సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1329వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా రక్షణ
2. బాబా మాత్రమే కాపాడగలరు

బాబా రక్షణ


సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు మహేష్. నేను ఇంతకుముందు చాలా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఒకసారి నాకు విపరీతంగా వాంతులు, విరోచనాలు అయి చాలా నీరసించిపోయాను. హాస్పిటల్‍కి కూడా వెళ్లలేని పరిస్థితి. అప్పుడు నేను నా సర్వస్వం అయిన సాయిబాబాను, "నన్ను ఈ సమస్య నుండి రక్షించినట్లైతే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. తరువాత బాబా దయవల్ల నెమ్మదిగా హాస్పిటల్‍కి వెళ్ళాను. అక్కడ నాకు ఇంజక్షన్ చేసి, సెలైన్ ఎక్కించారు. అద్భుతం! ఆ హాస్పిటల్లో బాబా నాకు ఫోటో మరియు చిన్న విగ్రహం రూపంలో దర్శనమిచ్చారు. ఆయన కృపతో నాకు వాంతులు, విరోచనాలు పూర్తిగా తగ్గిపోయాయి.


తెల్లవారితే రాఖీ పండుగ అనగా ఆ రాత్రి హఠాత్తుగా నాకు జ్వరం వచ్చింది. నేను అప్పుడు హైదరాబాద్‍లో ఉన్నాను. తెల్లవారుఝామున నేను, మా అక్క, తన పిల్లలు కలిసి రాఖీ పండగకోసం మా ఊరు వెళ్లాల్సి ఉంది. కాబట్టి జ్వరం ఎక్కువైతే ఊరు ఎలా వెళ్లడమని నాకు భయమేసి, "బాబా! తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోవాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకుని పడుకున్నాను. బాబా దయవల్ల జ్వరం తగ్గింది. బస్సులో మా గ్రామం వెళ్లడానికి దాదాపు 3 గంటల ప్రయాణం చేయాలి. ఆరోజు పండగ కాబట్టి జనం విపరీతంగా ఉన్నారు. అందువల్ల బస్సులో సీటు దొరుకుతుందో, లేదో అనుకున్నాను. కానీ బాబా దయవల్ల మేము ఎక్కిన బస్సులో జనం పెద్దగా లేరు. మేము అందరం సీటుల్లో కూర్చున్నాకే మా బస్సు ఫుల్ అయింది. మేము క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాం.


మేము కొమురవెల్లి శ్రీమల్లన్నస్వామి గుడికి వెళ్లి, మొక్కులు తీర్చుకుని, రావాలని అనుకున్నాము. ఆ విషయంగా నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! స్వామివారి దర్శనం, మొక్కులు చెల్లించడం అన్నీ బాగా జరగాలి" అని వేడుకున్నాను. బాబా, మల్లన్నస్వామల దయవల్ల అంత చాలా బాగా జరిగింది.


శిరిడీ సమాధి మందిరంలో బాబా సమాధి తాకి నమస్కరించుకోవాలని నాకు కోరికగా ఉండేది. ఈమధ్య ఒక గురువారం తెల్లవారుఝామున నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో నేను బాబా సమాధిని నా రెండుచేతులతో తాకి నమస్కరించుకుని, తరువాత బాబా పాదాలకు దణ్ణం పెట్టుకున్నాను. ఆ విధంగా బాబా నా మనసులోని కోరికను నెరవేర్చారు.


నేను ఎప్పుడూ బాబా నాతోనే ఉన్నారు, నేను ఆయన రక్షణలో ఉన్నాను అన్న నమ్మకంతో ఉంటాను. నేను ఎటు వెళ్లినా ఏదో ఒక రూపంలో బాబా నాకు దర్శనమిస్తూ ఉంటారు. ఒకరోజు నేను మా ఇంటి తలుపు దగ్గర కూర్చొని ఉండగా నా పక్కనే ఒక పెద్ద పాము కోరలు ఆడిస్తూ కనిపించింది. ఒక్కసారిగా నేను భయకంపితుడనయ్యాను. నేను ఆ సమయంలో కూడా బాబా గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఆయననే నన్ను రక్షించారు.


మా పొలం వద్ద ఉన్న బోర్ వల్ల విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ దెబ్బ తింటుందని, చుట్టు ప్రక్కల పొలం వాళ్ళు మమ్మల్ని చాలా చాలా ఇబ్బందికి గురిచేసారు. ఒకరోజు కరెంటు పోల్ నుండి మా బోర్ మోటార్‍కి ఉండే కరెంటు వైర్‍ను కూడా తొలగించి చాలా ఇబ్బందిపెట్టారు. అప్పుడు నేను చాలా బాధతో, "బాబా! మీ దయతో సమస్య పరిష్కారమైతే కొబ్బరికాయ సమర్పించుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆ తరువాత మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, *నీకు అసాధ్యమనిపించేది, నేను సాధ్యం చేస్తాను. నేను దాన్ని పూర్తి చేస్తాను* అని బాబా మెసేజ్ కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇంక నేను బాబా మీద నమ్మకంతో ఉన్నాను. తెల్లవారేసరికి మా పొలం వైపుగా ఉండే మెయిన్ కరెంటు వైర్ తెగి పడిపోయింది. దాంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు, "మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్లనే ఇలా జరిగిందని, తప్పైపోయింది, ఇక మీ జోలికి రాము" అని మా నాన్నతో అన్నారు. తరువాత మేము మా బోర్ మోటార్‍కి కనెక్షన్ పెట్టించాము. అలా బాబానే మా సమస్యని పరిష్కరించారు.


ఒకసారి మా నాన్న నాతో, "మోటార్ ఆన్ చేసినప్పటికీ బోర్ నుండి నీళ్లు రాలేదు" అని చెప్పారు. వెంటనే నేను వెళ్లి, మోటార్ స్విచ్ ఆన్ చేశాను. అప్పుడు కూడా నీళ్లు రాలేదు. వెంటనే నేను, "బాబా! మీరు నాతో సత్యప్రమాణకంగా ఉన్నట్లైతే, వెంటనే నీళ్లు రావాలి" అని అనుకున్నాను. మహాద్భుతం! అరనిమిషంలో బోర్ నుండి నీళ్లు వచ్చాయి. నేను చాలా ఆనందించాను. పిలిచిన పలికే  దైవమైన నా సాయికి శతకోటి వందనాలు. "ప్లీజ్ బాబా. త్వరగా నాకు బ్రతుకుదెరువు చూపించి జీవితంలో స్థిరపరచండి. అంతా మీ దయ బాబా".


బాబా మాత్రమే కాపాడగలరు


నేను ఒక సాయి భక్తుడిని. నాపేరు శ్రీరామ సాయి కార్తికేయ. నా వయస్సు 15 సంవత్సరాలు. నా చిన్నతనంలో ఒకసారి మేము ఒక ఐస్ పార్లర్‍కు వెళ్ళినప్పుడు చిన్నపిల్లవాడినైన నేను అక్కడ కొత్తగా పెట్టిన రెండు గ్లాస్ డోర్స్ మధ్య నా చేయి పెట్టాను.  ఆ డోర్స్ చాలా పదునుగా ఉండటం వల్ల నా చేయి కట్ అయి నేను ఏడవటం మొదలుపెట్టాను. అక్కడ పనిచేస్తున్న ఒక అతను పరుగున వచ్చి నా చేతిని ఐస్ బాక్సులో పెట్టాడు. మా నాన్న చాలా కంగారు పడిపోయారు. ఆయన నా  చేతి వేళ్ళు ఉన్నాయో, లేవో అని  మనసులో బాబాను తలుచుకున్నారు. బాబాతండ్రి దయవల్ల నా ఐదు వేళ్ళు బాగున్నాయి. చిన్నవయసులో వేళ్ళు చాలా లేతగా ఉంటాయిఅ కదా! అలాంటి వాటిని బాబా మాత్రమే కాపాడగలరు. నేను ఇవాళ మీతో ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోగలుగుతున్నానంటే దానికి బాబానే కారణం. ఆయన ప్రసాదించిన చేతితోనే నేను ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. చాలా చాలా ధన్యవాదాలు బాబా.


2022, ఆగష్టు 30న నేను శ్రీసాయిబాబా జీవితచరిత్ర త్రిసప్తాహ పారాయణ పూర్తిచేసాను. ఆ పారాయణ జరుగుతున్న సమయంలో ఒకరోజు నేను ఆరోజు పారాయణ పూర్తిచేసి గదిలోకి వెళ్తుంటే హారతి పళ్లెం కనిపించింది. అప్పుడు నాకు, 'నేను సాంబ్రాణి వెలిగించాక అమ్మ ఆ సాంబ్రాణి పళ్లెం తీసుకెళ్లిందని, అందువల్ల నేను బాబాకి హారతి ఇవ్వలేద'ని గుర్తొచ్చింది. వెంటనే ఆ పళ్లెం తీసుకెళ్లి బాబాకి హారతి ఇచ్చాను. లేకుంటే హారతి ఇవ్వకపోవడం వల్ల ఆనాటి నా పారాయణ అసంపూర్ణంగా మిగిలిపోయేది. బాబాయే నా పారాయణకు భంగం కలగకుండా చూసారు. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని ఇదివరకే పంచుకోవాలి,  ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా".


2 comments:

  1. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయి రామ్ ఈ రోజు నేను చాలా సంతోషంగా వున్నాను కారణం మా అబ్బాయికి సన్మానం జరిగింది అది అంత బాబా దయతో జరిగిన ది.మా అబ్బాయి కూడా చాలా బాగా ప్రసంగం చెప్పాడు.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo