1. ఇంటా బయటా మనల్ని కాపాడే సాయిబాబా
2. జ్వరం నుండి పూర్తిగా ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
ఇంటా బయటా మనల్ని కాపాడే సాయిబాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ శిరిడీ సాయిబాబా చరణాలకు శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగును నడుపుతూ ప్రతిదినం సాయిమహిమలను స్మరించుకుని, మా భక్తిని దృఢపరచుకొనేలా సహాయపడుతున్న సాయికి, బ్లాగుని అనుదినం చదువుతూ బాబాని భక్తితో తమ హృదయం నుండి దర్శిస్తూ, మానసికంగా పూజిస్తున్న భక్తులందరికీ నమస్కారం. “బాబా! ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాల ద్వారా మీరు పరోక్షంగా మా సమస్యలకు కూడా పరిష్కారం సూచిస్తున్నారు తండ్రీ! సర్వవేళ సర్వావస్థలయందు నిన్ను మరచిపోకుండా సతతం మా హృదయంలో నిలుపుకొని స్మరించే అదృష్టాన్ని మాకు కలుగజేయి తండ్రీ!”
ఇంటా బయటా సాయిబాబా మనలను కాపాడుతుంటారనడంలో సందేహమే లేదు. నా పేరు శ్రీదేవి. నేను విశాఖపట్నం నివాసిని. కొన్ని వారాల క్రితం ఒక ఆదివారం ఉదయం మా కిచెన్ ప్లాట్‌ఫాం మొత్తం శుభ్రపరిచాక నేను, మా పనమ్మాయి గ్యాస్ వాసన రావడం గమనించాము. కానీ అది ఎలా, ఎక్కడనుండి వస్తోందో అర్థంకాలేదు. దాంతో, ‘ఇది మన ఇంట్లో కాదు, వేరే ఎవరింట్లోనో గ్యాస్ సిలెండర్ ఆఫ్ చేయడం మర్చిపోయుంటార’ని అనుకున్నాము. తరువాత నేను స్నానం చేసి ప్రక్కనే ఉన్న పూజామందిరంలో దీపాలు కూడా వెలిగించాను. నా రోజువారీ ప్రార్థన, పనులు అయ్యాక టిఫిన్ చేద్దామని స్టవ్ వెలిగించాను. ముందువైపున్న బర్నర్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టాను. వెనుకవైపునున్న బర్నర్ పైన మావారికి దోశ వేద్దామని పెనం పెట్టాను. సాధారణంగా పెనం వేడెక్కేలోపు ఇంకో చిన్న పనేదైనా పూర్తి చేస్తాను. కానీ, ఆరోజు ఎందుకో అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి స్టవ్ వెనకవున్న గోడకున్న టైల్స్‌లో నాకు ఎర్రని మంట తాలూకు ప్రతిబింబం కనబడింది. “ఇదేంటి? సాధారణంగా గ్యాస్ బ్లూ మంట కదా వస్తుంది” అనుకుంటూ, అనాలోచితంగా గ్యాస్ బర్నర్ ఆఫ్ చేసి పెనం ప్రక్కకి జరిపి చూద్దును కదా.. ఆ వెనుకగా ఉన్న గ్యాస్ గొట్టానికి అరంగుళమేర కన్నం పడి దాంట్లోంచి మంట రావటం కనిపించింది. అది చూసి టెన్షన్‌తో నా గుండె వేగం పెరిగిపోయింది. అంత టెన్షన్‌లో కూడా సడన్‌గా ‘సిలెండర్‌కి ఉన్న రెగ్యులేటర్ ఆఫ్ చేయమ’నే ప్రేరణ కలిగి వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేశాను. నాకు ఆ ఆలోచన వచ్చేలా చేసింది బాబానే. సందేహమే లేదు. మరొక్క 5 నిమిషాలు నేనది గమనించకుండా ఉంటే మంట సిలెండరుకి వ్యాపించి పెద్ద ప్రమాదం జరిగేది. ఆ బాబా తండ్రి దయ చూడండి. ప్రతీరోజూ అత్యంత బిజీగా 6.45 కల్లా వంటపని, ఇంటిపనులు పూర్తి చేసుకుని ఉద్యోగానికి ప్రయాణమయ్యే నేను.. నిజంగా ఈ సంఘటన వర్కింగ్ డేస్‌లో జరిగితే గమనించగల స్థితిలో ఉండను. పెనుప్రమాదాన్ని తప్పించడానికే ఈ సంఘటన ఆదివారంనాడు జరిగేలా చేసి, ఆ మంట నా దృష్టిలో పడి ప్రమాదం జరుగకుండా బాబా రక్షించారు. మనం పడవలసిన బాధని చిన్నగా మార్చి మనలను రక్షించే బాబాకి ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలము? “బాబా తండ్రీ! సర్వవేళల్లో ఈ రకంగా మమ్ము రక్షించు తండ్రీ!”
కొద్దిరోజుల క్రితం ఒక శుక్రవారంనాడు.. ఇటు పూజ, అటు ఉద్యోగానికి వెళ్ళే హడావిడిలో ఇంట్లో త్వరత్వరగా పనులు చేసుకుంటూ తిరిగే క్రమంలో క్రింద టైల్స్‌పై ఉన్న నీళ్ళు చూసుకోకుండా జారిపడ్డాను. కుడిమోకాలిపై బలం పూర్తిగా ఆనేలా క్రిందపడ్డాను. మామూలుగా అయితే అది పెద్ద ప్రమాదమే. కానీ, ఆ బాబా మనలను అలా కష్టానికి వదలరుగా! కేవలం ఆయన చేసిన మిరాకిల్. అంతలా జారిపడిన నాకు కనీసం పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ కూడా వాడకుండా పెయిన్ బామ్ తోనే నొప్పి పోయే చిన్న దెబ్బ తగిలేలా చేసి నన్ను తన రక్షణలో ఉంచి కాపాడిన బాబాకి ఏ విధంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి? స్కూలుకి వెళ్ళాక మా కొలీగ్ చెప్పారు.. నేను జారిపడిన విధంగానే జారిపడిన వారి ఎదురింటామెకి ఫ్రాక్చర్ అయి సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడిందట. ఇప్పుడు చెప్పండి.. పెద్దవిగా రావాల్సిన కర్మఫలాలను చిన్నవిగా చేసి మనలను అనుక్షణం కాపాడి ఒడ్డున పడేసే మన బాబా ఉండగా మనకెందుకు భయం? ఆయనకి ఏం చేసి ఋణం తీర్చుకోగలము? “సదా నిన్ను మా మనస్సులలో నిలుపుకొని స్మరించడం తప్ప మేమేం చేయగలం బాబా తండ్రీ?”.
ఈమధ్యన ఒకరోజు నాకు సంబంధించిన టీచింగ్ నోట్స్, లెసన్ ప్లాన్స్ వ్రాద్దామని పుస్తకాలు ఇంటికి తీసుకొనివచ్చి, వాటిని తిరిగి స్కూలుకి తీసుకెళ్ళడం మర్చిపోయాను. స్కూల్లోకి అడుగుపెట్టగానే, “ఈరోజు డి.ఇ.ఓ గారు గానీ, కలెక్టర్ గారు గానీ రావచ్చు, అందరూ అలెర్ట్ గా ఉండండి” అని మా హెచ్.ఎం గారు చెప్పారు. దాంతో నాకు టెన్షన్ మొదలైంది. “బాబా, వాళ్ళు ఈరోజు మాత్రం మా స్కూల్‌ని విజిట్ చేయకుండా చూడు తండ్రీ” అని పదేపదే బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్టే బాబా అనుగ్రహంతో వాళ్ళెవరూ స్కూలుకి రాలేదు. ఇది చిన్న విషయమని అనిపించవచ్చు. కానీ చిన్న విషయాలకి, చిన్న టెన్షన్స్‌కి కూడా బాబానే సర్వం అనుకుని బాబానే ప్రార్థించే అంకితభక్తి మనకు ఉండడం - ‘మనం బాబా బిడ్డలం’ అనడానికి నిదర్శనం.
“ధన్యవాదాలు బాబా! నేనూ, నా భర్తా కూడా ఉద్యోగరీత్యా దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నాము. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేస్తున్న మమ్మల్ని అనుకూలమైన ప్రాంతాలకు బదిలీచేసి మీ అనుగ్రహం మాపై ప్రసరింపజేయండి బాబా. అనుక్షణం మా ప్రయాణంలో మమ్మల్ని రక్షించే బాధ్యత పూర్తిగా నీదే బాబా తండ్రీ. నీ రక్షణలో మమ్ము ఉంచి కాపాడు బాబా! మా పాప తన చదువు చక్కగా పూర్తిచేసి జీవితంలో చక్కగా సెటిలయ్యేలా అనుగ్రహించు తండ్రీ! నీ భక్తులమైన మాకు అనుకూలమైన, బుద్ధిమంతుడైన, యోగ్యుడైన అల్లుడిని ప్రసాదించి మమ్మనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రీ! మా లోన్ శాంక్షన్ అయి, మా ఇంటిపనులు సకాలంలో సక్రమంగా పూర్తయ్యి, గృహప్రవేశం చక్కగా జరిగి, మా ‘ద్వారకామాయి’లో మేము నివసించేలా చెయ్యి బాబా తండ్రీ! ‘ద్వారకామాయి’లో సదా మమ్ము కాపాడుతూ కొలువుండు బాబా. ఈ పనులన్నీ చక్కగా పూర్తయ్యి, ఆ అనుభవాన్ని నా సాటి భక్తులతో బ్లాగులో పంచుకునేలా చెయ్యి బాబా!”
ఓం శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక సమర్థ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!
జ్వరం నుండి పూర్తిగా ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
నేను ఒక బాబా భక్తురాలిని. బాబా అంటే ప్రేమ, స్నేహం, నమ్మకం. ఆయన పిలిస్తే పలికే దైవం. ఆయనే నాకు తల్లి, తండ్రి. ఆయనతో నాకున్న అనుబంధం చాలా సంవత్సరాల నాటిది. ఆయనకి దగ్గర అవడం అంటే ఎన్నో జన్మల పుణ్యం. ఎన్నోసార్లు ఎన్నో కష్టాల్లో బాబా నన్ను ఆదుకుని నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. ఒకసారి మా బాబుకు జ్వరం వచ్చి నిద్రలో వాడికి స్పృహ లేకుండా పోయింది. అప్పుడే హఠాత్తుగా నాకు ఎందుకో మెలకువ వచ్చింది. మేము వెంటనే బాబుని హాస్పిటల్‍కి తీసుకెళ్లాము. జ్వరం తగ్గింది కానీ, మళ్ళీ వస్తుందేమోనని భయపడ్డాను. నేను భయపడినట్లే బాబుకు మళ్ళీ జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నా బిడ్డకు ఏమీ కాకూడదు. తనకి జ్వరం తగ్గాలి" అని బాబాను వేడుకున్నాను. ఆ తండ్రి దయవల్ల బాబుకి జ్వరం తగ్గి మళ్ళీ రాలేదు. "ధన్యవాదాలు బాబా. నా జీవితంలో మీరు ఇచ్చినవి వెలకట్టలేనివి తండ్రి".
Om Sairam
ReplyDeleteSai always be with me
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ మొదటి సాయి అనుగ్రహం లో సారే రక్షించారు.సాయి ఆశీస్సులు వుంటే మన జీవితంలో అన్ని ఆనందాలే.ఆ బాబా దయతో మనం కోలివుడ్ నుండి బయటపడడానికి సహాయం చేశారు.మనం సురక్షితంగా వున్నాము.బాబా నువ్వు సకల దేవతా స్వరూపానివి.
ReplyDelete