1. ఎంతటి సమస్యనైనా ఇట్టే తీర్చేసే బాబా
2. దయతో ఎన్నో సమస్యల నుండి బయటపడేసిన బాబా
ఎంతటి సమస్యనైనా ఇట్టే తీర్చేసే బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగులో ప్రచురితమయ్యే భక్తుల అనుభవాలను పఠించే సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు నాలుగుసార్లు నా అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోబోతున్నాను. నేను ఒక్కటిన్నర సంవత్సరంగా ఒక సమస్య విషయంగా ఆందోళన పడుతున్నాను. నిజానికి ఆ సమస్య నాకు సంబంధించినది కాదు. అది నా తమ్ముడి సమస్య. దాని గురించి నాకు, తమ్ముడికి తప్ప ఎవరికీ తెలీదు. ఒకవేళ తెలిస్తే, అందరూ తనని తప్పుపట్టి నిందిస్తారు. అందుకు భయపడే తను నాకు తప్ప ఎవరికీ దాని గురించి చెప్పలేదు. అయితే అదేమంత పెద్ద సమస్య కాదు. అందుకే నేను ఆ సమస్య గురించి అందరితో చెప్పమని తమ్ముడితో చెప్పాను. కానీ తను చెప్తే, ఉన్న సమస్యలు మరింత పెద్దవి అవుతాయని ఎవ్వరికీ చెప్పలేదు. నేను కూడా బలవంతపెట్టలేదు. కానీ విషయం అందరికీ తెలిసాక దాచిపెట్టినందుకు తమ్ముడిని, నన్ను కలిపి నిందిస్తారని నాకు చాలా భయంగా ఉండేది. ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో నేను ఆ విషయం గురించి ఆందోళన చెందని రోజంటూ లేదు. ప్రతిరోజూ నేను, "బాబా! అందరికీ తెలియకముందే తమ్ముడు ఆ సమస్య నుండి బయటపడాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకుంటూ ఉండేదాన్ని. 2022, ఆగస్టులో తమ్ముడు ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన సమయం వస్తుందనగా నా భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. నేను బాబాకి గట్టిగా దణ్ణం పెట్టుకుని 'సాయి దివ్యపూజ' చేసి, "తమ్ముడు గనక ఎటువంటి అపనిందల పాలుకాకుండా ఆ సమస్య నుండి బయటపడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా కృపతో ఆగస్టు నెలలో ఆ సమస్యని ఎదుర్కొనే సమయం వచ్చినపుడు తమ్ముడికి అంత సవ్యంగా జరిగింది. ఆ సమస్య నడిచినన్ని రోజులూ తనకి ఏ ఇబ్బంది రాలేదు. అసలు ఆ సమస్య గురించి తనని ఎవ్వరూ ఒక్క మాట కూడా అడగలేదు. నాకు ఎంతో ఆశ్చర్యమేసింది. సమస్య ఇంకా కొంచెం తేలాల్సి ఉంది. బాబా అనుగ్రహంతో అది కూడా సమసిపోతుందని నమ్మకంతో ఉన్నాను.
మా తమ్ముడు పక్క ఊరిలో ఉండే కాలేజీలో 'లా' చదువుతున్నాడు. తన ఉద్యోగరిత్యా ఆ కాలేజీలో అటెండెన్స్ తప్పనిసరి కాదు అన్నందున తను అక్కడ చేరి అప్పుడప్పుడు కాలేజీకి వెళ్లి పరీక్షలు వ్రాస్తూండేవాడు. అయితే, ఆఖరి సెమిస్టర్‍కి వచ్చేసరికి యూనివర్సిటీ హాజరు తప్పనిసరి చేసింది. దాంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. సహాయం కోసం సంప్రదించిన వాళ్ళందరూ ఈ విషయంలో ఏ సహాయం చేయలేమన్నారు. ఇక తన చదువు పూర్తికాదేమో అని తమ్ముడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే, ఆ 'లా' చదువు మీద వాడికి చాలా ఆశలున్నాయి. నేను కూడా ఆందోళన చెంది బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఆ సెమిస్టర్‍కి హాజరు తప్పనిసరి అయినప్పటికి ఆఖరిలో పరీక్షలు వ్రాయడానికి ఎవరూ అడ్డు చెప్పలేదు. ఇది కేవలం బాబా అనుగ్రహం తప్ప మరేమీ కాదు.
ఒకరోజు మా అమ్మ, "కుడి చేయి చాలా నొప్పిగా ఉంటుంది" అని అంది. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, 'అమ్మ చేయి నొప్పి తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. కానీ అమ్మకి ఆ చేయినొప్పి చాలా నెలల నుండి ఉంది కాబట్టి అంత తేలికగా తగ్గదని నాకు తెలుసు. అందువల్ల ఖచ్చితంగా హాస్పిటల్‍కి వెళ్ళాలనుకున్నాను. అయితే ఆ రోజు సాయంత్రం ఏదో మామూలుగా అమ్మని, "చేయి నొప్పి ఎలా ఉంది?" అని అడిగితే, "నొప్పి తగ్గింది. ఇప్పుడు అంతగా లేదు" అని అంది. అది విని ఆమె నుండి అటువంటి సమాధానాన్ని అస్సలు ఊహంచని నేను ఆశ్చర్యపోయాను. అది నా తండ్రి బాబా కృపకాక మరేంటి? కోరిక కోరిన నేను మార్చిపోతానేమోగాని, వాటిని తీర్చే కల్పతరువు, పిలిస్తే పలికే దైవం అయిన ఆ సాయినాథుడు మార్చిపోడు. "మీరు మాపై చూపే ప్రతీ అనుగ్రహానికి ధన్యవాదాలు బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!
దయతో ఎన్నో సమస్యల నుండి బయటపడేసిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. శ్రీసాయిబాబాకు అనంతవేల నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. ఈ బ్లాగు ద్వారా నా సమస్యలెన్నింటికో పరిష్కారం లభించింది. బాబా ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగు ద్వారా పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. బాబా దయతో ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకరోజు మా నాన్నగారికి జలుబు చేసి తరువాత జ్వరం కూడా వచ్చింది. మరుసటిరోజుకి బాగా దగ్గు రావడం మొదలై రెండు రోజులైనా తగ్గలేదు. నాన్న చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడు నేను నా మనసులో, "బాబా! మీ దయతో నాన్నకు దగ్గు తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని 108సార్లు స్మరించి, బాబా ఊదీ నీళ్లలో కలిపి నాన్నకి ఇచ్చాను. బాబా దయవల్ల ఆ రోజు సాయంత్రం నుండి నాన్నకి దగ్గు తగ్గింది. అదే సమయంలో మా అమ్మకి కూడా వైరల్ ఫీవర్ వచ్చింది. అయితే అమ్మ అంతగా ఇబ్బంది పడలేదు. బాబా దయవల్ల తొందరగానే తగ్గిపోయింది. అప్పుడే మా బాబుకి కూడా వైరల్ ఫీవర్ వచ్చి జలుబు, ముక్కు కారడం వల్ల ఇబ్బంది పడ్డాడు. నేను చాలా భయపడి, "బాబా! మీ దయతో బాబుకి తొందరగా నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆ తండ్రి దయవల్ల ఆ రాత్రికి బాబుకి తగ్గిపోయింది. ఆ తరువాత మా బాబుకి విరోచనాలైనప్పుడు కూడా నేను బాబానే ఆశ్రయించాను. ఆయన దయతో తనకి విరోచనాలు తగ్గిపోయాయి.
ఒకసారి మా పక్కింటివాళ్ళ టిఫిన్ బాక్స్ కనిపించలేదు. ఎంత వెతికిన 15 రోజుల వరకు అది దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో టిఫిన్ బాక్స్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆయన దయవలన వెంటనే ఆ బాక్స్ దొరికింది.
ఒకసారి మా బాబు నా మొబైల్ నీటిలో పడేసాడు. ఐదురోజులు వరకు మొబైల్ పనిచేయలేదు. అప్పుడు నేను మొబైల్‍కి బాబా ఊదీ పెట్టాను. ఆయన దయవల్ల మొబైల్‍ను ఏ షాపుకి తీసుకెళ్ళకుండానే, ఏ రిపేరు లేకుండానే అది పని చేసింది. "ధన్యవాదాలు బాబా. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను తండ్రి. మీ దయతో నేను కోరుకున్న డిప్యూటీ కలెక్టర్ పోస్టు నాకు వస్తే, మళ్ళీ నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను బాబా".
Om Sairam
ReplyDeleteSai always be with me
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram 🙏🙏🙏
ReplyDelete