సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1317వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. టెన్షన్లను ఇట్టే తీసేస్తారు బాబా
2. బాబా ఆశీస్సులతో పండంటి మగబిడ్డ

టెన్షన్లను ఇట్టే తీసేస్తారు బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. శ్రీసాయిమహరాజుకి వందనాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి ఓపికకు, సహనానికి నా మనఃపూర్వక నమస్సులు. మాలాంటి సాయిభక్తులను ప్రోత్సహిస్తూ శ్రీసాయి మాపై చూపిన కరుణను నలుగురితో పంచుకునే అవకాశం కల్పిస్తున్న మీకు ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. 2022, ఆగస్టు 21, ఆదివారం సెలవురోజు కాబట్టి హైదరాబాదులో ఉన్న మా పెద్దబాబు తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి, అక్కడనుండి బాబు పుట్టాక పుట్టింట్లో ఉన్న తన భార్య దగ్గరకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయమై తను నాకు ఫోన్ చేసి, "అమ్మా! నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి, అటునుంచి అటే మా అత్తగారింటికి వెళ్తాను" అని చెప్పాడు. నేను, "సరే" అని అన్నాను. తరువాత నేను మధ్యాహ్నం రెండు గంటలప్పుడు బాబుకి ఫోన్ చేసి, "పెళ్లయిపోయిందా?" అని అడిగితే, "ఆఁ, అయింది అమ్మా. నేనింక భోజనం చేసి, పది నిమిషాల్లో బయలుదేరుతాను" అని చెప్పాడు. "సరే, బండి మీద జాగ్రత్తగా వెళ్ళు. అక్కడినుండి ఎంత సమయం పడుతుంది?" అని అడిగాను. తను, "20 నిమిషాలు పడుతుంది" అని చెప్పాడు. నేను, "సరే" అన్నాను. ఎక్కడికి బయలుదేరినా అక్కడికి చేరుకున్నాక నాకు ఫోన్ చేసి చేరుకున్నామని చెప్పడం మా పిల్లలకి అలవాటు. అయితే, ఆరోజు 3 గంటలైనా తను నాకు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. నేను ట్రాఫిక్ ఉంటుందని మరో 20 నిమిషాలయ్యాక మళ్ళీ కాల్ చేశాను. అప్పుడు కూడా తను లిఫ్ట్ చేయలేదు. ఇంక నాకు బీపీ పెరిగిపోసాగింది. 'బాబా, బాబా' అనుకుంటూ సాయి చాలీసా చదివాను. తరువాత 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అనుకుంటూ మా కోడలికి ఫోన్ చేసి, "అమ్మా, బాబు వచ్చాడా?" అని అడిగాను. తను చాలా శాంతంగా, "సమయం పడుతుంది అత్తమ్మా. ట్రాఫిక్ ఉంటుంది కదా! 20 నిమిషాల ప్రయాణ దూరమే అయినా ఒక్కోసారి గంటసేపు కూడా పడుతుంది" అంది. తరువాత నేను, 'తను 2:30కి బయలుదేరినా ఇప్పుడు 4:30 కావస్తోంది. ఇంకా తను చేరుకోలేదు' అని బాబా ముందు నిలబడి, "బాబా! నేను వెళ్లి అలా కూర్చుంటాను. వెంటనే మా బాబు ఫోన్ చెయ్యాలి" అని కన్నీళ్ళతో వేడుకున్నాను. విచిత్రంగా, నేను ఇంకా సరిగా కూర్చోకముందే మా బాబు ఫోన్ చేసి, "చేరుకున్నానమ్మా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అందుకే ఆలస్యమైంది" అని చెప్పాడు. బాబు మాటలు వింటూనే నా మనసు చాలా ప్రశాంతంగా అయిపోయింది. కానీ ఆ రెండు గంటలు ఎంత టెన్షన్ పడ్డానో నాకు, ఆ సాయితండ్రికి మాత్రమే తెలుసు. ఏదేమైనా నా సాయి ఎల్లప్పుడూ నా టెన్షన్లను ఇట్టే తీసేస్తారు. నేను కోరుకున్న విధంగా నా కోరిక తీర్చే నా సాయితండ్రికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? మా బాబు కాల్ చేస్తే, మరుసటిరోజు సోమవారంనాడే నా అనుభవాన్ని బ్లాగుకు పంపుతానని సాయికి చెప్పుకున్నట్లే ఆలస్యం చేయకుండా నా అనుభవాన్ని బ్లాగుకు పంపించాను. "ధన్యవాదాలు బాబా".


మరో అనుభవం: మా అన్నయ్యవాళ్ళు చాలాకాలం క్రిందట ఒక ప్లాట్(స్థలం) కొని నాకు ఇచ్చారు. ఇటీవల మా చిన్నబాబు ఆ ప్లాట్ ఉన్న ప్రాంతానికి బదిలీ అయి వెళ్ళాడు. మా పెద్దబాబు హైదరాబాదులో ఒక ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యాడు. చిన్నబాబు కూడా ఒక ఇల్లు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నందున ఒకరోజు నాకు ఫోన్ చేసి, "అమ్మా‌, అన్నయ్య ఎలాగూ హైదరాబాదులో ఉంటాడు కదా! నాకు ప్రమోషన్ వచ్చి ఇక్కడనుండి బదిలీ కావడానికి 6, 7 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ నీ పేరు మీద ప్లాట్ ఉంది కదా! దాన్ని నాకు ఇస్తే, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను" అని అన్నాడు. పెద్దబాబుకి హైదరాబాదులో ఇల్లు ఉంది, చిన్నబాబుకీ ఇల్లు ఉంటే నాకు సంతోషమే. అందువలన నేను వెంటనే, "సరే" అన్నాను. తరువాత నేను పెద్దబాబుకి కాల్ చేసి, "ప్లాట్ ఇస్తే ఇల్లు కట్టుకుంటానని తమ్ముడు అంటున్నాడు" అని చెప్పాను. అందుకు తను, "సరే అమ్మా. పెళ్లి సమయానికి వాడికి ఇల్లు ఉండాలి కదా! వాడికి ఇంట్రెస్ట్ ఉంటే అలాగే కానివ్వమ్మా" అని చెప్పాడు. ఇంతవరకు మేమే సరే అనుకున్నాం, బాగానే ఉంది. కానీ, ఆ ప్లాట్ ఎక్కడ ఉందో స్పష్టంగా మాకు తెలియదు. ఆ ప్లాట్ దగ్గరే మా అన్నయ్యలకి కూడా ప్లాట్లు ఉన్నాయి. అన్నయ్య అక్కడికి దగ్గరలోనే ఉంటారు. కాబట్టి అన్నయ్యని ఆ ప్లాట్ చూపించమని అన్నాను. తను అప్పుడు, ఇప్పుడు అంటూ ఒక సంవత్సరం గడిపేశాడు. ఇంక నేను ఇంకో అన్నయ్యకి ఫోన్ చేశాను. అతనికి కూడా అక్కడ ప్లాట్ ఉంది. నేను తనతో, "నీకు నా ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసా?" అని అడిగాను. తను, "నాకు తెలియదు" అని చెప్పి, బిల్డర్ మరియు ప్లాట్ల బిజినెస్ చేసే మా చుట్టాలబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నేను అతనికి కాల్ చేస్తే, "ఆఁ, నాకు తెలుసు అత్తమ్మా. మీ బాబు ఇక్కడే ఉంటాడు కదా! పది రోజులు పోయాక తనకి చూపిస్తాను" అని అన్నాడు. కానీ ప్రస్తుతం ప్లాట్లు కబ్జా చేస్తున్నారన్న భయంతో నేను, "బాబా! మా ప్లాట్ మాకు తొందరగా చూపిస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని వేడుకుని, 'బాబా, బాబా' అని అనుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే, ఆ ప్లాట్ తీసుకుని 15 సంవత్సరాలకు పైనే అయివుంటుంది. ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న అన్నయ్య తప్ప ఇంకెవరమూ ఆ ప్లాట్ చూడలేదు. ఆ అన్నయ్యకి కూడా ఆ ప్లాట్ సరిగా గుర్తులేదు. అయితే బాబా దయవల్ల ఒకరోజు ఆ అబ్బాయి అక్కడికి వెళ్లి, నాకు ఫోన్ చేసి, "అత్తమ్మా, ప్లాట్ చూశాను. ఇక్కడ ఇండ్లు అయ్యాయి. బాబాయివాళ్ళవి దగ్గరలోనే ఉన్నాయ"ని చెప్పాడు. నేను ఇంకా అనుమానంతో, "మా ప్లాట్ అదే అని నీకు ఎలా తెలుసు?" అని అడిగాను. "మీ అన్నయ్యవాళ్ళకు ఈ ప్లాట్లు అమ్మిన అతని దగ్గరే నేను అప్పట్లో పనిచేస్తుండేవాడిని. కాబట్టి నాకు ఈ ప్లాట్లు బాగా తెలుసు" అని చెప్పాడు. దాంతో నా భయం, టెన్షన్ తీరిపోయాయి. చాలా ఆనందంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా. చిన్నబాబు ఇల్లు, పెళ్లి విషయంలో మీరు అండగా ఉండాలి. అలాగే మీ ఆశీస్సులు ఎల్లవేళలా మాకు  ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక నమస్సులు తండ్రీ".


బాబా ఆశీస్సులతో పండంటి మగబిడ్డ


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ముందుగా, 'సాయి మహరాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగును నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేనొక సాయిభక్తుడిని. మేము ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మా కోరికను బాబా ఎలా నెరవేర్చారో నేనీరోజు మీతో పంచుకుంటాను. మాకు పెళ్ళై 2 సంవత్సరాలు గడుస్తోంది. పెళ్ళైన ఒక సంవత్సరం తరువాత నా భార్య గర్భం దాల్చింది. కానీ, గర్భస్రావం జరిగి ఆ గర్భం నిలవలేదు. తరువాత బాబా దయ, వారి అనుగ్రహంతో నా భార్య మళ్ళీ గర్భవతి అయింది. చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ బాబా దయతో అంతా సవ్యంగా జరిగి నా భార్యకి కాన్పు సమయం ఆసన్నమైంది. ఆ అనుభవాలను ఎప్పటికప్పుడు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇకపోతే, 2022, ఆగస్టు 29న డాక్టరు నా భార్యను హాస్పిటల్‍లో జాయిన్ అవమని చెప్పారు. సరేనని నా భార్య హాస్పిటల్లో అడ్మిట్ అయితే, డాక్టరు ఒక ఇంజెక్షన్ నా భార్యకిచ్చి, "24 గంటల తరువాత నొప్పులు మొదలై డెలివరీ అవుతుంద"ని చెప్పారు. కానీ, వెంటనే నా భార్యకు నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఆమె పక్కన ఉండడానికి కేవలం భర్తనే అనుమతిస్తామని అన్నారు. కానీ నేను వేరే ఊరిలో ఉన్నాను. 30న డెలివరీ అవుతుంది అన్నారని నేను ఇంకా అప్పటికి బయలుదేరలేదు. నొప్పులు మొదలయ్యాయని తెలియడంతో టెన్షన్ పడి ఆ రాత్రి నేను ట్రైన్ ఎక్కాను. కానీ నేను హైదరాబాద్ చేరేసరికి ఉదయం 6 గంటలు దాటుతుంది. కాబట్టి ఏం చేయాలో తెలియక, "బాబా! నొప్పులు తట్టుకునే శక్తిని నా భార్యకి ప్రసాదించు" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఉదయం 3 గంటలకి కాస్త నొప్పులు తగ్గి, తను నిద్రపోయింది. తరువాత (వినాయకచవితి ముందురోజు) ఉదయం 7  గంటలకి మళ్ళీ నొప్పులు మొదలై గం.7:33నిమిషాలకి సాయిబాబా, వినాయకుని అనుగ్రహంతో నా భార్య పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది.  అదే సమయానికి నేను హాస్పిటల్‍కి చేరుకుని కనులారా నా బిడ్డని తొలిసారి చూసి మురిసిపోయాను. "బాబా! ఇది మీ అనుగ్రహం. నిన్ను నమ్ముకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు తండ్రీ. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూడు సాయిదేవా. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



5 comments:

  1. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఓం సాయి రామ్ నీ దయ వుంటే కష్టం తెలియకుండా వుంటుంది.నీ కృప తో మాకు వున్న యిబ్బందులు తీరిపోయాయి.ఈ కార్తీ కి మాసం లో కోటి దీపోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నాయి అది నీ ఆశీస్సులు బాబా.చూడ వలసి నా ప్రోగ్రాం.కోటి దీపాలు వెలిగించడం వల్ల లోకి క్షేమం కోసం.ఈ క్రతువు చాలా మంది చేస్తున్నా రు.శివుడిని పూజ చేయాలి పుణ్య ం

    ReplyDelete
  4. ఓం సాయి రామ్ చంద్ర గ్రహణం అయిపోయింది.శివారాధన మొదలు అయింది.సాయే శివుడు సాయి అన్ని దేవుళ్ళ స్వరూపం మన అందరిని రక్షిస్తుంది.

    ReplyDelete
  5. బాబా నేను దిక్కు తోచన స్థితిలో ఉన్నా 😢ఏదోఒక దారి చూపవయా 😢😢😢

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo