఫానులో కూడా బాబా మాకు చక్కని శిరిడీ దర్శనాన్ని ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం మావారికి వైరల్ ఫీవర్ వచ్చింది. త్వరగా తగ్గించండి తండ్రీ. మళ్ళీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఈ అనుభవాలు ఇంత పెద్దగా వస్తాయని ఇన్ని రోజులు ఆలస్యం చేశాను. దయచేసి నన్ను క్షమించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
చాలా బాగుంది.రెండవ అనుభవం చాలా బాగుంది.నాకు రాత్రి హారతి యిష్టం.ఆదివారం పేజ్ హారతి కి వెళ్ళాను.చాలా ఆనందం కలిగింది.హారతి చాలా బాగుంది.సాయీ నీ దయ వుంటే లేనిది లేదు
ReplyDelete