సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1321వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రార్థనతో పొందిన బాబా అనుగ్రహం
2. పెద్ద సమస్య నుండి బయటపడేసిన బాబా

ప్రార్థనతో పొందిన బాబా అనుగ్రహం


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఈ బ్లాగుని ఇంత చక్కగా నిర్వహిస్తున్న మీకు ఆ సాయి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు లలిత. ఈ బ్లాగులో నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకసారి నేను మా కన్నవారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య, తమ్ముడు బయటకు వెళదామని బయలుదేరారు. అయితే వాళ్ళు ఎంత ప్రయత్నించినా బండి స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు నా మేనల్లుడు, "బండి స్టార్ట్ అయితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాడు. వెంటనే బండి స్టార్ట్ అయింది. అప్పుడు నా మేనల్లుడు తను బాబాకి చెప్పుకున్న విషయం నాతో చెప్పి, ఈ అనుభవాన్ని బ్లాగుకి పంపమని చెప్పాడు. "ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా".


ఇంకోసారి నేను నా కన్నవారి ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి నా పిల్లల కోసం ఏదైనా కొత్త రకం వంటకం చేసి పెట్టాలని అనుకుంది. అంతలోనే మావారు వచ్చి పిల్లల్ని మా అత్తవారింటికి తీసుకెళ్లిపోవాలనుకున్నారు. అప్పుడు మా చెల్లి, "బాబా! నేను పిల్లలకి ఏదో ఒక వంటకం చేసిపెట్టేంతవరకు బావగారు వాళ్ళని తీసుకెళ్ళకూడద"ని దణ్ణం పెట్టుకుంది. బాబా దయవల్ల తను ఆరోజు పిల్లలకి పావ్‌భాజీ చేసి పెట్టాక మర్నాడు మావారు పిల్లలని తీసుకుని వెళ్లారు. "ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".


ఒకసారి మా అమ్మకి విరేచనాలు అవుతుంటే నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! అమ్మకి విరోచనాలు తగ్గి తన ఆరోగ్యం బాగుంటే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. బాబా దయవలన అమ్మకి విరేచనాలు తగ్గాయి. అలాగే ఈమధ్య నా రెండు కళ్ళకి ఆపరేషన్ జరిగినప్పుడు, "బాబా! నా కళ్ళకి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవలన ఆపరేషన్ చక్కగా జరిగి నా కళ్ళు రెండు బాగా కనిపిస్తున్నాయి. "శతకోటి నమస్కారాలు సాయితండ్రీ".


కళ్ళ ఆపరేషన్ జరిగిన తరువాత ఒకసారి నా కంట్లో నలకపడి మూడు రోజులైనా ఆ నలక బయటికి రాక చాలా ఇబ్బందిపెట్టింది. అప్పుడు నేను సాయితండ్రికి దణ్ణం పెట్టుకుని, "బాబా! డాక్టర్ దగ్గరకి వెళ్ళకుండానే కంట్లో నలక బయటికి వచ్చేస్తే, మీ కృపను మీ బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. సాయి దయవలన తెల్లవారేసరికి నలక బయటికొచ్చేసి కన్ను నొప్పి తగ్గింది. "సాయీ! ప్రతి విషయంలోనూ నాకు ఎంతో సహాయం చేస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ పాదాలందు నాకు స్థిరమైన నమ్మకాన్ని ప్రసాదించండి. మీ అనుగ్రహాన్ని పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏమైనా అనుభవాలు పంచుకోవడం మరిచిపోయివుంటే నాకు గుర్తుచెయ్యండి సాయీ. నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


పెద్ద సమస్య నుండి బయటపడేసిన బాబా


నా పేరు రమాదేవి. సాతులూరు గ్రామం. నేను అంగన్ వాడి టీచర్ని. నేను శ్రీసాయిబాబా భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా కుమారుడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈమధ్య  తనకి తెలిసిన వాళ్ళు అత్యంత అవసరమై, "మేము చాలా సమస్యలో ఉన్నాము. మీ ఫ్రెండ్స్ వద్ద 25 లక్షల రూపాయల విలువైన మా కారు పెట్టుకుని 1,50,000 రూపాయలు మాకు ఇప్పించండి" అని బ్రతిమిలాడారు. మా బాబు సరేనని, తనకి తెలిసిన సురేంద్ర అనే అతని వద్ద వాళ్ళ కారు పెట్టి, 1,50,000 రూపాయలు వాళ్లకు ఇప్పించాడు. తరువాత ఒక నెల రోజులకు సురేంద్ర తన వద్ద తాకట్టు పెట్టిన ఆ కారును వేరే వాళ్ళ వద్ద తాకట్టు పెట్టి 3,20,000 రూపాయలు తీసుకున్నాడు. అ తరువాత కారు అసలు యజమాని తాము తీసుకున్న 1,50,000 రూపాయలు మా బాబుకి ఇచ్చి, "ఈ డబ్బులు అతనికిచ్చి, మా కారు మాకు ఇప్పించండి" అని అన్నారు. మా బాబు ఆ డబ్బు సురేంద్రకి ఇస్తే, అతను ఆ డబ్బులు తీసుకుని, "కారు జంగారెడ్డిగూడెంలో ఉంది, వస్తుంది" అని చెప్పారు. కానీ రెండు రోజులైనా కారు రాలేదు. మా బాబు ఆ సురేంద్రకి ఫోన్ చేసి, "నాకు చాలా సమస్యగా ఉంది, వాళ్ళ పోన్ నెంబర్ ఇవ్వండి" అని పోన్ నెంబర్ తీసుకుని జంగారెడ్డిగూడెం వాళ్ళకి పోన్ చేశాడు. వాళ్ళు, "సురేంద్ర మావద్ద 3,20,000 రూపాయలు తీసుకున్నాడు. అతను మాకు 1,50,000 రూపాయలే ఇచ్చాడు. మిగతా డబ్బులు ఇస్తేనే మీ కారు మీకు ఇస్తాము" అని చెప్పారు. సురేంద్రకి ఫోన్ చేస్తే, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అలా ఒక రోజు గడిచిపోయింది. మరుసటిరోజు నా కుమారుడు ఏదో ఒకటి చేద్దామని వెళ్తుంటే, "మనకెందుకు ఈ సమస్యలు?" అని నేను కేకలేశాను. అయితే ఆ కారు యజమాని కుటుంబం చాలా సమస్యలలో ఉన్నారు. వాళ్ల ఇంట్లో గొడవ పడుతున్నారు. అందువలన మేమే జంగారెడ్డిగూడెం వాళ్ళకి ఇవ్వాల్సిన మిగతా 1,70,000 రూపాయలు ఇచ్చేసి కారు విడిపించి వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకున్నాము. కానీ ఉన్నపళంగా అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలో అర్థంకాక, "బాబా! నా కుమారుడు సహాయం చేయడానికి పోయి ఆపదలో చిక్కుకున్నాడు తండ్రీ. చాలా కష్టమైన సమస్య తండ్రీ. మీరు మాత్రమే పరిష్కారం చూపించగలరు. ఎక్కడికి వెళ్తే ఈ సమస్య పరిష్కారమవుతుందో తెలియడం లేదు. మీ దయతో సమస్య ఈరోజు పరిష్కారమైతే వెంటనే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయిబాబాకి దణ్ణం పెట్టుకున్నాను. వెంటనే నాకు నా ఫ్రెండ్స్‌ని అడగాలనిపించింది. కానీ అడిగితే, వాళ్ళు ఏమనుకుంటారో అని భయమేసి బాబా ఎదురుగా కూర్చుని, "నా ఫ్రెండ్స్ వల్ల పని అవుతుందా?" అని బాబాను అడిగాను. నేను అలా ఏదైనా బాబాని అడిగినప్పుడు ఆ పని అవుతుందంటే నా ఎడమకన్ను అదురుతుంది, పని అవదంటే  కుడికన్ను అదురుతుంది. అలాగే నాకు ఏదైనా కష్టం రాబోతుందంటే నా కుడికన్ను అదురుతుంది. నేను వెంటనే, "తండ్రీ! ఏ ఆపద రాబోతుందో నాకు తెలియదు. మీరే నాకు తల్లి, తండ్రి, దైవం" అని వేడుకుంటాను. బాబా ఆ ఆపదను తప్పిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే,  'నా ఫ్రెండ్స్ వల్ల నా పని అవుతుంద'ని బాబా సమాధానం ఇచ్చారు. దాంతో నేను నా ఫ్రెండ్స్‌ని సహాయం అడిగాను. ఒక్కరోజులోనే వాళ్ళు నాకు 1,70,000 రూపాయలు ఫోన్-పే ద్వారా పంపి గొప్ప సహాయం చేశారు. "బాబా! అడిగినంతనే అనుగ్రహించిన మీకు వేలవేల కృతజ్ఞతలు. నా కుమార్తె, అల్లుడు 2022, డిసెంబర్లో అమెరికా వెళ్లాలనుకుంటున్నారు. అందుకు తగిన సహాయం చేయండి బాబా. నేను బేరానికి పెట్టిన 1.27 సెంట్ల భూమి మంచి ధరకు అమ్మడుపోవాలి. అలాగే నాకు గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టు ఇప్పించండి. ఇంకా నాకున్న మరికొన్ని సమస్యలకు మీరు మాత్రమే పరిష్కారం చూపగలరు. దయచేసి అనుగ్రహించండి. మా ఊరిలో మిమ్మల్ని ప్రతిష్ఠించేందుకు నాకు సహాయసహకారాలు అందించి, మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. మార్గదర్శకుడవు, సంరక్షకుడవు అయిన మీరే నాకు, నా కుటుంబానికి గమ్యం బాబా".


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo