సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1334వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరుకుంటే నిరాశపరచరు బాబా
2. కాలువలో పడేసిన బంగారు హారాన్ని తిరిగి దొరికేలా అనుగ్రహించిన బాబా 
3. కోరుకున్నట్లు గొడవలు లేకుండా పెళ్లి జరిపించిన బాబా 

కోరుకుంటే నిరాశపరచరు బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య మా అబ్బాయికి కొడుకు పుట్టాడని నేను నా గత అనుభవంలో పంచుకున్నాను. మా మనవడు ప్రస్తుతం మా కోడలి కన్నవారి ఇంట్లో ఉన్నాడు. వాడు నా మొదటి మనవడు అయినందున వాడు అంటే నాకు చాలా ప్రేమ, వాడిని చూడకుండా నేను ఉండలేను. రోజూ రాత్రి వీడియో కాల్‍లో వాడిని చూశాకనే నేను నిద్రపోతాను. నా కొడుకు శని, ఆదివారాలు తన అత్తవారింటిలో ఉంటాడు. ఆ సమయంలో నేను ఉదయం కూడా వీడియో కాల్ చేసి మనవడితో ఫోన్‍లోనే ఆనందంగా కాస్త సమయం గడుపుతాను. ఈ విషయంగా నా కోడలు నా కొడుకుతో, "మీ అమ్మ మిమ్మల్ని, మీ తమ్ముడిని ఎంతగా ప్రేమిస్తుందో అంతకన్నా ఎక్కువ ప్రేమను మనవడి మీద చూపిస్తోంది. అది సంతోషమే అయినా, ఇలా ఉంటే ఇబ్బంది అవుతుంది" అని అంది. ఆ మాటలకి మా అబ్బాయికి చాలా కోపమొచ్చి తనపై కోప్పడ్డాడు. అదేమీ తెలియని నేను, 'అబ్బాయి ఆఫీసుకి వెళ్ళిపోతాడు, ఈలోగా మనవడిని చూద్దామ'ని మళ్ళీ వీడియో కాల్ చేస్తే మా అబ్బాయి, "అమ్మా! ఒకరోజు నీ కోడలు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, తన తమ్ముడికి కాల్ చేశావట. మరీ అంత ప్రేమ చూపిస్తే, ముందుముందు ఇబ్బంది అవుతుందేమోనని నీ కోడలు అంటోంది. అయినా నువ్వు తన తమ్ముడికి ఎందుకు ఫోన్ చేశావు?" అని కాస్త కోపంగా అన్నాడు. దాంతో నేను, "సరేలే, ఇప్పటినుండి కాల్ చేయను" అని ఫోన్ పెట్టేశాను. వెంటనే తను నాకు మళ్లీ వీడియో కాల్ చేశాడు. కానీ నేను వీడియో కాల్ లిఫ్ట్ చేయకుండా, నార్మల్ కాల్ చేసి, "నేను కూడా అలవాటు చేసుకోవాలి" అని అన్నాను. నా మాటలను లౌడ్‌స్పీకరులో తన భార్యకి వినిపించి, "మీవాళ్ళలాగానే కదా మా అమ్మావాళ్ళు. తను నిన్ను ఎంత మంచిగా చూసుకుంటుంది! అలాంటి అమ్మ నీ మాటల వలన బాధపడుతోంది" అని కాస్త కోపంగా తన ఆఫీసుకి వెళ్ళిపోయాడు. అయితే, మా అబ్బాయికి తన భార్య మీద నాకు కోపం ఉందని తెలుసు. అందుకే తన భార్య మీద కోపం పోవడానికి తను నాతో, "నువ్వు ఫోన్ చేస్తే, మేము కాల్ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతావు కదా, అలాగే 'నేను కూడా ఫోన్ ఎత్తకపోతే అత్తమ్మ టెన్షన్ పడుతుంద'ని నీ కోడలు నీ గురించే ఆలోచిస్తుంది" అని చెప్పి నాకు సంజాయిషీ ఇచ్చాడు. కానీ, తన మనసులో ఉన్న కోపం వల్ల తను తన భార్యకి ఫోన్ చేయలేదు. ఆమె కూడా తనకి ఫోన్ చేయలేదు. ఆ విషయం నాకు చెప్పినప్పుడు నేను బాబా ఫోటోకేసి చూస్తూ, "బాబా! వాళ్ళ మనసులో కోపాన్ని తొలగించి ఇద్దరూ మాట్లాడుకునేటట్లు చేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. శనివారం సాయంత్రానికల్లా వాళ్లిద్దరూ మాట్లాడుకోవాలి" అని అనుకున్నాను. విచిత్రం! సెప్టెంబర్ 6, మంగళవారం సాయంత్రం 6 గంటలకి మా కోడలు ఫోన్ చేసి, "ఇంట్లో అందరూ బాగున్నారా అత్తమ్మా?" అని అడిగి, "కిరణ్(మా అబ్బాయి) ఇప్పుడే కాల్ చేశాడు" అని చెప్పింది. నాకు చాలా సంతోషమేసింది. ఎప్పుడైనా నేను బాబాను ఏదైనా కోరుకుంటే, ఆ తండ్రి నన్ను నిరాశపరచరు. "ధన్యవాదాలు సాయీ. మా కుటుంబాన్ని, మా పిల్లల భవిష్యత్తుని చల్లగా చూడు సాయీ. మాది, మా పిల్లల దాంపత్య జీవితాలు చల్లగా చూడు సాయి". 


ఓం శ్రీ సాయీశ్వరాయనమః!!!


కాలువలో పడేసిన బంగారు హారాన్ని తిరిగి దొరికేలా అనుగ్రహించిన బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. మేము కొంతమంది భక్తులం ప్రతి గురువారం సాయంత్రం గుడిలో బాబా ఆరతి పాడి, భజన చేసుకుంటాం. మాలో ప్రసన్న అనే భక్తురాలు శ్రీవినాయకచవితినాడు వినాయకవ్రతం చేసుకుంది. ఆ సమయంలో ఆమె తన బంగారు లక్ష్మీహారాన్ని వినాయకుని విగ్రహానికి వేసి చక్కగా అలంకరించింది. సాయంత్రం ఆమె ఆ వినాయక విగ్రహాన్ని పెద్ద కాలువలో నిమజ్జనం చేయడానికి తన కుమారునికి ఇచ్చి పంపించింది. ఆ అబ్బాయి మరికొంతమంది స్నేహితులతో కలిసి వెళ్లి కాలువలో వినాయకుని నిమజ్జనం చేసి వచ్చాడు. అది సాయంత్రం 4.30కి జరిగింది. ఆ తరువాత సాయంత్రం 6.30 సమయంలో ఆమెకి వినాయకుడి మెడలో వేసిన బంగారు హారాన్ని తీసి జాగ్రత్తపరచలేదని గుర్తుకొచ్చింది. దాంతో ఆమె ఆ హారంతోనే వినాయకుడ్ని నిమజ్జనం చేసేశామని బాబా ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తరువాత ఆమె తన భర్తతో విషయం చెప్పి, "ఒకసారి కాలువకెళ్లి చూసి రండి" అని చెప్పింది. అతను ఆమెను తిట్టి, "అది ఎప్పుడో నీటిప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటుంది. అనుభవించు" అన్నాడు. కానీ ఆమె అతనిని బ్రతిమాలి పంపించింది. ఆమె ఇంట్లో బాబా ఫోటో వద్ద  కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంది. ఆశ్చర్యం! ఆమె భర్త కాలువ దగ్గరకి వెళ్లి చూస్తే, శ్రీవినాయకుని విగ్రహం అక్కడే పొదలో చిక్కుకుని కనిపించింది. వినాయకుని మెడలోని బంగారు హారం కూడా అలానే ఉంది. అతను ఆ హారాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. భార్యభర్తలిద్దరూ బాబాకు అనేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తరువాత ఆమె బాబా అనుగ్రహాన్ని మా భక్తులందరితో చెప్పి, "బాబా చేసిన మేలు నా జీవితాంతం మరువలేనిది. ఆయన నన్ను, నా కుటుంబాన్ని అనేకవిధాల కాపాడుతున్నారు" అని అంది. మేమందరమూ కూడా బాబా దయకు, ప్రేమకు ప్రణామాలు అర్పించుకున్నాము. "ధన్యవాదాలు బాబా!"


కోరుకున్నట్లు గొడవలు లేకుండా పెళ్లి జరిపించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి, సాయిభక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఏ పని చేసినా బాబా నామస్మరణ చేసుకుంటూనే చేస్తాను. బాబా ఎల్లప్పుడూ తోడుగా ఉండి నన్ను నడిపిస్తారు. నేను రోజూ ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతాను. వాటిని చదువుతుంటే బాబా నాతోనే ఉన్నట్లుంటుంది. ఆయన దయవల్ల నేను అనుకున్నవన్నీ జరిగాయి. నాకు పెళ్లి నిశ్చయమయ్యాక మా మావయ్యవాళ్ళు కన్యాదానం చేయాలని నేను ఆశపడ్డాను. ఎందుకంటే, నేను చిన్నప్పటినుండి వాళ్ళ దగ్గరే పెరిగాను. కానీ నా చిన్నప్పటినుండి మా నాన్నవాళ్ళకి, మావయ్యవాళ్ళకి మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలున్నాయి. అందువల్ల కన్యాదానం మావయ్యవాళ్ళని చేయమంటే గొడవ జరుగుతుందేమో అని నేను భయపడ్డాను. అప్పుడు, "బాబా! ఏ సమస్యా లేకుండా అంతా మంచిగా జరిగేలా చూడు తండ్రీ. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా నా పెళ్లి జరిగింది. నేను కోరుకున్నట్లే మావయ్యవాళ్ళు నాకు కన్యాదానం చేశారు. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి బాబా. నా ట్యూషన్లు బాగా జరిగేలా అనుగ్రహించు తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!



5 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo