సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1337వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మహిమ
2. 'తలసేమియా' లేకుండా అనుగ్రహించిన బాబా

బాబా మహిమ


సాయిబాబా చరణం - సర్వదా శరణం శరణం|

సాయి నామస్మరణం - సర్వరోగహరణం, సర్వపాపహరణం||


ముందుగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహరాజుకి పాదాభివందనాలు. బాబా ఆశీస్సులతో సమర్థవతంగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు జగదీశ్వర్. నేను ఆర్టీసీలో డిపో మేనేజరుగా పనిచేసి పదవీవిరమణ చేశాను. బాబా నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు చూపించినప్పటికీ, శ్రీసాయిసచ్చరిత్రలో 'గుడ్డపీలికలు దొంగిలించరాదు, ఏదైనా స్వయంగా వచ్చి తెలుసుకోవాలి' అని చెప్పినందువల్ల నేను ఈమధ్యకాలం వరకు నా అనుభవాలను పంచుకోలేదు. కానీ, ఇటీవల ఒకరోజు నేను ప్రశాంతంగా కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థించి, "బాబా! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాలు పంచుకోవచ్చునా?" అని అడిగితే, "పంచుకోవచ్చు" అని బాబా సమాధానం వచ్చింది. అందుచేత నేను బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఒక్కొక్కటిగా మీతో పంచుకోవడం మొదలుపెట్టాను. గతంలో కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను.


బాబా దయతో నేను ఆర్టీసీలో సూపర్‌వైజరుగా చేరినప్పటినుంచి రిటైరయ్యేవరకు ఒక రెండుసార్లు మినహా ఎప్పుడూ కోరుకున్న ఊర్లలోనే నాకు పోస్టింగులు వచ్చాయి. ఆ రెండు సందర్భాలలో కూడా బాబా ఎలా అనుగ్రహించారో ఇప్పుడు పంచుకుంటాను. ఒకప్పుడు నేను నిజామాబాద్‍లో కొద్దిరోజులు డ్యూటీ చేశాక నన్ను కరీంనగర్‌కి బదిలీ చేశారు. అయితే కరీంనగర్‌లో నాకిచ్చిన పోస్టులో అప్పటికే ఒకతను ఉన్నాడు. అతనిని బదిలీ చేయకుండానే నన్ను అక్కడికి బదిలీ చేయడంతో నేను అదనంగా అక్కడ ఉండాల్సి వచ్చింది. దాదాపు 3 నెలలు అవసరమైనప్పుడల్లా నాతో పని చేయించుకున్నాక ఒకరోజు నా పైఅధికారి నన్ను పిలిచి, "డిపోలో పోస్టింగ్ ఇస్తాం. వెళ్లి చేసుకో" అని అన్నారు. అప్పుడు నేను, "చెకింగ్ ఇన్‌ఛార్జిగా పోస్టు ఇవ్వండి" అని అడిగాను. అందుకాయన, "అదెలా ఇస్తాం? అక్కడ ఇదివరకే ఒక వ్యక్తి చెకింగ్ ఇన్‌ఛార్జిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు చేయి" అని అన్నారు. అప్పుడు జరిగిన అద్భుతం చూడండి. ఆ మరుసటిరోజే చెకింగ్ ఇన్‌ఛార్జిగా ఉన్న అతనికి ప్రమోషన్ మీద మంచిర్యాలకి పోస్టింగ్ ఇచ్చినట్లు హైదరాబాద్ నుండి ఉత్తర్వులు వచ్చాయి. అలా నేను కోరుకున్న చెకింగ్ ఇన్‌ఛార్జి పోస్టు ఖాళీ అవడంతో అదనంగా ఉన్న నాకు ఆ పోస్టు ఇచ్చారు. అదీ బాబా మహిమ.


మరోసారి నేను కరంనగర్‌లో డీ.ఎం.గా చేస్తున్నప్పుడు 'అధికారులు స్వంత జిల్లాలో పనిచేయరాదు' అన్న నిబంధన తీసుకొచ్చి నన్ను భూపాల్‍పల్లికి బదిలీ చేశారు. అయితే కరీంనగర్‌లోనే జోనల్ లెవల్ పోస్టింగులో ఉన్న ఒకతను నెలరోజుల్లో పదవీవిరమణ చేస్తున్నందున నేను ఒక నెలరోజులకు సిక్ లీవ్‍కి అప్లై చేసి భూపాల్‍పల్లి వెళ్ళలేదు. ఆ నెలరోజుల్లో నేను కరీనగర్ జోనల్ పోస్ట్ కోసం చాలా ప్రయత్నించాను. కానీ ఏదీ సఫలం కాలేదు. ఈలోగా వేరేవాళ్ళని భూపాల్‍పల్లికి, కరీంనగర్‌కి పోస్టింగ్ ఇచ్చారు. నా నెలరోజుల సిక్ లీవ్ కూడా పూర్తయింది. దాంతో నేను తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేమీలేక 'ఎక్కడన్నా పోస్టింగ్ రానీ, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంద'ని బాబాపై భారమేసి హైదరాబాదులోని హెడ్ ఆఫీసుకి వెళ్ళాను. ఇంకో పది నిమిషాల్లో నేను సంబంధిత అధికారికి రిపోర్టు చేస్తాననగా బాబా ప్రేరణతో మా బ్రదర్ చేసిన ప్రయత్నం వల్ల సంబంధిత అధికారికి, 'నన్ను కరీంనగర్ జోనల్ లెవల్ పోస్టింగ్ ఇవ్వమ'ని ఆదేశాలు వచ్చాయి. దాంతో నేను సంతోషంగా కరీంనగర్‌లోనే జోనల్ లెవల్ పోస్టింగ్ ఉత్తర్వులు తీసుకుని ఆ పోస్టులో జాయినయ్యాను. ఇదంతా బాబా కరుణాకటాక్షాల వల్లనే సాధ్యమైంది. "ధన్యవాదాలు బాబా. మా బ్రదర్‌కి ఈ మధ్య చెస్ట్ పెయిన్ వస్తే, హార్ట్‌లో స్టెంట్ వేశారు. తను త్వరగా కోలుకోవాలి,  అలాగే ముందు ముందు తనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడండి ప్రభూ".


ప్రస్తుతం మా అబ్బాయి ఉన్నత చదువు కోసం యు.ఎస్.ఏ వెళ్ళబోతున్నాడు. తను వెళ్ళేముందు ఒకసారి బాబా దర్శనం చేసుకుని వద్దామని నేను, మా అబ్బాయి 2022, జూలై 26న బయలుదేరి శిరిడీ వెళ్ళాము. బాబా అనుగ్రహంతో వారి దర్శనం మాకు బాగా జరిగింది. మేము 27, 28 తేదీలలో మధ్యాహ్న ఆరతిలో పాల్గొన్నాము. అదేరోజు, అంటే 28వ తేదీ సాయంత్రం బయలుదేరి మన్మాడ్ స్టేషన్‌కి వచ్చాము. అక్కడ ప్లాట్‍ఫాం నెంబర్ 5లో ట్రైన్ కోసం వేచివున్న సమయంలో అక్కడున్న విపరీతమైన దోమల కాట్లకు మేము గురయ్యాము. మరుసటిరోజు ఉదయం కరీంనగర్ చేరుకున్నాము. ఆరోజు ఏమీ ఇబ్బంది లేదుగానీ, 30వ తేదీ ఉదయం నుండి నాకు కాళ్ళనొప్పులు, తలనొప్పి ఎక్కువైపోయి దాదాపు రోజంతా మంచంపైనే పడుకుని ఉన్నాను. మలేరియానో, డెంగ్యూనో అయుంటుందన్న ఆందోళనతో యాంటీబయోటిక్ టాబ్లెట్ వేసుకుని, రెండుసార్లు బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని తాగి, "బాబా! రేపు ఉదయానికి నార్మల్ అయ్యేలా దయచూపండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి కొద్దిగా నీరసంగా ఉన్నప్పటికీ కాళ్లనొప్పులు, తలనొప్పి తగ్గి దాదాపు నార్మల్ అయిపోయాను. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


చివరిగా మరో చిన్న అనుభవం: 2022, సెప్టెంబర్ 12న మా ఆవిడ హైదరాబాద్ వెళ్లేందుకు తయారై తన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, కారు ఆర్.సి  కార్డు ఉన్న కార్డు హోల్డర్ కోసం వెతికితే, అది ఎక్కడా దొరకలేదు. మామూలుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న రాక్‍లో ఉండాలి. కానీ నేను, నా శ్రీమతి రాక్ అంతా వెతికినా ఆ కార్డు హోల్డర్ కనబడలేదు. దాంతో మాకు టెన్షన్ పెరిగిపోయింది. ఆ క్షణంలో నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! కార్డు హోల్డర్ ఎక్కడున్నా తొందరగా దొరికేలా చేయి స్వామీ. మీ అనుగ్రహంతో అవి దొరికితే వెంటనే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. కేవలం ఒకేఒక్క నిమిషంలో డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనక ఉన్న అదే రాక్‍లో పాస్‌బుక్ పక్కనే ఆ కార్డు హోల్డర్ కనబడింది. అంతకుముందు అదేచోట ఇద్దరమూ ఎంత వెతికినా దొరకనివి బాబాకి దణ్ణం పెట్టుకున్న వెంటనే దొరకడం నిజంగా మహాద్భుతం! "ధన్యవాదాలు బాబా"


'తలసేమియా' లేకుండా అనుగ్రహించిన బాబా  


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నా పేరు రాజేశ్వరి. నేను ఒక సాయిభక్తురాలిని. మేము 25 సంవత్సరాల నుండి బాబాను నమ్ముకున్నాము. ఒకనొకప్పుడు నేను, మావారు, మా ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాం. అలాంటి మమ్మల్ని బాబానే కాపాడారు. అంతేకాదు, ఆయన ఎన్నో సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేశారు. మా ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్లు అయి పిల్లలు కలిగారు. అందరికీ సాయి పేరు కలిపి పేర్లు పెట్టుకుని ఆ తండ్రికి మా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి మా ధన్యవాదాలు. ఈ బ్లాగులోని అందరి అనుభవాలు చదివి చాలా సంతోషిస్తున్న నాకు ఇప్పటికి మా అనుభవాలు పంచుకునే అవకాశం వచ్చినందుకు అమితానందంగా ఉంది.  ఇక నా అనుభవానికి వస్తే...


మా పెద్దమ్మాయికి పెళ్లయిన సంవత్సరానికి బాబు పుట్టాడు. ఆ బాబుకి తొమ్మిదో నెలలో 'తలసేమియా' (ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి నిలిచిపోవడాన్ని 'తలసేమియా' వ్యాధి అంటారు) అనే జబ్బు వచ్చింది. ఆ జబ్బు కారణంగా మూడు నెలలకు ఒకసారి బాబుకి రక్తం ఎక్కిస్తూ ఉండేవాళ్ళము. ఆ బాబు ఏడు సంవత్సరాల వయసు వచ్చాక మూడేళ్ళ క్రితం చనిపోయాడు. మేము బాబాను, "అమ్మాయికి మళ్ళీ సంతానాన్ని ప్రసాదించండి బాబా" అని వేడుకున్నాం. బాబా దయవల్ల 2022, ఏప్రిల్ 22న మా అమ్మాయికి పాప పుట్టింది. తలసేమియా జన్యు సంబంధమైన వ్యాధి. అది పాపకి కూడా వస్తుందేమోనని మేము భయపడ్డాము. బాబా దయవల్ల పాపకి నాలుగో నెల వచ్చాక ఆగస్టులో టెస్ట్ చేసి, "తలసేమియా లేదు. కానీ 6వ నెలలో మళ్లీ టెస్ట్ చేసి పూర్తిగా నిర్ధారిస్తాము" అని డాక్టరు చెప్పారు. ఈ బాబా అనుగ్రహాన్ని బ్లాగుకి ఎలా పంపించాలో తెలియక నేను ఎంతో బాధపడుతుంటే అనుకోకుండా బాబా దయవల్ల ఈ బ్లాగ్ వాట్సాప్ నెంబర్ నాకు లభించింది. "బాబా! మీకు వేలవేల ధన్యవాదాలు. మీ దయ అందరిమీదా ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రీ. ఆరవ నెలలో చేసే టెస్టులో కూడా పాపకి ఏ సమస్యా ఉండకూడదు. అదే జరిగితే, మళ్ళీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి బాబా".



4 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo