సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1310వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో ఏదైనా సాధ్యం
2. చెడు వెనక మంచిని ప్రసాదించిన బాబా
3. బాబాను వేడుకున్నంతనే చెడు కలల నుండి విముక్తి - ప్రశాంతమైన నిద్ర

బాబా అనుగ్రహంతో ఏదైనా సాధ్యం


అనంతకోటి బ్రహ్మాండనాయకుని పాదపద్మములకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయితండ్రి లీలలు ఎన్నని చెప్పగలను? ఎందుకంటే, ఆయన లీలను చూపని రోజంటూ నా జీవితంలో లేదు. మేము మా బాబుతో మోపిదేవిలో నాగప్రతిష్ఠ చేయిద్దామని అనుకున్నాము. అందుకోసం ఒక తేదీ నిర్ధారించుకుని జూలై 14న 'ఫోన్ పే' ద్వారా డబ్బులు చెల్లించాము. వాళ్ళు వాట్సాప్‍లో బిల్లు పంపించారు. కానీ ఫోన్ ద్వారా తేదీ నిర్ధారించుకున్నందువల్ల నాకేదో భయంభయంగా అనిపిస్తుండటంతో ప్రతిరోజూ వాళ్ళకి ఫోన్ చేస్తుండేదాన్ని. నేను ఫోన్ చేసినప్పుడల్లా వేర్వేరు వ్యక్తులు మాట్లాడేవాళ్ళు. నేను వాళ్లతో మాట్లాడి డేట్ కన్ఫర్మ్ అనిపించుకుంటుండేదాన్ని. అయితే, కొన్ని అనివార్య కారణాలవల్ల మేము ఆగస్టు 14కి తేదీ పోస్ట్‌పోన్ చేయమని అడిగాం. వాళ్ళు అలాగేనని చెప్పారు కానీ, రిజిస్టరులో బాబు పేరు వ్రాయలేదు. ఆ విషయం మాకు తెలియదు. తీరా మేము అన్నీ సర్దుకుని 2022, ఆగస్టు 13న బయలుదేరే సమయానికి ముహూర్తం పెట్టిన పంతులుగారు ఫోన్ చేసి, "మీ బాబు పేరు రిజిస్టరులో లేదు. రూల్స్ ప్రకారం రిజిస్టరులో పేరు నమోదైన వాళ్ళకే పూజ చేయాలి. కాబట్టి మీరు మామూలుగా వచ్చి, స్వామి దర్శనం చేసుకుని వెళ్ళండి. అంతకుమించి చేసేదేమీ లేదు" అని అన్నారు. ఆఫీస్ వాళ్లకు ఫోన్ చేసి అడిగితే, "నేను సెలవు ముగించుకుని నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యాను. నాకు ఏమీ తెలియద"ని చెప్పారు. నాకు ఏమి చేయాలో అర్థంకాలేదు, కానీ మేము ఇంటినుండి బయలుదేరాము. దారిలో నా తండ్రి సాయినాథుని ఆలయానికి వెళ్లి, ఆయన్ని దర్శించి, "బాబా! మీ అనుగ్రహంతో విగ్రహప్రతిష్ఠ జరిగితే, ఆలస్యం చేయకుండా బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత దారిమధ్యలో నేను నా వాట్సాప్ చూస్తే, బిల్లుతో పాటు మా బాబు పేరు మీద తేదీ కన్ఫర్మ్ చేసినట్లు మెసేజ్ కనిపించింది. విగ్రహప్రతిష్ఠకు సంబంధించి మొదట వాళ్ళు పంపిన బిల్లు ఉన్నట్లు నాకు తెలుసుగాని, పోస్టుపోన్ చేసుకున్న తరువాత వాళ్ళు బిల్లు పంపినట్లు నాకు ఏ మాత్రమూ ఐడియా లేదు. అలాంటిది ఆ బిల్లు కనిపించేలా బాబానే చేశారు. నేను ఆ మెసేజ్ తీసుకెళ్లి అక్కడ చూపిస్తే విగ్రహప్రతిష్ఠకు అనుమతించారు. మామూలుగా అక్కడ రోజుకు రెండు విగ్రహప్రతిష్ఠలే చేస్తారు. అలాంటిది ఆరోజు మాది మూడోది. ఇదంతా బాబా అనుగ్రహం వల్లే సాధ్యమైంది. "ధన్యవాదాలు సాయితండ్రీ".


ఇకపోతే, ఇదివరకే బ్లాగులో పంచుకోవలసిన మరో రెండు అనుభవాలున్నాయి. వాటి విషయంలో నా ఆలస్యానికి మన్నించమని బాబాను వేడుకుంటూ అవి పంచుకుంటున్నాను. మూడు, నాలుగు నెలలపాటు మా షాపులు ఖాళీగా ఉండిపోయాయి. కోవిడ్ తర్వాత షాపులు ఖాళీ అవటం వల్ల మొదట్లో అందరూ చాలా తక్కువ అద్దెకు అడుగుతుండేవాళ్లు. తర్వాత అది కూడా లేకుండా పోయింది. మాకు చాలా దిగులుగా ఉండేది. చివరికి ఒకరోజు నేను, "బాబా! మీ దయతో మా షాపుల్లోకి అద్దెకు త్వరగా ఎవరైనా వస్తే, మీ బ్లాగులో నా అనుభవం పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ తండ్రి దయవల్ల మంచి అద్దెకు మా షాపులు ఫుల్ అయ్యాయి. "ధన్యవాదాలు బాబా. మీ లీలలు అనంతం".


మా బాబుకి చదువు పూర్తవుతూనే ఉద్యోగం వచ్చింది. కానీ తను అనుకున్న పోస్ట్ రాలేదు. బాబు తన చదువుకు తగిన ఉద్యోగం రాలేదని బాధపడుతుంటే మాకు కూడా చాలా బాధగా ఉండేది. నాకు ఏ అవసరం వచ్చినా బాబా దగ్గరకి వెళ్లి, ఆయనను ప్రార్థిస్తాను. అలాగే మా బాబు విషయంలో కూడా ప్రతిరోజూ బాబాని ప్రార్థిస్తుండేదాన్ని. బాబా దయవల్ల ఒక ఆరు నెలల తర్వాత కోరుకున్న పోస్టు బాబుకి వచ్చింది. "ధన్యవాదాలు తండ్రీ. బాబు ఆ ఉద్యోగంలో బాగా నేర్చుకుని, ఉన్నత స్థితిలో ఉండేలా చూడు తండ్రీ. అలాగే కొన్ని మ్రొక్కులు, సానుకూలమైన కోరికలు ఉన్నాయి. అవన్నీ సక్రమంగా జరిగేలా చూడు నాయనా".


ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!


చెడు వెనక మంచిని ప్రసాదించిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ ద్వారా ప్రతిరోజూ మేము సాయి భగవాన్ లీలలను ఆస్వాదిస్తున్నాము. నా పేరు చైతన్య. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మా బాబు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసిన తరువాత ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం చాలా యూనివర్సిటీల ఎంట్రన్స్ పరీక్షలు వ్రాశాడు. బాబా దయవల్ల అన్ని యూనివర్సిటీలలో తనకి సీట్ వచ్చింది. వాటిలో మేము చెన్నై యూనివర్సిటీకి సంబంధించిన ఒక కాలేజీని ఎంచుకున్నాము. కానీ తర్వాత వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా బాబు ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. అప్పుడు మేమందరము 'ఏంటి ఇలా జరిగింది?' అని చాలా బాధపడ్డాము. మా బాబు ప్రతిరోజూ, 'నా స్నేహితులందరూ మంచిగా పాస్ అయ్యారు. మరి నాకే ఎందుకిలా జరిగింది?' అని చాలా బాధపడుతుండేవాడు. నేను ధైర్యం తెచ్చుకుని బాబుతో, "జరిగిందేదో జరిగింది. ఏది జరిగినా మన మంచికే. నువ్వు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకో. సాయినాథులు ఉన్నారు. ఆయన మీద భారమేసి చక్కగా చదువుకో. నీకు మంచి మార్కులు వస్తాయి" అని ధైర్యం చెప్పాను. ఇంకా శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేయమని కూడా చెప్పాను. తరువాత నేను, "బాబా! మా బాబుకి ఫెయిల్ అయిన ఆ సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చి పాస్ అయ్యేలా చేయి తండ్రీ. నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా బాబు ఫెయిల్ అయిన సబ్జెక్టు మళ్ళీ వ్రాసి, అనుకున్న దానికంటే మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నేను ఆనందంతో, "థాంక్యూ సో మచ్ బాబా. ఏ సమస్యా లేకుండా బాబుకి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటును కూడా ప్రసాదించండి బాబా" అని బాబాను ప్రార్థించి భారమంతా ఆ తండ్రిపై వేసి, ఏది జరిగినా మన మంచికోసమే అనుకున్నాను. ఆయన దయవల్ల మా బాబుకి ఒక మంచి యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఆ కాలేజీలో చెన్నై యూనివర్సిటీలో కన్నా తక్కువ ఫీజు. పైగా అది మా బాబు కోరుకున్న కాలేజీ. చెడు వెనక మంచి జరగడమంటే ఇదేనేమో! ఏదైనా సమస్య వచ్చినప్పుడు 'సాయిబాబా'కి చెప్పుకుంటే, ఆయన మనకి ఏది మంచిదో, శ్రేయస్కరమో దాన్ని మనకు ప్రసాదిస్తారు. అప్పటివరకు మనం ఆయనయందు విశ్వాసంతో, సహనంతో ఉండాలి.  "థాంక్యూ బాబా. మా పిల్లలకు మంచిగా చదువుకునే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి బాబా. బాబుకి హాస్టల్ ఎలాట్మెంట్ చేయలేదు. మీ కృప, ఆశీర్వాదంతో తనకి హాస్టల్ ఎలాట్ చేయాలని కోరుకుంటున్నాను తండ్రీ. మేము ఎప్పుడూ మీ పాదపద్మాలను విడవకుండా గట్టిగా పట్టుకునే శక్తిని, ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేసే భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రీ".


బాబాను వేడుకున్నంతనే చెడు కలల నుండి విముక్తి - ప్రశాంతమైన నిద్ర


సాయిభక్తులందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనీరోజు మీతో పంచుకుందామనుకుంటున్నాను. నాకు నిద్రలేమి సమస్య ఉంది. దానితో నేను చాలా ఇబ్బందిపడుతున్నాను. ఆ సమస్య నుండి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఇలా ఉండగా 2022, ఆగస్టు 28 రాత్రి నేను నిద్రపోగానే విపరీతమైన చెడు కలలు రావడం మొదలైంది. దాంతో నిద్రలేచి మళ్ళీ పడుకుంటే మరల భయం గొలుపుతూ కలలు రాసాగాయి. అయినా నేను అలాగే నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటే నా శరీరాన్ని ఎవరో తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు అనుభూతి కలిగి అరవడానికి ప్రయత్నించాను. కానీ, నా గొంతు స్పందించలేదు. కళ్ళు తెరవడానికి చేతకాలేదు. నా తలను ఎవరో గట్టిగా నొక్కి పట్టుకున్నట్లు అనిపించింది. విపరీతమైన భయంతో నా శరీరం నా అధీనంలో లేకుండా పోయింది. అట్టి స్థితిలో నేను, "బాబా! నన్ను ఈ స్థితి నుండి విముక్తురాలిని చేయండి" అని బాబాను వేడుకున్నాను. మరుక్షణమే నేను ఆ స్థితినుండి బంధవిముక్తురాలినై అరుస్తూ నిద్రలేచాను. ఈ కాలంలో ఇదంతా ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా నాకు అత్యంత భయాన్ని కలిగించిన అనుభవమిది. ఎంతలా అంటే, మరుసటిరోజు నిద్రపోవాలంటే నాకు భయం వేసింది. అప్పుడు నేను బాబా ఊదీ పెట్టుకుని సచ్చరిత్రలోని బాబా ఒక భక్తుని నిద్రలేమి రోగాన్ని పారద్రోలి చక్కని నిద్రను ప్రసాదించిన లీలను చదివి, "బాబా! మళ్ళీ నాకు అలాంటి అనుభవం అవకుండా ఉంటే, 'సాయి మహరాజ్ సన్నిధి'లో నా అనుభవం పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ రాత్రి మామూలుగానే నిద్రపోయాను. ఎలాంటి చెడు కలలు రాలేదు. "థాంక్యూ సో మచ్ బాబా".


3 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better and better Jaisairam

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo