సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1326వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

    •     శ్రీసాయి అనుగ్రహ లీలలు - ఎనిమిదవ భాగం

    సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


    కొన్నిసార్లు బాబా భక్తులకు పరీక్షలు కూడా ఎదురవుతాయి. 2018, అక్టోబర్ నెలలో దసరాకి ముందు ఒక బుధవారం నా భార్య బాబా పుస్తకం చదువుతుంటే, "నేను కొద్దిసేపట్లో మీ ఇంటికి వస్తాను. నన్ను వెళ్ళగొట్టవద్దని మీ ఆయనకు చెప్పు” అని  వచ్చింది. అది చదివిన నా భార్య ఆ వాక్యాలు నాకు చూపించి, "బాబా ఏ రూపంలో వస్తారో, మనం జాగ్రత్తగా ఉండాలి" అని అంది. మేము ఉదయమంతా ఎదురుచూశాము. కానీ ఎవరూ రాలేదు. సాయంత్రం పూజయ్యాక నేను సచ్చరిత్ర చదువుతున్నాను. హఠాత్తుగా వంటగదిలో ఉన్న నా భార్యకు తన ప్రక్కనే ఒక కోతి కనిపించింది. ఆ కోతి అక్కడున్న ఒక టోమాటో తీసుకుని నా ముందునుండి నన్ను చూస్తూ మెల్లగా బయటికి వెళ్ళిపోయింది. నేను చదవడం పూర్తిచేసి లేచి, “కోతి వచ్చి వెళ్ళింది. ఇల్లంతా వాసన వస్తోంది. ఛీ, ఛీ.. ఇల్లంతా ఒకసారి తుడువు" అని నా భార్యతో అన్నాను. ఆమె సమాధానమేమీ ఇవ్వకుండా బాబా పుస్తకం చదివే సమయమైందని పుస్తకం తెరిచింది. ఆ పేజీలో, “నన్ను ఛీ, ఛీ.. అనవద్దు” అని ఉంది. వెంటనే ఆమె నాకు ఆ వాక్యం చూపించింది. అంతే, ఆ కోతి రూపంలో వచ్చి వెళ్ళింది బాబానే అని అర్థమై నేనింక 'ఛీ, ఛీ' అని చీదరించుకోలేదు. అంతేకాదు, “మీరు వచ్చినా గుర్తించలేకపోయాము బాబా” అని బాబాని క్షమాపణ అడిగాము. మామూలుగా రోజూ రెండు కోతులు వచ్చి మా ఇంటి కాంపౌండులో అటూ ఇటూ దూకుతూ అల్లరి చేసి, మేము అదిలిస్తే, భయపెట్టి వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడూ అవి ఇంట్లోకి రాలేదు. అలాంటిది ఆరోజు మా ఇంటిలోకి ఆ కోతి(బాబా) వచ్చి, నెమ్మదిగా, శాంతంగా, “వచ్చింది నేనే” అన్నట్లు నన్ను చూస్తూ వెళ్ళింది. బాబా మాట పొల్లుపోలేదు.


    బాబా హేమాడ్‍పంతుకు స్వప్నదర్శనమిచ్చి, "ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తాను" అని చెప్పి ఛాయచిత్రం రూపంలో వచ్చినట్లు మనం సచ్చరిత్రలో చదువుకున్నాము. 2015 మే నెలలో ఒక గురువారం బాబా పూజైన తర్వాత నా భార్య బాబా పుస్తకం చదువుతుంటే, “నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను” అనే వాక్యం కనిపించింది. గురువారంనాడు మేము రోజంతా ఉపవాసం ఉంటాము. అయినా మధ్యాహ్నం బాబా ఏ రూపంలో వచ్చినా ఆయనకి భోజనం పెట్టాలని నా భార్య అనుకుంది. కానీ మధ్యాహ్నం ఎవరూ రాలేదు. రాత్రి 8 గంటల సమయంలో మురికి బట్టలు వేసుకుని, చింపిరిజుట్టుతో ఉన్న ఒక భిక్షగాడు మా ఇంటి ముందుకు వచ్చి, “అమ్మా! కొంచెం అన్నం పెట్టు” అని అడిగాడు. మేము అన్నం వండలేదని ఒక  గ్లాసు పాలు అతనికి ఇచ్చాము. అతను తీసుకోలేదు. అరటిపండ్లు ఇస్తే, వాటినీ అతను తీసుకోలేదు. సరేనని డబ్బులు ఇచ్చాము. అవి కూడా అతను తీసుకోకుండా, "అన్నమే కావాల"ని వెళ్ళిపోయాడు. అప్పుడు నా భార్యకు ఉదయం బాబా పుస్తకంలో చదివిన వాక్యం గుర్తుకు వచ్చి, “బాబా భోజనానికి వస్తానన్నారు. బహుశా ఆ భిక్షువు రూపంలో వచ్చుంటారు. మనం గుర్తుపట్టలేదు” అని చాలా బాధపడింది. కనీసం హోటల్ నుండి తెచ్చిపెడదామనీ లేదా అతను వేచివుంటానంటే వండిపెడదామనీ ఆ వ్యక్తికోసం చాలా వెతికాము. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. నా భార్య ఆరోజు నుండి ఇప్పటికీ ‘బాబా వస్తే ఆయనను గుర్తించి భోజనం పెట్టకుండా తప్పుచేశామ’ని బాధపడుతూ ఉంటుంది. బాబా ఎప్పుడు ఏ రూపంలో వస్తారో మనం కనిపెట్టడం కష్టం. కానీ ఆయన వచ్చి వెళ్లిన తర్వాత, “నేనే వచ్చి వెళ్ళాన"ని బాబా మనకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తారు. మనం ఆ ఎఱుక కలిగి ఉండాలి. సాయిభక్తులారా! భిక్షకోసం వచ్చినవారిని జాగ్రత్తగా గమనించి, ఉంటే భోజనం పెట్టండి లేదా శాంతంగా ఏదైనా చెప్పి పంపండి.


    ఒక పండుగరోజున మేము పూజ చేసుకొంటుండగా మాకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చి గేటు వద్ద నిలబడి నన్ను పిలిచాడు. పూజ మధ్యలో లేవడం ఇష్టంలేక నేను ఆ వ్యక్తిని తరవాత రమ్మని చెప్పాను. అతను వెళ్ళిపోయాడు. పూజ పూర్తయిన తరువాత చదువుకుందామని బాబా పుస్తకం తెరిస్తే, ఆ పేజీలో, "నేను ఏ రూపంలోనైనా మీ దగ్గరకు రావచ్చు” అని ఉంది. దాంతో ఆ వచ్చిన వ్యక్తి బాబా అని గుర్తించనందుకు మేము చాలా బాధపడ్డాము. అప్పటినుండి మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము.


    మా ఇంటిలో అద్దెకు ఉండేవాళ్ళు ప్రతినెలా ఇవ్వాల్సిన ఇంటి అద్దెను మా బ్యాంకు ఖాతాలో జమ చేస్తూండేవాళ్లు. అయితే ఒక నెల వాళ్ళు ఏ కారణం చేతనో అద్దె డబ్బులు వేయడం ఆలస్యం చేశారు. నేను ఎన్నిసార్లు బ్యాంకు ఖాతాలో చూసినా అద్దె డబ్బులు జమ అయినట్లు రాలేదు. అప్పుడు నేను బాబా పూజ అయ్యాక, “డబ్బు జమ చేయించమ"ని బాబాను అడిగాను. తరువాత నాకు ఒక దినపత్రికలో, “జమ అయింది, తీసుకో” అనే అక్షరాలు కన్పించాయి. వెంటనే నేను బ్యాంకుకు వెళ్ళి చూస్తే, డబ్బు జమ అయి ఉంది. ఇలానే ఇంకొకసారి కూడా వాళ్లు అద్దె డబ్బులు వేయడం చాలా ఆలస్యమైంది. అప్పుడు నేను బాబాని అడిగాను. “పైకం జమ అవుతుంది. కానీ ఈరోజు మీరు తీసుకోలేరు” అని సిక్స్త్ సెన్స్ ద్వారా బాబా సూచించారు. మేము అద్దె డబ్బులు తీసుకుందామని ఎటిఎంకి వెళితే, మా ఊళ్ళో ఉన్న రెండు ఎటిఎంలు చెడిపోయాయి. ఇంకొకటి పనిచేస్తున్నా అందులో డబ్బు లేదు. పైగా ఆరోజు బ్యాంకుకు సెలవు. అందువల్ల మేము డబ్బు తీసుకోలేకపోయాము. మరుసటిరోజే తెచ్చుకున్నాము. ఇలా బాబా చెప్పినవి అక్షరాలా  జరిగి తీరుతాయి.


    ఒకసారి మేము హైదరాబాదులో ఉన్న నా భార్య స్నేహితురాలి ఇంటికి వెళ్ళాము. వాళ్ళు కూడా బాబా భక్తులే. సాయంసమయంలో వాళ్ళమ్మాయి పూజగదిలో బాబా పూజ చేసి మా వద్దకు వచ్చి కూర్చుంది. అయితే ‘ఆ అమ్మాయి బాబాకి నైవేద్యం పెట్టలేద’ని సిక్స్త్ సెన్స్ ద్వారా బాబా నాకు తెలియజేశారు. అప్పుడు నేను ఆ అమ్మాయితో, “బాబాకి నైవేద్యం పెట్టావా? ఒకసారి వెళ్లి చూసి రామ్మా" అని చెప్పాను. ఆ అమ్మాయి చూసొచ్చి, "పెట్టలేదు, మర్చిపోయాను” అని చెప్పింది. నేను, “వెళ్లి బాబాకు నైవేద్యం పెట్టి క్షమించమని అడుగు” అని చెప్పాను. ఆ అమ్మాయి అలాగే చేసింది. క్షమించమని అడిగితే తప్పకుండా క్షమించే దయార్ద్రహృదయులు బాబా. ఆయన క్షమించినదానికి నిదర్శనంగా ఆ అమ్మాయికి కోరుకున్న కాలేజీలోనే ఇంజనీరింగ్ సీటు వచ్చినట్టు మా ముందే ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి చాలా సంతోషించింది.


    ఏదైనా అనుకున్న పని జరగకపోతే ఆందోళన కలగడం సహజం. బాబాకు విన్నవించుకుంటే ఆందోళన అనవసరం. బాబా దయవల్ల అమరిన క్రొత్త హీరో స్కూటరు లోన్‍కి సంబంధించి పదిహేను నెలలపాటు నెలనెలా ఆటంకం లేకుండా డబ్బులు కట్టాక పదహారవ నెలలో ఆటంకం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ నెల 7వ తేదీన డబ్బులు కట్టాల్సి ఉండగా 6వ తేదీ వచ్చినా మాకు రావాల్సిన డబ్బు మా చేతికి అందలేదు. మేము అప్పటికీ చాలాసార్లు మాకు డబ్బు ఇవ్వాల్సినవారికి ఫోన్ చేసి, "డబ్బు బ్యాంకులో వేయమ"ని చెప్పాము. వాళ్ళు, "వేస్తామ"ని చెప్పారు కానీ, వేయలేదు. దాంతో, 'రేపు డబ్బు కట్టలేకపోతే స్కూటరు లోన్ పెండింగ్‍లో పడుతుంది. స్వయంగా బ్యాంకుకు వెళ్లి డబ్బులు కట్టే సమయం కూడా లేదు' అని ఆందోళన చెందాము. ఆరోజు సాయంత్రం నేను బాబా మందిరానికి వెళ్ళి విషయం బాబాకి విన్నవించుకున్నాను. తరువాత రాత్రి తొమ్మిది గంటలకు ఎటిఎంకి వెళ్ళి చూస్తే, మాకు రావలసిన డబ్బులు ఇంకా బ్యాంకులో పడలేదు. కానీ, 'స్కూటరు లోన్‍కు ఆటంకం కలగద'ని సిక్స్ సెన్స్ ద్వారా బాబా సూచించారు. 'ఇంకెందుకు ఆందోళన?బాబా ఏదో మహిమ చేస్తార'ని అనిపించింది నాకు. తర్వాత ఇంటికి వచ్చి టీవీ చూస్తుంటే, 'దేవుని మహిమ జరుగుతుంద'నే వాక్యం కనిపించింది. మరుసటిరోజు ఏడవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు నేను బాబాను, “బ్యాంకు అకౌంటులో డబ్బు వేయాలా? వద్దా?" అని అడిగాను. బాబా, “వద్దు” అని సెలవిచ్చారు. బాబా అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. అదేమిటంటే, స్కూటరు లోన్ కట్టించుకునే ఆఫీసరు, 'ఉదయం పది గంటలకే ఆన్‍లైన్లో డబ్బు తీసుకుంటామ'ని చెప్పారు. కాబట్టి నేను పదిన్నర గంటలకు బ్యాంకుకు వెళ్లి డబ్బులు కట్టినా ప్రయోజనం లేదు. అయితే బాబా తమ మహిమ చూపారు. నేను 8వ తేదీ ఉదయం ఏటీఎంకి వెళ్లి, బ్యాంకు స్టేట్మెంట్ చూస్తే, 7వ తేదీన నాకు రావాల్సిన డబ్బు బ్యాంకు అకౌంటులో పడినట్లు, అలాగే మేము కట్టవలసిన లోన్ బ్యాంకువాళ్లకు జమ అయినట్లు ఉంది. ఇదంతా ఎలా జరిగిందో బాబాకే ఎఱుక. మేము మనసారా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాము.


    ఒకసారి మేము ఒక బాబా భక్తుని ఇంటికి వెళ్ళాం. మేము మాటల సందర్భంలో బాబా గురించి మాట్లాడుతూ, "బాబా సమాధి చెందక ముందు, ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు మేము శిరిడీలో పుట్టి ఉంటే ఎంతో బాగుండేది. ఆయనను చూస్తూ, ఆయనకు సేవ చేస్తూ ఉండలేకపోయినందుకు మనసులో ఏదో చెప్పుకోలేని వెలితిగా ఉంద"ని ఆ భక్తునితో అన్నాము. అందుకు ఆయన, "అలా ఎందుకనుకుంటున్నారు? మీరు కూడా అప్పుడు బాబా దగ్గర ఉండి ఉంటారు. అందుకే మీకు ఆయనంటే అంత భక్తి ఏర్పడిందేమో!" అని అన్నారు. మాకు చాలా సంతోషమేసింది. బాబానే ఆయన చేత అలా చెప్పించి ఉంటారని అనుకున్నాము. అలా ఎన్నో సంవత్సరాలుగా మనసులో ఉన్న వెలితిని నిమిషంలో బాబా పోగొట్టారు.


    బాబా అన్ని జీవులలో తామున్నామని తెలియజేశారు కదా! ఒకసారి నేను, నా భార్య తెనాలిలో బాబా మందిరానికి వెళ్ళినపుడు అక్కడ మెట్ల మీద బాగా చిక్కిపోయి ఉన్న ఒక చిన్న నల్లకుక్క నిద్రపోతోంది. బాబా కోసం తీసుకెళ్తున్న ప్రసాదం దానికి పెడదామని ఒక సెకండు ఆగి కూడా పడుకున్నదాన్ని లేపడం ఎందుకని, అదీకాక ముందు బాబాకు నివేదించాలని గుడి లోపలికి వెళ్ళాం. పూజ అయ్యాక తిరిగి బయటికి వచ్చి చూస్తే ఆ కుక్క కన్పించలేదు. సరేనని అక్కడనుండి ఇంటికి తిరిగి వచ్చేసి బాబా పుస్తకం చదువుకుందామని తెరిస్తే, అందులో ఒకచోట, "కుక్కకు ప్రసాదం పెట్టలేదు” అని వచ్చింది. వెంటనే గుడిలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి బాబాని క్షమాపణ అడిగాము. అప్పటినుండి ఎప్పుడు గుడికి వెళ్ళినా అక్కడున్న కుక్కకుగానీ, ఆవుకుగానీ ప్రసాదం పెట్టి వస్తున్నాము.


    ఒకసారి నా మేనకోడలు హనీ ఎమ్.ఎస్. చదువుకోసం అమెరికా వెళ్లాలనుకుంది. తను అక్కడుండే రెండు సంవత్సరాలకు 45 లక్షలు ఖర్చవుతాయి. ఆ డబ్బుల కోసం తన తండ్రి(నా భార్య తమ్ముడు) బ్యాంకు లోన్ కోసం అప్లై చేసి మూడు నెలలు కష్టపడి హనీ ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. పాస్‌పోర్ట్, వీసా, యూనివర్సిటీలో సీటు, విమాన టికెట్ అన్నీ రెడీ అయిపోయాయి. కుటుంబమంతా శిరిడీ వెళ్లొచ్చారు. ఇంక వారంలో ప్రయాణమనగా "లోన్ క్యాన్సిల్ అయింది, ఇవ్వడం కుదరద"ని బ్యాంకువాళ్ళు చెప్పారు. దాంతో ఇప్పుడు ఎలాగని ఆలోచిస్తున్నంతలోనే 2 రోజులు గడిచిపోయాయి. ఆ లోపల 'ఒక సెమిస్టరుకు 5 లక్షలు చెల్లించినా చాలు, అమెరికా వెళ్లొచ్చు' అని తెలిసింది. ఆ డబ్బుల కోసం స్నేహితులను అడిగారు. కానీ వరుసగా 4 రోజులు బ్యాంక్ సెలవులు, ఏ.టి.యం.లో డబ్బులు లేకపోవడం వంటి అన్ని ఇబ్బందులూ ఒకేసారి కలిసి వచ్చాయి. ఇంట్లో నా భార్య, “నా తమ్ముడికి డబ్బు సహాయం చేయలేకపోతున్నాన"ని మౌనంగా బాధపడింది. ఆరోజు చదువుదామని బాబా పుస్తకం తెరిస్తే, ఆ పేజీలో, "నీ తమ్ముడికి నేను సహాయం చేస్తాను” అన్న వాక్యం వచ్చింది. అది చదివిన నా భార్య చాలా సంతోషించి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇంక 'బాబా చూసుకుంటారు' అన్న గట్టి నమ్మకంతో మేము ఉన్నాము. ప్రయాణానికి ఇంకో రెండు రోజులు ఉందనగా హనీ బాబా మందిరంలో కూర్చొని బాబాను ప్రార్థిస్తుండగా ఒక అద్భుతం జరిగింది. హనీవాళ్ళ మేనమామ భార్య ఫోన్‍లో తన తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్తోంది. ప్రక్కనున్న ఎవరో ఒకతను అదంతా విని, అప్పటికప్పుడు 6 లక్షలు ఇచ్చి,ముందు అమ్మాయిని చదువుకోసం అమెరికాకి పంపండి" అన్నారు. అది తెలిసి హమ్మయ్య అని అందరి మనసులు తేలికపడ్డాయి. అలా బాబా ఆశీస్సులతో హనీ బయలుదేరి అమెరికా వెళ్ళి యూనివర్శిటీలో జాయిన్ అయింది. హనీని చివరి నిమిషంలో అమెరికా పంపిందెవరు?, బాబానే! ఆయన తాము చెప్పినట్లే ఎవరో తెలియనివ్యక్తి రూపంలో హనీకి సహాయం చేసి అమెరికా పంపించారు. బాబా తనకు చిన్నప్పుడే 2 సార్లు నిజదర్శనం ఇచ్చారు.


    మరుసటిరోజు 2019 కొత్త సంవత్సరం ఆరంభమవుతున్నందున 2018, డిసెంబరు 31వ తేదీ సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసుకుని, పూజలో ఉన్న దేవుని పటాలన్నీ తుడిచి గంధం, కుంకుమ పెడుతూ “ఈ కొత్త సంవత్సరం మనకు ఎలా ఉండబోతోంది?” అని నా భార్య నాతో అంది. అప్పుడు నేను, “బాబా ఉండగా మనకు భయమేల? ఆయన దయవల్ల అంతా బాగానే ఉంటుంది” అని అన్నాను. అంతలో నా భార్య తన చేతిలో ఉన్న ఒక చిన్న న్యూస్‌పేపరు మీద 'నేనున్నానమ్మా' అని అక్షరాలు చదివి నాకు చూపించింది. అలా బాబా 'నేనున్నాను' అంటూ మాకు అభయం ఇచ్చారు. అలా ఎల్లప్పుడూ ఆయన మా కుటుంబాన్ని ముందుండి నడిపిస్తుంటారు.


    ఇప్పుడు 'కల వాస్తవమే'నని తెల్పిన బాబా అద్భుత లీలలను చదవండి. 2016 చివర్లో ఒకనాటి రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను నిద్రలో ఉండగా యమభటులు వచ్చి నన్ను పట్టుకునిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు చాలా భయమేసింది. అకస్మాత్తుగా బాబా ప్రత్యక్షమయ్యారు. ఆయన్ని చూడగానే నాకు ధైర్యం వచ్చింది. బాబా కోపంతో వాళ్ళని వారించి అక్కడినుండి తరిమేశారు. మరుసటిరోజు ఉదయం నేను నా భార్యకు నాకొచ్చిన ఆ కల గురించి చెప్పాను. ఆరోజు సాయంత్రం బాబా పూజచేశాక పుస్తకం చదువుతుంటే, అందులో, “అవును. నిజంగా యమభటులు వచ్చారు. వాళ్ళని తన్ని తరిమేశాను. నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను” అని ఉంది. దానిని బట్టి నాకు వచ్చింది కల కాదనీ, వాస్తవమేననీ మాకు అర్థమైంది. బాబా నన్ను రక్షించారని నేను దృఢమైన నమ్మకంతో చెప్తున్నాను. కొందరికి 'స్వర్గం, నరకం ఉంటాయా?' అనే సందేహం రావచ్చు. "ఉంటాయ"ని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే, బాబా కొన్ని సందర్భాలలో వాటి గురించి చెప్పారు. ఉదాహరణకు శిరిడీలో ఒక బాలుడు మరణించినప్పుడు, “ఆ బాలుడు స్వర్గానికి వెళుతున్నాడు" అని బాబా చెప్పారు.


    2017, జనవరి నెల చివర్లో మేము అనుకోకుండా ఒకరి ఇంటికి వెళ్ళాల్సివచ్చి వెళ్ళాము. ఆ ఇంటివారిని చూడగానే ఎక్కడో చూసినట్టు, ఆ ఇల్లు కూడా చూసినట్టు అనిపించింది. కానీ మేము వాళ్ళింటికి వెళ్లడం అదే మొదటిసారి. మేము తిరిగి మా ఇంటికి వచ్చాక ఆలోచిస్తే, సుమారు ఒక నెల క్రితం వారిని, వాళ్ళ ఇంటిని బాబా కలలో చూపించారని గుర్తుకు వచ్చింది. 'ఎవరో పరిచయంలేని క్రొత్తవారింటికి ఎలా వెళతాము? అదేదో మామూలుగా వచ్చిన కల అయ్యుంటుంద'ని మేము అనుకున్నాము. కానీ మేము వాళ్ళింటికి వెళ్లబోతామని బాబా ముందుగా చూపించారని తరువాతే మాకు అర్థమైంది.


    2017, ఏప్రిల్ నెలలో మా అమ్మాయి అత్తగారింటి గృహప్రవేశం వేరే ఊరిలో జరిగింది. ఆ ఫంక్షనుకు మా అమ్మాయివాళ్ళు బెంగళూరు నుంచి వచ్చి, వెంటనే తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంది. అయితే ఫంక్షన్ ముందురోజు మధ్యాహ్నం నేను భోజనం చేసి పడుకున్నాను. కలలో మా మనవడు ఒక్కడే మా దగ్గరకు వచ్చి, ఒక పూటంతా మాతో ఆనందంగా గడిపి వెళతాడని బాబా చూపించారు. నేను, 'వస్తే, అమ్మాయి, అల్లుడు, మనవడు ముగ్గురూ వస్తారు కదా! మనవడు ఒక్కడే ఎలా వస్తాడు?' అని మనసులో అనుకున్నాను. కానీ, బాబా చర్యలపై ఉన్న గట్టి నమ్మకంతో ఏం జరగబోతుందోనని ఎదురుచూశాను. మరుసటిరోజు మా అమ్మాయి, అల్లుడు, మనవడు బెంగళూరు నుండి గృహప్రవేశానికి వచ్చారు. ఆ మరుసటిరోజు మధ్యాహ్నం నేను భోజనం చేసి బయట పడుకుని ఉండగా గేటు శబ్దమై, ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దమై తల త్రిప్పి చూస్తే, మా మనవడు. వాడు ఆ పూటంతా మాతో గడిపి రాత్రికి వెళ్ళిపోయాడు. చూశారా! బాబా కలలో తెలిపింది ఇలలో ఎలా జరిగిందో!


    తరువాయి భాగం వచ్చేవారం...

     


    ముందు భాగం కోసం
    బాబా పాదుకలు తాకండి.




     


     


    తరువాయి భాగం కోసం
    బాబా పాదాలు తాకండి.

     



    3 comments:

    1. Om Sairam
      Sai always be with me

      ReplyDelete
    2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

      ReplyDelete
    3. ఓం శ్రీ సాయి రామ్ అను అనుభవం చాలా బాగుంది.సాయిని నమ్ముకుంటే మనకు అంతా మంచే జరుగుతుంది.బాబా దయ వుంటే లేనిది ఏమీ లేదు.అంతా సాయిమయం.లోకమంతా బాబా మాయం.దా్వరకామాయి చెల్లిని అమ్మ

      ReplyDelete

    సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

    Subscribe Here

    బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

    Delivered by FeedBurner

    Followers

    Recent Posts


    Blog Logo