సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1318వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు
2. బాబా చేయి చాలా పెద్దది

బాబా ఉన్నారు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా సాయిబంధువులందరికీ, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాధారణ సాయిభక్తురాలిని. నా పేరు లక్ష్మి. నేను గతంలో కొన్ని అనుభవాలను పంచుకున్నాను. మరలా ఇప్పుడు మరికొన్ని అనుభవాలను బాబా అనుగ్రహంతో పంచుకోబోతున్నాను. 2022, ఏప్రిల్ నెలలో ఒకరోజు ఉన్నట్టుండి నా గొంతుకు ఎడమవైపు నొప్పి వచ్చింది. తర్వాత జ్వరం కూడా వచ్చింది. జ్వరం మాత్రలు వేసుకున్నా జ్వరం తగ్గలేదు. మా బాబు అజిత్రోమైసిన్ టాబ్లెట్ తెచ్చి, "ఈ టాబ్లెట్ వేసుకో, గొంతునొప్పి తగ్గుతుంది" అని చెప్పాడు. ఆ టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గింది కానీ, గొంతుకు ఎడమవైపున గవదబిళ్ళలా వచ్చింది. 'ఇదేంటిలా వచ్చింది?' అని నేను కంగారుపడ్డాను. అందరూ, "అదేం కాదు. అలా వస్తాయి" అంటున్నా, నాకు చాలా భయమేసి, "బాబా తండ్రీ! నువ్వు ఉన్నావు. ఈ బిళ్ళను నువ్వే తగ్గించాలి తండ్రీ. నేను నిన్నే నమ్ముకున్నాను" అని మనసులో బాబాను ఎన్నోమార్లు ప్రార్థించాను. అప్పటినుండి ఆ బిళ్ళ తగ్గుముఖం పట్టసాగింది. రోజురోజుకీ కొంచెంకొంచెంగా తగ్గుతూ కొద్దిరోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు నేను ఎంతో సంతోషంతో, "బాబా! నువ్వు ఉన్నావు తండ్రీ. నీ దయవల్లనే ఆ బిళ్ళ పూర్తిగా తగ్గింది. నేను వెంటనే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. "కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించండి బాబా".


మావారు చెప్పినా వినకుండా మా పాప కెనడాలో ఎమ్మెస్ చదువుకుంటానని మారాం చేసింది. దాంతో, "సరే అయితే, వెళ్ళు" అన్నాము. కానీ అక్కడ కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు సర్దుబాటు అవక ఎంతో ఆందోళనపడ్డాం. అప్పుడు నేను, "బాబా! ఏదో ఒక విధంగా సమయానికి డబ్బులు సర్దుబాటు చేయండి తండ్రీ, ప్లీజ్. పాప కంగారుపడుతుంది. మీ దయతో ఏ ఆటంకం లేకుండా త్వరగా డబ్బు కట్టేస్తే, ఈ అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా దయతో ఫీజు తొందరగానే కట్టేశాము. ఇంకా బాబా దయవల్ల పాప బయోమెట్రిక్ మరియు మెడికల్ సర్టిఫికెట్  గురువారంనాడే వచ్చాయి. దాంతో మా పాపకు బాబా మీద నమ్మకం అధికమై, 'త్వరగా వీసా కూడా వచ్చేస్తే, బాబాకి అభిషేకం చేయిస్తాన'ని మొక్కుకుంది. బాబా దయవల్ల వీసా కూడా వచ్చి పాప కెనడా వెళ్తోంది. "నువ్వు ఉన్నావు బాబా. పాప ఒక్కతే కెనడా వెళ్తోంది. తను క్షేమంగా చేరేలా ఆశీర్వదించండి బాబా. అక్కడ తనకి తోడుగా ఉండి తనకి ఏ కష్టమూ రాకుండా కాపాడుతూ అంతా మంచిగా జరిగేలా చూడండి నాయనా. మీకు శతకోటి వందనాలు". 


ఒకరోజు మా బాబు కంపెనీ నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఓ చోట తన సెల్‌ఫోన్ పడిపోయింది. అది గమనించని తను మామూలుగానే ఇంటికి వచ్చేశాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ కోసం చూసుకుంటే, ఫోన్ కనిపించలేదు. దాంతో తను, "అమ్మా! ఫోన్ కంపెనీలో మర్చిపోయాను. వెళ్లి తీసుకొస్తాను" అని వెళ్ళాడు. నాకు ఆ ఫోన్ ఏమైందోనని ఒకటే టెన్షన్‌గా అనిపించి భయంతో, "బాబాతండ్రీ! ఆ ఫోన్ దొరికితే, ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను నాయనా. మీ దయతో బాబు ఫోను దొరికిందని చెప్పాలి సాయీశ్వరా!" అని ఎన్నోసార్లు బాబాను వేడుకున్నాను. బాబా నా ప్రార్థన మన్నించి ఫోన్ దొరికేలా అనుగ్రహించారు. ఆ విషయం తెలియగానే నేను ఎంతో సంతోషపడిపోయాను. "ధన్యవాదాలు బాబా. నువ్వు ఉన్నావు తండ్రీ. దయతో ఆ ఫోన్ దొరికేలా చేశావు. మీకు మాటిచ్చినట్లు ఈ అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకున్నాను.  ఆలస్యమైనందుకు క్షమించండి బాబా".


ఈమధ్య కంపెనీ నుండి మా బాబు బండిమీద వెళ్తుంటే, ఎవరో వచ్చి గుద్దేశారు. ఆ ఘటనలో తన పాదం లోపలి వరకు తెగిపోయింది. దానికి కుట్లు వేస్తే సరిపోయేది, కానీ కుట్లు వేయించలేదు. అందువల్ల ఆ గాయం తొందరగా తగ్గలేదు. నేను మనసులో, "బాబా! మా బాబు కాలి గాయం త్వరగా తగ్గితే, ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'  బ్లాగులో పంచుకుంటాను. దయతో ఆ గాయాన్ని తొందరగా తగ్గించు నాయనా" అని ప్రార్థించాను. బాబా దయచూపారు. ఆ గాయం తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. నేను మీకు మాటిచ్చినట్లుగా నా అనుభవాన్ని పంచుకున్నాను. మా కుటుంబాన్ని చల్లగా చూడండి బాబా. ఈమధ్య నేను కంటి సమస్యతో బాధపడుతున్నాను తండ్రీ. అది మీకు తెలుసు. మీరే డాక్టర్ రూపంలో ఉండి సమస్యను పూర్తిగా తగ్గించండి తండ్రీ. ఆ సమస్య తగ్గితే బ్లాగులో పంచుకుంటాను. మేము మా కంపెనీలో కొద్దిగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నాము. మీరే చల్లగా చూసి మా కంపెనీని లాభాల బాటలో నడిపించండి బాబా".


బాబా చేయి చాలా పెద్దది


నేను ఒక సాయిభక్తుడిని. ఈమధ్య బాబా నాకిచ్చిన ఒక బహుమానం గురించి బ్లాగులో పంచుకుంటానని ఆయనకి మాటిచ్చిన ప్రకారం పంచుకుంటున్నాను. మా కుటుంబం మొత్తం కొన్ని సంవత్సరాలుగా ఒక సమస్య విషయంగా బాబాను, ఇతర దైవాలను ప్రతీరోజూ వేడుకుంటున్నాము. కానీ ఆ సమస్య తీరకపోగా మేము ఇంకా కష్టంలో పడిపోయాము. నేను ఆ బాధలో బాబా ముఖం చూడకుండానే నా నిత్యపూజ పూర్తిచేస్తుండేవాడిని. అలా ఒక నెల గడిచిపోయింది. శిరిడీ సంస్థానం నుండి ప్రతినెలా నాకు వచ్చే ఊదీ ప్రసాదం నాకు రాలేదు. నా ఆర్థిక పరిస్థితి కూడా తగ్గుముఖం పట్టింది. అందుకు కారణం, 'ప్రతీది బాబాకు చెప్పుకునే నేను, ఆయనను పట్టించుకోకపోవడమే' అనిపించింది. అంతటితో ఎందుకో నా మనసు, బుద్ధి మారి ఓ బుధవారంనాడు నిజంగా బాబా సశరీరులుగా నా ముందు ప్రత్యక్షమైనట్టు భావిస్తూ ఏమీ ఆశించకుండా ఆయన పూజ తృప్తిగా చేశాను. ఆరోజు నా ఉద్యోగంలో నా పైమేనేజరు నాకు ఒక టార్గెట్ ఇచ్చారు. నిజానికి అది మా మేనేజరుగారికి ఆయన పైఆఫీసర్ ఇచ్చిన టార్లెట్. ఇంతకీ ఆ ఆఫీసరు చెప్పింది ఏమిటంటే, 'ప్రతి బుధవారం మీ బ్రాంచి 5 లక్షల రూపాయల టార్గెట్ పూర్తిచేస్తోంది. అయితే ఈ బుధవారం 20 లక్షల రూపాయల టార్గెట్ చేయాలి. అలా చేస్తే, చేసినవాళ్ళని సన్మానిస్తాం' అని. అయితే అనుకోకుండా మా మేనేజరు సెలవు పెడుతూ ఆ బాధ్యతను నాకు అప్పగించారు. నా ప్రయత్నం నేను చేసి 20 లక్షల టార్గెట్ పూర్తిచేశాను. అదే ఒక అద్భుతం అనుకుంటే, అది అక్కడితో ఆగలేదు. ఆరోజు వరద ప్రవాహంలా నేను పిలవకుండానే చాలామంది కస్టమర్లు వచ్చి రాత్రి 9:30 వరకల్లా మొత్తం 42 లక్షల బిజినెస్ జరిగింది. నిజానికి మాది చాలా చిన్న బ్రాంచి. 20 లక్షల టార్గెట్ పెట్టారంటే కనీసం 10 లక్షలైనా ప్రయత్నిస్తామని మా పైఆఫీసర్ల ఆలోచన. అలాంటిది ఆరోజు మా బ్రాంచిలో బ్రహ్మాండమైన బిజినెస్ జరిగింది. ఇంకో విషయం, ఆరోజు అంత తీరికలేని బిజినెస్ జరుగుతున్నా నా శరీరంలో అలసటగానీ, నీరసంగానీ లేవు. చాలా ఉత్సాహంగా సహనంతో పనిచేశాను. అదంతా నాకు ఒక మిరాకిల్‍లా అనిపించింది. అప్పుడు బాబా మళ్ళీ గుర్తొచ్చారు. అలకబూనిన తండ్రీకొడుకులు మళ్ళీ కలుసుకున్నప్పుడు తండ్రి కొడుకుపట్ల ఎంత ప్రేమ చూపుతాడో అంతటి ప్రేమ బాబా చూపిస్తున్నారనిపించింది. లేకపోతే, 42 లక్షల బిజినెస్ చేయడం ఏమిటి? ఇది ఆయన లీల కాకపోతే మరేంటి?


సరే, తరువాత 86 బ్రాంచిల వాళ్లకు రీజనల్ ఆఫీసు నుంచి పిలుపు వచ్చింది. చాలామంది సన్మానం రేసులో ఉన్నారు. నేను మాత్రం, "నేను నిమిత్తమాత్రుడిని, ఇవ్వాలనుకుంటే బాబా ఇస్తారు" అనుకున్నాను. ఎందుకంటే, 'బ్రాంచిలో నిజాయితీగా ఎన్నో కష్టాలకోర్చి 7 సంవత్సరాల నుండి కష్టపడి పనిచేస్తున్నా ఏ గుర్తింపూ లేదు' అన్న నిరాశ నాలో ఉంది. అయితే నాకు అంత ఆశ లేదు అనుకుంటూనే, "నాకు అవార్డ్ వస్తుందని నా కుటుంబం, నా తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. వస్తే మాత్రం బ్లాగులో నా సంతోషాన్ని పంచుకుంటాను బాబా" అని చెప్పుకున్నాను. ఇక మీటింగ్‍లో తెలిసిందేమిటంటే, పోటీపడ్డ బ్రాంచిలన్నీ 26 లక్షల లోపు టార్గెట్ రీచ్ అయితే, నేను పోటీ పడకుండా కేవలం మా మేనేజర్ మాట నిలబెట్టడానికే ప్రయత్నిస్తే రికార్డ్ సృష్టించబడింది. అంత గొప్ప బహుమతితో బిడ్డ అలక తీర్చిన తండ్రి బాబా. ఆయన చేయి చాలా పెద్దది. 17 సంవత్సరాలుగా నా తోబుట్టువు పడుతున్న బాధను కూడా తీర్చి మా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వమని సత్యస్వరూపుడైన బాబాను ప్రార్థిస్తున్నాను. "బాబా! ఇన్ని సంవత్సరాలుగా నా తోబుట్టువు బాధను అనుభవిస్తుంటే మేము మీరు పెడుతున్న అన్నాన్ని నిజమైన సంతోషంతో ఎలా తినగలం? నా ముసలి తల్లిదండ్రుల్ని ఇంకా ఏడిపించకండి. ఇకనైనా మా తోబుట్టువు కర్మలను తొలగించి, తన కష్టాలు తీర్చి మాకు సంతోషాన్ని ఇవ్వండి బాబా. మాకు మీరే దిక్కు తండ్రీ".


సాయీ, మీ చరణాలే మాకు శరణం!!!


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయి రామ్ 2అనుభవం చాలా బాగుంది.బాబా ఆశీస్సులు వుంటే అంతా శుభమే.సాయి అన్ని చూసుకుంటారు అని భరోసా ఇస్తున్నారు.ఇంత కంటే మనకు ఏమి కావాలి పృభూ.నాయనా నా మనసు, తనువు హృదయం, అన్ని నీకు అరిపతము.నాకు శుద్ద,స్ఫూర్తి ప్రసాదించు బాబా

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo