సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1336వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అనుకోకుండా శిరిడీకి బాబా పిలుపు
2. ప్రార్థనతో సమస్యలను తొలగించిన బాబా
3. ఇంటి డాక్యుమెంట్లు దొరికేలా అనుగ్రహించిన బాబా

అనుకోకుండా శిరిడీకి బాబా పిలుపు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు అనుకోకుండా జరిగిన మా శిరిడీ యాత్ర గురించి పంచుకోబోతున్నాను. మేము 2022, ఫిబ్రవరిలో మా పెళ్లి రోజున శిరిడీ వెళ్లి సాయిని దర్శించుకున్నాము. తరువాత మళ్ళీ అక్టోబర్‌లో మా కుటుంబమంతా ఒక 10 మందిమి శిరిడీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నాము. అయితే ఆ లోపలే బాబా తమ దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. అదెలా అంటే, గతంలో నా ఫ్రెండ్ ఒకరు, 'మా ఊర్లో ఒకతను కొంతమందిని పోగు చేసి శిరిడీ తీసుకెళ్ళి, ఒక వారం రోజులు అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపిస్తార'ని చెప్పారు. అప్పట్లో వాళ్ళు ఒకసారి వెళ్ళారు కూడా. ఆ తరువాత కోవిడ్ కారణంగా వాళ్ళు అలాంటి ట్రిప్‌లు మానేశారు. మేము కూడా ఇల్లు మారడం వల్ల మా ఫ్రెండ్‌తో రెగ్యులర్‌గా మాట్లాడలేదు. సుమారు ఒక 6 నెలల తరువాత ఈమధ్య నేను ఊరికే ఆ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే, మాటల్లో తను, "మేము సెప్టెంబర్ 7వ తేదీన శిరిడీ వెళ్తున్నాం" అని చెప్పారు. నేను సరదాగా, "అయ్యో! నాకు చెప్పలేదే, నేనూ వచ్చేదాన్నిగా" అని అంటే, తను కూడా సరదాగా, "ఇప్పుడు మాత్రం ఏమైంది, వచ్చేయండి" అని అన్నారు. కానీ నాకు 6వ తేదీకి నెలసరి సమయం. అది ఒకవేళ ముందుగా వస్తే, ఆలోచిద్దాంలే అనుకున్నాను. అయితే, ఆ మర్నాడే నాకు నెలసరి వచ్చింది. దాంతో నాకు, 'బాబా నన్ను శిరిడీకి పిలుస్తున్నారు' అనిపించింది. కానీ ఇంట్లో మా అత్తగారు ఉన్నారు. మామూలుగా అయితే ఆవిడ పని చేసుకోగలిగేవారే కానీ, ఈ మధ్య ఆవిడ ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. అందువలన నేను శిరిడీ వెళ్లి, వచ్చేవరకు పగటిపూట మా అత్తగారికి తోడుగా ఉండమని పనిమనిషిని అడిగితే, ఆమె సరేనంది. వెంటనే నేను టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. అదృష్టం కొద్దీ అతి తక్కువ వ్యవధిలో టిక్కెట్లు, హారతి మొదలైనవన్నీ బుక్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతలో ఊరికి వెళ్ళిపోతుందనుకున్న మా అమ్మాయి కూడా ప్రయాణం వాయిదా వేసుకుంది. కాబట్టి మా అత్తగారికి తోడుగా పనిమనిషి ఉండకపోయినా ఇక పర్లేదు. ఇక ఏ అడ్డంకి లేకుండా నా ప్రయాణం మొదలైంది. రైల్వేస్టేషన్‌లో కూర్చుని ఈ అనుభవం పంచుకుంటున్నాను. బాబా దయతో ఈ వారం ట్రిప్ అంతా బాగా జరగాలని,  ప్రతిరోజూ బాబా దర్శనాలు అవ్వాలని, అన్ని ప్రదేశాలు చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా బాబా దీవించాలని ఆశిస్తూ... సెలవు తీసుకుంటున్నాను.


ప్రార్థనతో సమస్యలను తొలగించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా సాయితండ్రికి అనేక నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి బృందానికి బాబా తండ్రి ఎల్లవేళలా శుభాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. నేను ఇంతకముందు ఒకసారి నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను అనేక సమస్యలతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకసారి పొట్ట ఉబ్బరం, చెమటలు పెట్టడం, ముఖ్యంగా ఆహారం తీసుకోలేక అవస్థ పడటం వంటి సమస్యలతో నేను తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదురుకున్నాను. 2022, ఆగస్టు 18, గురువారంనాడు నేను మహాపారాయణ ముగించుకుని విజయవాడలోని ఆసుపత్రికి వెళితే, అక్కడ అన్ని పరీక్షలు చేసారు. నేను నిరంతరాయంగా 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని మననం చేస్తూ ఉండగా సాయంత్రానికి రిపోర్టులు వచ్చాయి. డాక్టరు, "ఎక్కడా ఏ లోపం లేదు" అని చెప్పారు. వెంటనే నేను సాయితండ్రికి మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను. తరువాత మా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణంలో అడుగడుగునా సాయితండ్రి ఫోటో రూపంలో దర్శనం ఇచ్చారు


హైదరాబాద్‌లో ఉన్న మా పెద్దబ్బాయి ఒకరోజు రాత్రి 10.30 గంటలకి తప్పనిసరై ద్విచక్ర వాహనంపై దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. నేను చాలా ఆందోళనకి గురై, "బాబా! పిల్లవాడు క్షేమంగా గమ్యం చేరుకుంటే, మీ అనుగ్రహాన్ని తోటి సాయి బంధువులతో పంచుకుంటాను" అని బాబాకి విన్నవించుకున్నాను. బాబా దయవల్ల పిల్లవాడు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా ఇల్లు చేరాడు. అలాగే మా చిన్నబ్బాయి ఉన్న ఉద్యోగం వదులుకుని ఇంటి వద్ద ఖాళీగా ఉంటే నేను బాబా తండ్రిని వేడుకున్నాను. ఆ తండ్రి దయవలన అనతి కాలంలోనే పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది. "ధన్యవాదాలు సాయితండ్రి. మీకు శతకోటి వందనాలు. నేను మరో కోరికను మీ ముందు ఉంచాను తండ్రి. దాన్ని అనుగ్రహించినంతనే నా అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకుంటాను తండ్రి".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


ఇంటి డాక్యుమెంట్లు దొరికేలా అనుగ్రహించిన బాబా


సాయి బందువులందరికీ నమస్కారం. సదా వెన్నంటి ఉండి మనల్ని నడిపే బాబా పాదపద్మాలకు శిరసా ప్రణామాలు. నా పేరు గంగాభవాని. మాది వైజాగ్. నేను చిన్నప్పటి నుంచి సాయి భక్తురాలిని. బాబా నా జీవితంలో అడుగడుగునా తోడుగా ఉండి ముందుకి నడిపి ఈ రోజున నన్ను ఉన్నత స్థానంలో ఉంచారు. ఆయన ప్రేమకు సృష్టిలో మరేదీ సాటిలేదు. ఆయన పాదాలందు నమ్మకం ఉంచడమే మనం చేయాల్సింది. ఇక నా అనుభవానికి వస్తే... ఈ మధ్య మేము లోన్‌కి అప్లై చేద్దామనుకుంటే మా ఇంటి డాక్యుమెంట్లు కనపడలేదు. ఎంత వెతికినా అవి  దొరకలేదు. వాటిని ఎక్కడ పెట్టానో నాకు అస్సలు గుర్తులేదు. అప్పటికే లోన్ పెట్టడానికి నాలుగు నెలలు ఆలస్యమైనందున చివరి ప్రయత్నంగా, "డాక్యుమెంట్లు దొరికితే, కోవా నివేదిస్తాను" అని బాబాకి దణ్ణం పెట్టుకుని మరోసారి వెతికాను. గిల్లి, బుజ్జగించడం ఆయనకు అలవాటే, కాస్త ఏడిపించాక చేతిలో బెల్లం పెడతారు. అప్పుడే బెల్లం విలువ మనకి తెలుస్తుంది కదా! ఏదేమైనా మన అశ్రద్దకి బాబా బాధ్యత వహిస్తారు. ఆయన దయవల్ల అరగంటలో ముందు వెతికిన చోటే ఆ డాక్యుమెంట్లు దొరికాయి. "ధన్యవాదాలు బాబా. మీరు ఉండబోయే ఇల్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా, తొందరలోనే మనం ఆ ఇంటికి వెళ్లి, అక్కడ ప్రతిరోజూ కబుర్లు చెప్పుకునేలా, అలాగే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. సదా మీ చరణాలకు నా నమస్కారాలు బాబా".


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo