సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1315వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహ జల్లులు
2. బాబా కృప

బాబా అనుగ్రహ జల్లులు

ఓం శ్రీసాయి పరమాత్మనే నమః!!! సాయిబంధువులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. బాబాకి మాటిచ్చినట్లు ఆయన నాకు అనుగ్రహించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. ముందుగా, కొంచెం ఆలస్యమైనందుకు బాబాను క్షమించమని కోరుకుంటున్నాను.

2022, ఫిబ్రవరిలో మా పనమ్మాయి మానేసింది. తర్వాత కొత్త పనిమనిషి కోసం చాలా ప్రయత్నాలు చేశాం. కానీ, దొరకలేదు. చివరికి నేను, "బాబా! మంచి పనిమనిషి దొరికితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల జూలైలో ఒక మంచి పనమ్మాయి దొరికింది. కాదు..కాదు, తనకి తానుగా వచ్చి పనిచేస్తానని అడిగింది. తన తల్లిదండ్రులు మా చిన్నప్పుడు మా ఇంట్లో పనిచేశారు. కాబట్టి తను మాకు బాగా తెలిసిన అమ్మాయే. పని చాలా బాగా చేస్తుంది. "థాంక్యూ సో మచ్ బాబా".

ఒకసారి నేను ఆన్లైన్‌లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాను. వాటిలో అన్నీ వచ్చాయిగానీ, ఒక 3 వస్తువులు రాలేదు. వాళ్ళు డెలివరీ అయినట్లు ఇన్వాయిస్ కూడా ఇచ్చారు. అది చాలా పేరున్న షాపింగ్ సైట్. ఇదివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. కానీ నేను ముందే అన్ని వస్తువులకు డబ్బులు చెల్లించినందువల్ల ఆ డబ్బులు తిరిగి వస్తాయో, లేదో అని నాకు కొంచెం టెన్షన్ అనిపించి, "బాబా! ఆ వస్తువుల డబ్బులు నాకు తిరిగి వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఒక వారం రోజుల్లో డబ్బులు వెనక్కి వచ్చేశాయి. "థాంక్యూ సో మచ్ బాబా".

2022, జూలై 21న హఠాత్తుగా నా మేనల్లుడికి జ్వరం వచ్చి రాత్రి అయ్యేసరికి 104 డిగ్రీల జ్వరం ఉంది. జ్వరం తగ్గటానికి మందు వేసినా జ్వరం తగ్గలేదు. దాంతో మాకు చాలా భయమేసింది. నేను, "బాబా! బాబుకి త్వరగా తగ్గిపోతే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. మర్నాడు హాస్పిటల్‌కి వెళ్తే, మేము వేసిన మందు డోస్ చంటిపిల్లలకు వేస్తారని, అది మా మేనల్లుడి వయసుకి సరిపోదని, అందుకే జ్వరం తగ్గలేదని డాక్టర్ చెప్పి, వేరే మందు ఇచ్చారు. అది వాడితే రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. వాడు ఎప్పుడూ బాగుండేలా చూడు బాబా".

2021లో మా మరదలి పొలంలో బోర్ వేయాలని చూస్తే, చాలా అడ్డంకులు వచ్చాయి. బోర్ వేస్తే ఎక్కువ కౌలు ఇవ్వాల్సి వస్తుందని ఆ పొలం కౌలుకి చేసే రైతు బోర్ వేయకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అదీకాక కరోనా పరిస్థితులు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా కారణాల వల్ల బోర్ వేయడం ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి ఈమధ్య నేను, "బాబా! మీ దయతో బోర్ పని త్వరగా పూర్తయితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొద్దిరోజుల క్రితమే ఆ పని పూర్తి అయింది. "థాంక్యూ సో మచ్ బాబా. ఇంతకుముందు ఆ పొలం చేసిన రైతు వేరే ఎవర్నీ కౌలుకి పొలం తీసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎవరు పొలం చేయటానికి వచ్చినా ఏదో చెప్పి వాళ్ళని పంపేస్తున్నాడు. ఆ సమస్య కూడా తీరిపోతే మళ్ళీ మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను".

ఇప్పుడు ఇంకొక బాబా అనుగ్రహాన్ని పంచుకుంటాను. ఇది బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకోకపోయినా, మీ అందరితో పంచుకోవాలనిపించి చెప్తున్నాను. ఇది జరిగి కొన్ని నెలలు అయింది. నేను శ్రీసాయిలీలామృతం పారాయణ గ్రూపులో జాయిన్ అయి, ఆ గ్రూపు నియమం ప్రకారం ప్రతి శుక్రవారం ఒక అధ్యాయం చదువుతున్నాను. మొదట్లో నా దగ్గర ఆ పుస్తకం లేక, అది ఎలా దొరుకుతుందో కూడా తెలియక పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చదివి రిపోర్ట్ చేస్తుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రూపువాళ్ళు 'శ్రీసాయిలీలామృతం పుస్తకం కావాలంటే సంప్రదించండి' అని ఒక నెంబర్ ఇచ్చారు. నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాను. నాలుగు రోజుల్లో పుస్తకం వచ్చేసింది. అయితే అప్పటికి నేను పిడిఎఫ్ లో సగం అధ్యాయాలు చదివి ఉన్నందువల్ల మళ్ళీ మొదటి అధ్యాయం వచ్చినపుడు పుస్తకంలో చదవడం మొదలుపెడదామని ఆ పుస్తకం పక్కన పెట్టేశాను. మా అమ్మ ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టినపుడు ఉపయోగపడుతుందని (బుక్‌మార్క్ లాగా) దత్తదేవుని ఫోటో ఒకటి పుస్తకంలో పెట్టింది. అది ఏ పేజీలో అన్నది ఆమె గమనించలేదు. తర్వాత శుక్రవారంనాడు పారాయణ చేద్దామని పిడిఎఫ్ ఓపెన్ చేయబోతే, ఎంతకీ ఓపెన్ కాలేదు. చాలాసేపు ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. డ్రైవ్ నుండి డౌన్లోడ్ చేద్దామన్నా కూడా అవలేదు. దాంతో 'పుస్తకం చదవడం మొదలుపెట్టమ'ని బాబా చెప్తున్నారనిపించి పుస్తకం తెరిచాను. అమ్మ దత్తదేవుని ఫోటో పెట్టిన పేజీ తెరుచుకుంది. ఆ పేజీ చూడగానే నేను ఎంత షాకయ్యానో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే, ఆ పేజీలో ఆరోజు నేను చదవాల్సిన 16వ అధ్యాయం ఉంది. అమ్మ ఏదో యథాలాపంగా పెట్టినా, సరిగ్గా నేను చదవాల్సిన అధ్యాయమే ఆ పేజీలో ఉందంటే, బాబా ఇదంతా ఎంత అందంగా నడిపారో చూడండి. ఇలాంటి లీలలు మన అందరికీ సర్వసాధారణమే అయినా బాబా అనుగ్రహానికి మనం పరవశించకుండా ఉండలేము. అప్పటినుంచి నేను పుస్తకంలో చూసి పారాయణ చేస్తున్నాను, ప్రత్యేకమైన రోజుల్లో తప్ప. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మీ లీలలను పంచుకుంటూ సంతోషంగా జీవించేలా అనుగ్రహించు బాబా. ప్రస్తుతం నేను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎలాంటి స్థితిలో ఉన్నానో మీకు మాత్రమే తెలుసు బాబా. నాకు ఏం జరిగినా అది మీ కృపతోనే జరుగుతుందని నా సంపూర్ణ విశ్వాసం. మరి ఇలాంటివెందుకు జరుగుతున్నాయి? మీరు ఇచ్చే సందేశాలు చూస్తుంటే, ఆశ కలుగుతుంది. కానీ జరిగేవి చాలా గందరగోళంగా ఉంటున్నాయి. ఏదేమైనా ఒక్కటి మాత్రం చెప్పగలను బాబా, 'నువ్వు ఏం చేసినా అది నా మంచికే' అని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడు తండ్రీ. నేను ఎలాంటి స్థితిలో ఉన్నా నీ చేయి వదలకుండా చూడు బాబా, ప్లీజ్!"

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
శుభం భవతు!!!

బాబా కృప

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

నా పేరు రాఘవ. నేను విజయవాడ నివాసిని. నేను నా చిన్ననాటినుంచి బాబా భక్తుడిని. నాకు ప్రత్యేకమైన అనుభవాలంటూ ఏమీ లేకున్నా, బాబా నాకు అన్నీ సమకూర్చారు. ఈమధ్యకాలంలో బాబా రెండుసార్లు నన్ను అనుగ్రహించారు. వాటినే నేనిప్పుడు మీతో పంచుకుంటాను. కోవిడ్ వచ్చిన తర్వాత నాకు ఒకరోజు పంటినొప్పి వచ్చి చాలా బాధపడ్డాను. నేను ఆ బాధను తట్టుకోలేక భయంతో ఆరోజు బాబా స్మరణ చేస్తూ, 'నాకు నొప్పి తగ్గితే, బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి ఆ నొప్పి తగ్గింది.

కొద్దిరోజుల క్రితం ఆఫీసులో ఒక విషయంగా నాకు, మా అధికారులతో కొద్దిగా ఇబ్బంది అయింది. అప్పుడు నేను, "వాళ్ళు నన్ను ఏమీ అనకుండా చూడండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా కృపతో నాకు, మా అధికారులకి ఇబ్బంది లేకుండా ఆ సమస్యను తొలగించారు. "ధన్యవాదాలు బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam

    ReplyDelete
  3. ప్రస్తుతం నేను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎలాంటి స్థితిలో ఉన్నానో మీకు మాత్రమే తెలుసు బాబా. నాకు ఏం జరిగినా అది మీ కృపతోనే జరుగుతుందని నా సంపూర్ణ విశ్వాసం. మరి ఇలాంటివెందుకు జరుగుతున్నాయి? మీరు ఇచ్చే సందేశాలు చూస్తుంటే, ఆశ కలుగుతుంది. కానీ జరిగేవి చాలా గందరగోళంగా ఉంటున్నాయి. ఏదేమైనా ఒక్కటి మాత్రం చెప్పగలను బాబా, 'నువ్వు ఏం చేసినా అది నామంచికే' అని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడు తండ్రీ. నేను ఎలాంటి స్థితిలో ఉన్నా నీ చేయి వదలకుండా చూడు బాబా, ప్లీజ్!"

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo