సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1328వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో నిశ్చయమైన వివాహం
2. బాధను తీర్చిన బాబా

బాబా అనుగ్రహంతో నిశ్చయమైన వివాహం


ముందుగా శ్రీసాయినాథునికి పాదాభివందనాలు. బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఒక బాబా భక్తురాలిని. బాబా నన్ను రోజురోజుకి తమ వైపుకి నడిపిస్తున్నారు. "ధన్యురాలిని బాబా". సాయి భక్తులందరినీ మన బాబా చల్లగా చూడాలని కోరుకుంటూ నేను నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలై నాలుగైదు సంవత్సరాలవుతుంది. మా తమ్ముడు అమెరికాలో ఉంటున్నందున నాకు మొదట బంధువుల ద్వారా ఇతర దేశాల సంబంధాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల మేము ఆ సంబంధాలను తిరస్కరించాము. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఏ సంబంధమూ కుదరలేదు. మాది అన్నివిధాలుగా బాగా స్థిరపడిన కుటుంబమే అయినప్పటికీ సంబంధాలు ఎందుకు కుదరడం లేదని జాతకాలు చూపిస్తే "జాగ్రత్తగా జాతకాలు చూసి సంబంధం నిశ్చయించుకోండి" అని చెప్పారు. దానితో అవతల వాళ్ళు ఇష్టపడి ముందుకు వచ్చినా, జాతకాలు కలవక వెనుతిరిగిన సంబంధాలు చాలానే ఉన్నాయి. నా చదువు పూర్తి అవ్వకపోవడం కూడా ఒక కారణం. రెండు సంబంధాలు పెళ్లిచూపుల వరకు వచ్చి ఆగిపోయాయి. నా గురించి మా కుటుంబమంతా చాలా చాలా బాధపడ్డారు. ఎన్నో పూజలు చేసాము. ఇలా ఉండగా బాబా అనుగ్రహం వల్ల కొన్నినెలల క్రితం నాకు ఈ బ్లాగు పరిచయమైంది. నేను బాబాతో నా బాధ చెప్పుకుని, "బాబా! నాకు ఒక మంచి మనసున్న వ్యక్తిని భర్తగా ప్రసాదించండి" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల రెండు నెలల క్రితం(జూన్-జూలై ప్రాంతంలో) నాకు ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి చాలా మంచివాడు. అతని పేరులో 'సాయి' అని ఉండటం మరో విశేషం. అప్పుడు నేను, "బాబా! అతనితో నా వివాహం నిశ్చయమవ్వాలి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని వెంటనే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆయన కృపవల్ల ఆ సంబంధం వాళ్ళు నన్ను చూసి చీర పెట్టడానికి వస్తామని చెప్పారు. మేము మంచిరోజు చూసి వాళ్ళతో చెప్పాము. అయితే అంతలో నాకు 102 డిగ్రీల జ్వరం వచ్చి డోలో 650 టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. హాస్పిటల్‍కి వెళితే, నాకు టైఫాయిడ్ అని నిర్ధారణ అయింది. అది చాలదన్నట్లు నాకు రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టేది కాదు. ఇలా అయితే జ్వరం ఎలా తగ్గుతుందని నేను చాలా భయపడి, "బాబా! దయచేసి నాకు జ్వరం త్వరగా తగ్గి, మళ్ళీ రాకుండా ఉండేలా అనుగ్రహించండి. ఇంకా నేను టైఫాయిడ్ సెలవులో ఉన్నప్పుడే ఆ సంబంధం వాళ్ళు వచ్చి సంబంధం ఖాయం చేసుకునేలా అనుగ్రహించండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. మూడురోజుల్లో నాకు జ్వరం తగ్గింది. వెంటనే నేను హైదరాబాద్ నుండి మా ఊరికి బయలుదేరాను. నేను బస్సులో ఉండగానే ఆ సంబంధం వాళ్ళు ఫోన్ చేసి నా సెలవు రోజుల్లోనే వస్తామన్నారు. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగి నా వివాహం అతనితో నిశ్చయమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు మంచి మనసున్న వ్యక్తితో నా వివాహం నిశ్చయం చేశారు బాబా. అతని పేరులో 'సాయి' అని ఉండటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. దగ్గరుండి మా వివాహం నిర్విఘ్నంగా జరిపించే బాధ్యత మీదే బాబా”.


ఒకరోజు నా ఎడమ దంతం కదులుతూ నొప్పిగా ఉంటే, నేను బాబా ఊదీ పెట్టుకుని, "బాబా! మీ కృపతో నొప్పి తగ్గి ఏ సమస్యా లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకుని ఏ మందులూ వేసుకోకుండా కేవలం బాబా మీద ఆధారపడ్డాను. ఆయన కృపవల్ల కొన్నిరోజులకి నొప్పి తగ్గటం తోపాటు దంతం కదలటం కూడా ఆగిపోయింది. "ధన్యవాదాలు సాయి. ఇలాగే మమ్మల్ని సదా కాపాడండి తండ్రి".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


బాధను తీర్చిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా తాము ప్రసాదిస్తున్న అనుభవాలను అందరితో పంచుకునే అదృష్టాన్ని ప్రసాదించిన మన బాబాకి నా ప్రణామాలు.  భక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి కోటికోటి ధన్యవాదాలు. ఈ బ్లాగు ద్వారా మీరు మా అందరినీ బాబాకి మరింత దగ్గర చేస్తున్నారు. మీకు, అలాగే ప్రతి ఒక్కరికీ బాబా ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2022, సెప్టెంబర్ 3న మా అన్నయ్య ఎందుకనో కోపంగా, చిరాకుగా కనిపించాడు. తనకి ఒక సమస్య ఉంది. దాని గురించి వివరంగా తెలియపరచలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. అన్నయ్యని అలా చూసి అమ్మ, నేను 'బాబా ఎందుకని మనపై దయ చూపించట్లేద'ని బాధపడ్డాము. నేను బాబాను, "బాబా! దయచేసి అన్ని విధాలా అన్నయ్యని బాగు చేసి, తనని కాపాడండి. మీరు తప్ప మాకు వేరెవరూ దిక్కు లేరు. మీరే మమ్మల్ని ఆదుకోవాలి తండ్రి" అని వేడుకున్నాను. అలా బాబాతో మా బాధని చెప్పుకున్న కాసేపటికి అన్నయ్య వచ్చి, అంతా మామూలుగా ఉన్నట్లు ఉన్నాడు. "ధన్యవాదాలు బాబా. అన్నయ్యని అన్ని విధాల కాపాడండి బాబా".


ఈమధ్య దాదాపు రెండు నెలలపాటు మా ఇంట్లో తరచుగా పిల్లలు, పెద్దలు అని లేకుండా అందరికీ అనారోగ్యంగా ఉంటుండేది. ముందుగా మా బాబుకి జలుబు, జ్వరం వచ్చాయి. తర్వాత మా పాపకి వైరల్ ఫీవర్ వచ్చింది. అయితే బాబా దయతో పాప కాస్త త్వరగానే కోలుకుంది. కానీ బాబుకి రెండు రోజులు జ్వరం తగ్గి, మళ్ళీ వస్తుండేది. దానికి తోడు జలుబు, దగ్గు కూడా విపరీతంగా ఉండేవి. టెస్టు చేయిస్తే, తనకి కూడా వైరల్ ఫీవర్ అని మందులిచ్చారు. మందులు వేస్తే, బాబు ఆ మందులు వాంతి చేసుకుంటుండేవాడు. మాకు ఏం చేయాలో తోచేదికాదు. నేను మాత్రం బాబానే నమ్ముకుని, "బాబా! మీరే ఎలాగైనా పిల్లలకి ఆరోగ్యం బాగుండేలా చూడాలి తండ్రి. అలాగే ఇంకెవరికీ ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడండి బాబా" అని చెప్పుకున్నాను. అంతలో నాకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది కానీ, బాబా దయతో తగ్గింది. బాబుకి మాత్రం అలాగే ఉండింది. ఈలోగా నా భర్తకి, మా అమ్మకి కూడా ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. యోగా చేస్తున్నప్పుడు హఠాత్తుగా నా భర్తకి బ్యాక్ సైడ్ పెయిన్ వచ్చి తగ్గలేదు. నేను, "బాబా! దయచేసి నా భర్తకి ఆ నొప్పి తగ్గి, తను ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా చూడు తండ్రి" అని బాబాను వేడుకున్నాను. అమ్మ విషయానికి వస్తే, ఎందుకో తెలీదు హఠాత్తుగా ఆమె ముఖం మీద దద్దుర్లు వచ్చాయి. రోజూ పెద్దగా ఒక దద్దురు ముఖం మీద వచ్చి, సాయంత్రమయ్యేసరికి బాగా పెరిగిపోవడం జరుగుతుండేది. దురద చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పేది. ఇంకా అమ్మ కళ్ళలో బాగా నొప్పి కూడా వస్తుండేది. డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు వాడినా కూడా తగ్గలేదు. నేను అమ్మ పడుతున్న ఇబ్బందిని చూడలేక, "బాబా! మీరే ఎలాగైనా బాబుకి, నా భర్తకి, అమ్మకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి తండ్రి. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి తండ్రి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మనస్పూర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా దయచూపారు. ఇప్పుడు బాబుకి, నా భర్తకి ఆరోగ్యం కొంచెం బాగానే ఉంది. అమ్మకి కూడా దురద తగ్గింది, దద్దుర్లు కూడా రావడం లేదు. "ధన్యవాదాలు బాబా! అమ్మవాళ్ళకున్న అన్ని సమస్యల నుంచి వాళ్ళను గట్టెక్కించు స్వామి. మా పిల్లలు, నా భర్త, అమ్మానాన్న, అన్నయ్య, ఇంకా ప్రతి ఒక్కరూ సదా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి. మీరు తప్ప మాకు ఎవరూ లేరు బాబా. మీ అనుగ్రహాన్ని అందరి మీద ఎల్లప్పుడూ కురిపిస్తూ ప్రతి ఒక్కరిని మీరే కాపాడాలి తండ్రి. ప్రతి ఒక్కరం మీ నామస్మరణ నిత్యం చేస్తూ ఉండేలా చూడు తండ్రి". చివరిగా నా అనుభవాలు చదివిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.


ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా!!!


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo